Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

ఆదర్శ తమిళ కవయిత్రి సుకీర్తారాణి

ఆర్థిక నేరస్తుడు గౌతమ్‌ అదానీ ప్రాయోజితం చేసిన అవార్డును ప్రముఖ తమిళ కవయిత్రి సుకీర్తారాణి తిరస్కరించి ఎందరికో ఆదర్శంగా నిలవడం శుభ పరిణామం. ఈ రకంగా ఆమె అవార్డుని స్వీకరించపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసిం దనడంలో ఏమాత్రం సందేహం లేదు. అవార్డ్‌లను ప్రకటించ గానే స్వీకరించాలనుకునే వారు కోకొల్లలు ఉన్న ఈ రోజుల్లో, ఆమె తాను విశ్వసించిన ఆదర్శాల మేరకు ఆ అవార్డుని తిరస్కరించి భావి తరాలకు సరికొత్త సందేశాన్ని అందివ్వడం అభినందనీయం. ది న్యూ ఇండియన్‌ ఎక్సెప్రెస్‌ గ్రూప్‌ నిర్వహించే ‘దేవి అవార్డ్స్‌’ కోసం దేశ వ్యాప్తంగా సుకీర్తారాణితో పాటుగా శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌, భరతనాట్యం నృత్యకారిణి ప్రియదర్శిని గోవింద్‌, పరోపకారి రాధికా సంతానకృష్ణ, స్క్వాష్‌ క్రీడాకారిణి జోష్నా చినప్ప తదితరులు మొత్తంగా 12 మంది మహిళా ప్రముఖులను ఎంపిక చేయగా, తమిళ కవయిత్రి సుకీర్తారాణి మాత్రమే అవార్డును తిరస్కరిం చడం గమనార్హం. ముఖ్యంగా సుకీర్తారాణి దళిత సాహిత్యానికి చేసిన కృషికి ఎంపిక అయ్యారు. ‘నేను మొదట ఈ అవార్డును స్వీకరించ డానికి అంగీకరించాను. కాని ముఖ్యంగా ఈ అవార్డు ఈవెంట్‌ను ప్రాయోజితం చేసినది అదానీ అని తెలుసుకుని నిర్ఘాంత పోయాను. నేను మాట్లాడే రాజకీయాలు, నేను నమ్మిన సిద్ధాంతాల కోసం అదానీ గ్రూప్‌ ఆర్థికంగా మద్దతు ఇచ్చే కార్యక్రమంలో అవార్డును స్వీకరించడం నాకు సంతోషంగా లేదు. కాబట్టి నేను ‘దేవి అవార్డు’ని స్వీకరించడానికి నిరా కరిస్తున్నాను. అయితే నిపుణులబృందం ఎంపికతీర్పును మాత్రం గౌరవిస్తాను’ అని పేర్కొనడం ఆమె విధేయతపటిమని సృష్టంగా వెల్లడిస్తుంది.
1973 లో తమిళనాడులోని వేలూరు జిల్లాలోని లాలాపేట్‌ అనే గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో సుకీర్తారాణి జన్మించారు. ఆ ప్రాంతంలోని పది దళితకుటుంబాలతో పాటుగా ఆమె ఒకరిగా పెరిగారు. ఆమె చిన్నప్పటి నుండి కులవివక్షని ఎదుర్కొన్నారు. నేను ఇంటి బయట అడుగు పెట్టగానే కులం ‘కుక్క’లా వెంటాడుతుంది అని ఆమె ఆవేదన చెంది తక్షణమే సామాజిక కార్యాచరణ దిశగా ప్రేరణ పొందారు. ‘‘నా జీవితంలో ఒకానొక సమయంలో నా కులం గురించి నేను సిగ్గుపడ్డాను. మా పాఠశాలలో అధ్యాపకులు ‘ముందడుగు వేసిన కులానికి చెందిన వారు ఎవరు’, ‘హరిజనులు ఎవరు’ అని అడిగేవారు. కాని ఆ పదాలను నన్ను నేను బహిరంగంగా గుర్తించలేకపోయాను. ఒకానొక సమయంలో కుల గుర్తింపును అధిగమించాను. ఒక రకంగా నేను దళితురాలిని అయినందుకు గర్వపడ్డాను. చిన్నప్పుడు కులాన్ని అర్థం చేసుకోలేదు. దాన్ని ఎదుర్కొనే పరిపక్వత నాకు లేదు. అప్పుడు తికమక పడ్డాను. ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను’’ అని ఆమె తన అంతరంగాన్ని బాహాటంగా వ్యక్తీకరించారు.
సుకీర్తారాణి ఆర్థికశాస్త్రం, తమిళ సాహిత్యంలో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఆమె వెల్లూరులోని రాణిపేట జిల్లాలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తమిళం బోధిస్తున్నారు. ఆమె చురుకైన స్త్రీవాది, సామాజిక కార్యకర్త. సుకీర్తారాణి తమిళంలో రాసే దళిత స్త్రీవాద కవయిత్రి. ఆమె కవితలు కులం, శరీరంచుట్టూ కేంద్రీకృతం అయ్యాయి. కుల వ్యవస్థ స్త్రీల శారీరక స్వేచ్ఛను ఎలా నిర్బంధిస్తుందో ఆమె తన రచనల ద్వారా బట్టబయలు చేశారు. కైపత్రి యెన్‌ కనవు కేల్‌, ఇరవు మిరుగమ్‌, కామత్తిపూ, తీండపడతా ముత్తం, అవలై మొజిపెయర్తాల్‌ ఇప్పదిక్కు ఏవల్‌ వంటి ఆరు కవితా సంకలనాలను సుకీర్తరాణి రచించారు. ఆమె తన రచనలద్వారా మరుగునపడిన అనేక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. తేవమగల్‌ కవితూవి పురస్కారం, పుతుమై పిత్తన్‌ స్మారక పురస్కారం, పెంగల్‌మున్నానిచే మహిళాసాధకుల పురస్కారం మొదలైన పురస్కారాలను సుకీర్తారాణి పొందారు. ముఖ్యంగా సుకీర్తారాణి కవితలు తమిళనాడులోని కళాశాల పాఠ్యాంశాలలో చేర్చారు. 2021 ఆగస్టులో దిల్లీ యూనివర్సిటీ అకడమిక్‌ కౌన్సిల్‌ ఏకపక్షంగా ఇంగ్లీష్‌ హానర్స్‌ సిలబస్‌ నుండి సుకీర్తారాణి రాసిన బామా అలియాస్‌ ఫౌస్టినా సూసైరాజ్‌ అనే పాఠ్యంశాన్ని తొలగించడం సర్వత్రా విమర్శలకు గురైంది. ఆమె కవితలు ఇంగ్లీష్‌, మలయాళం, కన్నడ, హిందీ, జర్మన్‌ భాషలలోకి అనువాదం చేశారు. కుల గుర్తింపు, స్త్రీ శరీరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, దళిత స్త్రీల సమస్యలు ఇతర కులాల స్త్రీల కంటే భిన్నమైనవి అని సుకీర్తారాణి వ్యక్తిగతంగా భావించారు. ఆమె రచనలన్నీ నా స్వంత అనుభవాలు కావు, ముఖ్యంగా దళిత స్త్రీ అనుభవాలు అని ఆమె వ్యక్తీ కరించారు. మనమందరం కులసంకెళ్లలో ఉన్నాం అని, ముఖ్యంగా దళిత స్త్రీల శరీరాలు నిత్య హింసకు గురవుతున్నాయి అని, అగ్రవర్ణ స్త్రీలు అనుభవించే బాధలతో పోలిస్తే, దళితస్త్రీలు అధ్వాన స్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత తరుణంలో ఆమె ప్రధానంగా స్త్రీ విముక్తి గురించి ముఖ్యంగా దళిత మహిళల అభ్యున్నతిపై దృష్టిని కేంద్రీకరించి ఆ దిశగా పురోగమి స్తున్నారు. ‘ఆమె ఆకాంక్షలు సఫలీకృతం కావాలి’ అని కోరుకుందాం. అంతిమంగా ‘నమ్మిన ఆదర్శాలముందు అవార్డులు ఏమాత్రం సరితూగవు’ అని సుకీర్తా రాణి నిరూపించారు. ఏదిఏమైననూ ‘నిర్జీవ అవార్డులకన్నా చరిత్రలో కల కాలం సజీవంగా మనగలిగే ఆదర్శాలు నూతన సమాజనిర్మాణానికి బాసటగా నిలుస్తాయి’ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
జె.జె.సి.పి. బాబూరావు, సెల్‌: 94933 19690.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img