Friday, June 2, 2023
Friday, June 2, 2023

అడుగంటుతున్న భూగర్భ జలాలు

ప్రకృతి ప్రసాధించిన సహజవనరులతోనే ప్రాణికోటి మనుగడ సుసాధ్యం అయ్యింది. ఏమీ అడగకుండా అన్నీ అందుబాటులో ఉంచింది భూమాత. గాలి, నేల, నీరు అనే మూడు అత్యుత్తమవనరులను అందించింది. నేల తల్లి, వాయు దేవుడు, గంగామాతలను ఆరాధిస్తూ జీవిస్తున్నారు. నీరు ప్రాణాధారమయ్యింది. నీటి నిల్వల్లో సాగరాలు, సరస్సులు, చెరువులు, ఆనకట్టలు, భూగర్భజలాలు, ఉపరితలజలాలు, మంచుకొండలు, గ్లేసియర్లు లాంటివి ప్రముఖంగావస్తాయి. ఉపరితల జలవనరులు, భూగర్భ జల సంపదల తోనే సకల జీవరాశులు మనుగడను సాగిస్తున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భూఉపరితల జలాలతో పాటు భూగర్భ జల వనరులను కాపాడుకోవడానికి వేరు వేరు మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. ఉపరితల జల వనరులు పెరిగితే భూగర్భ జలాలు సమృధిగా లభిస్తాయనే విషయం మనకు తెలుసు. ఊరిచెరువు మత్తడిదునికితే ఆ ఊరి వ్యవసాయ బావుల్లో భూగర్భ జలవనరులు పొంగిపొర్లుతూ గ్రామదేవత సస్య శ్యామలంగా హరిత తివాచీలను పరిచినట్లు ఆనందాల విందును చేస్తుంది.
నానాటికీ తరిగిపోతున్న ఉపరితల జలరాశులను కళ్లారా చూస్తున్న మానవ సమాజం తగు ముందు జాగ్రత్తలను తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పారిశుద్ధ్య వ్యవస్థలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలు, వాతావరణ మార్పులకు భూగర్భ, ఉపరితల జలాలు ఆధారం. భూగర్భ జలనిధులు తరిగిన కొలది నీటి కొరత, నీటి నాణ్యతకు తూట్లు పడడం జరుగుతున్నది. మే-2022లో నిర్వహించిన ‘‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నీరు కీలకం’’ అంశంపై అంతర్జాతీయ సదస్సుతో పాటు డిసెంబర్‌8న 2022న జరిగిన ‘భూగర్భ జలాలపై శిఖరాగ్ర సమావేశం’తో పాటు 23-24మార్చిలో నిర్వహించిన ఐరాస సదస్సు నేపథ్యంలో భూగర్భ జల అంశానికి మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రపంచ దేశాల్లో భూగర్భ జలాల మీద ఇండియా అత్యధికంగా ఆధారపడిఉన్నది. 2017లో 248.69బిలియన్‌ క్యూబిక్‌మీటర్స్‌ నీరు అందుబాటులో ఉండగా, ఇండియాలో ఉపయోగించే భూగర్భనీటి నిధుల్లో 89శాతం వ్యవసాయ రంగానికి, 9శాతం గృహఅవసరాలకు,2 శాతం పారిశ్రామిక అవసరాలకు వాడుతున్నాం.
కేంద్ర భూగర్భ జలాల బోర్డు అంచనాల ప్రకారం వార్షికంగా అందుబాటులో ఉండే భూగర్భ జలాల్లో 70శాతం వరకు మాత్రమే వాడుకో వచ్చని నిర్ణయించారు. భారతదేశం 2004లో 58 శాతం, 2017లో 63 శాతం వరకు భూగర్భ జలాలను వినియోగించడం గమనించారు. దేశం లోని పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యానా, ఢల్లీి, చంఢీఘర్‌, హిమాచల్‌, తమిళనాడు, పుడుచ్చేరి రాష్ట్రాలు దాదాపు 70 శాతం వరకు వాడడం జరిగింది. భారతంలోని 22 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 534 జిల్లాల్లోని 202జిల్లాలు దాదాపు 71 నుంచి 385శాతం వరకు వినియోగించు కోవడం మరింత భయానికి కారణమవుతున్నది. 2030 నాటికి దేశంలోని అన్ని జిల్లాలు 70శాతం వరకు మాత్రమే వాడుకునేలాచర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. భూగర్భ జలాలను అధికంగా తోడినపుడు జలంలో ప్రమాదకర ఫ్లోరైడ్‌, ఐరన్‌, లవణ ధర్మం, నైట్రేట్స్‌, ఆర్సెనిక్‌ పరిమాణాలు పెరిగి ప్రజారోగ్యం సంక్షోభంలో పడవచ్చని హెచ్చరిస్తున్నారు. 2006లోనే 109 జిల్లాలో నైట్రేట్‌ సమస్యలను ఎదుర్కోగా నేడు 335 జిల్లాల నీటి నాణ్యతలు ప్రమాదపు అంచున నిలబడడం గమనించారు.
ప్రస్తుత ‘కేంద్ర జలాల కమిషన్‌’తో పాటు ‘కేంద్ర భూగర్భ జలాల బోర్డు’లను ఏకం చేస్తూ భూగర్భ, ఉపరితల జలాల నియంత్రణకు నడుం బిగించాలని 2016లోనే ‘మిహిర్‌ షా కమిటీ’ సిఫార్సు చేయడం కూడా గుర్తు చేసుకోవాలి. స్థానిక వనరులను దృష్టిలో ఉంచుకొని వర్ష నీరు, ఉపరితల జలం, నేలలో నీరు భూగర్భ జల లభ్యతలను పరిగణనలోకి తీసుకొని అవసర ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. భూగర్భ జలాలతో ఉపరితల జలాలను అనుసంధానం చేయడానికి ప్రాంతాల వారీగా చొరవ తీసుకోవాలి. ఉపరితల, భూగర్భ జలాల లభ్యతల ఆధారంగానే వ్యవసాయ పంటలను, పంటల సాంద్రతలను నిర్ణయించు కోవాలి. నేడు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత కరెంట్‌ అందుబాటులో ఉంచడంతో రైతులు విచక్షణారహితంగా వేయి మీటర్ల లోతు వరకు బోర్లను వేసి భూగర్భ జలాలను పాతాళంలోంచి పైకి లాగడంతో భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడనున్నాయని గమనించాలి. భూగర్భ జలాలతో నీటి ఎద్దడి, శుష్క భూములు, పాక్షిక శుష్క ప్రాంతాల అవసరాలు తీరడానికి ప్రభుత్వ చట్టాలకు మరింత పదును పెట్టాల్సిన అగత్యం ఏర్పడుతున్నది.
భూగర్భ జలాల లభ్యతతో సామాజిక-పర్యావరణ సవాళ్లు ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వాలు సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన, పాలనపరమైన మధ్యవర్తిత్వాలు సకాలంలో జరిగితే రాబోయేతరాలకు నీటిలభ్యత సమస్యలు ఉండవని గమనించాలి. జలంతో జీవనం, జీవనంతోనే ఆరోగ్యం సిద్ధిస్తాయని ఆశిద్దాం. భూగర్భ, ఉపరితల జలవనరులను అమూల్య జాతిసంపదగా గుర్తించి కాపాడుకోవాలి.
మధుపాళి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img