డాక్టర్ అరుణ్ మిత్రా
గోవు మళ్లీ ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. ఎన్నికల ప్రచార సాధనంగా గోవును ఉపయోగించుకునే ఎత్తుగడ బీజేపీ ప్రభుత్వం అనుసరించదలచిందని జరుగుతున్న పరిణామాలు తెలియ జేస్తున్నాయి. గోవు ద్వారా విలువైన ప్రయోజనాలున్నాయని అందువల్ల వాలెంటైన్ డే బదులుగా ఫిబ్రవరి 14న ‘‘గోవును హత్తుకునే దినం’’ గా నిర్వహించాలని పశు సంక్షేమ బోర్డు ఒక ప్రకటనలో దేశప్రజలకు పిలుపునిచ్చింది. పశుపోషణ విభాగం, మత్స్యశాఖ కూడా ఈ పిలుపులో భాగస్వామ్యమైంది. ఏదో రూపంలో ఎన్నికల ప్రచారంలో వాడుకునేందుకే ఇప్పుడు అధికారికంగా గోవును తెరమీదకు తీసుకువచ్చారు. భారత సంస్కృతికి గోవు వెన్నెముక అని, గ్రామీణ ఆర్థికవ్యవస్థకు ప్రధానమైనదని, మనజీవనానికి తోడ్పడుతుందని పశుసంపదకు, జీవవైవిధ్యానికి గోవు ప్రాతినిధ్యం వహిస్తుందని చాలా గొప్పగా ఆ ప్రకటనలో తెలిపారు. కామధేను, గోమాత లాంటి పదాలతో గోవు తల్లిలాగా పోషిస్తుందని ఇది వేదిక్ సాంప్రదాయమని ప్రభుత్వ విభాగాలు నూరిపోస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతి విస్తరించినందున వేదిక్ సంప్రదాయాలు సమిసిపోయే దశలో ఉన్నాయని పేర్కొంది. పాశ్చాత్య సంస్కృతి వెలుగులో మన సంస్కృతిని, వారసత్వాన్ని దాదాపు మరచిపోయామని ఆ ప్రకటన పేర్కొంది. గోవును హత్తుకున్న వ్యక్తికే గాక అందరికీ సంతోషం కలుగుతుందని బోధించింది. అందువల్ల గోవును ప్రేమించేవారంతా 14వ తేదీన దాన్ని హత్తుకోవాలని పశుపోషణ బోర్డు కోరింది. గోవును హత్తుకుంటే భావోద్వేగ సంపన్నత లభిస్తుందనికూడా ఈ ప్రకటన పేర్కొన్నది. ప్రజాసంక్షేమంకోసం ఏర్పాటుచేసిన ఈ శాఖలు అందుకోసం పనిచేయకుండా ఎన్నికల్లో బీజేపీకి ఉపయోగపడే అంశాలను తీసుకుని ప్రచారంచేయడం న్యాయవిరుద్ధమైన వ్యవహారం.
ఈ శాఖలుచేసిన విజ్ఞప్తిని ప్రజలుగట్టిగా వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో ఆ ప్రకటనను ఉపసంహరించు కున్నారు. ఒకవైపు ప్రధాని మోదీ సైన్సును గురించి మాట్లాడతారు. ప్రోత్సహిస్తున్నట్లు కూడా చెబుతారు. మరోవైపు తెరవెనుక ఇలాంటి అశాస్త్రీయమైన అంశాలను ప్రచారం చేస్తున్నారు.