Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఉద్యమాల సెగలో… అమరావతి

పోతుల బాలకోటయ్య

తెలుగునేలపై 600 రోజుల ఉద్యమమంటే సాదాసీదా విషయం కాదు. ఇంతటి సుదీర్ఘ ఉద్యమ ఘట్టం దేశచరిత్రలో లేనే లేదు. తెలుగు నేలపై జరిగిన ఎన్నో ఉద్యమాలకు, ప్రజా రాజధాని అమరావతి ఉద్యమానికి రూపంలోనూ, సారంలోనూ తేడా ఉంది. కేవలం ఒక ప్రభుత్వ నిర్వాకానికి, కక్షపూరిత, అనా లోచిత నిర్ణయానికి చిహ్నంగా అమరావతి ఉద్యమం జరుగుతోంది. 2014కు ముందు విజయవాడ-గుంటూరు జంట నగరాల మధ్య ఉన్న ఆ 29 గ్రామాల ప్రజలకు తమ భూముల్లో రాజధానిని నిర్మిస్తారని కానీ, రాజధాని కోసం భూములు ఇస్తామని కానీ తెలియదు. అయినా తరాలుగా నమ్ముకున్న పంట పొలాలను ప్రభుత్వానికి ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో నష్టపరిహారం లేకుండా అప్పజెప్పారు. రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయామనే ఆవేదనల మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఏపీకి ఒక నూతన రాజధాని ఆవశ్యకతను తెరపైకి తెచ్చింది. పదేపదే క్యాబినెట్‌ మీటింగులు, చర్చోపచర్చలు, నివేదికలు, అసెంబ్లీ తీర్మానం తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేసారు. ఇందులో ప్రజల పాత్ర ఏమీ లేదు. భూములు యిచ్చిన ఏ ఒక్క రైతుకు ప్రభుత్వ ప్రక్రియ అస్సలు తెలియదు. ప్రభుత్వం కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసింది. అయితే అమరావతి ఎంపికకు ఆనాటి ప్రభుత్వం కొన్ని ప్రధానమైన అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రజలకు తెలియజేసింది. రాజధానికి నీటి కొరత ఉండకూడదని, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, విమానాశ్రయం ఉండాలని భావించింది. అంతకంటే ముఖ్యంగా 13 జిల్లాల నడిబొడ్డుగా ఉండాలని, జనసమర్థత ప్రాంతంగా ఉండాలని ప్రకటన చేసింది. ప్రభుత్వానికి భూసమీకరణ పద్ధతిలో అవసరమైన భూములను సేకరించి, రైతులకు నష్టపరిహారం ఇచ్చే ఆర్థిక స్థితి లేకపోవడంతో భూసేకరణతో రైతుల నుండి 34 వేల ఎకరాలను సేకరించింది. రెండేళ్లలోనే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు పూర్తి చేసింది. ఉద్యోగులకు, న్యాయమూర్తులకు, సచివాలయ సిబ్బందికి అవసరమైన నిర్మాణాలు శరవేగంగా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ నిధులను, రాష్ట్ర ప్రభుత్వ నిధులను దాదాపు 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దేశ ప్రధానిని రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించి గౌరవించింది. మూడు ప్రాంతాల ప్రజలు అమరావతిని రాజధానిగా శ్లాఘించారు. ఏ ప్రాంతంలోనూ నిరసన వ్యక్తం చేయలేదు. ఆనాటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైకాపా కూడా అమరావతికి జై కొట్టింది. ఆ పార్టీ ప్రతిపక్షనేతగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో మూడు ప్రాంతాల మధ్య కలతలు, వైషమ్యాలు ఉండకూడదని, రాజధాని నిర్మాణానికి 30 వేలకు పైగా భూమి అవసరమని దేవాలయం లాంటి అసెంబ్లీలోనే ప్రకటించారు. ఇన్ని కార్య క్రమాలు జరిగాక… ఈరోజు కాకపోయినా భవిష్యత్తు తరాలకైనా మధ్యస్థ ప్రాంతమైన అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ భావించారు. 2019 ఎన్నికలకు ముందు సైతం అధికార పక్షం రాజధానికి వైకాపా ద్రోహం చేస్తుందని ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తే, రాజధానిని మరింతగా అభివృద్ధి చేస్తామని, అందుకోసమే రాజధాని ప్రాంతంలో ప్రతిపక్షనేత ఇల్లు కట్టాడనీ, కార్యాలయం పెట్టాడనీ ప్రచారం చేశారు.
అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం 2019 డిసెంబర్‌ 17వ తేదీన ఒక్కసారిగా అసెంబ్లీలో 3 రాజధానులను ప్రకటించింది. పేరుకు మూడు అని చెప్పినా, అసలు విషయం ఏమిటంటే, ఏపీకి రాజధాని అమరావతి కాదు, విశాఖపట్నం అని చెప్పకనే చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రజలు తెల్లబోయారు. రైతులు గుండెలవిసేలా రోడ్డెక్కారు. ఫలితంగా 600 రోజుల ఉద్యమ శంఖం చరిత్రపుటల్లోకి ఎక్కింది. పరిపాలనా రాజధాని విభజన అనాలోచిత నిర్ణయానికి వంతగా అమరావతిపై రాళ్ళేయటం మొదలెట్టారు. ఇన్సైడర్‌ ట్రేడిరగ్‌ అని ఒకసారి, ఒక సామాజికవర్గానికి మేలు అని మరోసారి, భూసారం లేదని, వరదలు వస్తాయని, స్మశానం అని, ఎడారి అని పేర్లు పెట్టారు. వీటన్నింటినీ రైతులు, రైతు మహిళలు నిబ్బరంగా తమ ఉద్యమంతో జవాబు చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు పోరుబాటపట్టడంతో ప్రభుత్వం ‘‘కల్లు తాగిన కోతి’’లా మారింది. 29 గ్రామాలపై విరుచుకుపడిరది. పోలీసుల పద ఘట్టనలు, అరెస్టులు, కేసులు నిత్యకృత్యం అయ్యాయి. ఎస్సీలపైనే ఎస్సీ ఎట్రాసిటీ యాక్ట్‌పెట్టారు. మహిళల చీరలులాగారు. జాకెట్లు చించారు. వెయ్యిమంది పోలీసు పహారాల మధ్య సియం క్యాబినెట్‌ మీటింగులకు, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళటానికి ఇష్టపడ్డారు తప్ప, ఏ ఒక్క శిబిరం దగ్గరకు వెళ్లి వారి గోడువినేందుకు ఆసక్తి చూపలేదు. రాజధాని ఉద్యమంలో దళిత, బహుజనులు అగ్రభాగాన నిలవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడిరది. న్యాయస్థానాలు రాజధానిపై ప్రభుత్వ వాదనలను, కేసులను తిప్పికొట్టాయి. దీంతో ప్రభుత్వం ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీ ఉద్యమంగా పేరు పెట్టి ప్రచారం మొదలెట్టింది. రాజధాని కోసం అమరావతి రైతులు భూములు ఇచ్చిన మాట నిజమే అని తెలిసినా, కేంద్ర ప్రభుత్వం ఉలకదు, పలకదు. పెద్దన్న పాత్ర పోషించేందుకు యిష్ట పడదు. మూడు ప్రాంతాల్లోని ప్రజలు సంఫీుభావం ప్రకటిస్తున్నా, ఆయా ప్రాంతాలలోని ప్రజాప్రతినిధులను నిగ్గదీసి అడగరు. నిర్మాణం కొరవడి, ఉద్యమ అనుభవలేమితో జెఎసిలు తమ శక్తిమేరకు ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో నడిపించక తప్పడం లేదు. కేవలం ఎన్నుకున్న ప్రభుత్వం కారణంగా రాజధానిప్రాంతంలోని 29వేలమంది రైతులు, వారితో పాటు రాజధాని ఫలాలను అందుకునే లక్షలాది మంది దళిత బహుజన కులాలు ఉపాధి లేక అలమటిస్తున్నా పరిస్థితి ఎవరికీ కనిపించడం లేదు. అదే ప్రాంతానికి చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులు సైతం ప్రజల దగ్గరకు వెళ్ళటంలేదు. దేశంలోని 29 రాష్ట్రాలూ ఈ వింతను విడ్డూరంగా చూస్తున్నాయి తప్ప, పార్లమెంటులో వాణిని వినిపించటం లేదు. రైతులను కన్నీరు పెట్టించి, వారిని క్షోభకు గురి చేసి వైకాపా ఆడుతున్న కరాళ నృత్యానికి కాలమే సమాధానం చెప్పాలి.
వ్యాస రచయిత అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img