Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉప ‘‘నయనం’’ పుస్తక ‘‘నేస్తం’’

జర్నలిస్ట్‌ వృత్తిలో భాగంగా నేను తొలిసారి కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ ఓ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఉదయాన్నే టిఫిన్‌ చేసేందుకు ఓ హోటల్‌ కి వెళ్తే ఆ హోటల్‌ గోడలకు అద్భుతమైన పెయింటింగ్స్‌ వున్నాయి. అవి అందం కోసం, అలంకరణ కోసం అనుకున్నాను. కానీ వాటి కింద పెయింటింగ్‌ ధరలని ట్యాగ్‌ చేసి పెట్టారు. నా వచ్చీ రాని హిందీతో ఇదేమిటి అని గల్లా పెట్టె దగ్గరున్న యజమానిని అడిగితే అది ఎగ్జిబిషన్‌ అని, వారం రోజులు అలా ప్రదర్శించి ఎవరైనా కొనుక్కుంటే ఆ డబ్బులు చిత్రకారుడికి ఇచ్చేస్తామని చెప్పారాయన. ఈ పెయింటింగ్స్‌ వల్ల హోటల్‌ కళకళలాడుతుందని కూడా అన్నారు. కలకత్తాలో చాలా హోటళ్లలో ఇలాంటి ప్రదర్శన లుంటాయని కూడా చెప్పారు. ఓ కళకి, కళాకారుడికి ఇలాంటి ఆదరణ చూసి కన్నీరు కార్చేంత ఆనందపడ్డాను. ఇది జరిగి రెండున్నర దశాబ్దాలకు పైనే అయ్యింది. ఇదిగో, ఈ మధ్య ఇలాంటి సంఘటన మళ్ళీ చూసాను. హైదరాబాద్‌లో. మా అగ్రహారీకుడు, కార్పొరేట్‌ సంస్థల్లో అత్యున్నత పదవుల్లో ఉన్న దాసు అనిరుద్‌(బుజ్జి) దంపతులు వారి కుమారుడికి ఉపనయనం చేశారు. బాగా డబ్బు చేసిన (ఆయన ముళ్ళపూడి వారి అభిమాని) మనిషి కనుక అట్టహాసంగానే నిర్వహించారు ఆ క్రతువు. నా కథలకి, ఈ నా కలం కి మంచి అభిమాని కావడంతో నేనూ వెళ్ళాను ఆ శుభకార్యానికి.
ఉపనయనం జరుగుతున్న ఆ పెద్ద హాల్‌లో ఓ వైపు ఐదారు బల్లలు వేసి దాని మీద పుస్తకాలు పేర్చారు. అక్కడే గోడకు పెద్ద పెద్ద అక్షరాలతో ‘‘ఉపనయనం.. పుస్తక నేస్తం’’ అని బోర్డు కూడా పెట్టారు. అది ఆ శుభకార్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన. నా అర్ధ శతాబ్దపు జీవితంలో అనేక శుభకార్యాలకి హాజరయ్యాను. ఎక్కడా ఇలాంటి పుస్తక ప్రదర్శన నా కంట పడలేదు. పోనీ అని ఈ పుస్తకాల క్రతువు నిర్వహిస్తున్న దాసు అనిరుద్‌ రాసిన పుస్తకాల ప్రదర్శనేమో అనుకుందుకూ లేదు. ఆయన రాసిన ఒక్క పుస్తకం కూడా లేదు.
శిరిడీ సాయి ప్రవచనాలు, పూజలు, వ్రతాలు, ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలున్నాయి. వాటి పక్కనే ‘‘గెలుపు సరే .. బతకడం ఇలా’’ అనే శీర్షికతో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు పెట్టారు. దాన్ని పక్కనే శ్రీ శ్రీ మహా ప్రస్థానం, ఆరుద్ర సంకలనాలు, గురజాడ కథలు, కృష్ణశాస్త్రి కవిత్వం పొందికగా అమర్చారు. బాపు-రమణలకు వీరాభిమాని కావడంవల్లనేమో ‘‘బాపూ రమణీయం’’ పేరుతో వారిద్దరి పుస్తకాలు అనేకం పెట్టారు. బాపూ స్వదస్తూరీతో రాసిన శ్రీ రమణ మిథునం పుస్తకాలు ఓ ఇరవై వరకు ఉంచారు. ఇక గోదావరి జిల్లా వారు కదా… అందుకని గోదారి-గౌతమి- కొబ్బరిచెట్లు శీర్షికతో మా గోదావరి జిల్లా వారి కథలు, కవిత్వం పెట్టారు. ఇందులో నా కేరాఫ్‌ కూచిమంచి అగ్రహారం కథలకి కాసింత చోటిచ్చారు అనిరుధ్‌ దంపతులు. ఇందులో ముఖ్యమైన విషయమేమిటంటే ఎవరికి నచ్చిన పుస్తకం వారు ఉచితంగా… ఔను… ప్రచురణ లోపం కాదు. ఉచితంగానే తీసుకోమన్నారు. అయితే, ఓ షరతు కూడా పెట్టారు. ప్రతీ కుటుంబం ఒక్క కాపీ మాత్రమే తీసుకోవాలి. అంటే ‘‘ఒకే పుస్తకం రెండు, మూడు కాపీలు తీసుకోవద్దు. అందరికి అన్నీ అందాలి కదా’’ అనే ఉదేశ్యంతో.
ఉపనయనం పట్ల ఆసక్తి వున్నవారు ఆ కార్యక్రమాన్ని చూస్తుంటే మిగిలినవారు ఈ పుస్తక ప్రదర్శనకి వచ్చారు. ఈ పుస్తక ప్రదర్శన కోసం దాసు అనిరుద్‌ ఐదారు రోజులు తిరిగారు. వేలాది రూపాయలు ఖర్చు చేశారు. ముఖ్యంగా సమయాన్ని వెచ్చించారు. పుస్తకాల షాపులకి, రచయితలకి డబ్బులిచ్చేసి ఈ శుభకార్యానికి వచ్చిన వారికి పుస్తకాలు ఉచితంగా ఇచ్చారు. ఎంత గొప్ప మనసుండాలి ఇలా చేయడానికి. పుస్తకం పట్ల ఎంత అవ్యాజమైన ప్రేముండాలి ఇలా చేయడానికి. ఇదే విషయం అనిరుద్‌ గారిని అడిగాను. దానికి ఆయన సమాధానం ‘‘ఎప్పుడో కాలేజీ రోజుల్లో శ్రీ శ్రీ మహాప్రస్థానం చదివాను. ఇదిగో మళ్ళీ దాసు బుజ్జి ఇప్పుడిచ్చారు అనుకోవాలి కదా ?’’ అన్నారు. ఈ మధ్య శుభకార్యాల్లో ‘‘ఫ్యాషన్‌’’ గా మారిన ‘‘ రిటర్న్‌ గిఫ్ట్‌’’ ఇంత అందంగా ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాను.
భోజనాల సమయంలో ఓ పెద్దావిడ చేతిలో కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు, శ్రీ శ్రీ మహాప్రస్థానం, కృష్ణశాస్త్రి, ఆరుద్ర సాహిత్యం వున్నాయి. ‘‘ఇవెందుకమ్మా’’… అని ఆవిడ్నిగితే ‘‘పొద్దున్న ఆధ్యాత్మికం చదువుతాను. మధ్యాహ్నం శ్రీ శ్రీ ని చదువుతా. రాత్రి కృష్ణ శాస్తి కవిత్వం చదువుతా. రోజంతా హాయిగా గడిచిపోతుంది’’ అన్నారు. ఆ భోజన శాలలో అందరూ విందు భోజనాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. నాకు మాత్రం ఆ పెద్దావిడ మాటలతో కడుపు నిండిపోయింది.
సీనియర్‌ జర్నలిస్ట్‌, 9912019929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img