Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

అంతర్యుద్ధంలో తల్లడిల్లుతున్న సూడాన్‌

సూడాన్‌లో మరోసారి అధికారం కోసం రెండు సైనిక విభాగాల మధ్య భీకరంగా అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు రెండు వందలకు పైగా అమాయక ప్రజల మరణించారు. రెండు వేలకు పైగా గాయపడ్డారు. ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు రావటంలేదు. ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ ( అర్‌ఎస్‌ఎఫ్‌) ని సూడాన్‌ ఆర్మీలో విలీనం చేసేందుకు ఆర్మీచీఫ్‌ అబ్దల్‌ పత్తా బుర్హాన్‌ చేసిన ప్రతిపాదన ఈ అంతర్యుద్ధానికి దారి తీసింది. సైన్యంలోని తమ గ్రూపును విలీనం చేయరాదంటూ మహ్మద్‌ హన్టూన్‌ దగా నేతృత్వంలోని ర్యాపిడ్‌ సపోర్ట్‌ దళాలు తిరుగుబాటు చేశాయి. ఈ ఆధిపత్య పోరులో దాగి ఉన్న నిజాలు ఏమిటి?
సూడాన్‌ సుదీర్ఘ కాలం బ్రిటిష్‌, ఈజిప్టు వలస దేశంగా ఉంది. వలస పాలనకు వ్యతిరేకంగా సూడాన్‌ ప్రజలు అనేక పోరాటాలు చేశారు. నిర్భందాలను ఎదుర్కొన్నారు. 1953లో అన్ని వలస ఆస్తులపై పట్టు కోల్పోవటంతో బ్రిటిష్‌ ప్రభుత్వం సూడాన్‌కు స్వయం నిర్ణయాధికారం కల్పించి, 1955 చివరిలో సూడాన్‌ పార్లమెంట్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. ఆ విధంగా పోరాటాల ఫలితంగా 1956 సూడాన్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. 1956 జనవరి1 పీపుల్స్‌ ప్యాలెస్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈజిప్టు, బ్రిటన్‌ జండాలు దించి హరిత వర్ణం, నీలం, పసుపు చారల కూర్పుతో ఉన్న కొత్త జెండాను సూడాన్‌ తొలి ప్రధానమంత్రి ఇజ్రాయిల్‌ అలు అజారీ ఎగురవేశాడు. నూతన ప్రభుత్వం పార్లమెంట్‌ని, రాజకీయ పార్టీలను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అజారీ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించటంలో విఫలమైంది. అజారీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగి కర్నల్‌ గాఫర్‌ నామీరై ప్రధాన మంత్రి అయ్యాడు.
సూడాన్‌ దేశం తూర్పు- దక్షిణ ప్రాంతాలుగా ఉంటుంది. ఈ రెంటి మధ్య దశాబ్దాలగా ఉన్న వైరుధ్యం, అపనమ్మకం 1950లో సాయుధ పోరాటానికి దారితీసింది. దక్షిణ సైనికాధికారులు 1955లో తిరుగుబాటూ చేశారు. ఇది సూడాన్‌ మొదటి అంతర్యుద్ధానికి నాంది పలికింది. దక్షిణ సూడాన్‌లో క్రిస్టియన్‌ జనసంఖ్య ఎక్కువ. కర్నల్‌ గాఫర్‌ ప్రభుత్వం క్రిస్టియన్లపై తీవ్ర నిర్భందాన్ని ప్రయోగించింది. ఆ ప్రాంత సహజవనరులను తరలించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణసూడాన్‌ ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారు. ఫలితంగా 1972లో దక్షిణ సూడాన్‌ స్వతంత్ర ప్రాంతంగా ఏర్పడి 1983 వరకు కొనసాగింది. తర్వాత సూడాన్‌ లో రెండవ అంతర్యుద్ధం ప్రారంభమై 2005 శాంతి ఒడంబడికతో అక్కడ స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పడి 2011 జూలైలో దక్షిణ సూడాన్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడిరది.
సూడాన్‌ దేశ ప్రధాన రంగం వ్యవసాయం. జొన్న ప్రధాన ఆహార పంట. నువ్వులు, వేరుశనగ పంటలను వ్యాపార పంటలగా సాగుచేస్తున్నారు. సూడాన్‌ 84 మిలియన్‌ హెక్టార్ల భూమి ఉంటే 20శాతం మాత్రమే సాగులో ఉంది. పెట్రోలియం గనులు అధికంగా ఉన్న దేశాలలో ఒకటి. బంగారు గనులతో పాటు అనేక ఖనిజాలకు ప్రసిద్ధ గాంచింది. ఇన్ని సహజ వనరులున్నా దేశంలో పేదరికం, నిరుద్యోగం తీవ్రంగా ఉంది. కరువుల మూలంగా లక్షలాది ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లారు. 1989 సంవత్సరం ముందు వరకు ప్రధానిగా అధికారంలో ఉన్న సాదిక్‌ అల్‌ మహదీ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటాన్ని అవకాశంగా తీసుకుని మాజీ సైనిక పారాట్రూపర్‌ బషీర్‌ 1989 తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు.
బషీర్‌ సైనిక నియంతృత్వ పాలనలో ప్రజలకు ఎటువంటి హక్కులు లేవు. ఇస్లామిస్టులతో అతని పొత్తు, ఆశ్రితులను రక్షించటానికి, భారీ అవినీతిని ప్రోత్సహించటానికి మిలీషియాలను ఏర్పాటు చేయటంలో అతనికి సహాయపడిన తీవ్రవాద జిహాదీలతో అతని పాలన అనుసంధానమైంది. మతం, జాతుల విద్వేషాలు రెచ్చగొట్టాడు. బషీర్‌ ప్రభుత్వం ధరలను అదుపు చేయటంలో విఫలమైంది. బ్రెడ్డు ధర మూడు రెట్లు పెరిగింది. మందుల, ఇంధనం ధరలు పెరిగాయి. ప్రజల్లో ఆగ్రహం ఏర్పడిరది. విద్య, రవాణ వ్యవస్థల్లో వైఫల్యం, ఆర్థిక కష్టాలు, రాజకీయ అశాంతి ప్రజా తిరుగుబాటుని ప్రేరేపించాయి. బషీర్‌ నియంతృత్వ పాలన సూడాన్‌ చరిత్రలోనే అత్యంత దారుణమైంది. సూడాన్‌ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తూర్పు నగరం ఆర్బాటాలో ప్రారంభమై నిరసనలు దేశవ్యాపితంగా విస్తరించాయి. అధ్యక్ష పదవి నుంచి బషీర్‌ వైదొలగాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. బషీర్‌ అనుకూల సైన్యాలు నిరసన కారులపై తీవ్ర హింసను ప్రయోగించి నాలుగు లక్షల దాకా ప్రజల ప్రాణాలు బలిగొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైన్యం తిరుగుబాటు చేసి బషీర్‌ని గృహనిర్భందం చేసింది. 30సంవత్సరాల బషీర్‌ నియంతృత్వ పాలన 11-4-2019లో ముగిసింది.
బషీర్‌ ప్రభుత్వం కూలి పోవటంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటుగా సాగాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. కాని మిలటరీ, ప్రజల సంయుక్త భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటైంది. రెండేళ్ల ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెప్పింది. 2021 అక్టోబర్‌ జనరల్‌ అబ్దల్‌ పత్తా అల్‌-బుర్హాన్‌ నేతృత్వంలో తిరుగుబాటుచేసి తాత్కాలిక ప్రభుత్వాన్ని రద్దు చేసింది. పౌర ప్రభుత్వ ప్రధాన మంత్రిని గృహ నిర్బంధం చేశారు. సార్వభౌమాధికార మండలిని రద్దు చేశారు. పౌర ప్రభుత్వ మంత్రులను, రాజకీయ పార్టీల సభ్యులను, న్యాయవాదులను, పౌర సమాజ కార్యకర్తలను, పాత్రికేయులను, మానవహక్కుల పరిరక్షణ నాయకులను అరెస్టు చేసి రహస్య ప్రదేశంలో ఉంచారు. ప్రజల పోరాటానికి ఒక లక్ష్యం లేకపోతే ప్రజానుకూల ప్రభుత్వ ఏర్పాటుకి భిన్నంగా ఒక దోపిడీ ప్రభుత్వ స్థానంలో మరో దోపిడీ ప్రభుత్వం ఏర్పడుతుంది. సూడాన్‌లో జరిగింది అదే. సూడాన్‌లో తిరిగి ప్రజా ప్రభుత్వ ఏర్పాటు పక్రియ చేపట్టేందుకు 2022 డిసెంబర్‌లో చర్చలు జరిగి, చర్చల ప్రతిపాదనలు ఆమోదించే దశలో చర్చలు విఫలమయ్యాయి. తాజాగా రెండు సైనిక విభాగాలు ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి.
బొల్లిముంత సాంబశివరావు, సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img