డా.అరుణ్‌మిత్రా
మణిపూర్ మూడు నెలలకుపైగా జ్వలిస్తూ సంక్షోభంలో కూరుకుపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో మెయితీలు, కుకీలు, జొమీల మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో అంతర్వ్యుద్ధ వాతావరణం నెలకొంది. 200మందికిపైగా మరణించగా 5060 వేలమంది శరణార్థులుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. తూతూ మంత్రంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన సహాయ శిబిరాల్లో ఉన్నవారు కనీస వసతులు లేక ఆరోగ్య సమస్యలతో తల్లడిల్లుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ మనదేశంలో భాగం కాదన్నట్లు ఇంతవరకు పరిష్కారం గురించి మాట్లాడలేదు. ఆ రాష్ట్రం భగ్గుమని మంటల్లో కాలిపోతున్నా ఒక్కమాటకూడా మాట్లాడలేదు. పైగా కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఎంతో ప్రయోజనంఉంటుందని చేసిన ప్రచారంతో విసిగిపోయిన కర్నాటక ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర షాక్ ఇచ్చారు. మోదీ
షాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.మణిపూర్‌లో ఇద్దరుమహిళలతో నగ్న ప్రదర్శన చేయించి లైంగిక వేధింపులకు గురిచేసిన మహిళలను గురించి గొప్పగా మాట్లాడే ఈ దుర్ఘటనను కనీసం ఖండిరచలేదు. మహిళలను అవమానించిన ఘటనతో పరిస్థితి దిగజారిపోయి హింసాయుత ఘటనలు విపరీతంగా పెరిగాయి. సహాయ శిబిరాల్ల తలదాచుకుంటున్న ప్రజలు తీవ్రమైన ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటున్నారు. తీవ్ర గాయాలతో ఉన్నవారు మానసిక వత్తిడికి గురైనవారు మరిన్ని ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్‌మెంట్(ఐడీపీడీ) సంఘం నుండి ఐదుగురు వైద్యుల బృందం 2023 సెప్టెంబరు 1,2 తేదీలలో మణిపూర్‌లో పర్యటించింది. లోయప్రాంతాలు, కొండప్రాంతాలలో తిరిగి మెయితీలు, కుకీలను కలుసుకుని మాట్లాడటంతో పాటు సహాయ శిబిరాల్లోనూ తలదాచుకుంటున్నవారి ఆరోగ్యపరిస్థితులను తెలుసుకున్నారు. ఖమన్‌లంక్‌పాక్ క్రీడా హాస్టల్‌ను సందర్శించి శరణార్థులుగా నివసిస్తున్నవారి ఆరోగ్యపరిస్థితులను తెలుసుకున్నారు. అలాగే సపోర్‌మెయినా పరిదిలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కంగ్‌పోక్‌పి జిల్లాలోని కొండప్రాంతాల్లో కూడా ఈ బృందం పర్యటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 334సహాయ శిబిరాలు ఉన్నాయి. అక్కడ నివసిస్తున్నవారిని, శిబిరాల నోడల్ అధికారులను, ఆరోగ్యశాఖ అధికారులను అలాగే అన్నిపౌరసమాజ సంస్థల్లో పనిచేసే కార్మికులను, రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని ఈ బృందం కలుసుకుంది. కొండప్రాంతాల్లోని శిబిరాల్లో నివసిస్తున్నవారు రాష్ట్రప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, అనారోగ్యాలకు చికిత్సలాంటి అవసరాలను తీర్చేవిషయంలో ఏ మాత్రం సంతృప్తిగాలేరు. మణిపూర్ కొండప్రాంతాల్ల నివసిస్తున్న ప్రజలు వైద్యం చేయించుకునేందుకు 150 కిలోమీటర్ల దూరంలో నాగాలాండ్‌లోని కొహిమా లేదా దిమాపూర్ జిల్లాలకు వెళ్లి మళ్లీ తిరిగి వస్తున్నారు. మరికొంతమంది అసోం వరకు వెళ్లి ఆరోగ్య చికిత్సలు పొందుతున్నారు. కొంతమంది అధికారుల సూచనమేరకు ఇంఫాల్‌లోని వైద్య కళాశాలలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. వైద్య చికిత్సకోసం కొండప్రాంతాల నుంచి లోయప్రాంతాలకు అలాగే లోయప్రాంతాలనుంచి కొండలపైకి ప్రజలు తిరగడమనేది అసాధ్యమైన పరిస్థితిఉంది. సహాయ శిబిరాల్లో ప్రజలు కిక్కిరిసి ఉండటం వలన పొంగు తదితర అంటువ్యాధులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ముఖ్యంగా పిల్లలకు పొంగును నివారించేందుకు వాక్సిన్‌లు వేయవలసిన అవసరంఉంది. అయితే ప్రభుత్వం వాక్సిన్‌లనువేసే కార్యక్రమాన్ని ఏమీ ఆలోచించినట్లు లేదు. పిల్లలకు పొంగురాకుండా 9నెలల వయసు దాటగానే ‘విటమిన్ ఏ’ ను నోటిద్వారా ఇవ్వాలి. ఇంకా పౌష్టికాహారం అనేది మరచిపోవడమే. శిబిరాలలో ఉండే నోడల్ అధికారులు ఆకుకూరలు, గుడ్లు, మాంసం వంటి ఆహారాన్ని ఏనాడూ సరఫరాచేయలేదని శిబిరాల్లో నివసిస్తున్నవారు చెప్పారు. అయితే ఆ ప్రాంతాల్లో నివసించేప్రజలు ఒక్కొక్కసారి ఆకుకూరల్ని శిబిరాలకు అందచేస్తున్నారు. కొన్ని శిబిరాల్లో ప్రజలకు 13రోజుల కొకసారి ఒక గుడ్డు అందచేస్తున్నారు. ఆకుకూరలు మాత్రం ఇవ్వడంలేదు. పౌష్టికాహారం లేకపోవడం వల్లనే రకరకాల వ్యాదులు చుట్టుముడుతున్నాయి.ఈ పరిస్థితులను ప్రబుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మేలైన వసతులను, ఆహారాన్ని, ఆరోగ్య సంబంధిత చర్యలను తీసుకోవలసిందిగా ఈ బృందం సూచించింది.