Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

ఉద్యమం కోసం శిక్ష అనుభవిస్తున్న యోగేంద్ర యాదవ్‌

కొంతమంది ముక్కు సూటితనం ఎవరికీ నచ్చదు. అందుకే వారు ఏ చట్రంలోనూ ఇమడ లేరు. ఎన్నికల సర్వేలు నిర్వహించడంతో మొదలై పదకొండు నెలలుగా సాగుతున్న రైతుల ఆందోళనకు ప్రతిరూపంగా నిలిచిన యోగేంద్ర యాదవ్‌ది అదే పరిస్థితి. ఆయన కొన్నాళ్లు అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆం ఆద్మీ పార్టీలో ఉన్నారు. అక్కడా ఇమడలేక బయటకు వచ్చారు. తానే స్వయంగా స్వరాజ్య అభియాన్‌ అని ఓ సంస్థ పెట్టుకున్నారు. ఆయన నిలకడగా ఒక చోట ఉండడం సాధ్యం కాకపోయినా నిఖార్సైన ప్రజా స్వామ్య వాది. తిన్నగా ఆలోచించేతత్వం ఉన్న వారు. మేధావిగా గుర్తింపు పొందిన వారు. ఈ లక్షణాలే ఆయనకు కష్టాలు కొనితెస్తాయేమో! ఆయన రైతు ఉద్యమానికి మార్గదర్శకత్వం చేస్తున్న గుప్పెడు మంది సభ్యులలో ఒకరిగా ఉండేవారు. సంయుక్త కిసాన్‌ మోర్చాకు అధికార ప్రతినిధిగా ఉండే వారు. కానీ ఆ సంస్థే ఆయనను ఇటీవల నెల రోజులపాటు సస్పెండ్‌ చేసింది. అంత తప్పు యోగేంద్ర యాదవ్‌ ఏం చేశారన్న అనుమానం కలుగుతుంది.
లఖింపూర్‌ ఖేరీ సంఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా పుత్రరత్నం అశీష్‌ మిశ్రాకు సంబంధించిన కార్ల బిడారు రైతుల మీదకు పోనిచ్చినందువల్ల నలుగురురైతులు మరణించారు. ఈ సంఘటనతో ఆగ్రహోదగ్రులైన రైతులు అదుపు తప్పి ఆగ్రహం ప్రదర్శించడం వల్ల బీజేపీ సమర్థకులనుకున్న వారిమీద దాడికిదిగారు. ఈ దాడిలో మరో నలుగురు మరణించారు. శాంతియుతంగా, గాంధేయ పద్ధతుల్లో సాగుతోందనుకున్న ఆందోళనలో మొట్టమొదటిసారి రైతుల కారణంగా రక్తం చిందింది. రైతుల దాడిలో మృతి చెందిన శుభం మిశ్రా అనే వ్యక్తి ఇంటికెళ్లి యోగేంద్ర యాదవ్‌ ఆ కుటుంబానికి సాంత్వన కలిగించి వచ్చారు. కానీ సమస్యెక్కడ వచ్చిందంటే మరణించిన బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న వారి దృష్టిలో ప్రత్యర్థి శిబిరంలోని వారే కదా! శత్రు పక్షం వారిని ఓదారుస్తారా అన్న వాదన మొద లైంది. దానితో సంయుక్త కిసాన్‌మోర్చా నిర్ణయాలకు బాధ్యత వహించే బృందం నుంచి యోగేంద్ర యాదవ్‌ను నెల రోజులపాటు సస్పెండ్‌ చేశారు. ఆయనా ఆ బృందంలోని వారే. యోగేంద్ర యాదవ్‌ క్షమాపణ చెప్పాలన్నారు. అయితే సంయుక్త కిసాన్‌మోర్చా నాయకులకు చెప్పకుండా రైతుల దాడిలో మరణించిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లినందుకు క్షమాపణ చెప్తా కానీ పరామర్శించినందుకు క్షమాపణ చెప్పనని యోగేంద్ర యాదవ్‌ అన్నారు. తనను సస్పెండ్‌ చేసినందుకు ఆయన కచ్చితంగా నొచ్చుకుని ఉంటారు కానీ కిసాన్‌ మోర్చా నాయకులు కలిసికట్టుగా తీసుకున్ననిర్ణయం కనక దాన్ని ఆమోదిస్తానని చెప్పారు. రైతుల ఉద్యమంలో మరింత చురుగ్గా పాల్గొంటానని కూడా అన్నారు.
ఇంతకీ ప్రత్యర్థి శిబిరంలోని వారిని పరామర్శించడం తప్పా అని ఆలో చిస్తే భారతీయ సంప్రదాయం ప్రకారం తప్పు కాదు అనే సమాధానమే వస్తుంది. మన పురాణేతిహాసాల్లో శత్రు పక్షం వారిని పరామర్శించిన ఉదం తాలు ఎన్నో ఉన్నాయి. రావణుడు మరణిస్తే రాముడు కసి తీరిందనుకోలేదు. రావణుడు మహా విద్వాంసుడనీ, చివరి ఘడియల్లో ఉన్న రావణుడి దగ్గర కాస్త జ్ఞానం సంపాదించాలని లక్ష్మణుడిని రాముడు పురమాయించాడు. మహా భారత యుద్ధం జరిగేటప్పుడు కౌరవులు, పాండవులు ఎంత భీకరంగా పోరా డుకున్నా సాయంత్రం అయ్యేసరికి ఒకరినొకరు పరామర్శించుకునేవారు. మర ణించిన వారు శత్రువులైనా గౌరవించేవారు. మరణాంతాని వైరాణి అంటారు.
తొమ్మిది మంది సభ్యులతో కూడిన కిసాన్‌ మోర్చా నాయకత్వం భిన్నంగా ఆలోచించింది. యోగేంద్ర యాదవ్‌ను సస్పెండ్‌ చేసింది. ఇది నిరంకుశ చర్య అని, రైతు ఉద్యమానికి హాని చేస్తుందని ఈ ఉద్యమాన్ని సమర్థిస్తున్న వారు అభిప్రాయపడ్తున్నారు. తమది గాంధేయ పద్ధతిలో సాగుతున్న ఉద్యమం అంటున్నారు కనక బీజేపీ కార్యకర్తల మరణానికి దారి తీసిన రైతుల దాడిని ఖండిరచి ఉండాల్సిందని మేధావి వర్గం భావిస్తోంది. పంజాకు చెందిన రైతుల నాయకత్వమే యాదవ్‌ విషయంలో ఇంత కఠిన నిర్ణయం తీసుకుందన్న వాద నలూ ఉన్నాయి. ఆందోళన చేస్తున్నది ప్రధానంగా పంజాబ్‌, హర్యాణా రాష్ట్రాల రైతులేనన్న వాదనను మోదీ ప్రభుత్వం మొదటినుంచీ చేస్తూనే ఉంది. కానీ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ రైతులకు ప్రాతినిధ్యం వహించే రాకేశ్‌ తికైత్‌ అగ్ర నాయకుడిలా కనిపిస్తున్నారు. పంజాబ్‌ రైతులకు అనేకమంది నాయకులుంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ రైతులకు తికైత్‌ ఒక్కరే నాయకుడిగా కనిపిస్తున్నారు.
తికైత్‌ క్రమశిక్షణను, ఔచిత్యాన్ని ఉల్లంఘించిన సందర్భాలే ఎక్కువ. ఆయన లఖింపూర్‌ ఖేరీసంఘటన ‘‘క్రియకు ప్రతిక్రియ’’ అనడాన్ని తర్కబద్ధంగా ఆలోచించే చాలామంది తప్పుపట్టారు. ఎదుటిపక్షం దౌర్జన్యానికి దిగితే గాంధేయపద్ధతుల్లో ఉద్యమం నిర్వహిస్తున్నవారు హింసామార్గాన్ని ఎలా సమర్థిస్తున్నారు? ‘‘చౌరీ చౌరా’’ ఉద్యమం హింసా మార్గం పట్టినప్పుడు గాంధీజీ ఆ ఉద్యమాన్ని వెంటనే ఉపసంహరించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. రైతుల ఉద్యమం నైతిక ధర్మాన్ని విడనాడకూడదంటున్నారు. నైతిక ధర్మమే రైతుల ఆందోళనకు మూలకందం. దాన్ని విడనాడితే ఎలా? ఈ ఉద్యమానికి గౌరవం తీసుకు రావడంలో యోగేంద్ర యాదవ్‌ది నిజంగానే అద్వితీయమైన పాత్ర.

  • అనన్య వర్మ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img