Friday, August 19, 2022
Friday, August 19, 2022

ఉందిలే మంచి కాలం ముందుముందునా…

కోపం వస్తుంది. చదువుతున్న దినపత్రికని చింపేయాలనిపిస్తుంది. టీవీ చూస్తూంటాం కదా… కొన్ని వార్తలు వింటూంటే… టీవీ మీదకి చేతిలో ఉన్న కాఫీ కప్పు విసిరేయాలనిపిస్తుంది. కాని, మధ్య తరగతి మానవులం కదా… అసహనంగా ఓ నిట్టూర్పుతో కోపాన్ని దాచేసుకుంటాం. రెండు నెలల ఈఎంఐ కట్టలేదని అపురూపంగా కొనుక్కున్న స్కూటరో, కారో ఫైన్సాన్‌ చేసిన బ్యాంక్‌ వాడు పట్టుకుపోతానని వస్తాడు. లేదూ ఎన్నాళ్లుగానో కంటున్న కలని నిజం చేసుకుందుకు అపార్ట్‌మెంట్‌లో ఓ పిచ్చుకుల గూడునీ అప్పు చేసి కొంటాం. నాలుగైదు వాయిదాలకే ఆ కలని చెరిపేసేందుకు టక్‌ చేసుకుని, ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడే ఓ మధ్య వయసు మానవుడు పొద్దునే ఇంటి ముంగిట వాలిపోతాడు. ఇదిగో ఇలాంటప్పుడే బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకుని విదేశాలకు పారిపోయిన వారి వార్తలు చదివి, టీవీల్లో చూస్తున్న వాళ్లకి అసహనం కట్టలు తెంచుకుంటుంది. కాని నిస్సహాయులం కదా…. మధ్యతరగతిని భుజాల మీద మోస్తున్న వాళ్లం కదా… కోపాన్ని భార్యాపిల్లల మీదో, ఆఫీసులో పై అధికారి మీదో, రోడ్డు మధ్యలో బండి ఆపేసి అది లేదు, ఇది లేదు అంటూ ఫైన్‌ కట్టమని గద్దిస్తున్న ఖాకీ బట్టలాయన మీదో కసురుకుంటాం. ఇలా సంవత్సరాలుగా గడిచిపోతోంది. దేశం వెలిగిపోతోందనే ప్రకటనల మధ్యలో తల పెట్టుకుని భోరున విలవిల్లాడిపోతాం. ఇంతకంటే ఇంకేం చేయలేమా అని దిగులు పడతాం. చుట్టూ మనలాంటి వాళ్లే లక్షలాది మంది ఉన్నా మనం ఒంటిరి వాళ్లంగానే మిగిలిపోతాం.
కోట్లు కొల్లగొట్టిన వాళ్లు రాత్రికి రాత్రే విమానాల్లో విదేశాలకు ఎగిరి పోతారు. దేశంలో అన్ని వ్యవస్థలూ చక్కగా పని చేస్తున్నాయని ప్రకటించే ఏలికలకు తెలియకుండానే వాళ్లంతా ఎలా ఎగిరిపోతున్నారో చిలకజోస్యం అడిగి తెలుసుకోవాలే తప్ప నిజాలు బయటకు రావు. ఇక్కడ దేశంలో అప్పులు కట్టలేక, ఆకలి తీర్చుకోలేక నిత్యం వందలాది మంది నిస్సహాయులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది కూడా ఎలా జరిగిందో, ఎందుకు జరుగు తోందో ఏలికలకు తెలిసినట్లుగా సామాన్యులకు తెలియదు. ఇప్పుడు కూడా దేశం వెలిగిపోతుందనే ప్రకటనలు వెల్లువెత్తుతాయి.
ఇంత ఆవేదనలోనూ ఎక్కడో మినుకు మినుకుమంటూ ఆశల దీపం కని పిస్తుంది. అప్పుడెప్పుడో వంద సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికాలో రైల్లోంచి బయటకు గెంటేసిన మహాత్ముడు గుర్తుకు వస్తారు. నాలుగొందల సంవత్స రాలు తిష్ట వేసుకుని కూర్చున్న బ్రిటీష్‌ వాళ్లని దేశం నుంచి తరిమేసిన ఆ బోసినవ్వులాయన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాడు. ఇక్కడి మన కష్టాన్ని దోచు కుని విదేశాలకు పారిపోయిన వాళ్లని తిరిగి వెనక్కి తీసుకురావాలంటూ ఓ ఆడ కూతురు పోలీసుల్ని నిలదీసిన వైనం వైరల్‌ అవుతూంటే మళ్లీ ఆశల పల్లకి కళ్లముందు కనపడుతుంది. మహాత్ముడు సాధించిన విజయం నాటి పరిస్థితులు నేడు లేకపోవచ్చు.
కాని ఆ ముంబయి ఆడకూతురు ప్రేమలతా భన్సాలీ చూపిన తెగువ గురించి తెలుసుకుంటే ఏమో మంచి రోజులు వస్తాయేమో…. అందుకు మనమంతా మళ్లీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందేమో అనే నమ్మకం పెరుగుతుంది. ఇంతకీ ముంబయి మాత ప్రేమలతా భన్సాలీ ఏం చేసింది. నిరసనలు చేసిందా…. ఆందోళనలకు నాయకత్వం వహించిందా. ఆమరణ దీక్షకు కూర్చుందా. ఇవేవీ చేయలేదు. 12 గంటల పాటు ముంబయి రైల్వే పోలీసులకు చుక్కలు చూపించింది. తాను నివాసం ఉంటున్న భులేశ్వర్‌ నుంచి సబ్‌ అర్బన్‌ రైలులో ప్రయాణించిన ప్రేమలతా భన్సాలీ రైలు వెళ్లి పోతుందన్న హడావుడిలో టిక్కట్‌ తీసుకోలేదు. ఇది నేరమే. కాని ఆపద్ధర్మ నేరంగానే దీన్ని పరిగణించాలి. రైల్వే అధికారులు ప్రేమలతా భన్సాలీ టిక్కట్‌ లేని ప్రయాణం చేసిందన్న కారణంగా అక్షరాల 260 రూపాయలు ఫైన్‌ అదే అపరాధ రుసుం కట్టాలన్నారు. ఇదిగో ఇక్కడే ప్రేమలతా భన్సాలీలోని మధ్యతరగతి కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహం వచ్చింది. మన వ్యవస్ధ మీద అసహనం కూడా వచ్చిందేమో. ఇన్ని కారణాలతో ఆ తల్లి ‘‘ఫైన్‌ కట్టను కాక కట్టను అంది. అంతే కాదు.. బ్యాంకులను ముంచి విదేశాలకు వెళ్లి పోయిన విజయ్‌ మాల్యాని వెనక్కి తీసుకొచ్చి అతగాడు ఎగొట్టిన డబ్బులు తిరిగి కట్టించ’’ మంది. అప్పుడే తాను కూడా తన టిక్కట్‌ తీయని అప రాధానికి ఫైన్‌ కడతానని భీష్మించుకుంది. రైల్వేఅధికారులు ఎంత చెప్పినా… ‘‘జైలుకైనా వెళ్తాను కాని ఫైన్‌ కట్టను కాక కట్టనంది.’’ ఇలా ఒకటి కాదు… రెండు కాదు… 12 గంటల పాటు తన నిరసన వ్యక్తం చేసింది. చివరికి లాభం లేదనుకుని రైల్వే అధికారులు ప్రేమలతా భన్సాల్సీ భర్త రమేష్‌ భన్సాలీని తీసుకువచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అదీ విఫలమైంది. ‘‘ఈ విషయంలో ప్రేమలత ముందు నేను అశక్తుడ్ని. అంతేకాదు… ఓ భర్తగా ఆమెకే నా మద్దతు’’ అని కూడా రమేష్‌ భన్సాలీ తేల్చేశారు. 12 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత రైల్వే అధికారులు ప్రేమలతా భన్సాలీని కోర్టుకు అప్పగించారు. అక్కడా ఆ తల్లి తన పట్టుని వీడలేదు. ఇక చేసేది ఏమీ లేక… కోర్టు కూడా మిన్నకుండిపోయింది.
ఇది పైకి చూడడానికి చాలా చిన్న విషయమే. కొందరు బుద్ధిజీవులైతే ‘‘260 రూపాయలే కదా… కట్టేయక ఈ గొడవ ఎందుకూ’’ అంటూ సన్నాయినొక్కులు నొక్కవచ్చు. కాని ఇదంత తేలిక వ్యవహారం కాదు. ఈ వివాదం, ప్రేమలతా భన్సాలీ పట్టుదల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అంటే అగ్గి పుట్టిందన్న మాట. నిప్పు రాజుకోవడమే తరువాయి…. మిగిలిన వన్నీ చకచకా జరిగిపోతాయి. బ్రిటీష్‌ వారి మీద అగ్గి రగిలింది దక్షిణాఫ్రికా లోనే కదా…. మన రాష్ట్రంలో మద్యం నిషేధంపై జ్వాల రగిలింది అతి చిన్న పల్లెటూరైన నెల్లూరు జిల్లా దూబగుంటలోనే కదా…. ఎక్కడో నక్సల్బరిలో పుట్టిన ఉద్యమమే కదా ఇప్పుడు ఏలికలకు సవాల్‌గా మారింది. 1960ల్లో పుట్టిన తెలంగాణ ఉద్యమమే కదా. 40 ఏళ్ల తర్వాత సాకారమైంది. ప్రపం చంలోని ఏ ఉద్యమమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది కదా… ఏమో… దేశాన్ని కొల్లగొట్టిన వారిని ఇక్కడికి తిరిగి రప్పించి ముక్కుపిండి డబ్బులు కక్కించేందుకు ప్రేమలతా భన్సాలీ వేసిన అడుగే తొలి అడుగేమో… నాకైతే అలాగే అనిపిస్తోంది. మీకు అలాగే అనిపించాలి. అనిపిస్తుంది కూడా.
వ్యాస రచయిత సీనియర్‌ జర్నలిస్ట్‌,
9912019929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img