Monday, March 20, 2023
Monday, March 20, 2023

ఆయుధాలను నమ్ముకుని అభివృద్ధిని మరచిన పాకిస్థాన్‌

అత్యంత దారుణమైన ఆర్ధిక పరిస్థితుల మధ్య పాకిస్తాన్‌ కొట్టు మిట్టాడుతున్నది. సమీప భవిష్యత్తులో ఎవరూ పూడ్చలేనంత స్థాయిలో పాకిస్థాన్‌ ఆర్ధికంగా పతనమై పోయింది. పాకిస్తాన్‌ తన దేశ ప్రజలను గాలికి వదిలేసి, వారికి జీవించడానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా అణ్వాయుధాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటూ, ఉగ్రవాదులను పెంచి పోషించింది. సరిహద్దుల్లో ఉగ్రవాదులను చొప్పించడమే కాకుండా స్వయంగా పాక్‌ సైన్యమే కాల్పులకు ఒడిగట్టిన సందర్భాలు కోకొల్లలు. కొంతమందిని కొన్నిసార్లు మోసం చేయవచ్చు, అందరినీ అన్నిసార్లు మోసం చేయలేమన్న నానుడి పాక్‌ విషయంలో నిరూపితమైనది. అగ్రరాజ్యాలను, ఐక్యరాజ్య సమితిని, ఇతర అంతర్జాతీయ సంస్థలను, మానవ హక్కుల సంఘాలను మభ్యపెట్టి భారత్‌పై దుష్ప్రచారాన్ని కొనసాగించిన పాకిస్థాన్‌ ప్రస్తుతం భారత్‌కు పాదాక్రాంతమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అహంకారంతో విర్రవీగే దేశాలు పాకిస్థాన్‌ దైన్యస్థితిని గుణపాఠంగా నేర్చుకోవాలి. సైనిక నియంతల కనుసన్నల్లో పనిచేస్తూ పాక్‌ పాలకులంతా అధికారంకోసం మాత్రమే పనిచేసారు. చివరికి అధోగతి పాలైనారు. సైనిక నియంతల పాలనలో చాలాకాలం పాకిస్థాన్‌ అరాచకాన్ని చవిచూసింది.
ప్రజాస్వామ్యం పేరుతో ప్రభుత్వాలు ఏర్పడినా అవి కేవలం సైనిక ఆజ్ఞలకు లోబడే పనిచేసాయి. 1965,1971లో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధాలు ముఖ్యంగా 1965లో 17రోజులపాటు జరిగిన యుద్ధంలో పాక్‌ బెంబేలెత్తి అమెరికా-రష్యాలను శరణు వేడుకున్న ఫలితంగా ఆయూబ్‌ ఖాన్‌-లాల్‌ బహదూర్‌ శాస్త్రిల మధ్య కుదిరిన తాష్కెంట్‌ ఒప్పందం వలన తాత్కాలికంగా రెండుదేశాల మధ్య యుద్ధ వాతావరణం సద్ద్ధుమణిగినా చివరకు ఆ ఒప్పందాన్ని కూడా పాక్‌ ఉల్లంఘించింది. తెల్లదొరల ఏలుబడిలో ఆర్ధికంగా చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో భారత్‌ కూడా స్వాతంత్య్రానంతరం అనేక కష్ట నష్టాలను చవిచూసింది. ఇక చిన్న మత ప్రాతిపదిక దేశమైన పాక్‌ విషయం గురించి, ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సహజ వనరులు గల భారతదేశమే అనేక ఆర్ధిక సంక్షోభాలను చవిచూసింది. కూటికోసం, గూడు కోసం ఎన్నో ఏళ్లు అలమటించింది. విద్య, ఉపాధి అవకాశాల కోసం ఎంతో తపించింది. స్వాతంత్య్రంవచ్చినా పొరుగు దేశాల నమ్మకద్రోహం వలన భారత్‌ అనేక విధాలా నష్టపోయింది. బ్రిటీషర్ల నుండి విముక్తి పొందిన భారత్‌ ఆర్ధికంగా కుదుటబడక ముందే, భారత్‌ను అనేక సవాళ్లు చుట్టుముట్టాయి. భారత్‌ అభివృద్దిపై కాకుండా దేశభద్రతపై దృష్టి సారించ వలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
బంగ్లాదేశ్‌ విమోచనోద్యమం సమయంలో భారత్‌ కీలక పాత్ర పోషించడం బంగ్లాదేశ్‌ విభజన జరగడం వలన అప్పటి నుంచి పాక్‌ మరింత రెచ్చి పోయింది. ఉగ్రవాదులను పెంచి పోషించింది. ఉగ్రవాదులే శాసించే పరిస్థితుల్లోకి పాకిస్థాన్‌ నెట్టబడిరది. ఇది భారత్‌కుపెద్ద తలనొప్పిగా పరిణమించింది. జనరల్‌ జియా ఉల్‌హక్‌, ముషారఫ్‌ లాంటి కరుడు గట్టిన పాక్‌ నియంతలు భారత్‌పై విద్వేషాన్ని వెళ్ళగక్కి పాక్‌ ప్రజలను తప్పుదారి పట్టించారు. తర్వాత వచ్చిన పాలకులు కూడా అదే బాటలో పయనించి, పాకిస్తాన్‌ను అధోగతి పాలు చేసారు. కోవిడ్‌ వలన సంభవించిన ఆర్ధిక కష్టాలనుండి కోలుకోకముందే పాక్‌ తీవ్రమైన వరదల వలన కకావికలమైనది. రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం వలన తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో పడిరది.
ఒక్కపూట ఆహారం కోసం ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. పాక్‌లో అంతర్గత యుద్ధం చెలరేగింది. బెలూచిస్థాన్‌ వంటి ప్రాంతాలు భారత్‌లో తమ భూభాగాన్ని విలీనం చేయాలని కోరుకుంటున్నాయి. ఆర్ధికంగా ఛిన్నాభిన్నమైన పాక్‌ అప్పులకోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ పెట్టిన కఠినమైన షరతులను అంగీకరించక తప్పలేదు. ఎవరు ఎంత సహాయం చేసినా అది కేవలం తాత్కాలిక ఉపశమనమే తప్ప పాక్‌ కోలుకునే పరిస్థితిలో లేదు. అభివృద్ధిని విస్మరించి, ప్రజలను గాలికి వదిలేసి, ఆయుధాలను నమ్ముకున్న పాకిస్తాన్‌ చివరకు ఆర్ధికంగా పతనమై అన్నమో రామచంద్రా! అంటూ విలపించే దుస్థితికి వచ్చింది. అభివృద్ధిని విస్మరించి, అరాచక వాదంతో ఇతర దేశాల సమగ్రతను, సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే దుష్టశక్తులకు పాక్‌ ప్రస్తుత దైన్యస్థితి ఒక గుణపాఠం కావాలి.
సుంకవల్లి సత్తిరాజు, సెల్‌: 9704903463

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img