చింతపట్ల సుదర్శన్
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరపడుతున్నట్లు చీకటి ముసురుకొస్తున్నది. కళ్లు మూసుకుని ఓ కునుకు వేద్దామనుకుంటున్న డాంకీ ఉలిక్కిపడ్డది. అరుగు చివరకు వెళ్లి నుంచుని తోక వేగంగా చక్రంలా తిప్పుతూ, తలపైకెత్తి అరుస్తున్నది డాగీ.
దీనికిదేం పిదపకాలం, ఉన్నట్టుండి అరుపు లంకించుకుంది అని విసుక్కుంటూ ఏమిటిది తమ్ముడూ అనవసరంగా అరుస్తున్నావు నిద్ర పోవాలా వద్దా’ అంది డాంకీ. అవునా అరుస్తున్నానా? అరుస్తాను! నా ఇష్టం. ఈతోకా నాదే ఈ నోరూ నాదే మొరిగేదీ నేనే. నీకేం బాధ, నీకేం నొప్పి, నీకేం కష్టం, నీకేం నష్టం అంది డాగీ అరుపు ఆపి.
అదేంటి ఇప్పుడు నేనేమన్నానని అంత ‘ఫైరై’ వుతున్నావు ‘ఆర్ యూ ఒకే’ అంది డాంకీ. ‘అయాం నాట్ ఓకే’ అసలీ సీజనే అట్లాంటిది మనుషులందు పుణ్యపురుషులున్నారే వాళ్లందరి పల్సురేటు పెరిగిపోయింది. రక్తచాపం పెరుగుతున్నది కానీ తగ్గే సూచనలు లేవు. పుణ్య పురుషులా? ఎవరు వారు? అంది డాంకీ. ఇంకెవరు ప్రజల్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్న వాళ్లే. పాదయాత్రలు చేస్తున్నవాళ్లే వాళ్లా మంచి పేరే పెట్టావు పుణ్యపురుషులని. సరే వాళ్ల పల్సురేటు, గుండెపోటు పెరిగితేనీకేం అయింది. నువ్వెందుకు నెత్తిన నోరు పెట్టుకున్నావు. ఏం చెయ్యను వాతావరణ కాలుష్యం రాజకీయ సముద్రంలో ఎన్నికల వాయుగుండం. దాని ప్రభావం కుక్కలమీదా, గాడిదల మీదా పడకూడదని, పడరాదని ఎక్కడైనా రాసుందా? ఎవరైనా రాశారా! తెలిస్తే చెప్పు తెలవకపోతే నోరు మూసుకో! సారీ ‘ఫ్లోలో’ అనేశాను అంది డాగీ. గోడకు ఆనుకుని కూర్చుంటూ. ఎన్నడూ లేంది అంత కోపంగా చిరాగ్గా మాట్లాడుతున్నావు. యుధా రాజా తధా ప్రజా తధా ప్రజా తధా శునకం గార్ధభం అనేక పశూనాం. దీనికేమైందివాళ పులకరిస్తే ప్రవచనాలు చెబుతున్నది అన్ని మౌనంగా ఉండిపోయింది డాంకీ.
మామూలుగా ప్రతి ఏటా ఎండా కాలమని ఒకటి వచ్చునుకదా టెంపరేచర్ 45 డిగ్రీలు దాటును కదా. అయితే అయిదేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ ‘అధిక వేసవి కాలం’ అనగా ఎన్నికల కాలంలో వేడి అరవై డెబ్బయి డిగ్రీలు దాటవచ్చు దాని ప్రభావంవల్ల కోపం కోటలు దాటవచ్చు, మాటలు సభ్యతను, సంస్కారాన్ని భూ స్థాపితం చెయ్యవచ్చు. ఈ కారణంగానే నాలోనూ మార్పు వచ్చినట్లుంది. ఇది కుక్కలుమొరిగే కాలమన్నమాట. ఎన్నికలు మరీ దగ్గర పడ్డప్పుడు కరిచేకాలం ఎన్నికలయ్యాక తోక ముడిచేకాలం వచ్చాను అంది డాగీ. ఏంటీ ఏమన్నావు కాస్త క్లారిటీగా చెప్పరాదూ. నేనేం సంస్కృతం అనబడే బూతుభాష వాడలేదు. ఇప్పుడు జరుగుతున్నదంతా అరుపుల కాలమే కద. కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తాను, ఉచ్చపోయించే బాధ్యత నాది అని ఒకరు వాడికి ‘అ నుంచి అ:’ వరకు ‘క నుంచి క్ష’ వరకు అక్షరాలు రావు వత్తులూ, దీర్ఘాలూ తెలీవు. సంచార వయోజన పాఠశాలపెట్టి నేర్పిస్తాను అనేవారు మరొకరు, డిజిటల్ భాషనూ సెల్‌ఫోన్‌లో టార్చిలైటును కనిపెట్టింది, రెండువేలనోటు రద్దు చేయించింది నేనే అనేవారు ఇంకొకరు. గిల్లితే గిల్లుతాం. గిచ్చితే గిచ్చుతాం మెడలు వంచుతాం విరగ్గొడతాం అనేవారున్నారు. ఎన్నికలతేదీ రాకముందే ముఖ్యమంత్రి అయ్యాక ఏమేం విరగదీస్తాడో చెప్పేది ఒకరైతే, ఎన్నికలు కాగానే ఉచితగ్యాసు సిలిండర్లు, లక్షల్లో ఉద్యోగాలు పంచి పెట్టబోతున్నాం అని కూసేది మరొకరు. ఇదంతా ‘మొరిగే కాల మహిమే’ కద. ఇక ఎన్నికలు వచ్చాక జరిగేదే కరిచేకాలం. అప్పుడిరక మాటలుండవు మాట్లాడు కోవటాలు ఉండవు. కొట్టుకోడం, తన్నుకోడం, పొడుచు కోవడం ఉంటయి కనుక అది ‘కరిచే కాలం’ ఆ తర్వాత ఎన్నికలో ఓడిపోయినవాళ్లు ప్రజాభిప్రాయానికి తలవంచి తోకముడుచుకు పారిపోవడం, తోకముడిచేకాలం అంటూ క్లారిటీ గా క్లారిటీ ఇచ్చింది డాగీ.
విన్నా కాలాన్ని అదే ఎన్నికల కాలాన్ని బాగా స్టడీ చేసినట్టున్నావు. నాలెడ్జి బాగా పోగయినట్టుంది. టీవీలో ‘డిబేట్’కు పనికి వస్తావు వెళ్లి ట్రైచేద్దామా అన్నాడు అరుగెక్కిన అబ్బాయి. కుక్క, గాడిద ఓ తెలుగు అబ్బాయి టీవీలో చర్చిస్తే బాక్సులు బద్దలైపోతాయి మరి అంది డాంకీ. నాలా మొరిగే వాళ్లు, నీలా ఓండ్ర పెట్టేవాళ్లు రోజూ టీవీల్లో కనబడుతూ, వినపడుతూ ఉన్నార్లే అంది డాగీ.