జ్ఞాన్ పాఠక్
రానున్న కొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘర్, మిజోరం రాష్ట్రాల ఎన్నికలకు రానున్న కొన్ని వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించడం సాధ్యంకాలేదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ నాయకులమధ్య గ్రూపులేర్పడి కుమ్ములాటలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పటిలాగే ప్రధాని మోదీ హిందుత్వ బ్రాండ్ రాజకీయాల ప్రచారాన్ని సాగించేందుకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ప్రచారం సాగించారు. ముఠా తగాదాల మూలంగా ఈ రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతుఇచ్చే ఓటర్లసంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ బాగా ప్రయోజనంపొందే అవకాశాలున్నాయి. బీజేపీలో అంతర్గత తగాదాలను మాత్రమేకాకుండా, కార్యకర్తలలోనూ పెద్దగా ఉత్సాహంలేదని భావిస్తున్నారు. నాయకుల మధ్య తగాదాలు కార్యకర్తలవరకు చేరాయి. కరోనా మహమ్మారి విజృంభించినకాలంలో మోదీ దీపాలు వెలిగించండి, పళ్లాలతో శబ్దాలు చేయండి, కరోనా తగ్గిపోతుందని ఊదరగొట్టారు. జనం నిజమేనని ఆయన చెప్పినట్లు విన్నారు. ప్రస్తుతం ఆయనచెప్పే మాటలు జనం నమ్మేలాలేరు. బీజేపీకి ఎలా ఓటెయ్యడం అని ఆలోచిస్తున్నారు.
ఈ ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ నాయకులు మోదీ ప్రచారబలంపైనే ఆధారపడి ఉన్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున మోదీనే అన్ని సీట్లలోనూ పోటీచేస్తారేమో మరి! రాష్ట్రాలలో బీజేపీ నాయకత్వం బలహీనంగా ఉండటం, పోటీచేసే అభ్యర్థులు ఉత్సాహం చూపకపోవడం కారణంగా ఈ సారి ఎన్నికల్లో గెలుపుపై ఏ మాత్రం ధీమాగాలేరు. 2024లో జరుగనున్న లోకసభ ఎన్నికలకు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సెమిఫైనల్ అని భావిస్తున్నారు. నరేంద్ర మోదీ మూడోసారికూడా గెలిచి ప్రధానిపీఠం అలంకరించాలని తహతహలాడుతున్నారు. ఈ సారి మోదీ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతకాలం ప్రచారంచేస్తున్న మైనారిటీల వ్యతిరేక హిందుత్వ ప్రచారానికి భిన్నంగా వ్యూహం పన్నుతున్నారు. మైనారిటీల భయం పట్టుకున్నది. కేవలం హిందుత్వ అనుకూల ప్రచారం గెలుపును సాధించబోదని మోదీ భావన. అందుచేత మోదీ ప్రచారంచేసే ‘‘సనాతన ధర్మం’’ ప్రచారం కూడా పెద్దగా ప్రయోజనం కలిగించబోదని అంచనా వేస్తున్నారు. హిందువులు ఎక్కువగా దేశంలో ఉన్నందున సనాతనధర్మ ప్రచారంతో గెలవవచ్చునన్న భావన కూడా తగ్గిపోయింది. ఇండియాకూటమి ఇలాంటి మతప్రచారాన్ని తిప్పికొట్టి గెలిచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.సనాతన ధర్మాన్ని ఇండియాకూటమి నాశనం చేస్తుందని ప్రచారం సాగిస్తున్నారు. ఇండియా ప్రచారం మూలంగా హిందువులంతా ప్రమాదంలో ఉన్నారని కూడా మోదీ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారాన్ని చేస్తున్నారు. మోదీ చేసే రాజకీయ ప్రకటనల్లోనూ ఇండియాతో హిందువులకు ముప్పే ఉండదని పరోక్షంగా చెబుతున్నారు. హిందుత్వ బ్రాండ్ రాజకీయాలను ఆయా రాష్ట్రాలలో రూపుమాపే అవకాశాలు ఉన్నాయి. హిందుత్వ బ్రాండ్ రాజకీయాలు లేదా హిందుత్వ వ్యతిరేక రాజకీయాలు ప్రచారం చేసినప్పటికీ ఫలితం ఉండదని విశ్లేషిస్తున్నారు.
సనాతనధర్మం పేరుతో మతాన్ని, ఛాందసవాదాన్ని, మూఢనమ్మకాల్ని హిందువులలో రెచ్చగొట్టేందుకు ప్రధాని తీవ్రంగా యత్నిస్తున్నారు. ఆయనపన్నిన వ్యూహాల్లసామాజిక, రాజకీయాలను పరిశీలిస్తే, ఈసారి ఎన్నికల్లో గెలుపు కష్టమేన్నట్లుగా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమటీ పునర్నిర్మాణం అనంతరం రెండురోజులపాటు సెప్టెంబరు 16,17 తేదీలలో హైద్రాబాద్‌లో సమావేశమైంది. ఈ సారి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకత్వంలో సాగించే మతప్రచారం ఉచ్చులో ఏ మాత్రం చిక్కుకునే సమస్యలేదని సమావేశం నిర్ణయించింది. తమిళనాడు మంత్రి ఉదయ్‌నిధి సనాతనధర్మం నిర్మూలన జరగాలని చేసిన వ్యాఖ్యానాన్ని మోదీ మధ్యప్రదేశ్‌లో ఎన్నికల నినాదంగా తీసుకుని ప్రచారం సాగించారు. సనాతన ధర్మాన్ని బీజేపీ ఇంకా అమలు చేయాలని కోరుకుంటోంది. ఈ ధర్మం అసమానతలను పెంచేందుకు, సతీసహగమనం లాంటి దురాచార భావనను కొనసాగించేందుకు ప్రయత్నిస్తుందా అని ఇండియాకూటమి ప్రశ్నించినప్పటికీ మోదీ సమాధానం చెప్పడంలేదు. తెలంగాణలోగాని, మిజోరంలోగాని మోదీ ప్రకటనలను ఎక్కువమంది ఓటర్లు పెద్దగా పట్టించుకోవడంలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో బీజేపీయేతర రాజకీయ పార్టీలదే కీలకపాత్ర. తెలంగాణలో పోటీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏఐఎమ్‌ఐఎమ్‌ను ఇండియాకూటమి తమతో కలిసిరావాలని ఆహ్వానించలేదు. ఈ నేపధ్యంలో ఏఐఎమ్‌ఐఎమ్ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మూడోఫ్రంట్ ఏర్పాటు చేయాలని పిలపునిచ్చింది. అయితే ఇది బిఆర్‌ఎస్‌కు అనుకూలంగాలేదు. ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో ఎమ్‌ఐఎమ్ చాలాచోట్ల బీజేపీకి అనుకూలంగా ఉన్నదన్న ప్రచారం సాగింది.
తెలంగాణలో అధికారంలోఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉన్నది. ఇది ఇండియా కూటమిలో భాగమైనా కాంగ్రెస్ పరిస్థితి మెరుగవుతుందని అంచనావేసారు. గత ఎన్నికల్లో బీజేపీ 8.09శాతం ఓట్లు తెచ్చుకున్నప్పటికీ, ఈసారి ఓట్లు తగ్గిపోతాయని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 30శాతం ఓట్లు లభించాయి. మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండ కూడా బీజేపీకి అననుకూలతను కలిగిస్తుంది. మోదీ చేసే ప్రచారం వ్యతిరేక ప్రచారంగా ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రత్యేకించి మోదీ మధ్యప్రదేశ్‌లో సాగించే హిందుత్వ ప్రచారం ఓటర్లలో రాజస్థాన్, చత్తీస్‌ఘర్‌లలో కంటే ఎక్కువగా ఆందోళన పరుస్తోంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం, రాజస్తాన్, చత్తీస్‌ఘర్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీలో అంతర్గత తగాదాలు గతంలో ఏనాడూలేనంత స్థాయిలో ఉన్నాయి. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నించినా తగాదాలుమాత్రం తగ్గలేదు. మధ్యప్రదేశ్ ఓటర్లలలో ప్రభుత్వ వ్యతిరేకత రెట్టింపు స్థాయిలో ఉన్నదని, లోకసభ ఎన్నికలలోనూ ఇదే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. హిందుత్వ అనుకూల ప్రచారం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఓటర్ల మీద తీవ్ర వ్యతిరేకప్రభావం అంతర్గతంగా కొనసాగుతున్నది. రాజస్తాన్, చత్తీస్‌ఘర్‌లలో హిందుత్వ అనుకూల ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తోంది. ఈ రెండు రాష్ట్రాలను పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ఎక్కువగా అమలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ రాష్ట్రస్థాయి శాఖల్లో అంతర్గత తగాదాలున్నాయి. అయితే ఇవి బైటకు అంత స్పష్టంగా కనిపించడంలేదు. ఈ సారి ఎన్నికల్లో గెలవాలన్న ఆలోచనగట్టిగా ఉన్నది. రహస్య ఎజండాను అనుసరిస్తున్న బీజేపీ కాంగ్రెస్ ఆ పనిచేస్తున్నదని ఎదురుదాడికి దిగింది. రహస్య ఎజండానే బీజేపీ దెబ్బతినేందుకు దోహదం చేయవచ్చు.