Friday, April 19, 2024
Friday, April 19, 2024

యూజర్ చార్జీల వసూళ్లు వేగవంతం చేయండి

కమిషనర్ హరిత

విశాలాంధ్ర – నెల్లూరు (కార్పొరేషన్) : నగరంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్న నూతన వాహనాల రుణ బకాయీల చెల్లింపులకు యూజర్ చార్జీల వసూళ్లు తప్పనిసరి అని, అన్ని డివిజనుల్లో పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ హరిత సచివాలయం అడ్మిన్ కార్యదర్శులను ఆదేశించారు. రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయం అడ్మిన్ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సమీక్షిస్తూ ప్రభుత్వ సంక్షేమ పధకాలైన అమ్మవడి, కాపు నేస్తం, వాహన మిత్ర నూతన లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయడంలో అలసత్వం సహించబోమని తెలిపారు. ఆస్థి పన్ను వసూళ్లకోసం చలనా మంజూరు అయిన వెంటనే వసూలు చేసిన మొత్తాలను డిపాజిట్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా ఆయా మొత్తాలను ఉంచుకోవద్దని ఆదేశించారు.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా (క్లాప్) యూజర్ చార్జీల వసూళ్లపై సచివాలయం అడ్మిన్ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని, స్లమ్ ప్రాంతాల్లో రూ.30/- , నాన్ స్లమ్ ప్రాంతాల్లో రూ.90/- లను క్రమం తప్పకుండా వసూళ్లు చేయాలని సూచించారు. కమర్షియల్ ప్రాంతాల్లో భవనం పరిధిని బట్టి యూజర్ ఛార్జ్ విధించాలని, వలంటీర్లకు చార్జీల వసూలు టార్గెట్ విధించడం ద్వారా త్వరితగతిన వసూళ్లు చేయగలమని కమిషనర్ పేర్కొన్నారు. సచివాలయం అడ్మిన్ కార్యదర్శులుగా యూజర్ చార్జీల వసూళ్లు బాధ్యతగా భావించి, శానిటరీ కార్యదర్శులను సమన్వయం చేసుకుని చార్జీల వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, సెక్రెటరీ హేమావతి, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్ లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img