Friday, June 9, 2023
Friday, June 9, 2023

ఆకాశం హద్దుకాదన్న విశ్వ వైజ్ఞానికుడు

డాక్టర్‌ దేవరాజు మహారాజు

‘‘అర్థమయేట్లు చెప్పాలంటే అసలు దేవుడు అనేవాడులేడు. ఈ విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు. నేను ప్రగాఢంగా విశ్వసించేదేమంటే, స్వర్గ నరకాలులేవు. మరణానంతర జీవితం కూడా లేదు. అద్భుతమైన ఈ విశ్వరహస్యాల్ని తెలుసుకోవాలంటే ‘‘మనకు ఉన్నది ఒక్క జీవితం మాత్రమే’’అని అంత బలంగా చెప్పిన డాక్టర్‌ స్టీఫెన్‌ హాకింగ్‌కు ఆ ఒక్క జీవితం కూడా ఎంతో దారుణంగా గడపాల్సి వచ్చిందని చాలా మందికి తెలిసుండక పోవచ్చు. ఆయన తన గురించి ఇలా చెప్పుకున్నారు. ‘‘నా శరీరం నిస్సత్తువగా కుర్చీలో కూలబడిపోవచ్చు. కానీ, నా మెదడు విశ్వాంతరాళాల్ని శోధిస్తుంది’’ అని, ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకున్న భౌతిక శాస్త్రవేత్త హాకింగ్‌. 1942 జనవరి 8న ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించిన హాకింగ్‌ 30ఏళ్లు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసి, పదవీ విరమణ చేశారు. హాకింగ్‌ తల్లి ఇసబెల్‌ హాకింగ్‌ బ్రిటీష్‌ కమ్యూనిస్టుపార్టీ సభ్యురాలు. అందువల్ల స్టీఫెన్‌ చిన్నప్పటినుండి ప్రగతిశీల భావాలుగల అబ్బాయి. తండ్రి ఫ్రాంక్‌ మెడికల్‌ డాక్టరు. పరిశోధకుడు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చిలో పారసైటాలజీ విభాగానికి అధిపతి. ఆయన తరచూ ఆఫ్రికావెళ్లి అక్కడ పరిశోధనల్లో నిమగ్నమవుతూ ఉండేవారు. అందుకే స్టీఫెన్‌ తల్లితోనే ఎక్కువగా కాలం గడిపాడు. ఆమె ఉన్నత విద్య నభ్యసించిన మహిళ. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో రాజకీయ, ఆర్థిక, తాత్విక శాస్త్రాలు అభó్యసించి, సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూఉండేది. స్టీఫెన్‌కి ఫిలిప్పా, మేరి ఆనే ఇద్దరు చెల్లాయిలతో పాటు, తన తల్లిదండ్రులు దత్తత తీసుకున్న సోదరుడు ఎడ్వర్డు ఉండేవాడు. తన పదమూడోవ ఏట హాకింగ్‌, బెర్ట్రాండ్‌ రస్సెల్‌ను ఆదర్శంగా తీసుకున్నాడు. విద్యార్థిదశలో పరిచయమైన ఓన్‌్‌ వైల్డ్‌ అనే అమ్మాయితో ప్రేమలోపడి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతనికి మోటార్‌ న్యూరోసిస్‌ వ్యాధి సోకింది. నేచురల్‌ సైన్సెస్‌లో బి.ఎ(ఆనర్స్‌) డిగ్రీ ప్రధమశ్రేణి సాధించాడు. ఫైనల్‌ ఇయర్‌లో ఉండగా స్టీఫెన్‌ కళ్లుతిరిగి మెట్లమీద పడిపోయాడు. మూతి వంకర పోసాగింది. క్రిస్‌మస్‌ సెలవుల్లో ఇంటికి వెళ్లినపుడు కుటుంబసభ్యులు ఆయన పరిస్థితి గమనించి వైద్యం చేయించడం ప్రారంభించారు. అప్పుడది ఆయనకు ఎ.ఎల్‌.యస్‌ అని తేలింది. అంటే ఏమియోట్రాఫిక్‌ లేటరల్‌ స్ల్కిరోసిస్‌ అనే వ్యాధి. దానినే గెహరిగ్స్‌ వ్యాధి అనికూడా అంటారు. ఇది ఒక మోటార్‌ న్యూరాన్‌ వ్యాధి. 1963లో బైటపడినప్పుడు ఆయన కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే బతకగలడని డాక్టర్లు చెప్పారు. అంటే ఆయన తన 23వ ఏట చనిపోవాల్సింది. కానీ ఇప్పుడాయన వయసు 76. బ్లాక్‌హోల్స్‌పై పరిశీలనలు చేస్తున్న సమయంలోనే 1965లో గాన్‌విల్లి కైస్‌ కాలేజి వారి ఫెలోషిప్‌ దొరికింది. దాంతో అప్లయిడ్‌ మాథమెటిక్స్‌ ధియరటికల్‌ ఫిజిక్స్‌కాస్మోలజీలో పీ.హెచ్‌.డీ తీసుకున్న స్టీఫెన్‌, మొదట్లో క్లచస్‌ ఉపయోగిస్తూ మెల్లగా నడిచేవారు. పనిచేసే యూనివర్సిటీ డిపార్టుమెంట్‌కు దగ్గర్లో ఇల్లు దొరకడం చాలా కష్టంగా ఉండేది. మరోవైపు భార్య జేన్‌ వైల్డ్‌ కూడా పీహెచ్‌.డి ప్రోగ్రాంలో చేరింది. మరోవైపు పిల్లల సంరక్షణ, కొడుకు రాబర్డ్‌(1967) కూతురు టాసీ(1970) మరో బిడ్డ టిమోతి(1979) పుట్టారు. హాకింగ్‌ తన శారీరకలోపాల గురించి ఎవరితోనూ ఎక్కువగా చర్చించేవారు కాదు. విధిరాత, దైవం వంటి వాటిని నమ్మేవారు కాదు కాబట్టి వాస్తవ పరిస్థితి ఎదుర్కోవడానికే సిద్ధపడేవారు. తన అంగవైకల్యానికి సానుభూతి ప్రకటిస్తూ సహాయపడడానికి వచ్చేవారిని వారించేవారు. ఆయన తనను మొదట సైంటిస్ట్‌గా గుర్తించాలనుకునేవారు. తరవాత పాపులర్‌ సైన్స్‌ రచయితగా ఆ తరువాత కొన్ని ఆలోచనలతో, భావాలతో, ఆశలతో, కోర్కెలతో ఉన్న ఒక మామూలు మనిషిగా గుర్తించాలని కోరుకునేవారు. ఆయనది గొప్ప ధ్యేయమని కొందరంటే ‘పిచ్చి పట్టుదల’ ఆని మరికొందరనేవారు. ఈ రెండు అభిప్రాయలూ విన్న ఆయన భార్య జేన్‌హాకింగ్‌, రెండిరటినీ ఒప్పుకునేది. ‘‘ఆ రెండూ కలిసికట్టుగా పనిచేస్తున్నాయేమో’’నని అనేది. లేదా ‘‘ఒకటి తర్వాత ఒకటి పనిచేస్తున్నాయేమో’’ నని అనేది. వెర్నర్‌ ఇస్రాయిల్‌ అనే భౌతిక శాస్త్రవేత్త మోజట్‌ ‘కంపోజింగ్‌ సింఫనీ’ తెచ్చి స్టీఫెన్‌ తలకు అమర్చాడు. దానివల్ల ఆయనకు తననుతాను వ్యక్తీకరించు కునే అవకాశం కలిగింది. దాన్ని అభ్యసించడానికి ఆయనకు కొంత సమయంపట్టినా, తర్వాత కాలంలో అది ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది. 1970 నాటికి మాట పూర్తిగా పడిపోయింది. అతని హావభావాలు కుటుంబసభ్యులకు, అతి సన్నిహితులకు మాత్రమే అర్థమయ్యేవి. 1985లో ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ల సరిహద్దులమీద సెర్న్‌ను సందర్శించినపుడు ఆయనకు న్యుమోనియా పట్టుకుంది. తీవ్ర అస్వస్థత ఎదుర్కోవలసి వచ్చింది. ‘లైఫ్‌ సపోర్ట్‌’ తీసెయ్యొచ్చాఅని కూడా ఆయన భార్య జేన్‌ హాకింగ్‌ను అడిగారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా ట్రాఖియోటొమి వచ్చింది. దానితో ఇరవైనాలుగు గంటలు వైద్య పర్యవేక్షణలో ఉండాల్సివచ్చింది. నర్సింగ్‌ హోమ్‌ ఖర్చు తాము భరిస్తామని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ ముందుకొచ్చి ఆయనకు అండగా నిలిచింది. కాని, ఆయన భార్య ఒప్పుకోలేదు. ఆయన ఇంటి దగ్గరే ఉండాలని కోరుకుంది. ఆ దశలో అమెరికన్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చి ఖర్చు భరించింది. మూడు షిఫ్ట్‌లలో నర్సుల్ని ఏర్పాటుచేసి పర్యవేక్షించారు. అలా నియమించినవారిలో ఎలెన్‌ మాసన్‌ అనే నర్సుకూడా ఉంది. ఈమె భర్త డేవిడ్‌ ఒక కంప్యూటర్‌ ఇంజినీర్‌. ఆయన ఒక చిన్న కంప్యూటర్‌ని స్టీఫెన్‌ హాకింగ్‌ వీల్‌ చైర్‌కు అమర్చాడు. అందులోని సింథసైజర్‌ విషయాన్ని మాటగామార్చి ఎదుటివారికి వినిపిస్తుంది. అందుకోసం తన గొంతునే వాడమన్నాడు స్టీఫెన్‌. మాటపడిపోకముందున్న తన గొంతు ధ్వనిని అందులో ఉపయోగించమన్నాడు. దానివల్ల స్టీఫెన్‌ హాకింగ్‌ సాంకేతిక సంభాషణ సహజ సంభాషణలా మారిపోయేది.
స్పెల్లింగ్‌ కార్డ్‌ మీద అక్షరాల్ని ఎన్నిక చేసుకోవడానికి తొలుత ఆయన కనుబొమలు కదిలించేవారు. తర్వాత 1986లో ‘ఈక్వలైజర్‌’ అనే కంప్యూటర్‌ ప్రోగ్రాం అందుబాటులోకి వచ్చింది. వర్డ్స్‌ ప్లస్‌ సీఈఓ ఆయిన వాల్టర్‌ వోల్టాస్‌ తను రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ తెచ్చి అమర్చాడు. దానివల్ల 25003000 వరకు అక్షరాలు, పదాలు, వాడుక మాటలు అన్నీ ఒక చిన్నమీట నొక్కితే అందుబాటులోకి వచ్చేవిధంగా ఉంటాయి. నిమిషానికి పదిహేను పదాలు టైపు చేయగల సామర్ధ్యం ఆ సాఫ్ట్‌వేర్‌కి ఉండడం వల్ల, ఆయన ఉపన్యాసాలు, వ్యాసాలు, రచనలు అన్నీ తయారవుతూ ఉండేవి. ఉపన్యసించాల్సిన చోట ఆ విషయాల్ని ముందుగానే స్పీచ్‌ సింథసైజర్‌కు పంపి సిద్ధంగా ఉంచుకోవడం వల్ల అక్కడ ఆయనే స్వయంగా మాట్లాడుతున్నట్లు ఉండేది. స్టీఫెన్‌ హాకింగ్‌ కేవలం మనిషి ఆత్మవిశ్వాసాన్ని నమ్మిన శాస్త్రవేత్త. మేధావి. ఆయనను కాపాడుకోవడానికి కుటుంబమేకాదు సమాజమే కదిలివచ్చింది. మనిషికోసం మనుషులు కదిలివచ్చినట్లయింది. అంతటి దయనీయమైన స్థితిలో కూడా ఆయన దేవుడ్ని తలవలేదు. ముడుపులు కట్టలేదు. క్త్రీస్తు భజనలు చేయలేదు. పైగా జరుగుతున్న వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనల్లో దేవుడి ప్రమేయమే లేదని అన్నారు. మనిషి చేస్తున్న అవిష్కరణలు, సాధిస్తున్న విజయాలులేని దేవుడి ఖాతాలోవేస్తూ బతికే పలాయన వాదులున్నంతకాలం మార్పురాదు. ఈ విషయం చెప్పడానికే స్టీఫెన్‌హాకింగ్‌ శారీరక బలహీనతగూర్చి, ఆయన అచంచల ఆత్మవిశ్వాసం గూర్చి ఇక్కడ వివరించడం జరుగుతోంది. 2005లో ఆయనతన పరికరం వాడడానికి చెంప కండరాలు కదిలించేవాడు. నిమిషానికి అది ఒక పదం మాత్రమే తీసుకునేది. అది ఇబ్బందిగా అనిపించడంవల్ల, ఇన్‌టెల్‌ పరిశోధకుల సహకారంతో మరోవిధానం అందుబాటులోకి వచ్చింది. అది అతని మెదడులోని విషయాల్ని, ముఖ కవళికల్ని అనువదించి చెప్పేది. అది కూడా అంత ఉపయోగకరంగా లేకపోవడం వల్ల లండన్‌లోని షిఫ్ట్‌కి కంపెనీ ముందుకొచ్చింది. అంతకుముందు స్టీఫెన్‌ హాకింగ్‌ రాసిన పరిశోధనా పత్రాల్లోని పదాల్ని, వాక్యాల్ని, విషయాల్ని తరచుగా వాడే వాడుక మాటల్ని అది గుర్తుపెట్టుకుని టైప్‌ చేసేది. ఈ పద్ధతి మనం రోజూ వాడే స్మార్ట్‌ఫోన్‌లలో కూడా చూస్తున్నాం. మనం టెక్స్ట్‌ టైప్‌ చేసేప్పుడు తరచుగావాడే పదాల్ని అదిగుర్తు చేస్తుంటుంది. 2009 నాటికి ఆయన వీల్‌చైర్‌ని నడుపుకోలేని స్థితి వచ్చింది. తర్వాత మెడ, గదుమ భాగాలు కదిలిస్తే దాన్ని అనుసరించి కుర్చీ కదిలేవిధంగా ఏర్పాటు చేశారు. అయితే అది ఆయనకు పనిచేయలేదు. అలా చేయడంవల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులొచ్చాయి. మళ్లీ ఆసుపత్రిలో కూడా చేరాల్సివచ్చింది. అలాంటి స్థితిలో కూడా ఆయన మానవజాతి గురించే ఆలోచించారు. ‘‘రాజకీయంగా, సామాజికంగా, పర్యావరణ పరంగా ధ్వంసమవుతున్న ఈ సమాజంలో మానవజాతి మరో వందేళ్లు కొనసాగే దెట్లా?’’ అని బెంగపెట్టుకున్నారు. యవ్వన దశలోనే వైద్యపరమైన శారీరక సమస్యలకు గురైన స్టీఫెన్‌హాకింగ్‌, జీవితంలో నిశ్శబ్దంగా అనేక పోరాటాలు చేస్తూవచ్చారు. నిస్సత్తువగా మారిన తన శరీరంతో తాను పోరాడుతూ, జ్ఞానకాంక్షకోసం పోరాడుతూ, ప్రపంచ మానవాళి మూఢత్వంతో పోరాడుతూ, 76ఏళ్ల వయసులో కూడా అచంచల ఆత్మవిశ్వాసంతో ఒక జ్ఞానశిఖరంగా నిలబడడం ఆయన ప్రత్యేకత. దెబ్బతాకితేనో, జ్వరం వస్తేనో దేవుడికి ముడుపులు కట్టి మొక్కుకునే మూఢజనం హాకింగ్‌ జీవితం గూర్చి ఏమైనా నేర్చుకోగలరా? మంచి కుటుంబ నేపధ్యం, మంచి ఆర్థికస్తోమత, మంచి ఆరోగ్యంతో మంచి జీవితం అనుభవిస్తూ కూడా, పక్కవాడికి కాదుగదా తమకు తామే పనికిరాని వాళ్లు ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. వారితో పోలిస్తే హాకింగ్‌ జీవితం ఎంతోఉన్నతమైంది. అర్థవంతమైంది కూడా! చేతులు లేక కాలితో సంతకంచేసే వారిని చూస్తేనో, కాళ్లు లేక చేతుల మీద నడిచే వారిని చూస్తేనో జనం జాలిగాచూస్తారు. వారి గుండెధైర్యాన్ని మెచ్చు కుంటారు. మరి స్టీఫెన్‌ హాకింగ్‌ పరిస్థితి ఏమిటి? మెడ ఒక్కటితప్ప మిగతా శరీరమంతా కుప్పగూలి ఉన్నారు కదా? అయినా, ఆయన ధ్యేయాన్ని క్షణకాలమైనా మరువలేదుకదా? విశ్వవిజ్ఞానానికి తన వంతుగా కొత్త విషయాలందిస్తూ వచ్చారుకదా? మృత్యువు అంచుమీద శ్వాసిస్తూ కూడా, మనిషి విజయ పరంపర గూర్చి మాత్రమే ఆలోచించారు డా.స్టీఫెన్‌ హాకింగ్‌. ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యంగా కనిపిస్తున్న దుర్భలులైన మిలియన్ల ప్రజలకంటే కూడా హాకింగ్‌ దృఢ సంకల్పుడు. మానసిక బలశాలి. ఆయనకు ఆకాశమే హద్దు అనుకోలేదు. ఆ ఆకాశాన్ని ఇంకొంచెం పైకి ఎదగమని..విసరకనే సవాల్‌ విసిరారు. 2018 మార్చి14 బుధవారం తెల్లవారుజామున విశ్వాంతరాళంలోకి వెళ్లిపోయిన స్టీఫెన్‌ హాకింగ్‌కు ప్రపంచ మానవాళి నివాళులర్పించింది.
`వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, సైన్స్‌ ప్రొఫెసర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img