Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నెల్లూరు టు రంపచోడవరం!

. గిట్టని కార్పొరేషన్ కమిషనర్లు అరణ్యవాసానికి..
. ప్రభుత్వం ఏదైనా పనిష్మెంట్ ఇదే

విశాలాంధ్ర, నెల్లూరు (కార్పొరేషన్) : నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ బాధ్యతలు అంటే కత్తి మీద సామే.. ఏ పార్టీ అధికారంలో ఉన్న నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్లకు రాజకీయ ఒత్తిళ్లు తప్పవు.. రాజకీయ నేతలకు తలొగ్గి పని చేసుకుంటూ పోతే అందలం ఎక్కిస్తారు… లేదంటే అరణ్యవాసం చేయిస్తారు.. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్లుగా వచ్చే ఐఏఎస్ అధికారులు అయ్యా ఎస్ అంటే ఓకే.. లేదంటే రంపచోడవరం ఐటీడీఏ బాట పట్టిస్తారు.. నాలుగు నెలల క్రితం నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి జాహ్నవి రంపచోడవరం పివోగా బదిలీ అయ్యారు.

అధికారపార్టీ నేతల ఒత్తిళ్ళకు లొంగలేదని..

అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగలేదని జాహ్నవిని బదిలీ చేయించినట్లు సమాచారం. నెల్లూరు నగరపాల సంస్థలో అవసరానికి మించి కాంట్రాక్ట్ సిబ్బందిని కంప్యూటర్ ఆపరేటర్ల పేరుతో నియమించినట్లు తెలిసింది. వారి నియామకం విషయంలో కమిషనర్ జాహ్నవి లోతుగా విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. వారంతా అధికార పార్టీ నాయకుల సిఫారసులతో కార్పొరేషన్ సిబ్బందిగా నియమితులయ్యారు. ఈ విచారణ సాధారణంగా అధికార పార్టీ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. ఆమె బదిలీకి ఇదొక్కటే కారణం కాదు.. అధికార పార్టీలో విభేదాలు కూడా ఆమె బదిలీకి కారణం అని తెలుస్తోంది. జిల్లా అధికార పార్టీలో మంత్రికి, కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు నేపథ్యంలో కూడా కమిషనర్ పై బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఆ బదిలీ కూడా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతానికి చేయడం ఇప్పుడు చర్చనీయాల్సింది. రంపచోడవరం అంటే ఒక విధంగా పనిష్మెంట్ ప్రాంతం. గిట్టని వారిని రంపచోడవరం బదిలీ చేయిస్తుంటారు. ఆ విధంగా కమిషనర్ జాహ్నవి పై బదిలీ వేటు వేశారని తెలుస్తోంది.

గత ప్రభుత్వంలో కూడా..

గత ప్రభుత్వంలో కూడా నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా నియమితులైన ఐఏఎస్ అధికారి చక్రధర్ బాబు ని రంపచోడవరం బదిలీ చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ పాలకులకు ఆయన అయ్యా ఎస్ అనకపోవడంతో ఆయనను కూడా అరణ్యవాసం చేయించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా ఐఏఎస్ అధికారులు వచ్చి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గక పోతే వారు రంపచోడవరం బాట పట్టాల్సి వస్తోంది. నెల్లూరు కార్పొరేషన్ కు కమిషనర్లుగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు నియమితులయితే వారిలో ఇద్దరు రంపచోడవరం ఐటీడీఏ పీవో లు బదిలీ కావడం గమనార్హం. ప్రభుత్వం ఏదైనా నెల్లూరు కార్పొరేషన్ కు కమిషనర్లుగా నియమితులయ్యే ఐఏఎస్ అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగాల్సిందే. ఆ విధంగా నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్లకు రంపచోరానికి మధ్య అవినాభా సంబంధం ఏర్పడింది ఏర్పడింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img