Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

ఆర్థిక అంతరాలు ` అభివృద్ధికి విఘాతాలు

ఆకాశాన్నంటే భవనాలు, బిలియనీర్ల సంఖ్య పెరగడం అభివృద్ధికి సూచిక కాదు. అందరికీ సమానమైన అవకాశాలు రావాలి. చదువు కున్న యువతకు విలువ పెరగాలి. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీ కృతం కారాదు. నాణ్యమైన విద్య, విద్యకు తగ్గ ఉపాధి, మెరుగైన మౌలిక సౌకర్యాలు, కల్తీ లేని ఆహార పదార్థాలు, పరిశుభ్రమైన త్రాగు నీరు, వసతి సదుపాయం, అందరికీ ఆరోగ్య సదుపాయం వంటి కనీస అవసరాలు కల్పించాలి. ఇవే ప్రజల ఉన్నత జీవన ప్రమాణాల స్థాయికి సూచికలు. ఇదే నిజమైన అభివృద్ధి. ఇలాంటి అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పని చేయాలి.
గత కాలపు వైభవాన్ని నెమరువేసుకుంటూ, వర్తమానంలోని కష్టాలను కన్నీళ్లకు అంకితం చేసి, బతుకీడ్చడం విజ్ఞత అనిపించుకోదు. గత వైభవాన్ని స్ఫూర్తిగా తీసుకుని వర్తమానాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి చేసే ప్రయత్నమే నిజమైన ఆశావహ దృక్ఫథం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి, అన్ని రంగాల్లోను విప్లవాత్మక మార్పులు తెచ్చి, అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రపంచమంతా కుగ్రామంగా మారిన నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మనం కూడా పరుగులు తీయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మన దేశంలో యువ శక్తికి కొదవలేదు. మన దేశం మేధా సంపత్తికి పెట్టింది పేరు. భారత దేశం అనాదిగా విదేశీయుల దౌర్జన్యాలతోను, దండ యాత్రల తోను అపారమైన ధనరాశులను, భూభాగాలను, చారిత్రక వారసత్వ సంపదను కోల్పోవడంతో పాటు అమూల్యమైన విజ్ఞాన సంపదను కూడా కోల్పోయింది. భారతదేశం నుండి కొల్లగొట్టిన మేధా సంపత్తిని వివిధ రూపాల్లో మార్చుకుని మేధో సంపత్తి హక్కులు పేరిట పేటెంట్‌ హక్కులను హస్తగతం చేసుకుని తామే ప్రపంచానికి మార్గనిర్దేశకుల మన్నట్టు అభివృద్ధి చెందిన దేశాలు తమ ఆర్థిక సామ్రాజ్యాలను నిర్మించుకున్నాయి.
భారతదేశానికి ఎంతటి చరిత్ర ఉన్నా, మేధావులున్నా భారత దేశంలో సరైన గుర్తింపు లభించడం లేదనే సాకుతో ప్రతిభా వంతులంతా విదేశాలకు వలస వెళ్లిపోవడం వలన భారతదేశం అనేక రంగాల్లో చాలాకాలం అభివృద్ధికి నోచుకోలేదు. స్వదేశీ పరిజ్ఞానం విదేశీయుల స్వప్నసౌధాలకు ఆలంబనగా మారింది. రానురాను భారత దేశంలోని మేధావుల దృక్పథంలో గణనీయమైన మార్పువచ్చింది. ‘‘ఏ దేశమేగినా, ఎందుకాలిడినా…’’ అన్నట్టుగా దేశీయ మూలాలను మరవరాదన్న సత్యం మన మేధావులకు, యువతకు తెలిసి వచ్చింది. అందువలనే వారంతా ఎక్కడ ఉన్నప్పటికీ భారతదేశం అన్ని రంగాల్లో బలపడడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. విదేశాల కంటే స్వదేశమే మిన్న అన్న భావన భారతీయ యువతలో కలిగింది. సాంకేతిక రంగంలో భారతదేశం కొత్తపుంతలు తొక్కింది. ఉపగ్రహాల ప్రయోగాల నుండి చంద్రయాన్‌ పయనం వరకు, వైద్య శాస్త్ర పరిశోధనల నుండి అణ్వస్త్ర ప్రయోగాల వరకు భారతదేశం స్వయం స్వావలంబన దిశగా పయనిస్తున్నది. పెరిగిన జనాభాకు సరిపడా మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టసాధ్యంగా మారిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం మరింతగా పాటు బడాలి. ప్రభుత్వ పథకాల మీద ప్రజలు ఆధారపడే రోజులు పోవాలి. ప్రజలం దరికీ బతుకు దెరువుకు మార్గం చూపాలి. చుక్కల నంటిన ధరలు ప్రజలకు నిత్య నరకాన్ని చూపిస్తున్నాయి. ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి. ధరలు పెరగడం వలన కల్తీ కూడా పెరుగుతున్నది. కల్తీ వలన ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రుల పాలవడం, వైద్య ఖర్చులను భరించలేక ఉన్నదంతా అమ్ముకోవడమో, అదీ సాధ్యం కాకపోతే ఆత్మహత్యలకు పాల్పడడమో జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితులు పోవాలి. అట్టడుగు స్థాయి నుంచి అవినీతిని అరికట్టాలి. అవినీతి అంతమైతే ప్రజా జీవనం మెరుగు పడుతుంది.

సుంకవల్లి సత్తిరాజు.
9704903463.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img