దేశవ్యాప్తంగా ఆహార పదార్ధాల ధరలు వేగంగా పెరుగుతూ సామాన్యులకు భారమౌతున్నాయి. గత నెలలో టమాటా ధరకన్నా ఈ నెల ధర రెండిరతలై 100 రూపాయలైంది.(ఇదే టమోటా మార్కెట్‌లో ధర రూపాయి కూడా పలకనందుకు రెండునెలల క్రితం రైతులు పొలా ల్లోనే వదిలెయ్యడం ఒక బాధాకర దృశ్యం) పప్పులు, పాలు, కూర గాయలు ఇతర నిత్యావసర ధరలన్నీ పైపైకే చూస్తున్నాయి. వాతావరణ మార్పుల్ని, ముఖ్యంగా తగ్గిన వర్షాల్ని చూస్తే రానున్న ఖరీఫ్ కాలంలో కూడా దిగుబడి తగ్గనుంది. ఉన్నంతలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే సామాన్యులపై తిండి ధరల భారం తగ్గుతుంది. లేదంటే సరైన తిండికి, పోషకాహారానికి ఎక్కువ మంది ప్రజలు దూర మౌతారు. గతంతో పోల్చి నపుడు ప్రజల్లో వ్యక్తిగతంగా చేసే ఆహార వ్యయం తగ్గినట్టు గణాంకాలు చెప్తున్నాయి. అంటే దానర్ధం తక్కువ ఖర్చుతో తిండి గడుస్తున్నట్లు కాదు. తిండి తగ్గించడం ద్వారా ఆహారంకోసం తక్కువ ఖర్చు చేస్తున్నట్టు. స్థూల జాతీయోత్పత్తితో పోల్చిచూసినప్పుడు ఈ విభాగంలో ఖర్చు తగ్గడం ఆర్ధికానికి శుభమూ కాదు. ఆరోగ్యకరమూ కాదు. ప్రభుత్వం వెంటనే ధరల నుండి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లో సబ్సిడీతో టమాటాలందించే చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఇలాంటి తక్షణ ఉపశమన చర్యలతో బాటు సమగ్ర ప్రణాళికలు దీర్ఘకాలికంగా దేశవ్యాప్తంగా అవసరం. ఉదాహరణకు శీతల గిడ్డంగులు సరిపడా నిర్మిస్తే అధిక పంటలు వచ్చినపుడు రైతులు ధరలేక దినుసుల్ని రోడ్డుపై పారబోసే దుస్థితి తప్పుతుంది. మార్కెట్ నిర్వహణద్వారా సరఫరాలో ఒడిదుడుకులుతగ్గి ధరలు స్థిరంగా ఉంటాయి. రైతులు కూడా పంట వెయ్యడానికి ఉత్సాహం చూపుతారు. మార్కెట్‌లో ఫ్యూచర్ ట్రేడిరగ్ లాంటివి అరికట్టాలి. బలమైన మానవ వనరులుంటేనే బలమైన ఆర్ధికశక్తిగా భారత్ రూపు దిద్దుకుంటుంది. ఆర్ధిక నిర్వహణలోనూ మానవ వనరుల కోణం విస్మరించరానిది.
- డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ, సెల్: 94408 36931