Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

అరగని నోటు`కడుపుకి చేటు

చింతపట్ల సుదర్శన్‌

ఖర్మమిట్లా కాలింది అనుకుంది గాడిద కడుపులో నొప్పి భరించలేక. ఇదివరకు ఇలాగ నొప్పివస్తే ఏ ఆకు నమిలో నాలుగు రకాల గడ్డిపోచలు కొరికో తగ్గించుకునేది. ఇప్పుడెందుకో తగ్గడం లేదు. స్వంత వైద్యం పనికి రాదని ఆసుపత్రికి బైలుదేరింది. ఆసుపత్రిలో జాతరకు వచ్చినట్ల జనం ఉన్నారు. వాళ్లు తినేవన్నీ కల్తీ వస్తువులేకదా. గాలీ, నీరూ కలుషిిితమే కదా. అందుకే కొత్త రోగాలు వస్తాయి. పాత రోగాలు తిరగబెడతాయి అనుకుంటూ వరండా మెట్ల దగ్గర ఆగిపోయింది. ఆసుపత్రిలోకి మనుషులకు ఉన్నట్లు, గాడిదలకుకూడా ప్రవేశంఉంటుందా అని అనుమానం వచ్చింది. ఏ డాక్టరైనా బైటకు వస్తే బాగుండు ననుకుంది. దేవుడనేవాడు ఉన్నాడో లేదో కానీ ఉంటే మనుషుల్నేకాదు గాడిదల్నికూడా పట్టించుకోవాలికదా అనుకుంది. తెల్లకోటూ మెడపైనుంచి వేళ్లాడుతున్న స్టెతస్కోప్‌తో బైటకు వచ్చాడు ఓ డాక్టర్‌. డాక్టర్‌కు ఎదురుగ్గా వెల్లి నిలబడిరది.
గాడిదను చూసి షాకయ్యాడు డాక్టర్‌. గుడ్‌మార్నింగ్‌ డాక్టర్‌ ఆశ్చర్యంతో మూర్ఛపోవడమో, కోమాలోకి వెళ్లడమో చెయ్యవద్దు. నేను మాటలు వచ్చిన గాడిదను అంది. అయితే అన్నాడు డాక్టర్‌ నీళ్లు నోట్లో నములుతూ. మరేం లేదంటే లేదనికాదు నిన్నట్నించీ కడుపునొప్పి తగ్గడంలేదు. వైద్యోనారాయణో హరీ అన్నారు కదా ఏదైనా ఓ మాత్ర ఇచ్చి నేను హరీ అనకుండా చూడండి డాక్టర్‌ అంది గాడిద దీనంగా.
కడుపులో నొప్పి ఆషామాషీ వ్యవహారం కాదు. ఆరోగ్యశ్రీ మనుషులకే సరిగ్గా వర్తించడం లేదు. ఇక గాడిదలకు వర్తిస్తుందా? రిసెప్షన్‌కి వెళ్లి ఫార్మాలిటీస్‌ పూర్తిచెయ్యి అన్నాడు డాక్టర్‌. ఫార్మాలిటీసా అవన్నీ మనుషులకే కదా. గాడిదను నా దగ్గరేముంది బూడిదరంగు జానా బెత్తెడు తోక తప్ప. అది అయ్యేపనికాదు. గానీ ఏదైనా ఉపాయం చెప్పండి. ఎక్సెల్‌ బాండ్‌పేపర్‌ గానీ హిందీన్యూస్‌ పేపరుగానీనమిల్తే సరిపోతుందా అంది గాడిద. ఫార్మా లిటీస్‌ పూర్తిచేస్తే మనుషులకూ, గాడిదలకూ, శవాలకూ కూడా స్పెషల్‌ రూం అలాట్‌చేస్తాం. బ్లడ్‌టెస్ట్‌, సిటిస్కాన్‌, డాప్లర్‌ టెస్టు, ఎక్స్‌రే ఎంఆర్‌ఐ, ఇసిజి, టూడి ఎకో ఇంకా చాలా టెస్టులుంటాయి. అవన్నీ చేయిస్తే కానీ నీ కడుపు నొప్పికి కారణంతెలీదు. ఆసుపత్రిలోఅడుగుబెట్టిన ‘బక్రా’లతోనూ గాడిదల్లోనూ కూడా ఆ టెస్టులన్నీ చేయిస్తేకానీ డాక్టర్లకు నెలజీతాలు రావు అన్నాడు డాక్టర్‌.
అయ్యో అలాగా మరిప్పుడెలాగ అని దిగాలు పడిరది గాడిద. దిగులు పడక మా నాన్న ఎప్పుడూ నన్ను గాడిద అనే సంబోధించేవాడు ఆ అనుబంధంతో చెప్త్తున్నా. కనిపిస్తున్న ఆ రోడ్డంట నేరుగా వెళ్లు. ఊరి చివర పశువుల ఆసుపత్రి ఉంది. అంటూ డాక్టర్‌ గాడిద వెనుకవైపు వెళ్లడానికి భయపడి వెనక్కి తిరిగి వరండా మెట్లెక్కాడు. పదరా గాడిదా అనుకుంటూ గాడిద పశువుల ఆసుపత్రివైపు నడిచింది. పశువులడాక్టర్‌ గాడిదను ఎగాదిగాచూసి నీ యజమాని ఎక్కడ అని అరిచాడు. గాడిద నాకు నేనే యజమానిని అంది. ఓహో మాటలు నేర్చిన గాడిదవా అన్నాడు డాక్టర్‌. తన కడుపునొప్పి సంగతి చెప్పింది గాడిద. అయితే ముందు నీ కడుపు ఎక్స్‌రే తీయాలి అన్నాడు డాక్టర్‌. ఎక్స్‌రేలో తెల్సింది గాడిద కడుపునొప్పికి అసలు కారణం. గాడిద క్రితం రోజు పేపరు కాయితాలతో పాటు పింకు రంగులో ఉన్న రెండు వేల నోటుని నమలకుండానే మింగేసింది. గాడిద కడుపునొప్పికి ఆ నోటే కారణం అంటూ డాక్టర్‌ గాడిద పొట్టలో హోలీ పిచికారీ అంత సైజులో ఉన్న ఇంజక్షన్‌ పొడిచి ఈ సారి పొరపాటున కూడా కరెన్సీనోట్లు మింగకు అవి మనుషులకేకాని గాడిదలకు అరగవు అన్నాడు. కడుపు కుదుట పడి సాయంత్రానికి పాడుబడ్డ ఇంటిఅరుగుమీదకు చేరుకుంది గాడిద. అప్పటికే అరుగుమీద బజ్జీలు తినేసి పొట్లాం కాగితం గాదిడకు ఇవ్వడానికి చూస్తున్న అబ్బాయి ‘బ్రో’ ఇంకా రాలేదేమని ఎదురుచూస్తున్న కుక్కా ఉన్నవి.
ఏమిటింత లేటు అన్నాడు అబ్బాయి కాగితం గాడిద నోటికి అందించ బోతూ. వద్దన్నా ఇవాళంతా కడుపునొప్పితో హైరానా పడ్డా. ఇంజక్షన్‌ పొడిపించుకొచ్చా. రేపటిదాకా ‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగే’. పేపరాపక్కన రాయి కింద పెట్టు. బ్రేక్‌ఫాస్ట్‌కు పనికి వస్తుంది అన్నది గాడిద. ఇంతకీ సింటెక్స్‌ ట్యాంకంత నీ కడుపుకి నొప్పి ఎందుకు వచ్చిందో అన్నాడు అబ్బాయి. పొరపాటున రెండువేల నోటు మింగడమే నన్నాడు డాక్టర్‌ అంది గాడిద. బ్లాక్‌మనీ అయి ఉంటుంది అదెక్కడ దొరికిందో చెప్పు వెళ్లి వెతికితే ఇంకా దొరకొచ్చు అన్నాడు మనిషి. పొద్దున ఒకాయన ఇన్‌కంటాక్స్‌ వాళ్లు వచ్చి తన డబ్బు లారీలో తీసుకెళ్లారంటూ రోడ్డుమీద భోరున ఏడుస్తుంటే చూశా. లారీ లోంచి గాలికెగిరి ఓ నోటు పడిరదేమో నువ్వు అనవసరంగా ఎక్సయిట్‌ అవకు అంది కుక్క. ఒక్క రెండువేల నోటే నా బానపొట్టను అతలాకుతలం చేసి పట్టపగలే చుక్కలు చూపించే మరి ఈ పెద్దమనుషులు పార్టీ ఫండ్లని, ప్రాజెక్టులని, పథకాలని, కాంట్రాక్టులని, రియల్‌ ఎస్టేట్లని, పైరవీలని ప్రజాసేవలని అనేక వేల నోట్లు మింగేస్తున్నారే! నొక్కేస్తున్నారే వాటికోసం అడ్డమైన గడ్డి మేసేస్తున్నారే, వీళ్ల వసలు కడుపులా చెరువులా అంది. గాడిద తన పొట్టవైపు చూసుకుంటూ. పశువులదాణాలు తిన్నవాళ్లకు, నోట్లుపోగేసు కుంటున్న వాళ్లకు, బ్యాంకులు దోచుకున్నవాళ్లకు, స్విస్‌బ్యాంకులో దాచుకున్న వాళ్లకు రాని కడుపునొప్పి నీకు రావడమేమిటి ఖర్మకాకపోతే అన్నాడు అబ్బాయి. ఏ పూటకాపూట కడుపునిండితే చాలు అనుకునేవాళ్లం మనం గాడిదలం, కుక్కలం, మనవళ్లకి, మునిమనవళ్లకి కూడా కూడ బెట్టాలని అడ్డమైన పనులు చేసేవాళ్లు మనుషులు. ఛీ! వీళ్లసలు మనుషులేనా అంటూ చెవులు వేలాడేసింది కుక్క.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img