Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలి

ప్యాసింజర్ రైళ్లకు పాత ధరలనే కొనసాగించాలి
ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలో రైల్వే మేనేజర్ కు వినతి

విశాలాంధ్ర – గూడూరు : గూడూరు ఒకటి, రెండు పట్టణాలను కలుపుతూ ప్రజల సౌకర్యార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ ఆల్ ఇండియా తన్జీమ్ ఏ ఇన్సాఫ్ గూడూరు డివిజన్ సమితి సభ్యులు శనివారం రైల్వే జంక్షన్ సూపరింటెండెంట్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఇన్సాఫ్ సమితి రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ షేక్. జమాలుల్లా మాట్లాడుతూ
గూడూరు రైల్వే జంక్షన్ ఏర్పాటయినప్పటి నుండి ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ఈ నేపధ్యంలో గూడూరు పట్టణ ప్రజలు, ప్రయాణీకులు రైల్వే జంక్షన్లో పలు సమస్యలపై సతమతమవుతున్నారన్నారు. ముఖ్యంగా గూడూరు రైల్వే స్టేషన్ ఒకటి, రెండు పట్టణాల మధ్యలో ఉండడం, గతంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి తొలగించడంతో ప్రజలు రాకపోకలు సాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనినో దృష్టిలో ఉంచుకుని ఎన్ట్ టు ఎన్డ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేయాలని కోరారు. అలాగే రెండవ అండర్ బ్రిడ్జి కింద ఐరన్ షీట్స్ అమర్చకపోవడంతో వాహనాలు నిలిచిపోతున్నాయన్నారు. రెండవ బ్రిడ్జి కింద రేకు షీట్లు ఏర్పాటు చేసి ప్రయాణీకులు రాకపోకలు సాగించడంలో ఎదుర్కొంటున్న అవస్థలను దూరం చేయాలని కోరారు. అదేవిధంగా కరోనా సమయంలో నిలిపివేసిన మెమో (యూనిట్) ప్యాసింజర్ రైళ్లను మళ్లీ పునరుద్ధరించాలన్నారు. అలాగే కరోనా సమయంలో మెమో, ప్యాసింజర్ ట్రైన్లకు రైల్వే శాఖ ఎక్స్ ప్రెస్ ట్రైన్ టికెట్లను వసూలు చేస్తోందన్నారు. ప్రస్తుతం అదేవిధంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఒకవైపు ఆర్టీసీ బస్సులలో చార్జీలు పెరిగి పేద ప్రజలు ప్రయాణాలు సాగించాలంటేనే హడలిపోతున్నారనీ అటువంటి సందర్భంలో ప్యాసింజర్ రైళ్లు పేదలకు కొండంత అండగా అతి తక్కువ ధరకే గమ్యస్థానాలను చేర్చేవన్నారు. ప్రస్తుతం ఆ రైళ్లలో సైతం ఎక్స్ ప్రెస్ టికెట్లు వసూలు చేస్తున్నారన్నారు. మెమో, ప్యాసింజర్ రైళ్లలో గతంలో ఉన్న ధరలను కొనసాగించాలన్నారు. ఇన్సాఫ్ సమితి పట్టణాధ్యక్షులు సయ్యద్ నయీమ్ మాట్లాడుతూ గేట్ నెంబర్ 99 (తిరుపతి లైన్) వద్ద రెండు పట్టాల నడుమ తారురోడ్డుకు బదులు టైల్స్ వేయడంతో నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఆ గేటు వద్ద ద్విచక్ర వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు కూడా స్కిడ్ అయి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. వెంటనే టైటిల్స్ ను తొలగించి రెండు రైలు పట్టాల నడుమ తారు రోడ్డు వేయాలని కోరారు. ఒకటవ ప్లాట్‌ఫాంపై ఏర్పాటుచేసిన ఎస్కలేటర్ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే లిఫ్ట్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మధ్యలో లిఫ్ట్ ఆగిపోతున్నందని ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారని‌, నిర్వహణ కోసం ఒక వ్యక్తిని ఏర్పాటుచేసి ప్రయాణీకులు ఆందోళన చెందకుండా చూడాలని కోరారు. ఆయా సమస్యలకు గూడూరు రైల్వే జంక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు సానుకూలంగా స్పందించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. సౌత్ క్యాబిన్ వద్ద నాలుగురోజులలో టైల్స్ తొలగించి తారు రోడ్డు నిర్మిస్తామన్నారు. లిఫ్ట్ నిర్వహణా కాంట్రాక్ట్ పూర్తవడంతో మళ్లీ టెండర్లు పిలిచి లిఫ్ట్ నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్యాసింజర్ రైళ్లలో ఎక్స్ ప్రెస్ ధరలు కేంద్ర నిర్ణయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డీ. నయూమ్, షేక్ ఇలియాజ్, దావూద్, పఠాన్ నశీర్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img