Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

కన్నూ`వేలూ సీమవే!

వి. శంకరయ్య

రాయలసీమ నేడు వలసల సీమగా మారిపోయింది. ఈ ప్రాంతం దుర్గతికి చేరింది. ఇదివరకటికంటే మరీ వెనుకబడిన ప్రాంతంగా చెప్పే తెలంగాణలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల ఆ మధ్య పాదయాత్రచేస్తూ పొలంలో పనిచేస్తున్న కూలీల బాగోగులు తెలుసుకొనేందుకు వెళ్లి పలకరించగా తాము ఉపాధి లేక రాయలసీమ నుండి వచ్చిన వలస కూలీలమని చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదీ నేటి దుర్గతి..తొలి రోజుల్లో సీమ పరిరక్షణ కోసం పప్పూరి రామాచార్యులు కడప కోటిరెడ్డి, కల్లూరు సుబ్బారావు లాంటి వారు చిత్తశుద్ధితో చేసుకొన్న శ్రీబాగ్‌ ఒడంబడికను తదుపరి వచ్చిన నేతలకు తమ స్వార్థ రాజకీయానికి ఒక ఉపకరణంగా మార్చుకున్నారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సమయంలో కర్నూలు రాజధాని చేశారు. అంత వరకు బాగానే వుంది. ఇప్పుడు సీమ ప్రాంతంలో ఏకపక్షంగా గెలిచిన వైసీపీ శాసన సభ్యులు వున్నా రాజధాని, న్యాయరాజధాని కాదుకదా? అందరూ ఏక కంఠంతో కోరుతున్న కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో పెట్టలేదు. 1953లో శ్రీ బాగ్‌ ఒడంబడిక పేరుతో కర్నూలు రాజధానిగా చేసిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నపుడే (కృష్ణా పెన్నార్‌ పోయింది) దాని స్థానంలో సిద్దేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టు తోసిపుచ్చి శ్రీ శైలం జలాశయం కేవలం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా నిర్మించినందున బచావత్‌ ట్రిబ్యునల్‌ 1969లో నిర్మాణంలో వున్న సాగునీటి ప్రాజెక్టులకే నీటి కేటాయింపులు చేశారు. ఫలితంగా శ్రీశైలం జలాశయంలో రాయలసీమకు చుక్క నీరు కేటాయించలేదు. శ్రీ బాగ్‌ ఒడంబడిక చేసుకున్న సమయంలో అనంత పురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం రెండవ కేంద్రం పెట్టాలని తొలి అంశం గానూ, తదుపరి అంశంగా సాగునీటి ప్రాజెక్టులకు ఆనాటి పెద్దలు ప్రాముఖ్యత ఇచ్చారు. లక్షలాది ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకున్నారు. నాల్గవ అంశంగా రాజధాని హైకోర్టుల గురించి షరతులు పెట్టారు. కాని గొంతెండిపోతున్న లక్షలాది ప్రజలకు ఉపాధి సామాజిక న్యాయం చేకూర్చే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నీటి వాటా పక్కకు నెట్టేసి నేతల రాజకీయావసరాలకు అనువుగా అప్పుడూ ఇప్పుడూ భావోద్వోగంగల నాల్గవ అంశం రాజధాని తెరపైకి తెచ్చారు. సిద్దేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మించి వుంటే జారిపోయిన కృష్ణ్ణా పెన్నార్‌ ప్రాజెక్టుతో సాగునీరు లభ్యమయ్యే మొత్తం ఆయకట్టుకు ఆనాడే నీటివసతి ఏర్పడి వుండేది. 1955లో సాగర్‌కు శంకుస్థాపన జరిగితే 1956లో నీలం సంజీవరెడ్డి పనులు ప్రారంభించారు. మధ్యలో కోస్తా వాళ్లను నిందించడమెందుకు? ప్రాంతీయ విద్వేషాలు ఎంతకాలం వుంటే అధికారం కోరుకొనే నేతలకు అంత ఉపకారంచేసి పెడుతుంది. 1953 నుండి ఇప్పటి వరకు సీమనుండే ముఖ్యమంత్రులు ఎక్కువమంది వున్నారు. ఇప్పుడు విశాఖకు రాజధాని తరలించే సీమకు చెందిన జగన్మోహన్‌ రెడ్డిని కోస్తా వాళ్ళు ప్రభావితం చేస్తున్నారా?
1976, 1977 సంవత్సరాల్లో కృష్ణా బేసిన్‌లోని మూడు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం దస్త్రాలకే పరిమితమై వుంటే 1983లో ఎన్టీఆర్‌ అధికారంలోనికి వచ్చిన తర్వాత తెలుగుగంగ పథకం తెరమీదకు వచ్చింది. ఈ సందర్భంలోనే మిగులు జలాల ఆధారంగా మరొక మూడు పథకాలకు శ్రీరామ కృష్ణయ్య శ్రీకారం చుట్టారు. అయితే మిగులు జలాలు కాకుండా నికర జలాలు కావాలని పెద్దఎత్తున రాయలసీమలో రాజకీయ మిళితమైన ఉద్యమంసాగింది. డాక్టర్‌ రాజశేఖరరెడ్డి, డాక్టర్‌ మైసూరారెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాదయాత్రలు ఆందోళనలు చేశారు. ఆ పాటికే నికర జలాలను బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులు చేసివున్నా ఉద్యమం సాగించారు. తదుపరి 1989లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి డాక్టర్‌ మైసూరారెడ్డి హోం మంత్రిగా కీలక పదవిలో వున్నా 2004లో డా.వైయస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినా రాయలసీమకు నికరజలాలు ఎందుకు ఇవ్వలేదు? ఉద్యమకారులుగా చేసిన డిమాండ్‌ అధికారంలోకి రాగానే నెరవేర్చలేకపోయారు. సీమ ఉద్యమ పెడ ధోరణలకు ఇదొక నిదర్శనం. వాస్తవంలో జరగిందేమంటే డాక్టర్‌ మైసూరారెడ్డి హోంమంత్రిగా వుండి శ్రీ రామారెడ్డి అనే ఇంజనీర్‌తో గాలేరునగరి పథకం మార్పులు చేయించి నెల్లూరు, చిత్తూరుజిల్లా రైతుల కడుపు గొట్టారు. డాక్టర్‌ రాజశేఖరరెడ్డి మాత్రం మిగులుజలాల ఆధారంగా దస్త్రాలకే పరిమితమైన ప్రాజెక్టులను పట్టాల కెక్కించారు. ఆ పుణ్యమే జగన్మోహన్‌రెడ్డికి లాభించింది. తదుపరి 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకొచ్చిన తర్వాత నికరజలాలు కేటాయింపులులేని పట్టిసీమపై పెట్టిన దృష్టి నికరజలాలు కేటాయింపులు వున్న గుండ్రేవుల రిజర్వాయర్‌లేక ఎత్తిపోతలపై పెట్టలేక పోయారు. జగన్మోహన్‌ రెడ్డిని నిలువరించేందుకు డాక్టర్‌ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు గండికోట అక్కడినుండి పైడిపాలెం ఎత్తిపోతలతోపాటు ముచ్చుమర్రి పూర్తిచేసేందుకు నిధులు వ్యయంచేశారు. హంద్రీనీవా కొంతమేరకు పూర్తి చేశారు. కాని పట్టిసీమ జలాలను సీమ పొలాలకు పారిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రకటనలను సీమ ప్రజలు నమ్మలేదు. ఫలితంగా డాక్టర్‌ రాజశేఖరరెడ్డి వారసత్వం వస్తుందని జగన్మోహన్‌ రెడ్డికి ఏకపక్షంగా ఓట్లు వేశారు. అయితే నాలుగేళ్ల తర్వాత అంతా భ్రాంతిగా మిగిలిపోయింది.
విషాదమేమంటే చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన సమైక్యఆందోళన నేడు కరవైంది. ఇప్పుడు సీమ పరిరక్షణ ఉద్యమంలో వున్న ఒక యువకుడు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ఏమీ చేయకున్నా మావాళ్లు ఓట్లు వేస్తారు. చంద్రబాబు నాయుడు పనులు చేసినా ఓట్లు వేయరు అని సామాజికవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని కాబోలు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు ఆ ధీమాతోనే జగన్మోహన్‌ రెడ్డి కూడా సీమ ప్రాజెక్టుల గురించి పట్టించుకోవడంలేదు. ఈ ధోరణి మారే వరకు సీమ ప్రజలు ఈ విషవలయంలో తన్నుకు లాడవలసిందే!
టీడీపీి హయాంలో కొందరు ఉద్యమకారులు శవయాత్రలు, ధర్నాలు, నిరసన, ఆందోళనలు నిరాఘాటంగా సాగించారు. ప్రభుత్వం వేపు నుండి నిరోధించిన దాఖలాలేదు. ఇప్పుడు వారే వీధుల్లోకివచ్చి గట్టిగా కేకపెట్టలేకున్నారు. ఈ అనుభవం సీమ యువతపై ఎంతవరకు పనిచేస్తుందో వేచిచూడాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో వుండేది. రాష్ట్ర విభజన తర్వాత రెండురాష్ట్రాల చేతుల్లోకి వెళ్లింది. పైగా కృష్ణ్ణా యాజమాన్యబోర్డు ఏర్పడిన తర్వాత పూర్తిగా మారిపోయింది. చుక్కనీరు తీసుకోవాలన్నా దాని అనుమతి అవసరమైన నేపథ్యంలో ఒక్క సిద్దేశ్వరం అలుగు అంశంలోనే కాదు ఇతర అంశాల్లో సీమ ఉద్యమం కొత్త దారులు చేపట్ట వలసివుంది. శ్రీశైలం నుండి 19 టియంసిలు తప్ప అదనంగా తీసుకోలేని పరిస్థితుల్లో నికరజలాలు ఎలా సాధించాలనో ప్రభుత్వం ఆలోచించడంలేదు. దానితో పాటు ఇతర ప్రతిపక్షాలతోపాటు ఉద్యమకారులు ఆలోచించాల్సిన సమయం నేడు నెలకొని వుంది. తీరా విభజన చట్టం సెక్షన్‌89 కింద విచారిస్తున్న బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు రెండు రాష్ట్రాలకు పంపకానికి మిగిలి వుండేది క్యారీ ఓవర్‌ కింద మిగిలిన 150 టియంసిలు మాత్రమే. అయితే రెండు రాష్ట్రాల్లో మిగులు జలాల ఆధారంగా వుండే ప్రాజెక్టులకు 400 టియంసిలు అవసరముండటం కొసమెరుపు.
విశ్రాంత పాత్రికేయులు, 9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img