Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఇలా మిగిలాం…

అయిపోయింది. మళ్లీ ఏడాది వరకూ అటు వైపే చూడాల్సిన అవసరం లేదు. మహిళలను కీర్తిస్తూ… కొలుస్తూ… వారి గొప్పతనాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ… సభలు, సమావేశాలు, ట్విట్టర్‌, వాట్సాప్‌, ఇన్‌ స్టా, ఫేస్‌ బుక్‌, టెలీగ్రాం…ఇలా ఎందులో వీలైతే అందులో మహిళలకు వందనాలు చెప్పేశాం. అమ్మగా కన్నందుకు, చనుబాలతో పెంచి నందుకు, బాగోగులు చూస్తున్నందుకు, భార్య అయినందుకు, ప్రియురాలుగా ప్రేమించినందుకు, అక్కగా అక్కున చేర్చుకున్నందుకు, చెల్లెలుగా భయమేసినప్పుడు మన చేయి పట్టుకున్నందుకు సకల విధాల, సమస్త రూపాల కృతజ్ఞతలు చెప్పేశాం. మళ్లీ వచ్చే ఏడాది మార్చి 8 వ తేది వరకూ ఏం చేయకపోయినా, చేతులు ముడుచుకుని కూర్చున్నా, మన పనుల్లో మనం మునిగిపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు. పితృదేవతలకు నిర్వహించే ఓ క్రతువుకు పెట్టుకునే సెలవు కూడా అవసరం లేదు. మార్చి 8 వ తేది అంటే ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సెలవు కదా. సోఫాలో కూర్చుని టీవీల్లో వచ్చే హీరోయిన్‌ ఓరియంటెండ్‌ సినిమాని సతీమణి చేసిన పకోడీలో, జంతికలో, చికెన్‌ లాలీపాప్‌లో తింటూ చూసేయచ్చు. మళ్లీ ఏడాది వరకూ మహిళలకు సంబంధించి ఇక ఎలాంటి కార్యక్రమాలు చేయనవసరం లేదు.
ఓ సీనియర్‌ దాష్టీకానికి నెల రోజుల క్రితం వేయి స్థంబాల గుడి సాక్షిగా మెడికో ప్రీతి కన్నుమూస్తే అంతర్జాతీయ మహిళాదినోత్సవం నాడు నివాళులర్పించేశాం. ఇది చాలు ఆ చిట్టి తల్లికి. ఆ దుర్మార్గుడు పైకి కనిపించాడు. వాడికి ఏదో ఒక శిక్ష పడుతుంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో అది కూడా పడకుండా ఆ దుర్మార్గుడు తప్పించుకున్నా ఆశ్చర్యంపడాల్సింది ఏమీ లేదు. నిజానికి ఇలా జరిగే సమయానికి మన బుర్రలోంచి వాడుచెరిగిపోతాడు. వాడిస్ధానంలో మరొకడు రావచ్చు. ఈ వ్యవస్ధలో దుర్మార్గుల పేర్లు మారుతున్నాయే తప్ప ఆకృత్యాలకు, పైశాచికత్వానికి అంతు మాత్రం దొరకడం లేదు. దొరకనివ్వడం లేదు. మెడికో ప్రీతి తన ఆత్మహత్యతో వాడి గురించి చెప్పింది కనుక మనకి తెలిసింది కాని… అలా చెప్పలేని,చెప్పుకోలేని మహిళలెంత మంది ఉన్నారో లెక్కించగలమా. పోనీ ఊహించగలమా.
రాయలసీమలోని బోగసముద్రం ఊరు పేరు విన్నారా. మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు ఆ ఊరు తెలుగు వారందరికీ తెలిసింది. మరో కన్నతల్లి మహేశ్వరి తన 14 నెలల కుమారుడు దేవాన్షును చున్నీతో కడుపుకు కట్టుకుని చెరువులో దూకేసింది. భర్త నాగేంద్ర గౌడ్‌కు వరకట్న దాహం ఎక్కువైపోతే ఆ దాహం తీర్చడానికి చెరువులో దూకేసింది ఈ చిట్టితల్లి. ఈ మహేశ్వరి మూడు నెలల గర్భిణి కూడా. ఈ దాహం తీరనిది …. మగవారి పాషాణ హృదయం కరగనిది….వీడు కూడా బెయిలో, మరో మధ్యవర్తిత్వంతోనూ బయటకు వచ్చేస్తాడు. తన దాహం తీర్చని మహేశ్వరి స్థానంలో మరొకరిని వివాహం చేసుకుంటాడు. ఈ కేసు కూడా పాత వరకట్నకేసుల్లాగే మసి పూసి మహేశ్వరిగా మారిపోతుంది. మహిళా దినోత్సవం రోజే దేశ రాజధాని దిల్లీలో పవన్‌సింగ్‌ అనే నీచుడు భార్యను ఆరు ముక్కలుగా కోసి నీళ్లులేని వాటర్‌ ట్యాంక్‌లో పడేశాడు. ఇంతకీ ఆ ఇల్లాలు చేసిన పాపం మంచిగా బతకమని, దొంగనోట్లు ముద్రించవద్దని. ఇలాంటి వారిని పట్టుకుని ఆరు కాదు… అరవై ముక్కలు చేయాలనిపిస్తుంది కదా. చేయలేం. ప్రజాస్వామ్యం చేయనివ్వదు. వీడు బయటకు వచ్చేస్తాడు. ఇలా ఎంతమంది రాలేదు కనుక వీడు రాకపోవడానికి.
తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఓ వెలుగు వెలిగిన నటి చేసిన ప్రకటన ఈ దేశంలో ఏ స్త్రీ ఈ దారుణాలకు మినహాయింపు కాదని లోకానికి మరోసారి తెలిసింది. తన ఎనిమిదో ఏటే తండ్రి నుంచి లైంగిన వేధింపులు ఎదుర్కొంది ఆ నటి. యాదృచ్ఛికమే అయినా ఆమె కూడా మహిళాదినోత్సవానికి ముందు రోజే ప్రకటించింది తనపై తన తండ్రి చేసిన ఆకృత్యాలను. ఇలాంటి దేశంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాలను జరుపుకోవాల్సిందే. వచ్చే ఏడాదే కాదు… ఆ తర్వాత… ఆ తర్వాత… ఆ తర్వాత కూడా జరుపుకోవాల్సిందే. మనుషుల్లా బతకడం ఎలాగో మరచిపోయిన మన గురించే మహాకవి శ్రీశ్రీ ఇలా అన్నాడు….
‘‘మనదీ ఒక బతుకేనా… కుక్కల వలె, నక్కల వలె, సందుల్లో పందుల వలె..’’ అన్నట్లు దీనికి నేనూ మినహాయింపు కాదు. మీరు కూడా కాదు.

సీనియర్‌ జర్నలిస్టు, 9912019929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img