Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

అప్పుల భారతంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

రావుశ్రీ

అధిక ధరలు, అపరిమితమైన నిరు ద్యోగం, విచ్చలవిడిగా ప్రైవేటీకరణ, లాభాల బాటలో కార్పోరేట్స్‌, ఒక శాతం సంపన్నుల చేతుల్లో దేశంలో సగం సంపద, ఆకలి సూచిలో 105, మానవ అభివృద్ధి సూచిక 142, ప్రపంచ సంతోష సూచిలో 139, ప్రపంచ యూనివర్సిటీ లలో మన భారత విద్యాలయాలు దిగువ ర్యాంకులో, మత ఉద్రిక్తతల్లో మాత్రం పై స్థానంలో ఉండటం ఏ అభివృద్ధికి చిహ్నం? ఇంధన పన్నులు, సెస్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఆర్జించిన ఆదాయం 24 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉందని అంచనా. ఇటీవల ప్రతీ నెలా జి.యస్‌.టి ఆదాయం లక్ష కోట్ల రూపాయలు పైబడి వస్తున్నా, అప్పుల వేటలో ప్రభుత్వాలు పయనిస్తున్నాయి.


ప్రస్తుతం అందిన గణాంకాలు ప్రకారం మన భారతదేశం అప్పులు సాక్షాత్తు 100 లక్షల కోట్లు పై మాటే… అనగా ఇప్పుడే పుట్టిన శిశువు నుంచి కాటికి చేరే ముదుసలి వరకూ ప్రతీ వ్యక్తి తలపై ఒక లక్ష రూపాయలు అప్పు ఉంది. నేనెప్పుడు అప్పు చేసాను అని ఆశ్చర్యపోకండి…! స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని పాలించిన వివిధ ప్రభుత్వాలు చేసిన అప్పులు కుప్ప ‘‘కోటి కోట్లు’’ పైబడి అన్నమాట. 2021 డిసెంబర్‌ నాటికి 128.4 లక్షల కోట్లు అప్పు ఉండగా, 2023 నాటికి 153 లక్షల కోట్లు చేరుతుంది అని అంచనా. అనగా ప్రతీ నెలా 83 వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఈ 2022లో కావలసిన కొత్త అప్పు 17లక్షల కోట్ల రూపాయలు.. ఈ అప్పు లన్నీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి…? చాలామటుకు అధికారం సాధించడా నికి పలు సంక్షేమ పథకాలు ప్రచారం చేసి, గద్దె ఎక్కిన తరవాత వాటిని అమలు చేయడానికి, దీంతో మరల అధికారం చేజిక్కించుకునేందుకు.. అలాగే ఉచిత పథకాలు అమలుతో.. కొంప కొల్లేరు చేస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు, విద్య, వైద్య రంగాల్లో నైపుణ్యం అందరికీ అందడానికి ఖర్చు చేయడంలేదు.
ఈ తెచ్చిన అప్పులపై వడ్డీ కింద ప్రతీ సంవత్సరం బడ్జెట్లో 8.2% నిధులు చెల్లిస్తున్నారు. ఈ తెచ్చిన అప్పులు ఏమైనా విద్య, వైద్య, ఉత్పత్తి రంగాల బలో పేతానికి వాడితే మంచి ఫలితాలు వచ్చేవి. ఎగుమతులు పెరిగి, విదేశీ మారక ద్రవ్యం హెచ్చి, దేశం అభివృద్ధి బాటలో పయనించేది. ప్రస్తుతం విదేశీ మారక ద్రవ్య నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో కేంద్రం చేసిన అప్పులే 80 లక్షల కోట్ల రూపాయలు. ఇకనైనా అందరూ వాస్తవాలు గ్రహించాలి. లేకపోతే భవిష్యత్తులో సామాన్య ప్రజల బతుకులు మరింత క్షీణిం చడం ఖాయం. ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలు హద్దు లేకుండా పెరిగి, ప్రజల నడ్డి విరుస్తున్నాయి. రోజురోజుకూ పెంచుతున్న పెట్రోల్‌, డీసెల్‌ ధరల్లో తాజాగా కాస్త ఊరట కలిగించారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర వేయి రూపాయల పైమాటే. ఇవేమీ ప్రజలు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సెల్‌ఫోన్‌ ఇంటర్నెట్‌ వాడకం, అనవసర ఛాటింగ్‌, వీడియో గేమ్స్‌, మత్తులకు బానిసలవుతున్నారు. టి.వీ సీరియల్స్‌, వినోద కార్యక్రమాలు, వివిధ షోల్లో రాత్రి పగలు మునిగి తేలుతూ జీవన ప్రయాణం కొనసాగిస్తున్నారు. మేలుకోండి, లేకపోతే భవిష్యత్తు మటాషే… వాస్తవంగా అవసర స్థితిలో ఉన్న వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తే బాగుంటుంది. కానీ అనర్హులకు కూడా వివిధ ఉచిత, సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా ఈ అప్పులు వ్యర్థ పదార్థాల పర్వతాల వలే పేరుకు పోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరికి మించి ఒకరు అప్పులు చేయ టానికి పరుగుపందెంలో ఉంటున్నారు. 2003లో, 2017లో సవరణలు చేసిన ‘‘ఎఫ్‌.ఆర్‌.బి.యమ్‌’’ చట్టంలోని నియమనిబంధనలు తుంగలో తొక్కి పయనిస్తు న్నారు. ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు.
అప్పులు అసలు తీర్చడం మాట ఎలా ఉన్నా, వడ్డీ డబ్బులు ఆర్జించడానికే ప్రభుత్వాలు ప్రజలపై పన్నులు, సెస్‌ భారాలు విపరీతంగా మోపుతున్నారు. పంజాబ్‌ 3.01, రాజస్థాన్‌ 3.46, ఆంధ్రప్రదేశ్‌ 3.89, తెలంగాణ 2.45, పశ్చిమ బెంగాల్‌ 5.28 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎంతో అభివృద్ధి చేస్తున్నాం అని జబ్బులు చరుచుకుంటూ, మరల అధికారం కోసం ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు గ్రహించకుండా ప్రజలు తిరిగి పట్టం కడుతున్నారు. అసలు అభివృద్ధి అంటే ఏమిటి…? ప్రజలకు విద్య, వైద్యం అందరికీ అందు బాటులో ఉండాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. వాస్తవ తలసరి ఆదాయం పెరుగుదల ఉండాలి. జీడీపీ కనీసం ప్రతీ సంవత్సరం 10% పైబడి ఉండాలి. కానీ ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఈ సంవత్సరం భారతదేశ జీడీపీ 6.4%గా నమోదు అయ్యే అవకాశం ఉంది. 500 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు ఆవిర్భవిస్తుంది? ఆదాయం తక్కువ – ఖర్చులు ఎక్కువ. ఎన్నికల వేళ ఆర్భాటంగా రకరకాల స్కీంలు, ఆకర్షణీయమైన పేర్లతో ప్రారంభిం చుట… చివరికి ఫలితాలు అంతంత మాత్రమే. ‘‘పేరు గొప్ప – ఊరు దిబ్బ’’ అనే నానుడిలా ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. లాభాల్లో ఉన్న ఎల్‌.ఐ.సి వంటి సంస్థలను స్టాక్‌ మార్కెట్ల లిస్టింగ్‌ పెట్టడం. చివరకు దేశ రక్షణ రంగంలో కూడా ప్రైవేటు పెట్టుబడిదారులకు ఆహ్వానం పలకడం. ఇదేం రకం అభివృద్ధో ప్రజలకు తేటతెల్లం చేయాలి. లేకపోతే ప్రజలైనా ప్రశ్నించాలి. కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 60% శాతం, రాష్ట్రా లైతే 20% మించి అప్పులు చేయకూడదు. ఈ నిబంధనలు ఎప్పుడో తుంగలో తొక్కారు. సాక్షాత్తు శ్రీలంక ప్రస్తుతం ప్రపంచ పటంలో నిజంగా కన్నీరు బొట్టులా తయారవటానికి కారణం వారి జీడీపీలో 100% పైబడి అప్పులు చేయడమే. ఇది అందరికీ కనువిప్పు కావాలి. ప్రభుత్వాలు చేసిన అప్పులకు ప్రజలు కష్టాల్లో మునిగి పోతున్నారు. 2008లో కూడా అమెరికా ఇటువంటి దుస్థితికి చేరింది. ప్రస్తుతం కూడా అనేక ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతున్నది.
అధిక ధరలు, అపరిమితమైన నిరుద్యోగం, విచ్చలవిడిగా ప్రైవేటీకరణ, లాభాల బాటలో కార్పోరేట్స్‌, ఒక శాతం సంపన్నుల చేతుల్లో దేశంలో సగం సంపద, ఆకలి సూచిలో 105, మానవ అభివృద్ధి సూచిక 142, ప్రపంచ సంతోష సూచిలో 139, ప్రపంచ యూనివర్సిటీలలో మన భారత విద్యా లయాలు దిగువ ర్యాంకులో, మత ఉద్రిక్తతల్లో మాత్రం పై స్థానంలో ఉండటం ఏ అభివృద్ధికి చిహ్నం? ఇంధన పన్నులు, సెస్‌ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఆర్జించిన ఆదాయం 24 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉందని అంచనా. ఇటీవల ప్రతీ నెలా జి.యస్‌.టి ఆదాయం లక్ష కోట్ల రూపాయలు పైబడి వస్తున్నా, అప్పుల వేటలో ప్రభుత్వాలు పయనిస్తున్నాయి. పరిపాలనలో పటిష్టత లేకపోవడమా? ప్రణాళికలు కారణమా? 2021 ఒక్క సంవత్సరంలోనే బడా పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసిన సొమ్ములు అక్షరాల 2.02 లక్షల కోట్లు. ఇటీవల రుణ బకాయిలు ఎగవేసిన వారికి ప్రభుత్వం చేసిన మేలు 10.75 లక్షల కోట్ల రూపాయలు అని నివేదికలు చెబుతున్నాయి. మరి ఈ ప్రభుత్వాలు ఎవరి పక్షాన పని చేస్తున్నాయి. పౌర సమాజమా మేలుకొని… వాస్తవాలు గ్రహించాలి. కులం, మతం, ప్రాంతం, భాష వంటి సున్నితమైన అంశాలు, రెచ్చగొట్టే మాటలు వైపు పయనించకుండా, ఏ పార్టీలు, సంస్థలు ప్రజల వాస్తవ జీవితాలు బాగుపడాలని నిరంతరం కృషి చేస్తున్నాయో, వారి వైపు నిలబడండి. భవిష్యత్తు సరిదిద్దుకోవడమే ప్రస్తుతం మన ముందు ఉన్న తక్షణ కర్తవ్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img