Friday, February 3, 2023
Friday, February 3, 2023

ఆహారంపై శాస్త్రీయ రచనలు : డా. జానకి

డా. జానకి

మనిషి జీవితం అనేక యాదృచ్ఛికతలతో నిండిపోయి ఉంటుంది. అలాంటి ఒక యాదృచ్ఛికతే నేను న్యూట్రిషనిస్ట్‌ కావడం. ఊహించని విధంగా ఎమ్మెస్సీలో న్యూట్రిషన్‌కోర్సులో సీటువచ్చింది. అలా…మన శారీరక, మానసిక ఆరోగ్యానికి, వికాసానికి అత్యంత అవసరమైన పోషకాహార ప్రపంచంలోకి నా ప్రయాణం 1992లో ప్రారంభమైంది. అనేకమలుపులు తిరుగుతూ, ఈ అద్భుత ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పోషకాహార శాస్త్ర రచయితగానూ నా ఆరంభం ఒక యాధృచ్ఛికతే. 1993లో నా ఎమ్మెస్సీ కోర్సులో భాగంగా నేను ఉస్మానియా ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి వచ్చింది. రోగులలో మధుమేహ వ్యాధిపై అవగాహన పెంపొందించే కార్యక్రమంలో మొదటిసారిగా రోగులను కలిసి మాట్లాడాను. వారు ఎటువంటి ఆహారాన్నితీసుకోవాలి? ఏ విధంగా తీసు కోవాలి? అనే అంశం మీద మాట్లాడేదాన్ని. వారిలో సరిjైున అవగాహన పెంచేందుకు ఈ అంశంపై తెలుగులో ఒక బుక్‌లెట్‌ తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. ‘మధుమేహంపై విజయం’ పేరుతో చిన్న పుస్తకం రాయగా, ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దానిని ప్రచురించింది. తెలుగులో నేను రాసిన మొదటిరచన అది. చిన్నప్పటి నుండి నేను ఇంగ్లీషు మీడియంలోనే చదివాను. అయితే తెలుగు ప్రథమ భాషగా ఉండేది. ద్వితీయ భాష సంస్కృతం. అంతేగాకుండా, మా తాత గెడ్డం మహాలక్ష్మి కమ్యూనిస్ట్‌ ఉద్యమ నేపథ్యం నుండి రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్‌.ఎల్‌.ఎ.గా ఎన్నికయ్యారు. అందువల్ల మా ఇంట్లో పుస్తకాల ప్రపంచం ఉండేది. దాంతో నాక్కూడా చిన్నతనంలోనే తెలుగు సాహిత్యంతో మంచి పరిచయం ఏర్పడిరది. ఆ నేపథ్యం తెలుగులో రచనలు చేయడానికి నాకు చాలా ఉపయోగపడిరది. రోగులతో నిత్యం సంబంధా లుండటం వల్ల నా రచన వాడుక భాషలో సరళంగా ఉండాలని గ్రహించాను. తెలుగులో అప్పటికి పోషకాహార సంబంధమైన అంశాల గురించిన రచనలు దాదాపుగా లేవు. అనేక ఇంగ్లీషు పదాలకి సమానమైన తెలుగు పదాలు నాకు తెలిసేవి కావు. అందువల్ల ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు సహాయం తీసు కున్నాను. అలా నా మొదటి తెలుగు రచన పుస్తక రూపంలో వెలుగు చూసింది. ఈ పుస్తకంతోపాటుగా మధుమేహంపై రోగులకు మరింత అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక ఆహార పదార్థాల ప్రదర్శనలను నిర్వహించాను. ఇందులో భాగంగా ప్రదర్శనకు తెలుగులో పోస్టరును కూడా తయారు చేశాను. సరిjైున ఆహారం తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చునని రోగులకు అర్ధంఅయ్యేట్టు చేయడమే ఈ కార్యక్రమాల ఉద్దేశం. ఈ అనుభవంతో రచనల అవసరం తెలిసింది నాకు. ఆహారానికి సంబంధించి శాస్త్రీయ పద్ధతిలో రచనలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాను. తర్వాత, 1994లో నా పిహెచ్‌డి మొదలైంది. ‘‘గర్భిణుల పోషకాహారం, పుట్టబోయే బిడ్డపై దాని ప్రభావం’’ ఇది నా పరిశోధనా అంశం. ఈ పరిశోధన కోసం అనేకమంది కాబోయే తల్లుల్ని కలిశాను. మనిషి పుట్టుకతో ఆహార ప్రభావం ఎంత ఉందో తెలిసొచ్చింది. ఉత్తమ మానవ జాతి పుట్టుకకు ప్రధాన పాత్ర పోషకాహారమే. ఇక అప్పటి నుండి నా వృత్తి, ప్రవృత్తి నా యావత్తు జీవితమూ పోషకాహార రంగమే.
1999లో నా మిత్రులతో కలిసి ‘‘డైట్‌ క్లినిక్‌’’ని స్వంతంగా ప్రారంభించాను. మొదట్లో ఒడిదొడుకులు ఎదురైనా, ధైర్యంగా పనిచేసుకుంటూ పోయాం. ఫలితంగా దృఢంగా నిలదొక్కుకోగలిగాం. మెల్లగా విస్తృతమవుతూ వచ్చాం. ఈ క్రమంలో నా గురించి తెలుసుకొన్న ‘ది హిందూ’ పత్రిక వారు ‘ఫిట్నెస్‌ ఫుడ్‌’ శీర్షికన కాలం రాయమని కోరారు. అలా నేను మొదటిసారిగా ‘‘ఆహార రచయిత’’గా అవతారం ఎత్తాను. నా శీర్షికకు పాఠకుల నుండి మంచి స్పందన వచ్చింది. 2004లో ‘ఈనాడు’ పత్రికలో శీర్షిక ద్వారా మొదటి సారిగా తెలుగు పత్రికల్లో రాయడం మొదలైంది. తర్వాత ‘నవ్య వీక్లీ’, ‘ఆంధ్రజ్యోతి’, ‘సాక్షి’ మొదలైన పత్రికల్లో వివిధ శీర్షికలతో రాశాను. రాస్తున్నాను. అదే సమయంలో డెక్కన్‌ క్రానికల్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, రైస్‌ విజన్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, హాన్స్‌ ఇండియా, ఇత్తేమాద్‌ మొదలైన పత్రికల్లో ఇంగ్లీషులో కూడా నిరాటంకంగా రచనలు చేస్తున్నాను.
నేను తెలుగులో రాయడం మొదలు పెట్టేసరికి పోషకాహారం మీద చాలా అరుదుగా మాత్రమే రచనలు వచ్చేవి. ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ వంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ‘సమతుల్య ఆహారం’ వంటి కొన్ని రకాల అంశాల గురించి ఎవరో ఒకరు రాసేవారు. వాటిల్లో దైనందిన జీవితానికి అన్వయింపు ఉండేది కాదు. భాష కూడా పాఠ్య పుస్తక భాష, కఠినమైన శాస్త్ర పరిభాషతో నిండిపోయేవి ఆ రచనలు. అటువంటి వాతావరణంలో నేను రచనలు ప్రారంభించాను. నాకు క్లినిక్‌ ఉండడం వల్ల, నిరంతరం పేషంట్లతో మాట్లాడుతుండటం వల్ల ఆహారానికి సంబంధించి వాళ్ళ సందేహాలు, భయాలు, ఆందోళనలు, అపోహలు, ప్రశ్నలు, అవగాహనా రాహిత్యం ఇవన్నీ నాకు తెలుస్తుండేవి. అందువల్ల ఎలాంటి అంశాల మీద వ్యాసాలు రాయాలి, వాటిని ఎలా విస్తరించాలి, వాటిలో వివిధ భావనల్ని ఎలా అర్థం చేయించాలి, భాష ఎలా ఉండాలి? – మొదలైన అంశాల మీద నాకు స్పష్టత పెరుగుతూ వచ్చింది. నా పేషంట్లు, పాఠకులే పరోక్షంగా నేను రాయాల్సిన అంశాన్ని నిర్ణయించేవారు. ఉదా : కొందరు పేషంట్లు ఆకు కూరల్లో ప్రొటీన్లు ఉంటాయని వాటిని విరివిగా తింటున్నామని చెప్పేవారు. నిజానికి ఆకు కూరల్లో ప్రొటీన్లు ఉండవు. వాటిలో వేరే పోషకాలుంటాయి. ప్రొటీన్లకోసం ఆకుకూరలు తింటే లాభం లేదు. అప్పుడు వాళ్ళకి ప్రొటీన్లు ఏయే ఆహార పదార్థాలలో ఉంటాయో చెప్పేదాన్ని. ఇదే విషయాన్ని ఆ వారం వ్యాసంలో రాసేదాన్ని.
ఇక భాష విషయానికొస్తే, మొదట్లో నేను ఇంగ్లీషు పదాలను తెలుగు లిపిలో రాసేదాన్ని. పేషంట్లు వాటిని తెలుగులో ఏమంటారు అని అడిగేవాళ్లు, ఉదా : ఫాంక్రియాస్‌ని తెలుగులో ఏమంటారు అని అడిగారు. అప్పుడు నేను డిక్షనరీ చూసి క్లోమము అని రాసేదాన్ని. ఐతే అది కూడా వారికి అర్థమయ్యేది కాదు. అప్పుడు నేను దాన్ని వివరించేదాన్ని. కొన్ని సార్లు ఇంగ్లీషుపదాలకు సమానార్థకమైన తెలుగు పదాలను రాస్తే, అవి అపోహలకు దారితీసేవి. ఉదా : ప్రోటీన్‌, దీన్ని తెలుగులో ‘మాంసకృత్తులు’ అని రాస్తే అవి మాంసాహారానికి సంబంధించినవేమో అని కొంతమంది పాఠకులు అనుకునే వారు. కార్బోహైడ్రేట్లకు బదులుగా ‘పిండి పదార్థాలు’ అని రాస్తే, అవి పిండికి సంబంధించినవని అనుకునేవారు. ఫ్యాట్స్‌ని కొవ్వు పదార్థాలు అంటే, పాఠకులు మాంసాహారం లోని కొవ్వు అనుకునేవారు కాని, నూనె కూడా కొవ్వు పదార్ధమే అని గుర్తించేవారు కాదు. ఇలాంటివెన్నో ఉన్నాయి. అప్పుడు నేను కేవలం అను వదించి ఊరుకోకుండా, అవి ఎందులోఉంటాయో వివరించేదాన్ని. మాంసకృత్తులు మాంసాహారంతో పాటు ఏయే శాకాహార పదార్థాలలో లభిస్తాయో చెప్పేదాన్ని. అంటే మాంసకృత్తులున్న ఆహారాన్ని తీసుకోండి అంటే సరిపోదు. అవి ఏయే ఆహార పదార్థాలలో లభిస్తాయో కూడా చెప్పాలి. ఇటీవలి కాలంలో గ్లోబలైజేషన్‌ ప్రభావం వల్ల ఆహారం, ఆరోగ్యం, ఫిట్నెస్‌ వంటి అంశాలకు సంబంధించి సమాచారం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. పత్రికల్లో రెగ్యులర్‌గా వీటిమీద పేజీల కొద్దీ రాస్తున్నారు. వీటితో పాటు టీవి, ఛానళ్ళలో, ఇంటర్నెట్‌లో గుట్టల కొద్దీ సమాచారం లభిస్తోంది.
గతంతో పోలిస్తే ఇలా సమాచారం అందుబాటులోకి రావడం మంచి విషయం. ఐతే సమాచారమంతా దానికదే శాస్త్రీయమైంది కాదు. రాస్తున్న వారందరూ నిపుణులని చెప్పలేం. ఒక విషయమై లోతైన అవగాహన లేకుండా ఇంటర్‌నెట్‌లోనో, మరొక చోటో చూసి తెలుగు పత్రికల్లో రాసేస్తున్నారు. దీనివల్ల విషయం మీద అవగాహన రావడానికి బదులు మరింత గందరగోళం జరిగిపోతోంది. పోషకాహారానికి సంబంధించి కూడా పేషంట్లలో, పాఠకులలో యిలానే గందరగోళం పెరిగిపోవడం నేను చూస్తున్నాను. అందువల్ల నా రచనల్లో కూడా మార్పువచ్చింది. వివిధ రకాల అపోహలు తప్పుడు అవగాహన, గందరగోళం, మార్మికత – ఇటువంటి వాటిని తొలగించి నిర్దిష్టమైన శాస్త్రీయ అవగాహనను పెంచే విధంగా నా ఇటీవలి రచనలు ఉంటున్నాయి. ‘మేము ఎక్కడో చదివామండి. వారు చెప్పినట్టు చేసామండి. కాని ఫలితం లేదు మేడం’. ఇది నాకు నా పేషంట్లనుండి తరచుగా వినిపించేమాట. తప్పుడు సమాచారంతో నిండిపోయిన బుర్రలోకి సరైన సమాచారం ఎక్కదు. రాస్తున్న వాళ్ళల్లో ఎవరు నిపుణులో ఎవరు కాదో తెలుసుకోవడం సామాన్య పాఠకులకు అంత సులభంగా సాధ్యం కాని పరిస్థితి. ఇటువంటి వాతావరణంలో నాకు ఒక న్యూట్రిషనిస్ట్‌గా, ఒక ఆహార రచయితగా కొత్త సవాళ్ళు ఎదురౌతున్నాయి. ఈ సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకెళుతున్నాను. దీనికి తోడు ప్రపంచమార్కెట్లు బార్లా తెరుచు కోవడంతో విదేశీ ఆహార పదార్థాలు, పళ్ళు, ఇతర ఆహార దినుసులు మనమార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వీటిని అమ్ముకోవడంలో భాగంగా ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల గురించి లేని గుణాలు ఉన్నట్టుగా, ఉన్నవాటిని పెద్ద యెత్తున ప్రచారం చేస్తున్నాయి. దీనివల్ల విదేశీ ఆహార దినుసులపై మన ప్రజల్లో విపరీతంగా మోజు పెరిగిపోతోంది. నేను నా రచన ద్వారా, వివిధ టీవీ చానళ్ళలో కార్యక్రమాల ద్వారా, వివిధ సంస్థలలో ఉపన్యాసాల ద్వారా, ఇతర పద్ధతులద్వారా ప్రజలలో ఆహారానికి సంబంధించి తప్పుడుజ్ఞానాన్ని తొలగించి శాస్త్రీయమైన, సరిjైున అవగాహన అందించడానికి కృషి చేస్తున్నాను. విదేశీ ఆహార పదార్థాలలో ఏయే దినుసులుఉన్నాయి, ఏయేగుణాలుఉన్నాయి. అవి ఎంతవరకు మనకు ఉపయోగ పడతాయి మొదలైన అంశాలమీద అవగాహన కల్పిస్తున్నాను. అదే సమయంలో స్థానికంగా లభించేవాటిలోఉన్న గుణాలగురించి కూడా అవగాహన కలిగి స్తున్నాను. ఐతే ఇది అంత సులభమైనది కాదు. చాలాసార్లు వాదవివాదా ల్లోకి తలదూర్చాల్సి వస్తుంది. వాతావరణం వేడెక్కే పరిస్థితి ఎక్కువ. ఐతే, సవాళ్ళు ఎదురైతేనే కదా శక్తి సామర్థ్యాలు పదునెక్కేది.
నాణానికి మరోవైపున్న ఆశా వహమైన అంశం ఏమిటంటే పాఠకుల్లో, పేషంట్లలో చదువుకొన్న వాళ్ళ శాతం పెరిగింది. ఆహారానికి సంబంధించిన అవగాహన పెరిగింది. అందువల్ల విభిన్న అంశాలమీద రాయగలుగుతున్నాను. మాట్లాడగలుగుతున్నాను. కేవలం ఆహార సంబంధవ్యాసాలు రాయడమే కాకుండా వివిధ పోషకపదార్థాలతో రెసిపీలు ఎలా తయారు చేయవచ్చో చెబు తున్నాను. టీవి చానళ్ళలో చేసి చూపిస్తున్నాను. దీనివల్ల మెరుగైనఫలితం వస్తుంది. నేను యూనివర్సిటీలో, పుస్తకాల్లో చదువుకున్న జ్ఞానాన్ని ఆచరణలోపెట్టాను. నిరంతరం జ్ఞానాన్ని అన్వయంచు కొంటూ రావడం ఒక దైనందిన కార్యకలాపం నాకు. అన్వయింపులేని జ్ఞానం వృథాకదా! సిద్ధాంతం-ఆచరణ-సిద్ధాంతం-ఈ ప్రక్రియ అప్రతిహతంగా కొనసాగుతుంటుంది నా రచనల్లో, జీవితాచరణలో.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img