Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

అఫ్గాన్‌పై వాస్తవ విరుద్ధ ప్రచారం

బుడ్డిగ జమిందార్‌

ఒకటా, రెండా ప్రపంచ చరిత్రలో వందకు పైగా కీలుబొమ్మ ప్రభుత్వాల్ని అమెరికా ఏర్పాటు చేసుకొంది. కొన్ని నిలిచాయి. చాలావరకూ కూలిపోయాయి. కీలుబొమ్మ ప్రభుత్వాధినేతలతో పాటు అమెరికా అధికారులు, సేనలు చేతులెత్తేసి పారిపోయిన ఘటనలనేకం. అట్టి వాటిలో వియత్నాం, అఫ్గానిస్థాన్‌, కంబోడియా వంటి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఈ పరంపరలో ఇటీవల జరుగుతున్న అఫ్గాన్‌ ఘటన చెప్పుకొని తీరాలి. ప్రస్తుత సోషల్‌ మీడియాలో, వార్తా పత్రికలు, టీవీ ఛానళ్ళల్లో తాలిబన్‌ వ్యతిరేక ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతోంది. కొంత వాస్తవమేగానీ, అంతా కాదు. అసలు తాలిబన్లు ఎదగటానికి, అఫ్గాన్‌ అధ్యక్షుడు నాలుగు రోజుల క్రితం దేశం వదిలి పారిపోవటానికి, అఫ్గానిస్థాన్‌లో లక్షలాది సామాన్య ప్రజలు చనిపోవటానికి, ఆకలితో అలమటిస్తున్న ప్రజలు వేరే దేశాలకు వలసలు వెళ్ళటానికి, జనాభాలో 70 శాతం ప్రజల ఆదాయం రోజుకు ఒక డాలరు కంటే తక్కువగా ఉండటానికి గల ప్రధాన కారణం 1978 నుంచి నేటి వరకూ అనేక యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరిపిన అమెరికాయేననే చర్చ మాత్రం జరగనీయకుండా అమెరికా అనుకూల ప్రభుత్వాలు, కార్పొరేట్‌ మీడియా జాగ్రత్తపడుతున్నాయి.
టెర్రరిజంపై యుద్ధం పేరిట 2001 సెప్టెంబరు 11 తర్వాత అఫ్గాన్‌ను ఆక్రమించిన అమెరికా ముఖ్య ఉద్దేశం అక్కడ టెర్రరిజాన్ని అంతమొందించటం కోసమైతే తాలిబన్లు ఎందుకు శక్తిని కూడగట్టుకొంటారు? ప్రజాస్వామ్యం ఎందుకు ఈ 20 సంవత్సరాల్లో విరాజిల్లలేదు? స్త్రీ స్వేచ్ఛ కోసమని ప్రచారం చేసే అమెరికా ప్రస్తుత పరిస్థితులు, నజీబుల్లా ప్రభుత్వ పాలన కంటే బాగున్నాయా? అమెరికా మిత్ర దేశమని చెప్పుకునే సౌదీ అరేబియాలో స్త్రీ స్వేచ్ఛ ఏ పాటిది? అనే ప్రశ్నలు ఉదయించక తప్పవు. సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత ఒకప్పటి సోవియట్‌ రిపబ్లిక్కులలో ఉన్న ముడి చమురు కోసం సెంట్రల్‌ ఆసియాను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి, దక్షిణ ఆసియాలో వ్యూహాత్మకంగా తిష్ఠ వేయటానికి, సుమారు వెయ్యి కిలోమీటర్ల పొడవు సరిహద్దు కల్గిన ఇరాన్‌ను బెదిరించటానికి మాత్రమే అఫ్గాన్‌లో అమెరికా తిష్ఠ వేసిందనేది వాస్తవం. అల్‌ఖైదా, ముజాహిద్దీన్‌, ఐసిఎస్‌ వంటి టెర్రరిస్టు గ్రూపుల కలయికే తాలిబన్లుగా చెప్పుకోవచ్చు. 80వ దశకంలో సోవియట్‌ యూనియన్‌ అనుకూల ప్రభుత్వానికి, సోవియట్‌ యూనియన్‌ సేనలకు వ్యతిరేకంగా పోరాడటానికి ఈ గ్రూపులన్నింటినీ అమెరికా, నాటో దేశాలు పెంచి పోషించాయి. నజీబుల్లా ప్రభుత్వం తర్వాత అధికారం చేపట్టిన తాలిబన్లు 1994 వరకూ ఉన్నారు. అప్పటి నుంచి అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాలు ఏర్పడుతూ వచ్చాయి. ఈ ప్రభుత్వాలకు, అమెరికాకు వ్యతిరేకంగా పోరాడినవాళ్లే తాలిబన్లు. విదేశీ పాలన వద్దని, స్వదేశీ ఛాందసవాద ఇస్లామిక్‌ రాజ్యం కావాలనేది తాలిబన్ల ధ్యేయం. ఈ అమెరికా వ్యతిరేకతే 20 సంవత్సరాలు అమెరికా ఆక్రమణ నుంచి అఫ్గానిస్థాన్‌ను రక్షించుకో గలిగింది. కాలక్రమేణా గడిచిన 20 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాల్లో, యువకుల్లో తాలిబన్ల ప్రాబల్యం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు తాలిబన్లు వేరు, అఫ్గాన్‌లు వేరు అని చూడటం సమంజసం కాదు. మంచి తాలిబన్లు, చెడు తాలిబన్లుగా విభజించి చర్చలు జరిపిన రష్యా సైతం వీరిద్దరి ఆకస్మిక ఐక్యతను చూసి ఆశ్చర్యపోయింది. ఇప్పుడు దేశాన్ని వదిలి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్న వారంతా అఫ్గాన్లు అని ప్రచారం చేయటం సరికాదు. వీరంతా అమెరికా అనుకూల కీలుబొమ్మ ప్రభుత్వ మద్దతుదారులుగానే చూడాలి. అయితే వీరిలో కొందరు అభ్యుదయ భావాలు కల్గినవారు కూడా లేకపోలేదు.
ఆగస్టు 13న కాబూల్‌లోని అమెరికా దౌత్య సిబ్బందిని రక్షించటానికి 3 వేల మంది సైనికులను పంపించటానికి ఏర్పాట్లు జరిగాయి. కువైట్‌లో అదనంగా 4 వేల మంది సైనికుల్ని సిద్ధం చేసింది. సైనికులు ఒకవైపు కాబూల్‌కు వస్తుండగానే తాలిబాన్లు వీరికంటే ముందుగా వచ్చేసారు. అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశాన్ని వదిలి పారిపోయాడు. అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు ఆక్రమించారు. అమెరికా రాయబార కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫైళ్ళుకు అమెరికా సిబ్బంది నిప్పు పెట్టారు. విమానాశ్రయాన్ని కాన్సలేట్‌గా మారుస్తామని అమెరికా ప్రగల్భాలు ఒక వైపు పలుకుతూ ఉండగానే వేరొక వైపు తాలిబన్లు కాబూల్‌ విమానాశ్రయాన్ని ఆక్రమించారు. గత్యంతరం లేక సిబ్బందిని దాక్కోమని అమెరికా ఆదేశించింది. మేమే సూపర్‌ పవర్‌, ప్రపంచమంతా మా చెప్పుచేతల్లో ఉండాలి, ప్రపంచ పోలీసులు మేమే అని చెప్పుకునే అమెరికా 20 సంవత్సరాల యుద్ధంలో ఒక పేద దేశంతో ఓడిపోవటం, ధన నష్టం`ప్రాణ నష్టం జరగడమే గాక సైనికులు పారిపోవాల్సిన పరిస్థితి, సిబ్బంది దాక్కునే పరిస్థితి అమెరికాకు దాపురించింది. ఈ విషయాల్ని మీడియా ఎక్కడా ప్రచారం చేయటం లేదు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసిన వ్యాసంలో ‘అఫ్గానిస్థాన్‌ విషయంలో అమెరికా ఎల్లప్పుడూ తప్పుడు అంచనాలను వేస్తుంది, చాకచక్యంగా సరైన ప్రణాళికతో కాబూల్‌ను తాలిబన్లు వశపర్చుకున్న తీరును చూసి బైడెన్‌ సలహాదారులు ఆశ్చర్యపోయారని’ అన్నది. జూన్‌ నెలలో అమెరికా అంచనాల ప్రకారం, ఈ సంవత్సరం తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నా, కాబూల్‌లో భీకరపోరు జరపాల్సి వస్తుందని, కాబూల్‌ను హస్తగతం చేసుకోవటానికి కనీసం సంవత్సరాలు పడుతుందని అంచనా వేసారని రాసింది. ఏకధృవ ప్రపంచంగా ఎదగాలన్న అమెరికా ఆశలు అడియాసలవుతున్నాయి. ఒకప్పటి చిరకాల మిత్రులైన ఐరోపా దేశాలు క్రమేపీ పోటీగా వస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ఆశించిన ఫలితాలు దక్కక చైనా వ్యతిరేక క్వాడ్‌ కూటమిలో మన దేశాన్ని కలిపి ఇప్పుడు మన విదేశాంగ విధానాన్ని దక్షిణాసియాలో ఏకాకిని చేసింది. తాలిబన్లతో చర్చలకు ముందుకు వచ్చిన భారతదేశానికి అడుగడుగునా చేదు అనుభవమే దక్కింది. తాలిబన్ల భవిష్యత్తు ప్రణాళికలో పాకిస్థాన్‌, ఇరాన్‌, చైనా, రష్యాలు మిత్రులుగా ఉండబోతారనేది పరిశీలకుల అంచనా. ఇప్పటికే ఆ దిశగా అడుగులేస్తున్నది. ఐతే అమెరికా అంత తేలికగా అఫ్గానిస్థాన్‌ నుంచి తొందరలో వేరు పడ్తుందని అనుకోలేం. వేరే మార్గాలను అన్వేషిస్తుందే గానీ వ్యూహాత్మక అఫ్గానిస్థాన్‌ను వదిలే ప్రసక్తే లేదు. కనుక రానున్న కాలంలో నూతన ప్రచారాలతో, సరికొత్త అబద్ధాలతో అమెరికా పంథాను మార్చుకోవటం తథ్యం. 20 సంవత్సరాల అవినీతితో సామాన్య ప్రజల ప్రాణాలు తీసి, దేశ వనరులను దోచుకుని, దేశ మహిళలపై సైనికులు చేసిన మాన భంగాలను దాస్తూ, అఫ్గానిస్థాన్‌ దేశాన్ని అమెరికా యుద్ధ ప్రయోగశాలగా చేసిన తీరును మరుగుపర్చి ఇప్పుడు తాలిబన్లను రాక్షసులుగా చిత్రీకరిస్తూ, నెపమంతా తాలిబన్లపై మోపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img