Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

వేగవంతంగా రోడ్ల మరమ్మతుల పనులు

కమిషనర్ జాహ్నవి

విశాలాంధ్ర, నెల్లూరు (కార్పొరేషన్) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల పనులను అత్యంత వేగవంతంగా పూర్తి చేసి, ప్రజా రవాణాకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ జాహ్నవి పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా వివిధ డివిజనుల్లో రోడ్లపై ఏర్పడిన గుంతల రిపేరు పనుల అభివృద్ధిని ఫోటోల రూపంలో కార్యాలయంలో శుక్రవారం ప్రదర్శించారు. ముందుగా కార్యాలయం కింది అంతస్తులో ఏర్పాటు చేసిన ‘రోడ్లపై గుంతలు నాడు – నేడు’ ప్రదర్శనను కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘గుంతల రహిత రోడ్ల నిర్మాణం’ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారుగా 7 కోట్ల రూపాయలతో వివిధ డివిజనుల్లో 1600 గుంతలకు మరమ్మతులు పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రారంభించిన పనులన్నీ అన్ని ప్రాంతాల్లో దాదాపుగా 90 శాతం వరకు పూర్తయ్యాయని, వాహన చోదకులకు సౌకర్యవంతంగా ఉండేలా దెబ్బతిన్న రోడ్లను తీర్చిదిద్దుతున్నామని కమిషనర్ వివరించారు. వీటితో పాటు వర్షాలకు దెబ్బతిన్న మరో 500 గోతులను గుర్తించామని, వర్షాకాలపు పరిస్థితుల దృష్ట్యా మరో నెల రోజుల అనంతరం వాటి మరమ్మతు పనులు చేపట్టి పూర్తి స్థాయిలో ప్రజా రవాణాకు అనుకూలంగా ఉండేలా అందుబాటులోకి తెస్తామని కమిషనర్ ప్రకటించారు. అదేవిధంగా రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన మరమ్మతు పనులకు సంబంధించి పూర్తి సర్వే నివేదికను సంబంధిత శాఖకు అందజేసామని, ఆ శాఖ ద్వారా పనులు పూర్తయితే ‘గుంతల రహిత రోడ్ల నగరం’గా గుర్తింపు పొందగలమని కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్ కుమార్, అధికారులు సంజయ్, శేషగిరిరావు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img