Monday, September 26, 2022
Monday, September 26, 2022

ఏ వెలుగులకీ ప్రస్థానం?

బి. లలితానంద ప్రసాద్‌
‘ఆజాద్‌ కా అమృత ఉత్సవ్‌’ పేరుతో దేశమంతా వివిధ రూపా లలో ఉత్సవాలు జరుపుతున్నారు. జాతి చరిత్రలో 75 సంవత్సరాలు తక్కువేమీ కాదు. ఈ గమనంలో అనేక మేలి మలుపులు, మెరుపులు, మైలు రాళ్ళు ఉన్నాయి. నిరంతరం సాగే ఈ యానంలో ఓసారి గతాన్ని సమీక్షించుకుని వర్తమానంతో బేరీజు వేసుకుని వాటి స్ఫూర్తితో భవి ష్యత్తుకు బాటలు వేయడం తప్పనిసరి. అన్నింటా వాస్తవికత ప్రాతిపదిక కావాలి. సర్వత్రా వచ్చిన, వస్తున్న మార్పులు నిష్పాక్షికంగా విశ్లే షించుకోవాలి. ఇందుకు సదా సంపూర్ణ ప్రజాశ్రేయస్సు పునాది, లక్ష్యం కావాలి. కోటానుకోట్ల బడుగు జీవులకు మేలు చేసేదే నిజమైన పాలన.
స్వాతంత్య్రానంతరం అనేక రంగాలలో గణనీయ ప్రగతి సాధిం చాం. అందుకు అప్పటి నేతల దూరదృష్టి, నిజాయితీ, సమర్థత, విజ్ఞత, విచక్షణ కారణం. వారంతా సదా స్మరణీయులు. అంతరిక్షం, సాంకేతిక రంగాలలో ఎనలేని విజయాలతో ప్రపంచంలోనే గుర్తింపు పొందిన స్థాయికి ఎదగగలిగాం. అన్నిటినీ మించి ఇక్కడి ప్రజలంతా ‘ప్రజా స్వామ్యం’ బలంగా నిలబడటానికి కారకులు అవటం ఎంతైనా గర్వ కారణం. మన ప్రజలంతా ఎప్పటికప్పుడు తమ అపార విజ్ఞతతో, నిశ్శబ్ద విప్లవంతో, మౌనంగానే పాలకుల పట్ల అసంతృప్తిని, అసహనాన్ని నిస్సంకోచంగా వెల్లడిస్తూ వచ్చారు. అయినా వారి ఆశలు, అంచనాలు, ఆకాంక్షలు పాలకులు ఎప్పటికప్పుడు వమ్ము చేస్తూనే ఉన్నారు. ప్రజల విశ్వాసంతో ఏర్పడిన పాలక పక్షం మారిన ప్రతిసారీ వారి భ్రమలు పటాపంచలు చేస్తూనే ఉంది. స్వపక్షం విపక్షం పేర్లు మార్పు గాని స్వభావంలో చేతల్లో ఏ మార్పు లేకుండటం గమనార్హం, గర్హనీయం. స్థానాలు మారినా గొంతుకులే భిన్నం గాని స్వరాలు మాత్రం ఒకటే. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు ఎన్నడూ లేవు. వీరు ఎవరైనా వారి నిఘంటువులలో నైతికత, విలువలు, ప్రమాణాలు, సత్యశీలత, చిత్తశుద్ధి అనే మాటలు లేవు. అనేక రూపాలలో అడ్డదారులు, దొడ్డి దారులు, దొంగ దారులు వెతుక్కోవడంలో ఎవరికి వారు పోటాపోటీగా రాటుదేలు తున్నారు. నిర్లజ్జగా పార్టీలు మూకుమ్మడిగా మారుస్తూ ఉండటం సర్వ సామాన్యం అయింది. దశాబ్దాల తరబడి విలువల గురించి విరామం లేకుండా వల్లించిన వారే ఇందుకు పాల్పడటం నీచాతినీచం. వీటిని ఏదో పేరుతో సమర్థించు మేధావులు, మీడియాలో అధిక భాగం ఇక్కడ తరించడం అమాయక ప్రజల పాలిట దౌర్భాగ్యం. గతంలో తాము వేలెత్తి చూపినవన్నీ ఇప్పుడు వారే చేస్తున్నారు. గత ఏడెనిమిదేళ్ళల్లో దాదాపు 10 రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పడిపోవడం, అనైతికంగా అధికారాన్ని చేజిక్కించుకున్న పార్టీల ప్రభుత్వాలు ఏర్పడడం మనం ఎటువైపు పయనిస్తున్నట్లు? ఏమైపోతున్నట్లు? ‘ఒకే పని ఒకరు చేస్తే మంచి మరొకరు చేస్తే చెడు’ అన్న రీతిగా ఉంది ఈ మహాను భావుల తీరు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు, ప్రజాభిప్రాయానికి విలువ, గౌరవం, అర్థం ఏముంది? ఏం మిగులుతుంది? అంతిమంగా వాటి మూల్యం సామూహికంగా భరించాల్సింది నిస్సహాయ ప్రజలే కదా!. వీటిలో ఏ కొంతైనా మార్పు వచ్చి సరిదిద్దుకోగలిగినప్పుడే అమృతోత్స వాలకు నిజమైన సార్థకత.
మన రాజ్యాంగం ఎవరి పరిధి వారికి నిర్ణయించింది. దానిని అతి క్రమించడం పవిత్ర రాజ్యాంగాన్ని అపవిత్రం గావించడమే. కేంద్రం, రాష్ట్రాల విషయంలో ఎవరి విద్యుక్త కర్తవ్యాలు వారివిగా పేర్కొనడంతో పాటు ఉభయులకు చెందినవి స్పష్టంగా పేర్కొంది. వాటి విషయంలో మరింత జాగరూకత అవసరం. పరస్పర సమన్వయం ముఖ్యం. పెత్తనం చేతిలో ఉంది కదా అని రాష్ట్రాల విషయాల్లో చొరబడరాదు. కాని జరుగుతున్నది అందుకు భిన్నం. వ్యవసాయం, విద్య, వైద్యం లాంటి అనేక అంశాలలో నానాటికీ రాష్ట్రాలు నామమాత్రం కావటం సర్వసామాన్యం అయింది. రాన్రాను వారి ఆదాయ వనరులకు వివిధ రూపాల్లో గండి పడుతుంది. అది తప్పక పాలనా సామర్థ్యంపై ప్రతి ఫలి స్తుంది. అంతిమంగా జనజీవనంపై బహుముఖంగా దీర్ఘకాల దుష్ఫలి తాలను ఇస్తుంది. వీటన్నింటినీ పునఃసమీక్షించుకుని సరిదిద్దుకోవాలి లేదంటే ఎన్ని దశాబ్దాలు గడిచినా ‘నానాటికీ తీసికట్టు నాగంబొట్లు’ అన్నట్లుంటుంది.
రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ఎన్నికవడం ముదావహం. దేశానికి రాష్ట్రపతి లాంటివారే రాష్ట్రాలకు గవర్నర్లు. రాజకీయ సంక్షోభంలో తప్ప వారికి రాజ్యాంగం ప్రకారం కార్యకలాపాలు పరిమితం, నామమాత్రం. ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఇటీవల పక్షపాత వైఖరి కనబరుస్తున్నారు. ఇందుకు ఎన్నో దాఖలాలున్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రత్యేకించి ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ రాజ్యాంగేతర కార్యకలాపాలు/ వివాదాస్పద వ్యాఖ్యలు నిత్యకృత్యం అయ్యాయి. ఈ కారణంగా ఆయా వ్యవస్థల స్థాయిని కుదించడంతో పాటు ఎన్నికైన ప్రభుత్వాలనీ కించపరిచినట్టు అవుతుంది. సొంత వ్యక్తి త్వాన్ని తగ్గించుకోవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించినట్లు అవుతుంది. రాజ్యాంగంలో ఎవరి పరిధి వారికి నిర్దేశించినప్పుడు ఒకరి విషయాల్లో మరొకరి జోక్యం ఎందుకు? ఇలాంటి ప్రమాణాలతో, విలు వలతో, నైతికతతో ప్రజానీకానికి ఎలాంటి సందేశం ఇవ్వదలిచారు? వల్లించే సుభాషితా లకు ఏమైనా విలువుంటుందా? ఇంకెంతకాలం ఇవి కొనసాగుతాయి? ఇలాగే కొనసాగితే ఈ ఉత్సవాలకు సంబరాలకు ఏమైనా అర్థం ఉంటుందా? ఏ వెలుగులకు ఈ ప్రస్థానం అనుకోవడం సమంజసం కాదా?
తమ బతుకులలో మంచి మార్పు వస్తుందని ప్రజలంతా ప్రత్యే కించి అట్టడుగు వర్గాల వారు తమ జీవన ప్రమాణాలు పెరుగుతాయని, మెరుగైన జీవనానికి బాటలు పడతాయని, తమ సంతతినైనా సమున్న తంగా చూడాలని, ఎన్నెన్నో ఆశలతో, అంచనాలతో, ఆకాంక్షలతో తాము ఎన్నుకున్న ప్రభుత్వాల వైపు చూస్తుంటారు. వాటిని వమ్ము చేయ డం భావ్యం కాదు. క్షంతవ్యం కాదు. మన వ్యవస్థను నిష్పాక్షికంగా పరిశీలిస్తే ఇది అసలు ప్రజాస్వామ్యమేనా అనిపించక మానదు. ఈ ప్రజాస్వామ్యం ఎవరికోసం? అనే ప్రశ్నల పరంపరకు, ఆందోళనకు, సందిగ్ధతకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఏలికలదే.
వ్యాస రచయిత రిటైర్డ్‌ ప్రొఫెసర్‌,
9247499715

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img