Friday, March 24, 2023
Friday, March 24, 2023

ఆ రెండు దీవులు మరో జోషిమఠ్‌ కానున్నాయా!

ఈ ధరిత్రి, మానవాళి మనుగడకే పెనుముప్పు ఏర్పడిరదని ప్రపంచం ఆందోళన చెందుతోంది. పర్యావరణ కాలుష్యం, పెరుగుతున్న భూతాపం ఈ ప్రమాదానికి కారణం. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రపంచ దేశాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయి. అభివృద్ధి అంటే సంపద పెంచడం మాత్రమేనన్న అభిప్రాయం పాలకులకు, ప్రజలకు ఉంది. అభివృద్ధిపేరుతో పర్యావరణ విధ్వంసం యధేచ్ఛగా సాగుతోంది. అండమాన్‌, నికోబర్‌ దీవులు మరో జోషిమఠ్‌ కానున్నాయని ప్రభుత్వ నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని అన్ని సహజవనరులను అభివృద్ధిపేరుతో ధ్వంసంచేసి సంపన్నులను మరింత సంపన్నులను చేస్తున్న ప్రభుత్వాలు అడవులను, దీవులనూ వదలడం లేదు. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఆదివాసీలకు, గిరిజనుల జీవనానికి ఎంతగానో సహాయపడుతున్న అటవీహక్కుల చట్టాన్ని సవరించిన చట్టాన్ని అమలు చేసేందుకు పూనుకున్నది. అభివృద్ధిపేరుతో అండమాన్‌ నికోబరు దీవులను నాశనం చేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకున్నది. ఫలితంగా ఈ దీవులు సమూహాలలో సహజసిద్ధమైన వాతావరణం హరించుకుపోనున్నది. వందలు, వేల సంవత్సరాలుగా ఇక్కడే జీవిస్తున్న అతి ప్రాచీన ఆదివాసీలు తమ ఆవాసాలను, జీవనోపాధిని కోల్పోనున్నారు. దాదాపు 8లక్షలకుపైగా పురాతన చెట్లను నరికివేయడంతో ప్రకృతి ధ్వంసమై కాలుష్యం పెరుగుతుంది. తద్వారా భూతాపం మరింత పెరగడానికి దారితీస్తుంది. లక్షలాది పక్షులు, వివిధరకాలు జంతువులు, ఇతర జీవరాశులు నాశనమైపోతాయి. వేటాడి, సముద్రజలాల్లో చేపలుపట్టి అమ్ముకుని జీవించి అరుదైపోతున్న మంగోలియా జాతి గిరిజనులు షోంపియన్‌లు, నికోబర్‌ గిరిజనులు అంతరించిపోయే ప్రమాదమూ ఉంది. నిర్వాసితులకు ప్రత్యామ్నాయ నివాసాలను ఏర్పాటు చేస్తామని, జీవనోపాధి కల్పిస్తామని పాలకులు వాగ్దానాలు కురిపిస్తారు. దశాబ్దాల క్రితం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి గానీ, నిర్వాసితులకిచ్చిన హామీలను ఏళ్ల్లుపూళ్లు గడిచినా నెరవేర్చరు. ఒకవేళ నెరవేర్చినా అవి అరకొరగానే ఉంటాయి. ఎంతసేపు అంకెల్లో అభివృద్ధిని ప్రకటిస్తూ, పేదరికాన్ని పెంచుతున్న నేటి పాలకులు విధానాలు ఇలాగే కొనసాగిస్తే కొంతకాలానికి ప్రకృతి పూర్తిగా ధ్వంసమై ఈ ధరిత్రి, మానవవాళి మహా ప్రళయాన్ని ఎదుర్కోనున్నదని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఈ దీవుల్లో నరికివేసిన లక్షల చెట్లను మళ్లీ విత్తులువేసి పెంచడం సాధ్యమేనా? దాదాపు ఏడెనిమిది వందల రకాల వృక్షాలు, మూడు నాలుగు వందల రకాల జంతుజాలం హరిస్తే మళ్లీ వీటిని తీసుకురాగలమా? పచ్చని పందిరిలాగా అల్లుకొనిఉండే అటవీ ప్రాంతాలను పునరుద్ధరించడం అలవిమాలిన యత్నమే అవుతుంది.. సునామీలు సైతం ఈ దీవులను ధ్వంసం చేయలేకపోయాయి. మన పాలకులు ఒకవైపు అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలుచేస్తూ మరోవైపు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. ఈ దీవుల్లో అతిపెద్ద చిత్తడి నేలలు, దట్టమైన అరణ్యాలు, దేశంలోఉన్న సీతాకోకచిలుకల రకాల్లో సగానికిపైగా, 40శాతం పక్షులు, 60శాతం పాలిచ్చే జంతువులు ఉన్నాయి. ఇవన్నీ విలక్షణమైనవి. ఇవన్నీ కనుమరుగు కావడంవల్ల జీవవైవిధ్యం నాశనమవుతుంది. దిగ్రేట్‌ నికోబర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టు పేరుతో వివిధ నిర్మాణాలు చేపట్టడానికి నీతి ఆయోగ్‌ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రజలందరికీ ఉపయోగపడే ప్రణాళిక ఇప్పటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసిందని చెప్పలేని పరిస్థితి. రహదారులు నిర్మించినా, ప్రాజెక్టులు కట్టినా ప్రకృతి ధ్వంసానికి, వేలు, లక్షలాది మంది ప్రజల ఆవాసాలకు, జీవనోపాధికి హాని కలుగుతూనేఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇంటర్నేషనల్‌ కంటైనర్‌ షిప్‌మెంట్‌, టెర్మినల్‌, (ఐసిటిటి) ఒక గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, ఒక భారీ టౌన్‌షిప్‌, 450 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు, రెండు నేషనల్‌ పార్కులు, ఒక బయోస్పియర్‌ రిజర్వ్‌ తదితరాలు నిర్మించనున్నారు. దీంతో ఇక్కడి పచ్చదనం, జీవ వైవిధ్యం మాయమై పోతుంది. హిమాలయ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు, సొరంగాలు నిర్మించడం వల్లనే జోషిమఠ్‌ పట్టణం కుంగిపోతోంది. మన కళ్లముందు ఇంత విపత్తు చోటుచేసుకున్నప్పటికీ పాలకులు కళ్లు తెరవకపోవడం శోచనీయం.
ప్రకృతి అందాలకు, పర్యావరణ పరిరక్షణకు, నిలయమైన ఈ దీవుల్లో ఎలాంటి ‘అభివృద్ధి’ ప్రాజెక్టులు నిర్మించవద్దని దాదాపు వంద మంది పూర్వపు సివిల్‌ సర్వెంట్స్‌ రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు విజ్ఞాపనపత్రం అందచేశారు. ఇలాంటి విజ్ఞాపనలు, నిపుణుల సూచనలు, సిఫారసులు మోదీ ప్రభుత్వం ఖాతరు చేయదనే విషయం విదితమే. 2021 జనవరిలో ఐలాండ్‌ కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ ఆప్‌ గ్రేట్‌ నికొబర్‌ చట్టాన్ని దాదాపు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ ప్రాజెక్టులు చేపడితే అభివృద్ధి జరిగి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం చెప్తోంది. ఇదివాస్తవమేనా? భారీ ప్రాజెక్టులు ఎప్పుడూ స్థానికులకు ఉపయోగపడవు. ఇది ఇప్పటివరకు అనుభవమే. తక్కువ కేడర్‌ ఉద్యోగాలు కొన్ని లభించవచ్చు. కార్పొరేట్లకే ప్రయోజనం కల్పిస్తాయి. ఈ దీవులు మధ్యప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాలకు విస్తరించి ఉంటాయి. ఈ దీవుల్లో నిర్మించే ప్రాజెక్టులు వాతావరణం విధ్వంసానికి దారితీసేవేననేది వాస్తవం.
` టి.వి.సుబ్బయ్య

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img