Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

అశాస్త్రీయ సాగు హానికరం

ప్రపంచవ్యాప్తంగా 67 శాతం ప్రజలు వ్యవసాయరంగం పైననే ఆధారపడి ఉన్నారు. భూమండలంపై నేలల్లో 11 శాతం వ్యవసాయానికి, 26 శాతం జంతు నివాసాలకు వినియోగ పడుతున్నది. ప్రపంచ దేశాల్లో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు ఉన్న 10 దేశాల్లో చైనా, భారతదేశం, అమెరికా, బ్రెజిల్‌, రష్యా, ఫ్రాన్స్‌, మెక్సికో, జపాన్‌, జర్మనీ, టర్కీలకు పేరుంది. భారత్‌లో 58 శాతం ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి ఉంటూ, 18 శాతం జిడిపీకి (60 శాతం జిడిపీకి వ్యవసాయ ఆధార రంగాలు) కారణం అవుతున్నారు. 1960 కి పూర్వం భారతదేశంలో ఆహార పదార్థాల కొరత విపరీతంగా వెంటాడేది. గత ఆరు దశాబ్దాల్లో హరిత విప్లవం, పారిశ్రామిక ప్రగతి వల్ల దేశంలో ఆహార పదార్థాల ఉత్పత్తులు అనేక రెట్లు పెరిగి మిగులు స్థాయికి చేరడం చూస్తున్నాం.
దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి ఆహార ఉత్పత్తులు పెంచడం ఒక్కటే మార్గం కాకూడదని, పోషకాహార లభ్యతకు అధిక ప్రాధాన్యతలు ఇవ్వాలి. సంప్రదాయ సాగు పద్దతులు మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని ఉరుగ్వే అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. అక్కడ వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉరుగ్వే జనాభా 3.3 మిలియన్ల ఉండగా, 12 మిలియన్ల ఆవుల సంపద ఉంది. దీనితో పాలు, పెరుగు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల నిల్వలు పెరిగి పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తున్నది. పశుసంపద పెరిగినపుడు జంతు వ్యర్థాలలో సాగు నేల నాణ్యత కూడా పెరుగుతుంది.
గతంలో శ్రీలంక తీవ్ర ఆహార పదార్థాల కొరతను ఎదుర్కొన్నది. రసాయన, కృత్రిమ ఎరువుల వినియోగంతో ఆహార పదార్థాల ఉత్పత్తి పెరగడం జరిగింది. అతిగా రసాయన ఎరువుల వినియోగంతో దీర్ఘకాలిక దుష్ప్రభాలను ఎదుర్కోవలసి వస్తుంది. రసాయనాల హానిని గమనించిన శ్రీలంక ప్రభుత్వం దశల వారీగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే ప్రయత్నాలు చేసింది. రసాయన ఎరువుల స్థానంలో ఆర్గానిక్‌ సాగు పద్దతుల్ని అమలు చేయడం ప్రారంభించారు. ఆహార పదార్థాల దిగుబడులు కూడా పడిపోయి మరోసారి ఆహార కొరత, ద్రవ్యోల్బణాలకు దారి తీసింది. దీని ఫలితంగా ఒక కిలో బియ్యం ధర రూ.115/-, గోధుమలు రూ.100/-కు చేరడంతో పాటు యల్‌పిజి సిలిండర్‌ ధర రూ.2,500/- వరకు పెరిగింది. ఈ దుష్పరిణామాలతో పాటు కోవిడ్‌-19 కల్లోలంతో శ్రీలంకలో పర్యాటక పరిశ్రమ పడిపోయి, ఆదాయ మార్గాలు తగ్గి, విదేశీ నిలువలు క్షీణించాయి. ఇవి ఇతర దేశాలకు గుణపాఠం కావాలి.
పాకిస్థాన్‌లో ఏర్పడిన ఆహార సంక్షోభంలో గోధుమలు, చక్కెర వంటి పదార్థాలను తక్కువగా వాడుకోవాలని మంత్రులే ప్రజలను కోరే దుస్థితి వచ్చింది. పాకిస్థాన్‌లో పోషకాహారలోపం, ఆహార పదార్థాల తీవ్ర కొరతలతో ఆకలి చావులను నిస్సహాయంగా చూడాల్సి వస్తున్నది. ఈ చేదు అనుభవాలు ఇతర దేశాలకు కనువిప్పు కావాలి. ప్రపంచ పాస్ఫరస్‌ నిల్వల్లో దాదాపు 75 శాతం మొరాకోలోనే దొరుకుతోంది. రసాయన ఎరువుల తయారీలో పాస్ఫరస్‌ వినియోగం అధికంగా ఉంటుంది. మొరాకోలో రసాయన ఎరువుల వినియోగం అపరిమితంగా ఉంటుంది. పాస్ఫరస్‌ అధిక నిల్వలున్న మొరాకో దేశం రసాయన ఎరువుల తయారీని తగ్గించి, పాస్ఫరస్‌ నిల్వలను అధిక ధరలకు ఎగుమతి చేసుకునే సదాలోచనలు చేయాలి. రసాయన ఎరువులు, ఆర్గానిక్‌ సాగు విధానాలతో సమతుల్యత సాధించి వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకుంటూ, సుస్థిరాభివృద్ధి దిశగా అడుగులు వేయాలి.
డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి, 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img