Friday, December 1, 2023
Friday, December 1, 2023

అఖండ జ్యోతి స్టాన్‌ స్వామి

ఆర్వీ రామారావ్‌
సరిగ్గా ఏడాది. గత సంవత్సరం ఇదే రోజు (05-07-2021) ఫాదర్‌ స్టాన్‌ స్వామి నిర్బంధంలో ఉండగానే ప్రాణాలు విడిచారు. 84 ఏళ్ల ఆ వృద్ధుడు పార్కిన్సన్‌ వ్యాధితో సహా అనేక రుగ్మతలతో తీసుకుంటున్నప్పటికీ పౌరుల ప్రాథ మిక హక్కులను పరిరక్షిస్తామని అవకాశం దొరికినప్పుడల్లా చెప్పే న్యాయవ్యవస్థ స్టాన్‌ స్వామికి మాత్రం ఆరోగ్య కారణాలతోనైనా బెయిలు మంజూరు చేయలేదు. ఆయన గ్లాసుతో మంచినీళ్లు తాగడం కూడా కష్టంగా ఉండేది. తనకు మంచి నీళ్లు తాగడానికి సిప్పర్‌ ఇప్పించాలని స్టాన్‌ స్వామి న్యాయమూర్తులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశారో!
బీమా కోరేగావ్‌ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన వారిలో స్టాన్‌ స్వామి కూడా ఒకరు. 2020 అక్టోబర్‌8న ఆయనను చట్ట వ్యతిరేకంగా అరెస్టు చేశారు. ఆయన ఎన్నిసార్లు బెయిలు కోసం అర్జీలు పెట్టుకున్నా వినిపించుకున్న నాథుడే లేడు. చివరకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి దయతలచి ఆయనకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించడానికి అనుమతించారు. అంతకుముందూ నిర్బం ధంలో ఉండగానే అనేక రోజులు తలోజా జైలులో మగ్గిపోయారు. ప్రైవేటు ఆసు పత్రిలో ఎంత మంచి చికిత్స అందినా ఆయన ప్రాణాలు నిలబడలేదు. న్యాయ వ్యవస్థ ఆయనకు బెయిలు మంజూరు చేయడానికి దీర్ఘకాలం నిరాకరి చినందు వల్ల ఆఖరి నిమిషంలో ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కూడా ఆయనను కాపాడలేక పోయింది. ఇది నిజానికి రాజ్యం చేసిన హత్యలో భాగంగానే పరిగ ణించాలి. నిజానికి ఆయనను అరెస్టు చేయడమే అక్రమం. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నందువల్ల అస్సలు అరెస్టు చేయవలసింది కాదు.
స్టాన్‌ స్వామి ఈ లోకం వదిలి వెళ్లినా ఆయన మీద మోపిన ఆరోపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బీమా కోరేగావ్‌ కేసులో అనేకమందిని జైళ్లలో మగ్గబెట్టడం తప్ప ఇంతవరకు విచారణే ప్రారంభం కాలేదు. ఈ దేశంలో, ముఖ్యంగా మోదీ సర్కారు హయాంలో న్యాయస్థానాలు విధించే శిక్ష కన్నా ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గడమే పెద్ద శిక్ష.
స్టాన్‌స్వామి తన జీవితాన్నంతటినీ గిరిజనులకోసం, హక్కులు, అధికారాలు లేని వారికోసం, అణగారిన వర్గాల కోసం పోరాడుతూనే గడిపారు. ఆయనది నిఖార్సైన నిస్వార్థ సేవ. రాను రాను అమానవీయంగా మారుతున్న సమాజంలో ఆయన దోపిడీకి గురవుతున్న వారి తరఫున, అభివృద్ధి ఫలాలు అందనివారి కోసం తాపత్రయపడ్డారు. గాంధేయ పద్ధతుల్లో ఉద్యమాలు నిర్మించారు. భౌతి కంగా స్టాన్‌స్వామి మనమధ్య లేకపోయినా దేశవాసులే కాదు, ప్రపంచవ్యాప్తంగా సత్యాహింసల్లో విశ్వాసం ఉన్నవారు, పీడితజన పక్షాన నిలబడేవారు ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆయనను నిర్బంధించి నప్పుడు, నిర్బంధంలో ఉండగానే మరణించినప్పుడు ప్రపంచ వ్యాప్త్రంగా నిరసన వ్యక్తమైంది. వందలు వేల సంఖ్యలో జనం రోడ్ల మీదకొచ్చి స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం నినదించారు. దయ, ధైర్యం, సహజీవనం, నిబద్ధత ఆయన వ్యక్తిత్వంలోని మూలకందాలు.
బీమా కోరేగావ్‌ కేసులో ఇద్దరు మాత్రమే బెయిలు మీద తాత్కాలింగా విడుదలయ్యారు. మిగతా 15మంది ఇంకా జైలులోనే మగ్గుతున్నారు. అభివృద్ధికి నోచుకోని వారు, దోపిడీకి గురయ్యే వారు అంటే స్టాన్‌ స్వామి హృదయం చలించిపోయేది. జీవిత వాస్తవికతను అర్థం చేసుకున్న కొద్ది మందిలో స్టాన్‌ స్వామి ఒకరు. పేదల ఆక్రందనలు వింటే ఆయనలో కరుణ, దయ ఉప్పొం గడంతో పాటు పోరాట పటిమ మరింత రాటుదేరేది. పీడితుల పక్షాన నిలబడి అన్యాయాన్ని ఎదిరించాలన్న ఆయన సంకల్ప బలం మరింత ఇనుమడిరచేది. పేదలు, నిర్వాసితులు, దోపిడీ కాడి కింద నలిగిపోయే వారు, హక్కులకు దూరంగా ఉండే వారితో మమేకం కావడం స్టాన్‌ స్వామి వ్యక్తిత్వంలోని విశేష లక్షణం. పీడితుల సుఖఃదుఖాలలో ఆయన సదా భాగస్వామిగానే ఉన్నారు. వారు నిరుపేదలుగా మగ్గిపోవడానికి మూలకారణాల మీద తన పోరాట పటిమను ఎక్కుపెట్టడం స్టాన్‌ స్వామిలోని మరో విశిష్టత.
ఈ పోరాట క్రమంలో ఆయన అనేక సమస్యలు ఎదుర్కున్నారు. ఓపికగా సవాళ్లను అధిగమించడం మీదే దృష్టి నిలిపారు. భయం అంటే ఏమిటో ఆయనకు తెలియదు. అందువల్లే ఆదివాసీల హక్కులు కాపాడడానికి ఆయన స్వార్థపర శక్తులతో నిరంతరం పోరాడుతూనే వచ్చారు. వారికి దక్కవలసిన భూమి, ఇతర సహజ వనరుల కోసం పోరాడడం మాత్రమే కాకుండా గిరిజన సంస్కృతిని పరిరక్షించడానికి ఆయన పడ్డ పాట్లు అపురూపమైనవి. నిష్కా రణంగా యువకులు జైళ్లల్లో మగ్గిపోయిన సందర్భాలలోనూ ఆయన పోరాడే వారు. ఇతరులకు న్యాయం కలిగేట్టు చేసే క్రమంలో అనేక సార్లు ఆయన ప్రాణాల మీదకు వచ్చినా ఎన్నడూ లెక్క చేయలేదు.
రాజ్యాంగ పీఠికలో రాసుకున్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రా తృత్వం ఆయన దృష్టిలో కేవలం ఆదర్శాలు మాత్రమే కావు. అవి ప్రజల భావనల్లో జీర్ణించుకు పోవలసిన అవసరం ఉందని చెప్పేవారు. ఈ లక్ష్య సాధన కోసం ఎవరు పోరాడినా రాజకీయ విభేదాలను పట్టించుకోకుండా స్టాన్‌ స్వామి ఆ పోరాటలన్నింటిలో భాగస్వామి అయ్యేవారు.
ప్రస్తుతం దేశం రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో తీసికట్టుగా తయా రైంది. ప్రతి రంగంలోనూ కాళ్లీడుస్తోంది. జనజీవనం, ప్రజాస్వామ్య హక్కులు, మీడియా స్వేచ్ఛ లాంటి కీలక రంగాలలో మనదేశం అట్టడుగు స్థాయిలో ఉంది. పైగా మోదీ ఏలుబడిలో ఒక్కో మెట్టూ కిందకు దిగ జారుతోంది. విచ్ఛిన్నకర విధానాలు, వివక్ష, విద్వేషం, ఒక వర్గం వారిని వికృతీకరించి చూపడం, వారిని కించపరచడం అనునిత్యం చూస్తూనే ఉన్నాం. హింస, దౌర్జన్యం, విద్వేష ప్రచారం సర్వత్రా వ్యాపించి విలయ తాండవం చేస్తున్నాయి. ఎటు చూసినా ఈ వికృత సంస్కృతిని ప్రోత్సహించే వారి వికటాట్టహాసమే వినిపిస్తోంది. నిష్పా క్షికంగా ఉండవలసిన ఎన్నికల కమిషన్‌, సీబీఐ లాంటి వ్యవస్థలు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న వర్గాలకు తాబేదార్లుగా మారిపోయాయి. ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌ లాంటివి ఏలిన వారి పరిచారికలుగా తయారయ్యాయి. ఈ దశలో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి దాసోహం అంటున్న మీడియా గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది.
స్టాన్‌ స్వామిని బీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధించడం, నిర్బంధంలో ఉండగానే ఆయన మరణించడం దారుణం అయిన మాట నిజమే. కానీ ప్రభు త్వానికి ఆయన ఒక్కడి మీదే ప్రత్యేకమైన కసి, ద్వేషం, పగ లాంటివి ఏమీ లేవు. న్యాయం, సత్యం కోసం పోరాడే వారెవరైనా మోదీ సర్కారు దృష్టిలో ద్రోహుల కిందే లెక్క. వారిని వేధిస్తారు. జైళ్లల్లో కుక్కుతారు. నోరు మూయిస్తారు. సంబంధం లేకపోయినా, ఏ మాత్రం వర్తించకపోయినా అత్యంత కఠినమైన చట్టాల కింద కేసులు మోపుతారు. స్టాన్‌ స్వామి ప్రాణ త్యాగం ఇలాంటి వారికి హెచ్చరిక కావాలని ప్రభుత్వం భావిస్తోంది.
మహమ్మద్‌ జుబేర్‌, తీస్తా సెతల్వాడ్‌ లాంటి వారు నిజం చెప్పడానికి ప్రయత్నించినందువల్లే ప్రస్తుతం జైళ్లలో ఉన్నారు. నిరాధారమైన ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. మరో వేపు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన పాపానికి గుజరాత్‌ పోలీసు ఉన్నతాధికారి సంజీవ్‌ భట్‌ దీర్ఘకాలంగా జైలు లోనే ఉన్నారు. మరో పోలీసు అధికారి ఆర్‌.బి. శ్రీ కుమార్‌ను తీస్తాతో పాటే అరెస్టు చేసి జైలుకు పంపించారు. విద్వేష ప్రచారం చేసే నూపుర్‌ శర్మలాంటి వారు మాత్రం హాయిగా, స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటారు. ఒక వేళ అరెస్టయినా వారికి స్వల్ప కాలంలో బెయిలు మంజూరు అవుతుంది. అన్యాయాన్ని అక్రమాలను చూస్తూ ఊరుకునే లక్షణం లేని స్టాన్‌ స్వామి లాంటి వారు ప్రాణాలు అర్పించి మూల్యం చెల్లించుకుంటారు. అలాంటి వారు అపరిమితమైన సంఖ్యలో ఉండవలసిన తరుణంలో కరకు రాజ్యం ఆయనను మింగేసింది. కానీ ఆయన స్ఫూర్తి, పోరాట పటిమ, చిత్తశుద్ధి ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయి. ఆయన వెలిగించిన దీపం అఖండంగా వెలుగుతూనే ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img