Friday, March 24, 2023
Friday, March 24, 2023

అణగారిన తరగతులకు అన్యాయం

జ్ఞాన్‌ పాఠక్‌

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 202324 బడ్జెట్‌లో అణగారిన తరగతుల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. అంతేకాదు, ఈ బడ్జెట్‌లో నేడు దేశంలో ముఖ్యమైన నిరుద్యోగసమస్య తీసుకోనేలేదు. అలాగే ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు సహాయం ప్రకటించకుండా అప్పులు తీసుకోడానికి 20వేల కోట్ల రూపాయలు ప్రకటించడం వల్ల ప్రయోజనం ఎంత? ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న ఊసేలేదు. భారత ఆర్థికవ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయి, అమృతకాలంలో ప్రవేశించాము. వచ్చే 25ఏళ్లలో స్వాతంత్య్రం సిద్ధించి శతాబ్ది అవుతుంది. ఆధునిక భారతదేశాన్ని నిర్మించడానికి అనుసరిస్తున్న విధి విధానాలు అత్యంత జాగ్రత్తతో రూపొందించాం అని చాలా గొప్పగా 202223 ఆర్థికసర్వేలో పేర్కొన్నారు.
ఖాళీకుండకు మోత ఎక్కువ
పూర్తి బడ్జెట్‌ను 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టారు. అయితే ఇది ఖాళీ కుండకు మోత ఎక్కువ అన్నట్లుగా ఉంది. 2014నుంచి సాధించిన విజయాలను ఆర్థికమంత్రి నొక్కి వక్కాణించారు. తలసరి ఆదాయం తమ పాలనలో రెట్టింపుకంటే ఎక్కువగా 1.97 లక్షలకు పెరిగిందని చెప్పుకొన్నారు. అలాగే దేశ ఆర్థిక వృద్ధి గడచిన దాదాపు 9ఏళ్ల కాలంలో ప్రపంచంలోనే పదోస్థానంలో ఉండగా అది ఐదవస్థానంలోకి ఎదిగిందని అన్నారు. అయితే సంపదలో అత్యధికం కొద్దిమంది కార్పొరేట్‌ కుబేరుల చెంతకు చేరిందని మాత్రం ఆమె విస్మరించారు. ఒకవైపు అపారంగా సంపన్నుల సంఖ్య పెరుగుతుండగా, అదే సమయంలో పేదరికం కూడా పెరుగుతుండటం మోదీ ప్రభుత్వ ‘విశిష్టత’. గడచిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రజలను కలల్లో ఉంచారు. అధికారానికి రాకముందు చేసిన ఏ ముఖ్యమైన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. 2047 నాటికి భారతదేశం శక్తిమంతంగా తయారవుతుందని మళ్లీ మనల్ని కలల్లోనే విహరించమంటున్నారు. ఈ అమృతకాలంలో యువతను దృష్టిలో ఉంచుకుని పౌరులకు అవకాశాలు కల్పించడం అభివృద్ధిద్వారా ఉద్యోగాల కల్పన బలమైన సుస్థిరమైన సూక్ష్మ ఆర్థిక వ్యవస్థను సృష్టించడం తమ ప్రాధాన్యతలని చెప్పుకొన్నారు. దాదాపు తొమ్మిదేళ్లకాలంలో నిరుద్యోగం పెంచారేగానీ తగ్గించలేదు. 1530ఏళ్ల వయసులో ఉన్న 23కోట్ల యువత రోడ్లుపట్టుకుని తిరుగుతున్నా ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టలేదు. దాదాపు 4కోట్లమంది చదువుకుంటున్నారు. చిన్న, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న 10కోట్ల మందిలో అత్యధికులు అసంఘటిత రంగంలోనూ నెలసరి వేతనాలు పొందని రంగంలోనూ పనిచేస్తున్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చారు మోదీ ప్రభుత్వకాలంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆర్థిక మంత్రి నానాతంటాలు పడ్డారు. ప్రత్యేకించి గొప్పవిజయాలు సాధించామని ఈ బడ్జెట్‌లో అనేక కొత్త ప్రతిపాదనలు చేశామని శంఖం ఊదారు. ఏడు ప్రాధాన్యతలు అని పేర్కొన్నారు. వీటిలో సమ్మిళిత అభివృద్ధి, యువత సాధికారత, ఆర్థికరంగ వృద్ధి, పచ్చదనం వృద్ధి అవకాశాలను అపారంగా వినియోగించుకోవడం, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు లాంటివి ప్రతిపాదించారు. ఇప్పుడు ప్రతిపాదించిన అంశాలు కొత్తవేమీ కాదు. నిరుద్యోగులను పెంచారు, ఆర్థికరంగం కుదేలైంది, వినియోగించు కున్న అంశాలు గొప్పగా ఏమీలేవు. అనే సమయంలో అసమానతలు అపారంగా పెరిగాయి. బహుశ: ఈ అంశాలు మోదీ ప్రభుత్వానికి పట్టవు. ఆర్థికవ్యవస్థలోని అన్ని విభాగాలలోనూ మోదీ ప్రభుత్వం వైఫల్యాలను మూటకట్టుకుంది. గత బడ్జెట్‌లో లేని ఒక కొత్త అంశాన్ని ప్రకటించారు. సామాజికరంగం అనే ఒక రంగాన్ని సరైనకారణమేమీ లేకుండానే సృష్టించారు. ఇది ఎందుకోసమో మాత్రమే చెప్పలేదు. బహుశ ఓట్ల కోసం ఇది ఉపయోగపడు తుందేమో. రైతుల ఆదాయం రెట్టింపుచేస్తామని 2022 బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఒకవైపు రైతులు అప్పుల్లో కూరుకునిఉంటే, మళ్లీ వ్యవసాయ అప్పులు ఇస్తామని 20లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. మరి రెట్టింపు ఆదాయం ఎలా చేకూరుతుంది? 157నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటుచేస్తామని, ఔషధరంగంలో పరిశోధనలు ప్రోత్సహిస్తామని చాలా గొప్పవిషయాలు ప్రతి పాదించారు. 2019 ఆర్థిక సంవత్సరంలో 1.4శాతం, 2023లో 2.1శాతం బడ్జెట్‌లో కేటాయించారు. విద్యారంగానికి 2019లో 2.8శాతం కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో 2.9శాతం కేటాయించారు. ఈ నిధులతోనే ఆర్థికమంత్రి పేర్కొన్నవన్నీ సాధించగలరా? ఇవన్నీ బోలుమాటలే. తొమ్మిదికోట్ల నీటి కుళాయిలు ఏర్పాటు చేసామని, 2.2లక్షల కోట్ల నుంచి 11.4కోట్ల రైతుల పీఎం కిసాన్‌ పథకాన్ని అమలు చేసామని, 11.7కోట్ల ఇళ్లల్లో మరుగుదొడ్లు నిర్మించామని, 9.6 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చామని, 220 కోట్ల వాక్సిన్‌లు ఇచ్చామని ప్రభుత్వం గొప్పగా చెబుతున్నది. అయితే క్షేత్రస్థాయిలో అంతా డొల్లగానే ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సామాజికరంగ వ్యయం 2023లో 21.3లక్షల కోట్లు అవుతుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ తల్లడిల్లుతున్నప్పటికీ కేటాయింపులు మాత్రం పెంచినట్లు చెబుతున్నారు. ఆరోగ్యం, ఉద్యోగకల్పన రంగంలో ప్రతిపాదనలన్నీ డొల్లగానే ఉన్నాయి. కరోనా మహమ్మారికాలంలో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగాఉన్న విషయం తెలిసిందే. ఆరోగ్య రంగంలో వృత్తి నిపుణులు, ఇతర సిబ్బంది అలాగే వైద్యులు, నర్సులు సైతం అవసరమైనంతమంది లేకపోవడం కొట్టవచ్చినట్లు కనిపించింది. ఈ బడ్జెట్‌లో ప్రజారోగ్య రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుచేసే బడ్జెట్‌ వ్యయం మహా అయితే 202223 జీడీపీలో 2.1శాతానికి మించదు. అయితే ఇది 2025 నాటికి 2.5శాతానికి పెంచుతామని పేర్కొన్నారు. ఇక ఉద్యోగకల్పనా రంగం ఉద్యోగాలులేని రంగంగా మారింది. మోదీ ప్రభుత్వ తొలి ఆరేళ్లకాలంలో ఉద్యోగాలకల్పనే లేదు. ఆ తరువాత దాదాపు మూడేళ్లు కరోనా మహమ్మారితో సరిపోయింది.
ప్రపంచబ్యాంకు సహా అనేక ఏజన్సీలు దేశంలో పేదరికం ఏనాడూ లేనంతగా పెరిగిందని హెచ్చరించాయి. ఎవరెన్ని హెచ్చరికలు చేసినా పట్టించుకోవలసిన అవసరంలేదని అనుకున్నారేమో బహుశ అందువల్లనే వారికోసం ఎలాంటి కేటాయింపులు లేవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img