Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ఇ`రూపి లక్ష్యం నెరవేరేనా?

ఇటీవల ప్రత్యేకించి కరోనా కాలంలో డిజిటల్‌ పేమెంట్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం సరికొత్త డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థ ‘‘ఇరూపి’’ యాప్‌ని తీసుకొచ్చింది. ఇది ఇప్పటివరకూ వచ్చినవాటి మాదిరిగా సాధారణ చెల్లింపుల యాప్‌ కాదని, దీనిద్వారా ఎన్నో రకాల సేవలను పొందవచ్చునని చెబుతోంది. ‘‘ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లొసుగులు, లోపాలను లేకుండా చేసే లక్ష్యంతో ఈ ఏక చెల్లింపుల విధానాన్ని తీసుకొస్తున్నాం. తద్వారా అర్హులైన వారికి లబ్ధిని చేకూర్చనున్నాం’’ అని చెబుతోంది. ఈ ప్రయోజనాలను లబ్ధిదారుల మొబైల్‌ ఫోన్లకు క్యుఆర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ స్ట్రింగ్‌ రూపంలో మొబైల్‌ ఫోన్ల్‌కు పంపిస్తారు. తద్వారా ఈ పథకాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉండదట! వినియోగదారులకు ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందీ లేకుండా ఈ వ్యవస్థను రూపొందించామంటున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం, కార్పొరేట్‌ సామాజిక బాధ్యతా కార్యక్రమాలకూ ఈ కొత్త వ్యవస్థ ప్రైవేటు రంగానికీ ఉపయోగపడుతుందని అంటున్నారు. సంక్షేమ సేవల్లో లోపాలను తొలగించే దిశగా ఇది ఒక విప్లవాత్మక చర్యగా ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. నగదు రహిత, భౌతిక రహితమైన (ముఖాముఖి లేదా నేరుగా కనిపించనవసరం లేని) ఈ డిజిటల్‌ చెల్లింపుల మాధ్యమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఇక ఈ ‘ఇరూపి’ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థద్వారా దేశంలో ఎక్కడ నుంచైనా చెల్లింపులు చేయవచ్చు. ఎస్‌ఎంఎస్‌ స్ట్రింగ్‌ లేదా క్యుఆర్‌ కోడ్‌ రూపంలో మొబైల్‌లోకి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పిసీఐ), ఆర్థిక సేవల విభాగం, ఆరోగ్యంకుటుంబ సంక్షేమమంత్రిత్వశాఖ, జాతీయ ఆరోగ్య యంత్రాంగం లాంటి కొన్ని ప్రభుత్వ సంస్థలు, కొన్ని అత్యున్నత స్థాయి సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించాయి. దేశంలో డిజిటల్‌ చెల్లింపులను మరింతగా ప్రోత్సహించే ప్రధాన లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ యాప్‌ వల్ల వినియోగదారులకూ మంచి ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ యాప్‌ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు తమ సొమ్మును ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు నిర్భయంగా బదిలీ చేయవచ్చు. దీనిని ఉపయోగించేందుకు డెబిట్‌ కార్డు లేదా క్రెడిట్‌ కార్డు, డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ఏమీ అవసరం లేదు. ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ ఓచర్‌ యాప్‌గా వాడుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక వస్తువుని కొనుగోలు చేసినప్పుడు మీకు ఒక ఓచర్‌ ఇస్తారు. అదే ‘ఇరూపి’ విధానంలో అయితే భౌతిక రూపంలో మీ వద్ద ఎలాంటి ఓచర్‌ ఉండనవసరం లేదు. ఈ ఓచర్‌ను క్యుఆర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ రూపంలో మీ మొబైల్‌ ఫోన్‌కు దీనిని పంపిస్తారు. మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండా సకాలంలో సర్వీస్‌ ప్రొవైడర్‌కు చెల్లింపులు జరుగుతాయి. డిజిటల్‌ చెల్లింపులే సురక్షితమనే భావనను ఇది కలగజేస్తుంది.
దేశంలోని ప్రతి మొబైల్‌కు ఈ యాప్‌ను పంపించేందుకూ ‘ఇరూపి’ సేవలను అందించేవారు ఎవరితోనూ ముఖాముఖి కలవాల్సిన అవసరం లేదు. ఇటు లబ్ధిదారులను (వినియోగదారులను) అటు సర్వీసు ప్రొవైడర్లను (సేవలు అందించేవారు) ఈ ‘ఇరూపి’ ద్వారా అనుసంధానం చేస్తారు.
‘ఇరూపి’ వ్యవస్థ ద్వారా మాతాశిశు సంక్షేమ పథకాలు, టీబీ నిర్మూలనా కార్యక్రమాల కింద మెడిసిన్స్‌, పోషకాహర సహాయాన్ని నేరుగా లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులను అతని మొబైల్‌ నంబర్‌ ద్వారా గుర్తిస్తారు. కేవలం ఆ వ్యక్తి మాత్రమే ఉపయోగించుకునేలా ‘ఇరూపి’ ఎలక్ట్రానిక్‌ ఓచర్లను జారీ చేస్తారు. అంటే ‘ఇరూపి’ ఓచర్లను అతనికి మాత్రమే కేటాయిస్తారు. అర్హులకు లబ్ధిని ఓచర్‌ రూపంలో బదిలీ చేయడం వల్ల ఉద్దేశిత ప్రయోజనానికి దానిని ఉపయోగించు కునే వీలు చిక్కుతుంది. ప్రభుత్వం ఈ విధానాన్ని ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ఎరువుల సబ్సిడీలు తదితరాలకు కూడా ఉపయోగించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. ‘ఇరూపి’ ద్వారా ఎన్నో రకాల సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంక్షేమ పథకాలు, సేవల్లో ఎలాంటి లోపాలు, లొసుగులు లేకుండా చేసేందుకు దీనిని ఉపయోగించనున్నట్లు ప్రకటించింది. ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల సంక్షేమానికీ ఈ డిజిటల్‌ ఓచర్‌ ప్రయోజనాలను అందిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
ఓచర్‌ ఆధారితమైన ఈరూపి డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా, ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. దీని ద్వారా నగదు చెల్లింపులకు పూర్తిభద్రత ఉంటుందనేభావన వెల్లడవుతోంది. సంక్షేమ పథకాల్లో లోపాల తొలగింపునకు ‘ఇరూపి’ బాగా ఉపయోగపడుతుందని, దీనిని తీసుకురావడం వెనక ప్రధాన లక్ష్యం కూడా ఇదేనని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం పైకి చెబుతున్న ఉద్దేశం బాగానే ఉంది కానీ, విషయం ఏదైనా మాటల కోటలు దాటించే మోదీ, ఆయన అనుంగు సర్కార్‌ తీరా ఆచరణకొచ్చేసరికి చతికిలపడుతుంది లేదా చెప్పినదానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది. మరి ఈ ‘ఇరూపి’ కూడా మోదీ సర్కార్‌ మాటల గారడీగానే మిగులు తుందా? లేక నిజంగానే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అసలైన లబ్ధిదారులకు అందిస్తుందా? వేచి చూడాలి! ఎడిట్‌ పేజి డెస్క్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img