Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

కమ్యూనిస్టుల ఐక్య సంఘటన అవశ్యం

ఘనచరిత్ర గల ఆంధ్రప్రదేశ్‌ నేడు అసమర్ధ సంతానపు అనాధ తల్లిగా తల్లడిల్లుతోది. కమ్యూనిస్టులు అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలూ ఇక చాలించాలి. దాయాది ఆలింగనలు, దాగుడుమూతలు కట్టిపెట్టాలి. తాము సంఘటితమై సొంత వ్యక్తిత్వంతో ప్రత్యక్షంగా రంగంలోకి దిగాల్సిన తరుణం వచ్చింది. ముందు నిలిచింది. ఇది నిస్పష్టమైన సందర్భం. పాలకవర్గ రాజకీయ పార్టీలకి నిజమైన ప్రత్యామ్నాయ ప్రజా ఉద్యమానికి భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ), భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్‌) (సిపిఐఎం) నడుం కట్టాలి. ఈ పార్టీలే బాధ్యత తీసుకొని చొరవ చేయాలి. వీరితో కలిసి నిలిచేందుకు మరికొన్ని కమ్యూనిస్టు గ్రూపులు బహిరంగంగానే తమ సమ్మతిని ప్రకటిస్తున్నాయి. పాలకపార్టీల నిజరూపాన్ని అర్థంచేసుకున్న దళిత, బహుజన సంఘాలు ముందుకొస్తున్నాయి. కమ్యునిస్టులారా ఆంధ్రదేశం సర్వనాశనం అవుతున్నాకూడా అనవసరపు పట్టుదలలను పట్టుకు వేలాడకండి. ఆ మత్తు ఉన్మత్తాల నుండి బైటపడండి. ఇది ప్రజల, కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషుల డిమాండు. జనం కోసమే సిద్ధాంతాలు, వ్యూహాలు, ఎత్తుగడలు ఉండాలి. కాకుంటే పిడివాదం అవుతుంది. అలా పిడివాదులుగా చరిత్రలో శాశ్వతత్వాన్ని పొందకండి. ఇప్పుడైనా అంధ్ర రాష్ట్రంలో వామపక్ష ప్రజాస్వామ్య సంఘటనకు నడుంకట్టండి. ఒకప్పుడు భారత కమ్యూనిస్టు ఉద్యమానికి ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అగ్రగామిగా నిలిచింది. కష్టజీవుల అసమాన త్యాగాలతో శ్రామిక పతాకకు అరుణిమను అద్దింది. నేడు ఆ కష్టజీవుల ఆత్మగౌరవాన్ని పాలక పార్టీల నాయకులు కొల్లగొడుతున్నారు. దొరల అహంభావ, అవినీతి అక్రమాలు, హింసా దౌర్జన్యాలతో అధోగతిపాలైన ఆంధ్ర రాష్ట్రంలో శ్రామిక జన ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించండి. సంపదను సృష్టించే కష్టజీవుల శ్రమ ఫలితాన్ని కొల్లగొట్టి వారినే అభాగ్యులు, ఉచిత పథóకాల కోసం దేబిరించే బిచ్చగాళ్ళు, అశక్తులుగా చిత్రిస్తున్నారు. తామేదో దానకర్ణులైనట్టు పాలకవర్గ పార్టీల అధినేతలు పోజులు పెడుతున్నారు. ఈ కపట నాటకాన్ని బద్దలుకొట్టగల నిజమైన శక్తిమంతులు కమ్యూనిస్టులే.
కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కరణ, త్రిపురనేని రామస్వామి హేతువాద ఉద్యమాలు కమ్యూనిస్టుపార్టీ వర్గ పోరాటంతో పదునెక్కిన ఆంధ్రజాతి చైతన్యం నేడు మొద్దుబారింది. బండబారింది. మూఢనమ్మకాలు, అమానుష కుల,మత ఉన్మాదం తలకెక్కి విలయ తాండవం చేస్తున్నాయి. వైద్య, ఇంజనీరింగ్‌, ఐఏఎస్‌, ఐపిఎస్‌, అధ్యాపక చదువులు వృత్తి చదువులుగా పరిమితమయ్యాయి. మానవ విజ్ఞాన ప్రతీకలుగా నిలవలేకపోతున్నాయి. కారణం పాలకవర్గాలు వాటిని ఆమేరకు నిస్సారంగా మార్చేశాయి. ఇది ఏదో పొరపాటు అని సమర్ధించేందుకు, సరిపెట్టుకునేందుకు ఏమాత్రం వీలులేదు. అందులో దుర్మార్గమైన దాని వర్గ ప్రయోజనమే ఇమిడిఉంది. పూర్తి స్పృహతోనే విద్యావ్యవస్ఠను, దానిలో పరిమళించాల్సిన జ్ఞానాన్ని మానవీయ పార్శ్వాన్ని పాలక పక్షం ధ్వంసం చేసింది. ఇంకా ఇంకా చేస్తోంది. దీనిని ప్రతిఘటించగల ఏకైకశక్తి మానవత్వం తొణికిసలాడే కష్టజీవుల సిద్ధాంతం మార్క్సిజం మాత్రమే. అది తిరిగి పునఃప్రతిష్టితం కావాలంటే కమ్యూనిస్టు ఉద్యమం ఊపందుకోవడమే ఏకైక మార్గం. ఆ ఉద్యమ శక్తిని కమ్యూనిస్టులు తిరిగి సంతరించుకోవాలంటే కమ్యూనిస్టు ఐక్య సంఘటనే శాస్త్రీయ మార్గం. అట్టడుగు, బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహించే కార్మికవర్గ నాయకత్వమే అందుకు అర్హమైనది. అప్పుడే జనశ్రేణుల్లో ఆత్మగౌరవ స్పృహ మేల్కొంటుంది. దానికి ఉద్యమ రూపాన్ని ఇస్తుంది. పోరాట శక్తిని ఇస్తుంది.
దీనంతటి సారం ఒక్కటే. అదేమంటే కమ్యూనిస్టుల ఐక్య సంఘటన అత్యావశ్యకతే. కమ్యూనిస్టు ఉద్యమ విచ్ఛిన్నత వల్ల జరిగిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దుకునే మరొక అవకాశం కమ్యూనిస్టుల కళ్లెదుట నిలిచింది. దానిని అందిపుచ్చుకొని కమ్యూనిస్టుల్లో వర్గ స్పృహ, సైద్ధాంతిక అవగాహన, సామాజిక న్యాయంలో నిబద్ధత ఇంకా మిగిలి ఉన్నాయని చాటండి. కమ్యూనిస్టులు పతితులు, భ్రష్టులు, బాధా సర్పదష్టులు, సకల కష్టజీవుల ప్రతినిధులని చాటండి. ఆంధ్రుల నిజమైన ఆత్మగౌరవాన్ని నిలపండి. పాలక వర్గ పార్టీలు చెప్పేది ఊహాజనిత ఆత్మగౌరవం. అది వారికి అధికారాన్ని కట్టబెట్టే ముఖ్య సాధనాల్లో ఒకటి మాత్రమే. కమ్యూనిస్టులు నిలబెట్టేది సమస్త ప్రజానీకపు నిజమైన ఆత్మగౌరవం. కమ్యూనిస్టుల ఐక్య సంఘటన రూపొందాలి! అయిదు కోట్ల ఆంధ్రుల నిజమైన ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి!!
కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img