వి. శంకరయ్య
ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టులఅంశం చర్చకువస్తే మెట్ట ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు గుర్తు కొస్తాయి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత మెట్టప్రాంతాల్లోని సాగునీటిరంగం పూర్తిగా పడకేసింది. ఏటా ఘనంగా కేటాయింపులు చేస్తున్నా ఆచరణలో నిధులు విడుదల చేయడంలేదు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి పాలనలో అనుమతులు ఇచ్చి పునాది రాళ్లు వేసిన ప్రాజెక్టులు రాయలసీమలో అడుగు ముందుకు కూడా కదలలేదు. బడ్జెట్‌లో ఏటా పదివేల కోట్లరూపాయలకు మించి కేటాయింపులుంటాయి. నిధులు విడుదల వుండదు. 2023-24 బడ్జెట్‌లో 11,908 కోట్లు కేటాయించారు. తమాషా ఏమంటే ఇందులో 5,042 కోట్లు పోలవరం పద్దు కింద చూపించారు. వాస్తవంలో కేంద్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు తన పూర్తి నిధులతో నిర్మించాలి. గణాంకాల్లో మాత్రం భారీ మధ్యతరహా ప్రాజెక్టుల పద్దుకింద 9,176 కోట్లు చూపించారు.
విశాఖ రాజధానిని చేసి ఉత్తరాంధ్రను ఉద్దరిస్తామనిచెప్పే ఈ ప్రభుత్వం ఆ ప్రాంతానికి జీవనాడి అయిన ఉత్తరాంధ్ర సుజలస్రవంతి పథకానికి ఈ బడ్జెట్‌లో 141.79 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదించి నపుడు అంచనా వ్యయం 7 వేల కోట్లు కాగా ప్రస్తుతం 17 వేల కోట్లకు చేరిందని చెబుతున్నారు. వైసిపి అధికారంలోనికి వచ్చిన తర్వాత మహేంద్ర తనయ అఫ్‌షోర్ జలాశయం వరద కాలువ నిర్మాణానికి రూ.852.43 కోట్లుగా సవరించిన అంచనాలకు పరిపాలనా అనుమతి ఇచ్చారు. కాని ఈ బడ్జెట్‌లో మాత్రం కేవలం 60.12 కోట్లు కేటాయించారు. మరి ఎన్నాళ్ళకు ఈ పథకాలు పూర్తికావాలి. వచ్చే ఏడాది పెరిగే షెడ్యూల్‌రేట్ల అంచనాలకు ఈ నిధులు సరిపోవు. నిత్యం క్షామపీడిత ప్రాంతమైన రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి మరీ దారుణంగా వుంది. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు ప్రస్తావనలేదు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో వున్న కేసుతోపాటు కేంద్ర జలసంఘం వద్ద డిపిఆర్ ఆమోదం మరచి పోయారు. అదే సమయంలో గ్రీన్‌ట్రిబ్యునల్‌లో కేసువున్నా కేంద్ర జలసంఘం అనుమతి లేకున్నా తెలంగాణ పాలమూరు రంగారెడ్డి పథకం పనులు సాగిస్తున్నారు. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన తర్వాత కాస్త కదలిక కలిగిన వెలుగొండ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో 101.47 కోట్లు కేటాయించి తోకకోశారు. వాస్తవంలో ఈ పథకం పూర్తి కావాలంటే జలవనరుల శాఖ అంచనా మేరకే దాదాపు నాలుగు వేలకోట్ల రూపాయలు అవసరం. హంద్రీనీవా ప్రాజెక్టుకు ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందనాలి. 2021లోనే హంద్రీనీవా విస్తరణలో భాగంగా ఎత్తిపోతల సామర్థ్యం పెంచేందుకు 221 కిలోమీటర్ల ప్రధాన కాలువలో 6,300 క్యూసెక్కుల నీరు ప్రవహించేందుకు వీలుగా విస్తరణకు 6,182 కోట్ల రూపాయల అంచనాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. అయితే ఈ ఏడు బడ్జెట్‌లో 122.69 కోట్లు కేటాయించారు. మరి ఇది ఎన్నాళ్ళకు పూర్తవుతుంది?
గాలేరు నగరి పథకానికి ఈ బడ్జెట్‌లో 855.35 కోట్లు చూపెట్టారు. తొలి పనులు ఇంకా పెండిరగ్‌లో వున్నాయి. తొలి దశ పనుల్లో వామికొండ సర్వారాయసాగర్ జలాశయాలకు కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ పనులు పంట కాలువల నిర్మాణం ముట్టుకోలేదు. కడప జిల్లాలో నిర్మించవలసిన ఉద్దిమడుగు రిజర్వాయర్ కాదు కదా ఇప్పటి వరకు ప్రధాన కాలువ పనులు చేపట్ట లేదు. మరీ అన్యాయమేమంటే గాలేరు నగరి రెండవదశ పథకానికి చెందిన టెండర్లు మొత్తంగా రద్దుచేశారు. రెండేళ్లకు పైబడిన పాత కాంట్రాక్టర్‌ల బిల్లులు చెల్లించలేదు. తిరిగి టెండర్లు పిలిచే జాడలేదు. పైగా కడప జిల్లా నుండి చిత్తూరు జిల్లాకు వచ్చే ప్రధాన కాలువ అలైన్‌మెంట్‌పై తర్జనభర్జనలు సాగుతున్నాయి. నీటిఎద్దడి రోజుల్లో తిరుపతి తిరుమలకు తాగునీటి కోసం ఉద్దేశించి గాలేరు నగరి రెండవ దశలో ప్రతిపాదించిన బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం పునాది దశలోనే వైసిపి ప్రభుత్వం టెండర్ రద్దు చేయడంతో నిర్మాణం ఆగిపోయింది. రాష్ట్ర మంతటా సాంస్కృతి కోత్సవాలల్లో ప్రజలకు వినోదం పంచుతున్న మంత్రి రోజా నియోజకవర్గంలో దాదాపు ఆరు టిఎంసిల సామర్థ్యంతో మూడు రిజర్వాయర్‌ల నిర్మాణం ఎక్కడికక్కడ ఆగిపోయింది. అసలు ప్రధాన కాలువ రూపురేఖలు కన్పించదు. గత అనుభవం దృష్టిలో పెట్టుకొంటే నిధులు ఏమాత్రం విడుదల అవుతాయో చెప్పలేము.
వైసిపి ప్రభుత్వం అధికారంలోనికొచ్చిన తర్వాత ప్రతి ఏటా పదివేలకోట్లకు పైగా బడ్జెట్‌లో కేటాయిస్తున్నారు. కాని నిధుల విడుదల భిన్నంగావుంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తొలి మూడేళ్లలో 15,786 కోట్లు రాష్ట్రం మొత్తం మీద సాగునీటి రంగంలో వ్యయంచేస్తే గత ప్రభుత్వం 29,352 కోట్లు ఖర్చు చేసింది. సాగునీటి ప్రాజెక్టులనగానే ముందుగా మెట్ట ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ జిల్లాల్లో ఎక్కువమంది వ్యవసాయం ఆధారంంగా జీవిస్తుంటారు. వారికి ఏం న్యాయం చేసినట్టు? గత ఏడాది కూడా జనవరి ఆఖరుకు 3.514కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. అయితే బడ్జెట్‌లో 8,795 కోట్లు వ్యయం కానున్నట్టు చూపారు. మిగిలిన రెండు నెలలకాలంలో దాదాపు 5 వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టగలరా?
రాయలసీమ, ఉత్తరాంధ్రజిల్లాల్లో ఎక్కువభాగం వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం సాగుతున్నందున జూదంలాగా మిగిలింది. ఈ ప్రాంతాల నుండే గ్రామీణులు వలసపోతున్నారు. ఒక వేపు కృష్ణ, తుదకు పెన్నా, వంశధార నదుల నుండి వందలాది టియంసిలు నీరు సముద్రపాలు అవుతున్నా వర్షపునీరు కూడా నిల్వచేసుకొనే వనరులు లేక పోవడంతో ఉపాధి కరవై వలసలు తప్పడంలేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వర్షపాతం 1200 మిల్లీ మీటర్లయితే ఉమ్మడి అనంతపురంజిల్లా సగటు వర్షపాతం 500 మిల్లీ మీటర్లు. అయినా రెండు జిల్లాల్లో వలసలు తప్పడం లేదు. ఎన్నికలు ముంగిటపెట్టుకొని ఈ ప్రాంతాల్లో వున్న కీలక పథకాలకైనా బడ్జెట్‌లో నిధులు కేటాయించక పోవడం నేటి విషాదం.
విశ్రాంత పాత్రికేయులు, 9848394013