రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, రాజధాని ఏర్పాటుపైన వైసీపీ, టీడీపీి పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు, విమర్శలు నిరంతరం కొనసాగుతున్నాయి. అప్పులు మీ పాలనలో ఎక్కువ అంటే, కాదు మీ పాలనలో ఎక్కువని, రాజధాని ప్రకటనలో చంద్రబాబు ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని వైసీపీ, రాజధాని మార్పు విషయంలో వైసీపీ ప్రయోజనాలు ఉన్నాయని వాదులాడుకుంటున్నాయి. ఈ విమర్శల, ప్రతి విమర్శల నేపథ్యంలో కాగ్ నివేదిక వీటిపై నిగ్గు తేల్చిన విషయాలు ఏమిటన్నది చూద్దాం!
ఏపీ ఆర్ధిక స్థితిగతులపై 31-3-22 న కంట్రోలర్ అండ్ ఆడిటర్ (కాగ్) నివేదిక సమర్పించింది. ఇందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, రెవిన్యూ, రవాణా, రాజధాని తదితర అంశాలను ప్రస్తావించింది. 2021-22 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు 3,72,503 కోట్లుగా ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. ఇందులో 99శాతం రుణాలు 13.9శాతం వడ్డీతో తీసుకున్నవని చెప్పింది. 2018 నుండి 2022 వరకు అంతర్గత రుణాలు 77.54శాతం పెరిగాయని వెల్లడిరచింది. గడిచిన ఐదు సంవత్సరాల్లో తలసరి రుణం 61శాతం పెరిగిందని, బడ్జెటేతర రుణాలు కూడా కలుప కుంటే తలసరి రుణభారం 92,796 రూపాయలుగా పేర్కొంది. వచ్చే ఏడేళ్లలో 1,29,817 కోట్ల రుణాల్ని తీర్చాల్సి ఉందని కాగ్ వివరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెవిన్యూ ఖర్చులు 4.25శాతం పెరిగాయి.
మొత్తం అప్పుల్లో టీడీపీి, వైసీపీ ప్రభుత్వాలు చేసిన అప్పులను కూడా నివేదిక ప్రస్తావించింది. 2014-15 నుంచి 2019 ఫిబ్రవరి వరకు చంద్రబాబు ప్రభుత్వంచేసిన అప్పులు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అప్పు వాటాలో ఆంధ్రప్రదేశ్‌ది 97,123.93 కోట్లు కాగా 2014-15లో కొత్తగా చేసిన అప్పు 21,481 కోట్లు. పాత అప్పుల చెల్లింపు 9,099 కోట్లు, నికర అప్పు 1,48,743కోట్లు. 2015-16లో కొత్త అప్పులు 77,265 కోట్లు ఉంటే తీర్చిన అప్పు 50,859 కోట్లు, నికర అప్పు 1,73,854 కోట్లు. 2016-17 లో చేసిన అప్పు 93,619 కోట్లు కాగా, తీర్చిన పాత అప్పు 61,963 కోటు,్ల నికర అప్పు 2,01,314 కోట్లు. 2017-18లో చేసిన కొత్త అప్పు 1,33,687 కోట్లు, తీర్చిన అప్పు 1,08,853 కోట్లు. నికర అప్పు 2,23,706 కోట్లు. 2018-19లో చేసిన అప్పు 1,36,084 కోట్లు, పాత అప్పుల తీర్చినది 97,940కోట్లు. నికర అప్పు 2,37,510 కోట్లు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులు ఇలా ఉన్నాయి. 2019-20లో కొత్తగా చేసిన అప్పు 1,57,859 కోట్లు కాగా, పాత అప్పులు తీర్చింది 1,13,197 కోట్లు. పాత అప్పుతో కలిపి నికర అప్పు 3,01,802 కోట్లు. 2020-21లో 3,60,333 కోట్లకు, 2021-22 నాటికి 3,98,903 కోట్లకు నికర అప్పు చేరుకుంది. 2023 నాటికి రాష్ట్రం మొత్తం అప్పు 4.42 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు 2,37,510 కోట్లు కాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది 2లక్షల 5వేల కోట్లు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు ఇంకా ఎక్కువగా ఉన్నట్లు టీడీపీ చెబుతున్నది. టీడీపీి, వైసీపీ చేసిన అప్పులు అత్యధిక మొత్తం వడ్డీల చెల్లింపులకే వినియోగించటం గమనించాల్సిన అంశం.
కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిలకు జమచేసిందని చెబుతున్నారు. పరిమితికి మించి అప్పుల ఉండటంతో రాష్ట్రం అప్పుల పాలైందని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిరదని తన నివేదికలో కాగ్ పొందు పర్చింది. ఇందుకు కారణం సంక్షేమ పథకాలుగా పేర్కొంటూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 7నెలల్లో రాష్ట్రానికి వచ్చిన మొత్తం రాబడులు 1,25,111 కోట్లు కాగా, అందులో సగం సంక్షేమ పథకాలకు ఉపయోగించారని, మిగతా సగం పాత వడ్డీలు చెల్లించటానికి, సబ్సిడీ బిల్లులు, ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు వినియోగించారని, కేవలం 8,739 కోట్లు మాత్రమే పెట్టుబడి వ్యయం చేశారని పేర్కొంది. సంక్షేమ పథకాల వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని కాగ్ చెప్పటం సరైన విశ్లేషణ కాదు. బడా పెట్టుబడిదారులకు ఇస్తున్న లక్షల కోట్ల రాయితీలను గమనిస్తే, సంక్షేమ పథకాలకు ఇచ్చేది చాలా తక్కువ. ప్రజల చేతుల్లో డబ్బులు అందటం వలన మార్కెట్‌లోప్రజల కొనుగోలుశక్తి పెరిగి ఆదాయం పెరుగుతుంది. అందువల్ల సంక్షేమ పథకాలు రాష్ట్ర అప్పులకు కారణంకాదు. సంక్షేమ పధకాల అవసరం లేకుండా ప్రజల ఆర్థిక పరిస్థితి పెరిగే విధంగా భూ సంస్కరణలు అమలు జరపకపోవటం, ఉపాధి అవకాశాలు కల్పించక పోవటం, పారిశ్రామిక విస్తరణకు చర్యలు తీసుకోకపోవటం వలన రాష్ట్ర ఆర్థికపరిస్థితి మెరుగు పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి, పరిశ్రమాధిపతులకు రాయితీలు కారణంగా రాష్ట్రం అప్పులపాలైంది. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలే. రెండు ప్రభుత్వాలు బడా పెట్టుబడిదారుల, భూస్వాముల ప్రయోజనాలు కాపాడేవే. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వీరి ప్రయోజనాలకోసం ఉపయోగించటం వల్లే రాష్ట్రం అప్పులపాలైంది. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు అప్పులపై అప్పులుచేస్తూ ప్రజలపై రుణభారం మోపుతున్నాయి. ప్రజలు ఉద్యమాల్లోకి రాకుండా తమ చట్టూ తిప్పుకునేందుకే సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయి. అమరావతి రాజధాని గురించి కూడా తన నివేదికలో కాగ్ పేర్కొన్నది. అమరావతి రాజధాని అనేది రాష్ట్రంపై అంతులేని ఆర్థిక భారాన్ని మోపుతుందని కాగ్ నివేదిక హెచ్చరిక చేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తక్షణం, భవిష్యత్తులోనూ మోయలేని ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని నివేదిక స్పస్టం చేసింది.
బొల్లిముంత సాంబశివరావు , సెల్: 9885983526