Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

ఉచిత వాగ్దానాలతో పార్టీల ఓట్లవేట

కర్నాటక 16వ శాసనసభ ఎన్నికలు ఈనెల 10వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికలలో విజయం సాధించడానికి ప్రధాన రాజకీయపార్టీలు శత విధాల ప్రయత్నిస్తూ ఓటర్లను ఆకట్టుకోవడానికి పోటాపోటీగా ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. ప్రస్తుతం బసవరాజ సోమప్ప బొమ్మయ్‌ నేతృత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి తన శక్తియుక్తులను కేంద్రీకరించింది. ప్రధాని నరేంద్ర మోదీ తానే పోటీలో ఉన్నాననే రీతిలో రాజధాని బెంగళూరు ప్రధాన నగరాలైన మైసూరు, కోలార్‌, చిత్రదుర్గ, హసన్‌, బేలూరు, రామనగర, చన్నపట్న, బీదర్‌, బీజాపూర్‌ తదితర నగరాలలో ఆర్భాటంగా, అట్టహాసంగా రోడ్‌షోలు నిర్వహిస్తూ బహిరంగ సభలలో ప్రసంగిస్తూ రెండు ఇంజన్‌ల ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలని కాంగ్రెస్‌ మోసపు మాటలు ఉచిత వాగ్దానాలను నమ్మవద్దని అంటున్నారు. మరోవైపు బీజేపీ ప్రకటనలు చేస్తోంది. ముఖ్యమంత్రి బొమ్మయ్‌, మాజీ సిఎం యడియూరప్ప, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాందీ,ó ప్రియాంక ప్రభృతులు కర్నాటక అంతటా కలియ దిరుగుతూ ప్రత్యర్థి పార్టీలను ఎండగడుతూ తమ పార్టీకే ఓటేయాలని కోరుతున్నారు.
ప్రజలకు ఊరించే ‘‘ఉచిత’’ వాగ్దానాలెన్నో చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ‘‘గృహలక్ష్మి’’ పథకం కింద ఇంటి పెద్ద అయిన మహిళకు నెలకు రూ 2వేల నగదు, పేదల ఇళ్లకు ‘‘గృహజ్యోతి’’ పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, ‘‘అన్నభాగ్య’’ పథకం కింద నెలకు ఉచితంగా 10కిలోల బియ్యం, కెఎస్‌ ఆర్టీసి బెంగళూరు నగర బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ 3వేలు, డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ.1500 రెండేళ్లపాటు నిరుద్యోగ భృతి ఇస్తామని చేస్తున్న ప్రచారం పేదలు, మహిళలు, నిరుద్యోగ యువత హస్తం పార్టీ వైపు అధికాధికంగా మొగ్గు చూపు తుండటంతో మోదీ సహా కమల నాథులు కలవరపడుతున్నారు. మాజీ సిఎం జగదీష్‌ శెట్టర్‌ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్‌ సవది ప్రభృతులకు టిక్కెట్లు ఇవ్వకుండా అవమానకరమైన రీతిలో పొమ్మనలేక పొగబెట్టడం, బి.ఎల్‌ సంతోష్‌, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి వంటి సంఘపరివార బ్రాహ్మణ నేతల ద్వారా బీజేపీలో లింగాయతుల ప్రాముఖ్యతను తగ్గించి బ్రాహ్మణ ముఖ్యమంత్రిని తేవాలని మోదీ, అమిత్‌షాలు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ప్రభావం చూపితే బీజేపీకి పరాజయం తప్పదంటున్నారు. అందుకే మోదీ, అమిత్‌ షా, నడ్డా ప్రభృతులందరూ ఊరూరా తిరుగుతూ ఉచితాలు అనుచితం అనే ఈ పెద్దలు తాము కూడా నెలకు 5కిలోల బియ్యం, 5 కిలోల రాగులు, జొన్నలు ఉచితంగా పేదలకు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. ఉమ్మడి పౌర స్మృతి, పౌర పట్టికలను కర్ణాటకలో అమలు చేస్తామనే హామీలు ప్రజలను పెద్దగా ఆకర్షించేలా లేకపోవడంతో వినాయకచవితి, దసరా, దీపావళి పండుగలకు 3 వంట గ్యాస్‌ సిలిండర్లు, రోజూ పేదలకు అరలీటరు పాలు, గర్భవతులకు పౌష్ట్టికాహార పాకెట్లు అందిస్తామని, వితంతు పింఛన్లను రూ.800 నుండి రూ.2వేలకు పెంచుతామని, ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.10లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స సౌకర్యం, దేవాలయాల జీర్ణోద్ధరణకు రూ1000 కోట్లు కేటాయిస్తా మని, రాజధాని బెంగళూరులో వేగంగాపనిచేసే ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని, అందరికీ ఇళ్ల పథకం కింద 10 లక్షల ఇళ్లు నిర్మిస్తామని..ఇలా ఎన్నో ఆకర్షణీయ వాగ్దానా లను బీజేపీ తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చి కాంగ్రెస్‌తో నువ్వా నేనా అనే రీతిలో తలపడుతోంది.
సొంతంగా అధికారంలోకి రాలేని మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ నేతృత్వంలోని జెడిఎస్‌ త్రిశంకు సభ ఏర్పడితే సిఎం పీఠం చేజిక్కించుకుని చక్రం తిప్పాలని ఆశగా ఎదురు చూస్తోంది. అందుకే రైతులకు ఎకరాకు రూ.20వేల సబ్సిడీ, కూలీలకు రూ.2వేల భృతి ఇస్తామని, సేద్యం చేసే యువకులను పెళ్లాడే యువతులకు రూ.2 లక్షల సబ్సిడీ ఇస్తామని, పాఠశాలలకు వెళ్ళే బాలికలకు 68వేల సైకిళ్ళు, కాలేజీ లకు వెళ్ళే యువతులకు 60 వేల మోపెడ్లు ఇస్తామని హామీ ఇచ్చింది. జెడిఎస్‌ పాత మైసూరు ప్రాంతంలో ప్రభావం కలిగి ఉన్నందున బీజేపి ఈసారి అక్కడ ఎక్కువ స్థానాలు గెలవాలని వ్యూహాత్మకంగా పావులు కదుపు తున్నది. పంటలకు కనీస మద్దతుధరలు రాక, సాగుఖర్చులు పెరిగి సేద్యపురంగంలో నెలకొన్న సంక్షోభం వల్ల తగిన విద్య, వైద్య సౌకర్యాలు లేనందున రైతు యువకులను పెళ్లాడేందుకు యువతులు ముందుకు రాక చాలా రాష్ట్రాలలో ఎందరో యువకులు పెళ్లికాక అలాగే ఉండిపోతున్నారు. జెడిఎస్‌ ఆ సమస్యను గుర్తించి యువతులకు నగదుసాయం ప్రకటించడం మెరుగైన చర్య. మిగతా పార్టీలు ఈ అంశంపై దృష్టి సారించాలి. లేదంటే పల్లెల్లో సామాజికసంక్షోభం తప్పదు. కాంగ్రెస్‌ వాగ్దానాల అమలుకు రూ.50వేల కోట్లు, జేడీఎస్‌ వాగ్దానాల అమలుకు రూ75 వేల కోట్లు అవసరమని అంచనా. 2023-24 కర్నాటక బడ్జెట్‌ రూ3.09 లక్షల కోట్లు కాగా అందులో 26 శాతం రుణాల ద్వారానే సమకూరుతున్నది. మూలధన వ్యయం కోసం బడ్జెట్‌లో 18శాతమే మిగులుతున్నది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోసం 22శాతం ఖర్చవుతుంది. 7వ వేతన సంఘం సిఫార్సులను ఈ ఏడాదే అమలు చేయాల్సి ఉన్నందున వేతన ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిగాక బడ్జెట్లో 9శాతం అంటే రూ.25వేల కోట్లు పాత రుణాలపై వడ్డీగా చెల్లించవలసివస్తోంది.
కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రవాటా ఇవ్వవలసిఉంది. 1.5కోట్ల మహిళలకు రూ.2వేల వంతున ఇవ్వాలంటే రూ.36వేల కోట్లు, గృహజ్యోతి కింద పేదల ఇళ్లకు 200 యూనిట్ల విద్యుత్‌ ఇవ్వాలంటే రూ 7.5వేల కోట్లు ఖర్చు కాగలదని అంచనా. 1.8 కోట్ల గృహ విద్యుత్‌ వినియోగదారుల్లో 65శాతం 200 యూనిట్లకంటే తక్కువ వాడే వారే. విద్యుత్‌ఉత్పత్తి సరఫరా నష్టాలను బాగా తగ్గించి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచితే రూ.7వేల కోట్లను భర్తీ చేయవచ్చని, ప్రభుత్వం సకాలంలో విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోతే అంధకారంలో మగ్గవలసిందేనని నిపుణుల హెచ్చరిక. సకలజనుల ‘‘శాంతివనం’’ కర్నాటక. లక్షలాదిమందికి రాజధాని బెంగుళూరు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ విశ్వనగరంగా, శాంతిధామంగా విలసిల్లుతున్నది. భారత జిడీపీలో 8శాతం సమకూరుస్తూ వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో ప్రగతిపథంలో కర్నాటక మరింత పురోగమించాలని ఆశిద్దాం.
పతకమూరు దామోదర్‌ ప్రసాద్‌, సీనియర్‌ జర్నలిస్టు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img