Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

కనీస వేతనాలు లేవు – గరిష్ట దోపిడి ఉంది…!

స్వాతంత్య్రానికి ముందు వలస పాలనలో కనీస వేతనాలు, సమగ్ర చట్టం లేక యాజమాన్యాలు ఇష్టారాజ్యంగ కార్మికుల శ్రమను దోచుకునేవారు. అనేక పోరాటాల తర్వాత భారత ప్రభుత్వం 1948లో కనీస వేతనాల చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ఉద్దేశం, చట్టంలో నిర్దేశించిన వేతనాల కన్న తక్కువ చెల్లించటం నేరం. యాజమాన్యాలు చెల్లించగల శక్తిని బట్టి ఎక్కువ వేతనం చెల్లించితే ఏలాంటి అభ్యంతరం ఉండదు. ఈ చట్టం లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ప్రతి కార్మికుడు తన కుటుంబ జీవనానికి అయ్యే ఖర్చులు, పిల్లల చదువులు, వైద్యం, వినోదం, పెళ్ళిల్లు, వృద్ధ్యాప్య అవసరాలకు కావల్సిన డబ్బులు కార్మికుడికి వేతనం ద్వారా యాజమాన్యాలు చెల్లించాలి. ఉత్తమ జీవన ప్రమాణాలకు తగిన ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలలో ఒకటి. అదేరకంగా యాజమాన్యాలు కార్మికులను తమ ప్రయోజనాల కొరకు శ్రమ దోపిడీ చేయకుండా నిరోధించటం ప్రభుత్వ బాధ్యత అని కూడా రాజ్యాంగం ప్రకటించింది. అందుకే కార్మికులకు సాంఘిక న్యాయం కల్పించటానికి ఈ చట్టం తీసుకువచ్చారు. ఈ చట్టం అమలుకు కార్మికశాఖ అధికారులను నియమించారు. కానీ కేంద్రంలోని ప్రస్తుత మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలతో పాటు కనీస వేతనాల చట్టాన్ని కూడా సమూలంగా ఎత్తివేసి వేతనాల పర్యవేక్షకులుగా ఉన్న కార్మిక అధికారులను తీసివేసింది. మోదీ చేసిన చట్టాలు ఇంకా అమలుకాలేదు. ఒకవేళ మోదీ చట్టాలు అమల్లోకివస్తే వలస పాలనలో కార్మికులు అనుభవించిన బానిస వ్యవస్థను తలపించే కష్టాలను కార్మికులు చవిచూడవల్సి వస్తుంది.
గతంలో 3 సంవత్సరాలకొకసారి కనీస వేతనాలు సవరించాలనే నిబంధన ఉన్నప్పటికీ దానిని 5 సంవత్సరాలకు పెంచారు. ఈ చట్ట ప్రకారం మన రాష్ట్రంలో గుర్తించిన 72 షెడ్యూల్‌ పరిశ్రమలకు మాత్రమే కనీస వేతనాలు వర్తిస్తాయి. షెడ్యూల్‌లోలేని అనేక కొత్త పరిశ్రమలు, కార్ఖానాలు వచ్చినప్పటికీ అందులో పనిచేసే కార్మికులకు ఎలాంటి వేతన భద్రత లేదు. వారి పరిస్థితి దయనీయం. మన దేశానికి స్వాతంత్య్రంవచ్చి 77 సంవత్సరాలు దాటినా కార్మికులకు డి.ఎ.తో కూడిన వేతనాలు చాలా చోట్ల లేవు. కనీస వేతనాల పెంపుదలకు 5 సంవత్సరాల కాలపరిమితి పెట్టినా అమల్లో 12 సంవత్సరాలు దాటినప్పటికీ, కనీస వేతనాల చట్టాలో ఎలాంటి మార్పు లేదు. కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా 14 సంవత్సరాలకు తెలంగాణ ప్రభుత్వం 5 పరిశ్రమలకు సంబంధించి కనీస వేతనాలు సవరించింది. కానీ కొంతమంది పారిశ్రామికవేత్తలు అభ్యంతరాల మూలంగా గజిట్‌లో ముద్రించి అమలు చేయకుండా నిలిపివేసింది. కనీస వేతన రంగంలో ఉన్న లక్షల మంది కార్మికులను ప్రభుత్వం లెక్కచేయకుండా పిడికెడు మంది పారిశ్రామికవేత్తల మాటలకు విలువ ఇవ్వటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రమదోపిడి దారుల పక్షాన నిలబడిరది. 5 జి.ఓ.లకు ఈ గతి పడితే 72 షెడ్యూల్‌ పరిశ్రమల్లో మిగిలిన వాటి పరిస్థితి అందులో పనిచేస్తున్న కార్మికుల గతి ఏమిటనేది కార్మికవర్గం అర్ధం చేసుకోవాలి. ఈ మొత్తం అస్తవ్యస్థ వ్యవహారానికి ప్రభుత్వానిది బాధ్యత కాదా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎన్నిసార్లు వేతనాలు పెంచుకున్నారో ఎంత పెంచుకున్నారో పరిశీలిస్తే వారి నైతికతను కార్మికులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నిర్ధిష్టమైన కనీస వేతనాలు లేక బాధపడుతుంటే ప్రభుత్వాలు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, స్కీం వర్కర్లు, పార్ట్‌టైం వర్కర్‌ లాంటి అనేక విధానాలు ప్రవేశపెట్టి కార్మికులకు భద్రతలేని ఉద్యోగం, తక్కువ వేతనాలు పొందే వ్యవస్థను ప్రవేశపెట్టారు. 1970 కాంట్రాక్టు చట్ట ప్రకారం కూడా పర్మినెంట్‌ లక్షణాలు కలిగిన ఉద్యోగాల్లో కాంట్రాక్టు ఇతర పేర్లతో కార్మికులను నియమించటం నిషేధించడమైంది. ఆ చట్ట ప్రకారం ఒక కార్మికుడు 240 రోజులు కాంట్రాక్టు విధానంలో పని చేస్తే ఖచ్చితంగా పర్మినెంట్‌ చేయాలని చట్టం చెపుతుంది. కాంట్రాక్ట్‌ చట్టంలోని ఈ నిబంధనలు ఎక్కడా అమలు జరగటంలేదు. కార్మికులకు కనీస వేతనాలు సవరించకుండా, కాంట్రాక్టు విధానాన్ని విచ్చలవిడిగా అమలుచేస్తూ ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తిని మంటకలిపి శ్రమదోపిడీకి పచ్చజెండా ఊపుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 10వ పే కమీషన్‌ సిఫార్సుల ప్రకారం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు 19వేలు కనీస వేతనం చెల్లించాలని, ప్రతి సంవత్సరం 10శాతం ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని, 3 సంవత్సరాల తర్వాత పై గ్రేడ్‌కు ప్రమోషన్‌ ఇవ్వాలని సిఫార్సు చేసింది. కానీ ప్రభుత్వం పర్మినెంట్‌ కార్మికులకు పే కమీషన్‌ సిఫార్సులు అమలుచేసి కాంట్రాక్టు కార్మికులకు మొండిచేయి చూపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను ఉపేక్షిస్తూ, 2016లో సుప్రీంకోర్టు చెప్పినట్లు, 1976 చట్టం ప్రకారం సమానపనికి సమానవేతనం చెల్లించకుండా, కమిటీలు ఇచ్చిన సిఫార్సులు అమలు చేయకుండా, న్యాయబద్దమైన కనీస వేతనాలు పెంచకుండా, కార్మికుల శ్రమను విశృంఖలంగా పారిశ్రామిక వేత్తలు దోచుకోవటానికి అవకాశాలు సృష్టించారు.
దోచుకోవటానికి కాంట్రాక్ట్‌ / ఔట్‌సోర్సింగ్‌ లాంటి విధానాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టి వాటి అమలుకు కార్మికులను నియమించుకున్నారు. వారికి పెట్టిన ముద్దు పేరు స్కీం వర్కర్లు. వారికి చెల్లించే వేతనం పేరు గౌరవ వేతనం. ఇది ప్రస్తుత కాలంలో ప్రజా ప్రతినిధులు లక్షల జీతాలు తీసుకుంటూ వీరికి వేలల్లో జీతాలు చెల్లించటం హాస్యాస్పదం. పదవీవిరమణ పొందిన స్కీం వర్కర్లకు 1972 గ్రాట్యుటీ చట్ట ప్రకారం ఎలాంటి గ్రాట్యుటీ, పెన్షన్‌ లేకుండా ఉట్టి చేతులతో, కన్నీళ్ళతో ఇంటికి చేరవల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ప్రజాసేవ చేస్తానని ముందుకు వచ్చిన రాజకీయ నాయకులు అప్పనంగా పెన్షన్‌ పొందుతున్నారు. ప్రజాసేవ పేరుతో రాజకీయాలు చేస్తున్న వారికి జీవనం కోసం స్కీంవర్కర్‌గా పనిచేస్తున్న వారికి ఉన్న వ్యత్యాసం పరిశీలిస్తే ఎక్కడా ఇలాంటి పరిస్థితి కనిపించదు
కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న కార్మికులకు పర్మినెంట్‌ కార్మికులకన్న తక్కువ వేతనం చెల్లించటం, స్కీం వర్కర్లకు వేతన వ్యవస్థ లేకుండా చేయటం, కొత్తగా గిగ్‌ వర్కర్ల వ్యవస్థను సృష్టించి ఎలాంటి రక్షణాలేని, ఎవరూ బాధ్యత వహించని పరిస్థితికి ప్రభుత్వాలు బాధ్యత వహించకుండా వీరి శ్రమదోపిడితో దేశాభివృద్ది / సమాజాభివృద్ధి చేయాలనుకోవటం పాలకుల దుష్టబుద్ధికి పరాకాష్ట. ఇలాంటి దుష్ట సంస్కృతికి, దోపిడీ సమాజానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ఎన్నికల సమయంలో కాంట్రాక్టు విధానం రద్దుచేస్తామన్న ప్రభుత్వాలు రద్దు చేయకపోగా కొత్త నియామకాలు కూడా కాంట్రాక్టు పద్దతిలో నియమించటం పాలకుల బరితెగింపుకు నిదర్శనం. నైపుణ్యంలేని కార్మికుల నుండి అతి నైపుణ్యం కలిగిన కార్మికుని వరకు ఇంజనీర్‌, డాక్టర్‌, టీచర్‌, ప్రొఫెసర్‌ అనే తేడా లేకుండా విద్య, వైద్యం, సేవా, ఉత్పత్తి లాంటి అన్ని రంగాలు అన్ని చోట్ల కాంట్రాక్ట్‌ విధానం దర్శనమిస్తూ తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయి.

వి.యస్‌.బోస్‌
ఏఐటీయూసీి తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి
ఫోన్‌: 9391356527

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img