Monday, February 6, 2023
Monday, February 6, 2023

ఆంధ్రలో బీజేపీ దుకాణం కట్టెయ్యొచ్చు!

వి. శంకరయ్య

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటెల రాజేంద్ర గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి పోటీలో లేకున్నా ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా రాలేదు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర గెలుపు అతని వ్యక్తిగతమైనది. ఇంతకు మునుపు ఆరు మార్లు ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గం నుండి గెలుపొందటం, సుదీర్ఘ కాలం మంత్రిగా వుండటంతో గెలుపు సాధ్యమైంది. ఆయనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాధింపులు సానుభూతి పవనాలు సృష్టించాయి. మరో వైపు రాష్ట్రంలో కేసీఆర్‌పై నెలకొన్న వ్యతిరేకత కూడా కలిసొచ్చింది. టీఆర్‌ఎస్‌ కోట్లు గుమ్మరించకుంటే ఈటెల ముందు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెలవెల పోయేవాడు. కేసీఆర్‌ సాగించిన అధికార దుర్వినియోగం, ఉపయోగించిన అర్థ బలానికి… బీజేపీ అభ్యర్థిగా ఈటెల కాకుండా ఇంకెవరైనా వుంటే బీజేపీ పరువు బజారు కెక్కేది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి 21,673 ఓట్లకే పరిమితమైనారు. ఎపిలో తమ ప్రధాన పోటీ దారు వైకాపానా లేక టీడీపీనా తేల్చుకోలేకపోవడంతో ఇక్కడ బీజేపీ డిపాజిట్‌ కూడా పోగొట్టుకొంది. టీడీపీ నుండి కొత్తగా చేరిన నేతల పలుకుబడి తప్ప కడప జిల్లాలో బీజేపీకి ప్రాతిపదిక లేదు. వాస్తవం చెప్పాలంటే జీరోనే. ఏ మాత్రం బలమున్నా పోటీలో తెలుగు దేశం అభ్యర్థి లేనందున కనీసం డిపాజిట్‌ అయినా దక్కించుకునేది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జివియల్‌ నర్సింహా రావు లాంటి నేతలు నోరు తెలిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పరోక్ష మిత్రులకు ఎక్కడ కోప మొస్తుందోనని చంద్రబాబు నాయుడుపై కూడా రెండు రాళ్లు వేయడం ఆనవాయితీగా వుంది. ఈ నేపథ్యం టీడీపీ అభ్యర్థి లేక పోయినా బీజేపీకి ఎక్కువ భాగం టీడీపీ ఓట్లు పడకుండా చేసింది. తమ యెడల వైకాపా ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరికి టీడీపీ శ్రేణులు విసిగి వేసారినా వారి ఓటు బ్యాంకు బీజేపీ వైపు మొగ్గు చూపకపోవడం గమనార్హం. ఈ ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో సంభవించిన కొన్ని రాజకీయ పరిణామాల వల్లే బద్వేలులో బీజేపీకి ఆ మాత్రమైనా ఓట్లు పడ్డాయి. తెలంగాణలో ఈటెల రాజేంద్ర గెలుపు బీజేపీ బలం ఎలా కాదో బద్వేలులో ఆ మాత్రం ఓట్లు రావడం కూడా బీజేపీ బలం కానే కాదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు టీడీపీని తరచూ తిట్టి పోస్తున్నా… వైకాపా వ్యతిరేకతతో టీడీపీ ఓటు బ్యాంకు తమకు లాభిస్తుందని, భారీగా ఓట్లు సంపాదించి పార్టీ కేంద్ర నాయకత్వం వద్ద క్రెడిట్‌ కొట్టెయ్యాలని భావించారు. అది కాస్తా తుస్‌ మంది. ఈ ఎన్నికల నేపథ్యంలో దిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం నిరీక్షించిన చంద్రబాబు విఫలమయ్యారు. బద్వేలు ఎన్నికల దృష్ట్యా తమకు అపాయింట్‌మెంట్‌ లభిస్తుందని చంద్ర బాబు భావించారు. ఆ అవకాశం లభించక పోవడంతో వైకాపా నేతలు సంబరపడ్డారు. ఆ మరు రోజు అమిత్‌ షానే చంద్రబాబుకు ఫోన్‌ చేయడం, కడప జిల్లాకు చెందిన బీజేపీ నేతలు సియం రమేష్‌ ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్లు తమకు టీడీపీ శ్రేణులతో వున్న పరిచయాల వల్ల ఆ పార్టీ వాళ్ల సహాయం తీసుకొన్నారు. ఫలితంగానే వైకాపా నేతల ఊహకు భిన్నంగా పోలింగ్‌ రోజు పలు పోలింగ్‌ బూత్‌ల్లో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ స్థానిక కార్యకర్తలు కనిపించారు. ఈ పరిణామం వైకాపా నేతలను దిగ్భ్రాంతికి గురి చేసినట్లు వార్తలు వచ్చాయి.
పోలింగ్‌కు ముందు కడప జిల్లా బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు వుండవచ్చునన్న సంకేతాలు ఇచ్చారు. బీజేపీలో వున్న వర్గ పోరు ఫలితంగా తర్వాత టీడీపీతో పొత్తు వుండదని ప్రకటన చేశారు. స్వయంకృతమైన ఈ పరిణామాలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నోరెళ్లె బెట్టవలసి వచ్చింది. రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం యెడల బీజేపీ నేతల్లో వున్న భిన్నాభిప్రాయాలకు రెండు సంఘటనలు చాలు. ఒకటి గతంలో తెలంగాణ బీజేపీ నేత సంజయ్‌, మొన్న బద్వేలు ఎన్నికల సమయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ చేసిన వైకాపా వ్యతిరేక ప్రసంగాలు రాష్ట్రంలో ఏ ఒక్క బీజేపీ నేత అయినా చేసి వున్నారా?
ఇక్కడ ఒక అంశం గమనించాలి. బద్వేలు ఎన్నికల సమయంలో దిల్లీ నుండి ఇద్దరు బీజేపీ నేతలు అలాంటి ప్రకటన చేశారంటే ఒకటి బీజేపీలో పెద్ద ఎత్తున వర్గ పోరు వుండాలి. రెండు ఎవరిదైనా ప్రేరణ వుండాలి. అంతిమంగా తేలినదేమంటే బద్వేలులో టీడీపీ పోటీ చేయనందున కొందరు టీడీపీ వారు ఓటు వేయడంతో పాటు కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి సియం రమేష్‌ లాంటి వారి వలన ఆ మేరకైనా ఓట్లు వచ్చాయి. డబ్బు లేదు. నాయకులు లేరు. పెద్ద హంగామా లేదు. అయినా కాంగ్రెస్‌ అభ్యర్థి (కోట్లు వ్యయం చేసి) బీజేపీ సాధించిన ఓట్లలో నాలుగవ వంతు సాధించారు. ఇది అసలైన బలం. ఒక వేళ బద్వేలులో టీడీపీ పోటీ చేసి వుంటే నోటా కన్నా తక్కువగా బీజేపీకి ఓట్లు పడేవి.
టీడీపీ కచ్చితంగా బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకొంటే వైకాపా బీజేపీకి మరింత దగ్గరయ్యే అవకాశం లేకపోలేదు. ఒక వేళ ముఖ్యమంత్రి మొండి కేసినా బలవంతంగానైనా బీజేపీ ముగ్గులోకి లాగుతుందేమో. ఇదే జరిగితే 2019 ఎన్నికల్లో వైకాపాను గెలిపించిన దళిత మైనార్టీ ఓట్లు ఆ మేరకు కోల్పోతుంది. ఇది ముఖ్యమంత్రికి తెలియదని భావించలేం. అయినా వ్యక్తిగత సమస్యలు ఎటు వేపు లాగుతాయో ఇప్పుడే చెప్పలేము. జనసేన అధినేత బీజేపీకి క్రమేణా దూరం జరుగుతున్న దశలో చంద్రబాబు కూడా వైకాపా, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా కచ్చితమైన వైఖరి తీసుకొంటే ఈ రాష్ట్రంలో బీజేపీకి ప్రాతిపదిక లేకుండా పోతుంది. లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో జట్టుకట్టాలి. బద్వేలు ఉప ఎన్నికల నేపథ్యం, పూర్వ పరిణామాలను అవలోకించి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకోవలసిన ఆవశ్యకత రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఎంతైనా వుంది.
వ్యాస రచయిత విశ్రాంత పాత్రికేయులు, 9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img