Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

అమలుకు నోచని విద్యాహక్కు చట్టం

ప్రపంచాన్ని మార్చాలంటే శక్తి వంతమైన సాధనం విద్య అని అన్నారు నెల్సన్‌ మండేలా. ఆయన ఆ మాట అని ఎన్నో సంవత్సరాలు దాటిపోయింది, మనదేశం అంతర్జాతీయ బాలలహక్కుల ఒడంబడికపై సంతకం చేసి కూడా చాలా కాలం గడిచింది. అయితే అనేక మంది ప్రయత్నాల ఫలితంగా మనదేశంలో విద్య ప్రాధమిక హక్కు అయింది. ఇది ఒక గొప్ప పరిణామం.
జాతీయ విద్యా హక్కు చట్టం 2009 అందరికీ నాణ్యమైన సమాన విద్యా ఫలాలను అందించాలని 2009 వ సంవత్సరంలో రూపొందించి 2010 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది. దానికి సంబంధించి ఆయా రాష్ట్రాలు కొన్ని నియమ నిబంధలను ఏర్పరచి పటిష్ట అమలుకు నాంది పలికారు. ఈ విద్యా హక్కు చట్టం అమలు ప్రారంభమై ఇప్పటికి 13 సంవత్సరాలు పూర్తయింది. మౌలిక వసతుల కల్పన, బాల బాలికలకు వేర్వేరుగా పారిశుద్ధ్య వసతులు, తగినన్ని తరగతి గదులు, తాగునీరు, అట స్థలాలు, పాఠశాల ప్రాంగణాభివృదికి చిహ్నంగా ప్రహరీ గోడ, ప్రత్యేకవసరాల పిల్లలకు అనువైన వసతులను లెక్కిస్తే విద్యాహక్కు చట్టం ఏర్పరచిన అవకాశాలు విద్యార్థులకు చేరలేదని దక్షిణ భారత విద్యా హక్కు పరిరక్షణ సమితి 2023లో విడుదల చేసిన తన నివేదికలో వెల్లడిరచింది.
నివేదిక ప్రకారం విద్యాహక్కు చట్ట పరిధిలో పిల్లలకు అందించాల్సిన నియమావళి కర్ణాటక రాష్ట్రం 23.6 శాతం, అండమాన్‌ నికోబర్‌ 25.9శాతం, ఆంధ్రప్రదేశ్‌ 10.7శాతం, గోవా 17.4శాతం, కేరళ 40.9 శాతం, మహారాష్ట్ర 43.2శాతం, లక్షద్వీప్‌ 12.2శాతం, పాండిచ్చేరి 36.1శాతం, తమిళనాడు 49.1శాతం, తెలంగాణ 32.0 శాతానికి చేరుకుంది. ఇంకా ప్రభుత్వాలు విద్యాహక్కు చట్ట పరిధిలో విద్యార్థులకు అందించాల్సిన వాటిని అందించాలి. కేవలం మౌలిక వసతులు ఒకటే నాణ్యతకు నిదర్శనం కాదు. అందుకు తరగతి గదిలో విద్యార్థులు క్లిష్టమైన అంశాలను సులభతరంగా చదివి ఆకళింపు చేసుకొనేలా బోధనా విధానం, అందుకు ఉపాధ్యాయులను తీర్చి దిద్దడం ప్రధానాంశం. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి, ఖాళీగా వున్న ఉపాధ్యాయుల నియామకం ఒక ప్రధాన భూమిక. ఇప్పటికీి 12,54,773 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా వున్నాయి. కర్ణాటక రాష్ట్రం లోనే అత్యధికంగా అనగా 1,41,358 ఖాళీలున్నట్లు నివేదికలు తెలుపు తున్నాయి. మరొక వైపు 9,30,531 విద్యార్థులు ఇంకా బడి బయట ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. యూ-డైస్‌ 2020-21 ప్రకారం 13,49,04560 మంది, 134,32,40480 మంది పిల్లలు 2021-22 సంవత్సరంలో అదనంగా పిల్లలు పాఠశాలల్లో చేరారు. పిల్లల-ఉపాధ్యాయుల నిష్పతి సమపాళ్లలో ఉండాలంటే ఉపాధ్యాయుల నియామకం అన్ని పాఠశాలల్లో తప్పనిసరి.
విద్యా ప్రమాణాలు తిరిగి పొందాలంటే: విద్యా వ్యవస్థలో మూల స్తంభాలుగా వున్న జిల్ల్లా బ్లాకు స్థాయి వ్యవస్థలను బలోపేతం చేయడానికి మరిన్ని చర్యలు తప్పనిసరి. దీనికి కావలసిన నిధులను సమకూర్చడం ముఖ్యంగా అభ్యాసనకు దూరమైన విద్యార్థులు, బాలికలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు కోల్పోయిన విద్యా ప్రమాణాలు తిరిగి పొందేలా ప్రణాళికలు రూపొందించడం ప్రభుత్వాల ప్రధమ కర్తవ్యం. విద్యా హక్కు చట్టం ఏర్పరచిన నియమాల ప్రకారం దేశంలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పేద విద్యార్థులకోసం కొన్ని ప్రత్యేక వ్యూహాలను మనం రచించుకోవాల్సి వుంది. ఎందుకంటే ఉపాధ్యాయుల-విద్యార్థుల నిష్పత్తి, నూతన బడ్జెట్లో ప్రతిపాదించిన డిజిటల్‌ తరగతులకు గ్రామీణ ప్రాంత వెనుకబడిన విద్యార్థులలో డిజిటల్‌ లైబ్రరీల ద్వారా పఠనా సంస్కృతిని పెంపొందించడానికి, విద్యా వ్యవస్థలో నాణ్యత పెంచడానికి ఇవి అవసరం. చదువు సామాగ్రిని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రావడం, ఉపాధ్యాయులకు ఇప్పటికే నిష్టా కార్యక్రమం ద్వారా అందించిన శిక్షణలను మరలా తిరిగి నిర్వహించడం, నిపుణ్‌ భారత్‌ ద్వారా రూపొందించిన కార్యక్రమాలకు మరింత ప్రాచుర్యం-ప్రభావంతం చేయడం తప్పనిసరి. అన్నింటికన్నా ముందు మాతృభాషలో చదవడం, రాయడం, విషయాన్ని అర్ధం చేసుకోవడం అవసరం.
భీతి గొల్పుతున్న విద్యార్థుల సామర్ధ్యాలు: ఈ మధ్య 2022లో విడుదల చేసిన నేషనల్‌ అచీవ్‌మెంట్‌ పరీక్ష ఫలితాలు పరిశీలిద్దాం. 2017లో 5వ తరగతి ప్రగతి సూచిక 53 ఉండగా ఇపుడు సరాసరి 44 నమోదు కాగా, 8వ తరగతిలో జాతీయ సరాసరి గణితంలో 42 కాగా, ప్రస్తుతం 36 సరాసరి, 2017లో సైన్స్‌ సబ్జెక్టులో 44 కాగా ప్రస్తుతం 39 లాంగ్వేజ్‌ సబ్జెక్టులలో ఇంకా తక్కువ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాని విద్యార్థికి చదవడం, వ్రాయడం, విషయాన్ని అర్ధం చేసుకోవడం రాకపోతే తాను చదువుతున్న తరగతి సబ్జెక్టులలో ఎలా ప్రగతి సాధించగలరు. అందుకే మాతృభాషలో చదువు లేదా ఆంగ్ల మాధ్యమైనప్పటికీ విద్యార్థికి ముందు విషయాన్ని చదవడం రావాలి. తద్వారా పై తరగతుల్లో మరింత ప్రగతి సాధించగలరు. అందుకే విద్యార్థుల విద్యా సామర్ధ్యాల సాధనవైపు చదువు సాగాలి తప్ప సిలబస్‌ పూర్తి నేపథ్యంలో చదువు సాగరాదు. ప్రాథమిక విద్య నుండి పటిష్ఠ పునాదులను ఏర్పరచాలి. ఉపాధ్యాయులకు మూస పద్ధతి శిక్షణ కాకుండా అవసరాలకనుగుణంగా శిక్షణలు రూపొందించాలి. వారికి కావలసిన లైబ్రరీలు, లాబొరేటరీలు, వృత్తి తర్ఫీదు అందించే డైట్‌ వంటి జిల్లాస్థాయి విద్యా వనరుల కేంద్రాలను మెరుగుపరచాలి. పిల్లలకు మాతృ భాష అయినా లేదా ఆంగ్ల భాషా మాద్యమం అయినప్పటికీ పూర్తి స్థాయిలో వారు చదవగలిగేలా అర్ధం చేసుకొనేలా సిద్ధపరచాలి. హైస్కూల్‌ స్థాయిలో బాలికలను స్టెమ్‌ (సైన్స్‌,టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మానేజ్‌మెంట్‌) విషయాలలో ప్రోత్సహించాలి. ఎన్‌జీఓల భాగస్వామ్యంతో వీటిని అభివృద్ధి చేయాలి. దేశంలో ఇంకా డెబ్భై అయిదు లక్షల బాల కార్మికులు ఉండటం(5`13 సంవత్సరాల పిల్లలు) ఆందోళనకరం. ఇందుకు ఉచిత నిర్బంధ విద్యాహక్కును 18సంవత్సరాల వరకు పొడిగించడమే తగిన పరిష్కారం.
వ్యాస రచయితలు: మల్లాడి శ్రీనగేష్‌, హరి వెంకట రమణ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img