అతి తక్కువ కాలంలో అత్యధిక గ్రామీణ ప్రజానీకానికి చేరువైన సంక్షేమ కార్యక్రమం మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం అమలుకు వామపక్షాలు పట్టుబట్టాయి. గ్రామీణ భారతంలో కోట్లాదిమందికి ఉపాధి కల్పనద్వారా నిరుద్యోగ సమస్యను రూపుమాపడం, గ్రామీణ వలసలను అంతమొందించడం, సామాజిక ఆస్తులను సృష్టించడం, గ్రామీణగిరాకీని పెంచి, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం అమలులోకి వచ్చి సుమారు 17సంవత్సరాలు దాటింది. ఈ మధ్యకాలంలో ఈ పథకంకింద నిర్ణీత కాలంలో గ్రామీణులకు ఉపాధి లభించి, కొంతమేరకువారి బతుకుల్లో ఆశాదీపాలు వెలిగిన మాట నిజం. మరోవైపు పోనుపోను దీని నిర్వహణ కొంత అవినీతిమయమైందన్న ఆరోపణలోనూ వాస్తవం లేకపోలేదు. ఎన్‌డీఏ సర్కారుకు దీనిని కొనసాగించే ఆలోచన మొదట్లోలేదు. ఈ పథకంపై ప్రధాని సహా ఒకరిద్దరు మంత్రులు ఆ రోజుల్లో విమర్శలు కూడా చేసారు. ఈ పథకానికి గత నాలుగేళ్లుగా బీజేపీ ప్రభుత్వ కేటాయింపులు పరిశీలిస్తే, ఏటా నిధులు తగ్గుముఖం పడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగానే కుదించింది. 202021లో రూ.1,11,169 కోట్లు 2021
22లో రు.98,000కోట్లు, 202223 ఏడాదికి రూ.73,000కోట్లు కేటాయించగా, తాజా 2023
24 బడ్జెట్‌లో కేవలం రూ.60,000 గ్రామీణ నిరుద్యోగిత 7శాతంతో కొనసాగుతున్న నేపధ్యంలో నిధులు, పనిదినాలు మరింత పెంచవలసిన అవసరముంది.
దేశంలో అత్యధిక జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అలాగే పట్టణ పేదరికం కన్నా గ్రామీణ పేదరికం ఎక్కువ. ఒక అంచనా ప్రకారం ఇది సుమారు 30శాతం. ఈ కారణం చేతనే ఉపాధిహామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ ప్రకృతి విపత్తులను తరచూ ఎదుర్కొంటున్న వ్యవసాయంపైనే ఆధారపడి వుంటుంది. దీనితోబాటు పెరుగు తున్న వ్యవసాయఖర్చులు, చిన్న, సన్నకారు రైతులను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. గ్రామీణ భారతంలో అత్యధిక పేదలుగా పేరొందిన షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలలో, షెడ్యూలు కులాల జనాభా కొంతమేర ప్రయోజనంపొందగా వారి సహచరులైన షెడ్యూలు తెగలు మాత్రం పేదరికం నుంచి విముక్తులు కాలేదు. జనజీవన స్రవంతికి వీరంతా దూరంగా ఉండడం, మూఢ విశ్వాసాలతో జీవనం గడపడం దీనికి కారణం. చాలా రాష్ట్రాల్లో ఒకపక్క ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఆహారభద్రత కల్పించడం, గ్రామాల్లో మెరుగైన స్వయం సహాయక సంఘాల పనితీరు, గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడం వంటి వాటిద్వారా గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రక్రియలో తమ పాత్రను పోషిస్తున్నాయి. నరేగా పాత్ర దారిద్య్రరేఖకు దిగువనున్న వారిలో కొనుగోలు శక్తి పెరగడానికి ఈ పథకమే కారణం. నిరుపేదలకు ఉపాధి óకల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచిన వినూత్న పధకంగా ఈ పథకాన్ని పశంసిస్తున్నారు.
దేశీయ విశ్వవిద్యాలయాల్లోనూ, విదేశీ విశ్వవిద్యాలయాల్లోనూ ఈ పథకంపై ఇంతవరకు శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయంటే ఈ పథకం ఘనత ఎంతో అర్థమౌతోంది. గతంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ సైన్సు, బెంగుళూరు అధ్యయన నివేదికసైతం ఈ పథకం అమలువల్ల వస్తున్న సానుకూల మార్పులను వెలుగులోకి తెచ్చింది. అలాగే 2016లో ఓస్లో(నార్వే) విశ్వవిద్యాలయ పరిశోధకుడు ఈ పథకానికి ఆకర్షితుడై అనంతపురం జిల్లా లోని వివిధ గ్రామాలను సందర్శించి దీని అమలుతీరు తెన్నులను నిశితంగా గమనించి ఇదెంతో గొప్ప సంక్షేమ పథకమని కొనియాడారు. ఈ పథకం గ్రామీణ పేదలకు వివిధ రకాలుగా ఉపయోగపడుతోంది. వారిలో కొనుగోలు శక్తి పెరుగుతోంది. వలసలు కొంతవరకు తగ్గుముఖం పడుతున్నాయి. మహిళా కూలీల వాటా ఎక్కువగా ఉండటంతో వారిలో చైతన్యం పెరిగింది. లబ్ధిదారుల్లో అత్యధికులు దళితులే. వారికి ఊతం లభించింది. కరోనా కష్టకాలంలో తమ గ్రామాలకు తిరిగివచ్చిన కుటుంబాలను ఆదుకున్నది ఈ పథకమే. ఈ పథకం కింద సామాజిక పనుల వాటా 2015లో నమోదైన 16శాతం నుంచి 2022 నాటికి 73 శాతానికి పెరిగాయని 2022-23 ఆర్థికసర్వే పేర్కొంది. ఇంతటి ఘనచరిత్ర కల్గిన ఈ పథకానికి ఏటాకేటాయింపులు తగ్గడం ఆశ్చర్యకరం. ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రు.60 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది గత ఏడాది కన్నా తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పాదక ఆస్తుల కొరకు మహిళా గ్రూపుల సమిష్టి కృషితో వనరుల సమీకరణ, నీటి సంరక్షణ పనులు, సాలిడ్, లిక్విడ్ వనరుల నిర్వహణ, గ్రామీణ గృహనిర్మాణం, పశువుల షెడ్ల నిర్మాణం, వానపాముల ఎరువుల తయారీ, గుంటలు తవ్వడం, భారీస్థాయిలో మొక్కలు నాటడం, పార్ముగుంటలు తవ్వడం, అంగన్వాడీ భవనాల నిర్మాణం, పక్కా గ్రామీణ రోడ్ల నిర్మాణం ఇవన్నీ ఉపాధి హామీ పథకంతోనే సాధ్యమవుతున్నాయి.
లోపాలు: భారతీయ గ్రామీణ ఆర్ధికవ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపు తున్న ఈ పథకంలో చాలాలోపాలు కారణంగా విమర్శల నెదుర్కొంటుంది. ఈ క్రమంలో ఈ పథకం అమలు తీరుతెన్నులపై కేంద్రం గ్రామీణాభివృద్ధి మాజీ కార్యదర్శి అమర్‌జిత్ సిన్హా నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ పేదరిక నిర్మూలనలో ఈ పథకం సామర్థ్యాన్ని మదింపు వేయనుంది. కూలిపనులకు వెల్లివెత్తుతున్న కోట్లాదిమంది అభ్యర్ధనలవెనక అసలు కారణాలు, దీని అమలులో రాష్ట్రాలమధ్య వైౖరుధ్యాలు తదితరాలను పరి శీలిస్తుంది. ఈ పథకానికి మరింతగా మెరుగుపెట్టేందుకు సూచనలను చేస్తూ ఈ కమిటీ త్వరలో తన నివేదికను సమర్పించనుంది. చేయని పనులకు చేసినట్లు బిల్లులు పెట్టడం, కూలీలకు సొమ్ము చెల్లించడంలో అలవిమాలిన జాప్యం, ద్రవ్యోల్బణ సూచీలకనుగుణంగా వేతనాలు పెంచకపోవడం, కేంద్ర నిధులను రాష్ట్రాలు ఇతర ఖర్చులకు వినియోగించడం, పర్యవేక్షణలోపాలు, పనుల్లో నాణ్యత లోపించడం, దొంగ జాబు కార్డులు, హాజరు పట్టీలో అక్రమాలు వంటివి పథకం ఉద్దేశ్యాన్ని నీరుగారుస్తున్నాయి. సామాజిక ఆస్తుల కల్పనలోనూ రాష్ట్రాలు వెనుకబడినట్లుగా అధికారిక గణాంకాలు చెబు తున్నాయి. చివరిగా ఈ పధకం కింద ప్రతి కుటుంబానికి 100 రోజులు పనిదినాలు ఏడాదిలో నిర్దేశించినా, వాస్తవానికి 2020-21లో ఇది సగటున 48 దినాలు దాటలేదు. అత్యధికంగా నమోదైన పనిదినాలు ఆ ఏడాదిలో కేవలం 52 మాత్రమే.
డాక్టర్ యస్.వై. విష్ణు, సెల్ 363217252