Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

‘ఒక్క నిమిషం’ మౌనంగా…

అదేంటి రెండు నిమిషాలు మౌనంగా కదా… ! అనుకుంటున్నారా. ప్రభుత్వ, అధికార పెద్దల నిర్వాకం కారణంగా విద్యా వ్యవస్ధ నిర్ణయాలకు ఒక్క నిమిషం మౌనం పాటించాల్సిందే. లేకపోతే పరీక్షలురాసే విద్యార్ధులకు ఈ ఒక్క నిమిషం ఆలస్యమైనా రానివ్వని ఈ విద్యావ్యవస్ధను ఏమనాలి. ఏడాది పాటు విద్యార్ధు లను పుస్తకాల పురుగులుగా మార్చేసి వారి బాల్యాన్ని బలవంతంగా పాఠశాలల్లో, కళాశాలల్లో బంధించిన వ్యవస్ధకు మౌనం పాటించాల్సిందే కదా. నిజమే, సమయం విలువైనదే. మరి ఈ విషయం విద్యార్ధుల పరీక్షల సమయంలోనే గుర్తుకొస్తే ఎలా. సమయపాలన నేర్పించడం చాలా అవసరమే. దానికీ ఈ పరీక్షలకు ముడి పెడితే ఎలా. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన నేరానికి ఓ ఏడాదిపాటు విద్యా సంవత్సరం కోల్పోవడం ఆ విద్యార్ధి భవిష్యత్‌కు ఎంత శాపం. నిబంధనలు విధించే ముందు ఎవరి కోసం, ఎందుకోసం, దీని వల్ల జరిగే లాభ నష్టాలను బేరీజు వేయాలి కదా. ఈ ఒక్క నిమిషంలో జరిగే అనర్ధాలను అంచనా వేయాలి కదా. ఇది క్రమశిక్షణలో భాగమా..? లేక బాల్యానికి విధిస్తున్నా శిక్షా … ? అన్నది గమనంలోకి రావాలి కదా. ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని రోజుల్లో పదో తరగతి, ఆ తర్వాత ఆ సెట్‌, ఈ సెట్‌ అంటూ రకరకాల ఎంట్రన్స్‌ పరీక్షలు ప్రారంభ మవుతాయి. ఓ పిల్లాడో, మరో అమ్మాయో నిర్మించుకున్న కలల గూడుని ఈ ఒక నిమిషం నిబంధనతో కూల్చేయడం ఏలికలకు, అధికారగణానికి మంచిదేనా. రోజుకు 24 గంటలు…గంటకు 60 నిమిషాలు… నిమిషానికి 60 సెకన్లు….మనం నేర్పించిందే. మరి నిమిషానికి ఎన్నిజీవితాలు చెడతాయో ఎవరైనా నేర్పించారా. ఏదైనా నేర్పించిన తర్వాతే కదా ప్రశ్నించాలి. టీచరో, లెక్చరరో బయోమెట్రిక్‌లో నిమిషం అలస్యం అయితే ఏం చేస్తున్నారు. అతను లేదూ ఆమె సెలవుల్లో కోత విధిస్తున్నారు. అదీ మితిమీరితే వారి జీతంలో కోత పెడుతున్నారు తప్ప జీవితంలో కోత విధించడం లేదు కదా… విద్యార్ధులకు పాఠాలు చెప్పే వారికే ఇలాంటి అవకాశాలు ఉంటే మరి వారి దగ్గర విద్య నేర్చుకుంటున్న వారి జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికిచ్చారు.
ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలో, మరో పోటీ పరీక్షలకే ఈ నిబంధన విధించడం సమంజసమే. ఉద్యోగార్ధిగా ఉన్న నిరుద్యోగి ఉద్యోగ ఆన్వేషణలోనే నిర్లక్ష్యంచేస్తే విధి నిర్వహణలో ఇంకెంత నిర్లక్ష్యంగా ఉంటాడో అనే అనుమానంతో ఇలాంటి నిబంధనలు అక్కరకు వస్తాయోమో కాని పసివారి భవిష్యత్తును కాలరాసేందుకు మాత్రం ఇవి కచ్చితంగా మౌనం పాటించాల్సిన నియమాలే. ప్రభుత్వం అట్టహాసంగా శంకుస్ధాపనో, ప్రారంభోత్సవ కార్యక్రమమో ఏర్పాటు చేస్తుంది. ఆ కార్యక్రమాలు నిమిషం ఆలస్యం కాకుండా జరిగిన సందర్భం ఒక్కటైనా కనిపిస్తుందా. ఆ కార్య క్రమానికి ముఖ్యఅతిధిగా హాజరవ్వాల్సిన మంత్రివర్యులో, ప్రజాప్రతినిధో లేదూ ఉన్నతాధికారో సరిగ్గా సమయానికి వచ్చిన సందర్భం ఏదైనా మీకు కనిపించిందా. నా మూడున్నర దశాబ్దాల జర్నలిస్టు జీవితంలో ఏ ప్రజా ప్రతినిధి, ఏ అధికారి సమయానికి వచ్చిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా నా అనుభవంలో లేదు. ఈ నిమిషం నిబంధన ఏ కార్యక్రమానికి విధించినా ఆ శుభ కార్యమో, అశుభమో ఆగిపోవడం ఖాయం.
ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, అధికార పక్షమో, ప్రతిపక్షమో, పరాయి పక్షమో, పూర్వ పక్షమో వారంతా పెట్టే బహిరంగ సభలకు, ర్యాలీలకు సరిగ్గా సమయానికి వచ్చిన సందర్భం ఒక్కటంటే ఒక్కటైనా ఉంటుందా. నిమిషం కాదు…గంటల సమయం పాటు బహిరంగ సభకు వచ్చిన వారు వేచి చూడాల్సిందే కదా. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, చలికి వణికుతూ, మంచులో ముసుగులువేసుకుని వేచి చూస్తారు కదా. మరి విద్యార్ధుల పరీక్షలకు ఈ నిమిషం నిబంధన విధించిన వారికి తమ సభలు, సమావేశాలకు నిమిష నిబంధన వర్తించుకోరా. ఈ మధ్యనే జరిగిన ఓ రాజకీయ పార్టీ సభ ప్రారంభం కావడానికి నిర్ణయించుకున్న సమయం కంటే అక్షరాలా మూడు వందల నిమిషాలు ఆలస్యమైంది. ఆ పార్టీయే కాదు…. అన్ని రాజకీయ పార్టీల తీరు ఇలాగే ఉంటుంది. ఒకరోజులో వందల నిమిషాల పాటు ప్రజల్ని ఎదురుచూపుల సంద్రంలో పడేస్తున్న వారు విద్యార్ధుల పరీక్షల్లో ఒక నిమిషం నిబంధన గురించి కూడా ఒక్క నిమిషం ఆలోచిస్తే మంచిది కదా…అలా ఆలోచిస్తారని ఒక్క నిమిషం అనుకున్నా విద్యార్ధులు సంతసిస్తారు కదా. నిమిషమంటే గడియారంలో తిరిగే ముల్లులా కనిపిస్తోందా…. నాకైతే నిమిషం ఆలస్యమైన కారణంగా పాఠశాలలోనో, కళాశాలలోనో గేటు ముందు దీనంగా ఏడుస్తున్న పిల్లలే కనిపిస్తున్నారు. ఈ నిమిష నిబంధనకి రెండు నిమిషాలు మౌనం పాటించాలని ఈ నిమిషంలో అనిపిస్తోంది. అలా జరగనంత వరకూ ప్రతి నిమిషం మౌనం పాటించాలనే ఉంది.
సీనియర్‌ జర్నలిస్టు, 99120 19929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img