Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ఆయన మరణంతో దేశం ఎందుకు శోకించిందంటే

అరుణ్‌ ఫెరెరా

భీమా కోరెగాన్‌ కేసులో అరెస్టైన గిరిజన హక్కుల కార్యకర్త, క్రైస్తవ మత బోధకుడు, 84 ఏళ్ళ స్టాన్‌ స్వామి గత నెల (జులై) 5వ తేదీన మృతి చెందాడు. స్టాన్‌ స్వామి అరెస్టయ్యారన్న వార్త 2020, అక్టోబర్‌ 8వ తేదీ సాయంత్రం తెలిసి ఆశ్చర్యపోయాం. మర్నాడు ఆయన మా పక్క బారెక్‌లోని ఖైదీలతో హిందీలో చక్కగా మాట్లాడుతున్నాడు. నేనప్పుడు జైలు ఆస్పత్రిలోని సెల్‌లో నా సహ నిందితులు వరవరరావు, వెర్నన్‌ గోన్సాల్వెస్‌తో కలిసి ఉన్నాను. ఉదయం టిఫిన్‌ తినడానికి ముందు వరవరరావును వీల్‌ చైర్‌లో కూర్చోబెట్టుకుని రోజూ రెండు వరుసలు తిరిగే వాళ్లం. స్టాన్‌ స్వామిని జుడీషియల్‌ కస్టడీకి పంపడానికి రెండు రోజుల ముందు కస్టోడియల్‌ ఇంటరాగేష న్‌కు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ కోరి ఉంటుందని ఊహించాం. కానీ, మా ఊహ తప్పు. ఎందుకంటే, ఎస్‌ఐఏ అతన్ని జైలులోపెట్టదలుచుకుంది. మమ్మల్నిచూడగానే స్టాన్‌స్వామికి ప్రాణం లేచొచ్చింది. స్టాన్‌ స్వామితో మేం ముగ్గురం రెండు నెలలు స్నేహంగా ఉన్నాం. అంతులేని తన అనుభవాలతో, తరుచూ పాడే పాటలతో ఏర్పడిన అతని స్నేహం ఎన్నటికీ మర్చిపోలేం. హైకోర్టు ఆదేశాలతో వరవరరావును ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించడంతో అప్పటివరకు వరవరరావును జాగ్రత్తగా చూసుకుంటున్న మమ్మల్ని వేరు వేరు బారెక్‌లకు తరలించారు. తనరోజు వారి పనులకు సహాయం కావాలని, మాతో ఒక అర్థవంతమైన సంబంధాల కోసం స్టాన్‌ స్వామి జైలు అధికారులతో వాదించాడు. మేం ‘చాచా’ అని పిలిచే మరొక ఖైదీతోపాటు నన్ను కూడా స్టాన్‌ స్వామి ఉండే సెల్‌కు 2020 డిసెంబర్‌ 5న మార్చారు. తనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిపైన మరిచిపోలేని ప్రభావం కలిగించిన స్టాన్‌ స్వామితో మేం రోజులు, నెలలు గడిపాం. నిర్మలమైన, స్వచ్చమైన నిరాడంబరత వల్లే అతనిలో ఆ మిరుముట్లు గొలిపే శక్తి వచ్చింది. ప్రతి చర్యలో, ప్రతి అంశంలో అతని నిరాడంబరత ప్రతిబింబించేది. తన చేతిని గుండెలకు అడ్డంగా పెట్టుకుని, తలవంచి ప్రతివ్యక్తిని గౌరవించే అతని అలవాటును మేం మరిచి పోలేం. తన కంటే చిన్న వయసులో ఉన్న ఖైదీలు సహా జైలు అధికారులతో కూడా ఈ సాధారణమైన ప్రవర్తన ప్రతి ఒక్కరిని కదిలించింది. తనకంటే చిన్న వారితో అనుచితంగా, వారిని తీసేసినట్టుగా ప్రవర్తించినట్టు మేం ఎప్పుడూ చూడలేదు. ఏదో ఒకటి పంచుకోవడమే ప్రేమ అని నమ్మిన వ్యక్తి. పంచుకోవడ మంటే ఇతరులకు ఏదో ఒకటి ఇవ్వటం కాదు. ఇతరుల బాధను, వారి విషాదంలో పాలుపంచుకోవడం. స్టాన్‌ స్వామిని అరెస్టు చేయడానికి రెండు రోజుల ముందు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ తీసిన వీడియో సందేశం ఇది. స్టాన్‌ స్వామిని మరింత తినమని నేను, చాచా దాదాపు ప్రతి రోజూ అడిగేవాళ్ళం. ఆహారం తక్కువగా తీసుకోవడం ఖైదీల పరిస్థితికి సరైనది కాదని మేం గాభరాపడే వాళ్ళం. ఒక యువ జెసూంట్‌గా జార్ఖండ్‌ లోని చైబసలో ఉన్న గిరిజన కుటుంబంతో కలిసి జీవిస్తున్నప్పుడు వారిలాగానే తాను కూడా అర్ధాకలితో ఉండే వాడినని చెప్పాడు. యాభై ఏళ్ళుగా ఇలా తినడం వల్ల తన పొట్ట కూడా అంటుకు పోయిందని చెప్పాడు. స్టాన్‌ స్వామి చెప్పిన సమాధానంతో మేం సంతృప్తి చెందలేదు. అతని కోసం జైలు క్యాంటిన్లో పళ్ళు, బలవర్థకమైన బిస్కెట్లు కొన్నాం. కానీ అతని కఠినమైన జీవన విధానం వల్ల జైల్లో కూడా మాతో ఏ మాత్రం రాజీపడలేదు. తన కిష్టమైన వేయించిన వేరుశెనగ పప్పుల్ని మాత్రమే కొనమని అడిగేవాడు. ఇతరుల విషాదాలలో పాలుపంచుకోవడమే ప్రేమకు లోతైన అర్థం అన్నది ఆయన భావన. జెంషెట్‌పూర్‌లోని జెసూయిట్‌ ప్రావిన్స్‌లో క్రైస్తవ మత బోధకుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి అనుభవాలను గుర్తు చేసుకునేవాడు. చర్చి ధార్మిక కార్యక్రమాలలో భాగంగా పేదలకు ఆహారం సరఫరా చేస్తున్న రోజులవి. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న స్టాన్‌ స్వామి, తొలి రోజులలోనే దీని కంటే ఎక్కువ చేయవచ్చు అనుకున్నాడు. జెసూయిట్‌ చర్చి వ్యవస్థాపకుడు సెయింట్‌ ఇగ్నటిస్‌ లయోలా చెప్పిన ‘ఒకటి అత్యవసరం’ అనేది చాలా ముఖ్యమని స్టాన్‌ స్వామి చెప్పేవాడు. ఈ దోపిడీకి మూలాలేమిటో తెలుసుకోవాలి. అప్పుడే విముక్తి సాధ్యమవుతుంది అనేది దీనర్థం. ప్రజా పోరాటాల కేంద్రీకృత వ్యవస్థకు, సామాజిక పరివర్తనకు మార్క్సిస్టు విశ్లేషణే నిజమైన మార్గమని స్టాన్‌ స్వామి విశ్వసించాడు. తరవాత బెంగుళూరులోని ఇండియన్‌ సోషల్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌గా ఈ ఆలోచనకు పదును పెట్టాడు. సామాజిక చర్యల్లో పాల్గొనేలా యువతను చైతన్యపరిచాడు. అలా చైతన్యవంతులైన వారిలో యువకుడిగా ఉన్నప్పటి వెర్నన్‌ గోన్సాల్వెస్‌ కూడా ఉన్నారు.
పీడనకు, తిరస్కారానికి గురైన వారిపై ప్రేమ
తిరుగులేని రోమన్‌ సామ్రాజ్యంపై, దాని ధర్మాలను అనుసరించడంపై జీసెస్‌ చెప్పిన మాటలను తరుచూ ఉదహరించేవాడు. మత సంప్రదాయాలను గౌరవిస్తున్నప్పటికీ, సమాజ మూలాలను, సామాజిక సారాంశాన్ని అర్థం చేసుకోవాలని భావించేవాడు. స్టాన్‌ స్వామి గిరిజన సమాజానికి, సంఘానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ‘ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌’ పేరుతో ప్రభుత్వం చేపట్టే హింస నుంచి గిరిజన సమాజాన్ని కాపాడాలని భావించాడు. అంటే ఆ సంఘం ఆత్మకు రక్షణ కల్పించాలన్నాడు. స్టాన్‌ స్వామి ప్రతిఘటన గురించి చదివేటప్పుడు కేవలం మావోయిస్టులని చెప్పేవారితో సంబంధాలుగా, నిబద్ధతగా భావించడమంటే ప్రజా సంఘంపై అతని నిబద్దతను గమనించడంలో వైఫల్యమే అవుతుంది. స్టాన్‌ స్వామి నా కంటే రెట్టింపు వయసున్నవాడు. మా నాన్నకంటే కాస్త చిన్న వాడైనప్పటికి ఆయనతో చాలా పోలికలున్నాయి. ప్రీస్ట్‌గా ఉన్న మా మేనమామకు మంచి స్నేహితుడు. మా మేనమామ మరణించక ముందు ఇద్దరూ ఆస్తికత్వ విముక్తి విషయంలో సహచరులు. ముంబయి వెళ్ళినప్పుడల్లా అతని ఇంట్లోనే బస చేసేవాడినని స్టాన్‌ స్వామి గుర్తు చేసుకునేవాడు. తమపై పెట్టిన తప్పుడు కేసుల గురించి స్టాన్‌ స్వామి అర్థం చేసుకోవడానికి నేను, వెర్నెన్‌ ప్రయత్నించాం. వెర్నన్‌ వెళ్ళిపోయాక స్టాన్‌ స్వామికి చట్టపరమైన విషయాలు చెప్పే బాధ్యత నేను తీసుకున్నాను. మా సంబంధాలు వీటన్నిటికీ అతీతమైనవి. ఇతర సహనిందితులకంటే మేం చాలా మంచి స్నేహితుల మయ్యాం. ఇద్దరం కలిసి ఒకే న్యాయం కోసం చేసే పోరాటంలో కుటుంబ సభ్యులయ్యాం. ఫాదర్‌ స్టాన్‌ స్వామి మా అందరి మధ్య కేవలం స్టా గా ఉండి పోయారు. రాజ్యం ఊహాతీతంగా మా అందరిని ఏకం చేస్తూ కట్టిపడేసింది. బొంబాయి హైకోర్టు 2021 ఫిబ్రవరిలో వరవరరావుకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ ఉత్తర్వుతో మేమంతా చాలా సంతోషించాం. స్టాన్‌ స్వామి ఆనందానికి అవధులు లేవు. వరవరరావుకు బెయిల్‌ మంజూరు చేస్తూ, ముంబయి దాటి వెళ్ళకూడదని, సహనిందితులతో సంబంధాలు నెరపకూదడదని, భీమా కోరేగాన్‌ కేసులో తన అభిప్రాయాలను పత్రికలకు, చానెళ్ళకు, సామాజిక మాధ్యమాలకు చెప్పకూడదని విధించిన నిబంధనలపట్ల స్టాన్‌ స్వామి చాలా బాధపడ్డాడు. చట్టపరమైన ఎత్తుగడల తలతిక్క వ్యవహారాల గురించి చర్చించేటప్పుడు ఆయన దృష్టి కోణాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నిజానికి స్వేచ్ఛ అంటే ఏమిటో తన లోతైన అవగాహనపై ఆయన అమాయకపు దృష్టి కనిపించింది. ఆంక్షలు లేని ఉద్యమం మాత్రమే దాని అర్థం కాదు, ఒకరికి సత్యం మాట్లాడగలిగే శక్తి, మరొకరికి చెప్పడం, మరొకరితో పంచుకోవడం కూడా ముఖ్యం. తన జెసూంట్‌ సహచరులకు, న్యాయవాదులకు తన బెయిల్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలియచేయాలన్నది ఆయన కోర్కె. గత మే నెలలో హైకోర్టు స్టాన్‌ స్వామి వాదనలను వీడియో ద్వారా విన్నప్పుడు ఈ అవకాశాన్ని ఒదులుకున్నాడు. జైలు నుంచి విముక్తి మాత్రమే తనను జార్ఖండ్‌లోని రాంచీ వద్ద ఉన్న తన ప్రజల వద్దకు చేర్చుతుందని భావించాడు.
ఏప్రిల్‌ 26వ తేదీన అతని పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన లెక్కలేనన్ని శుభాకాంక్షలు కూడా అతని పరిస్థితిని మెరుగుపరచ లేకపోయాయి. అతనిలో పెరిగిన బలహీనత అతని నరాల సమస్యకు పాకింది. వినికిడి సమస్య పెరిగింది. అతనికున్న పార్కిన్సన్‌ సమస్య మరింత తీవ్రతర మైంది. పత్రికలు కూడా చదవలేనంతగా చూపు మందగించింది. స్టాన్‌ స్వామికి మేం చివరిసారిగా వీడ్కోలు పలుకుతున్నప్పుడు, అతను కోలుకుంటాడనుకున్నాం. (బెయిల్‌ తిరస్కరించిన బాంబాయి హైకోర్టు స్టాన్‌ స్వామిని ప్రైవేటు హెలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించాలని మే 28న ఆదేశించింది). నా అంచనా తప్పు. అతను కోరుకున్న స్వేచ్ఛ చాలా దూరంగా ఉంది. ఎంత దూరంగా ఉందంటే అలసిన అతని శరీరం కూడా ఓర్చుకోలేనేంతగా.
అనువాదం : రాఘవ శర్మ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img