Friday, December 1, 2023
Friday, December 1, 2023

కరువు మండలాలపై సవతితల్లి ప్రేమ

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ` రైతు ఏడ్చిన రాజ్యం నిలవదన్న చందంగా మన రాష్ట్రంలో వ్యవసాయంపై ప్రభుత్వం తీరు ఉన్నది. ప్రస్తుతం కరువు తీవ్ర రూపం దాల్చింది. అన్ని జిల్లాలు అత్యల్ప వర్షం కేటగిరిలో మగ్గుతున్నాయి. జూన్‌ 1 నుండి సెప్టెంబరు వరకు 574.7 మి.మీటర్ల వర్షపాంతం నమోదుకావల్సి ఉంటే 487.2 మి.మీటర్లు మాత్రమే కురిసింది. 15.2శాతం తక్కువ వర్షం పడిరది. అక్టోబరు 1 నుండి నవంబరు 1 మధ్యకాలంలో 173.5 మి.మీటర్లు గత సంవత్సరకాలంలో కురవాల్సిఉంటే ప్రస్తుత సంవత్సరం ఈ కాలంలో 20.7 మి.మీటర్లు మాత్రమే అంటే 88.1శాతం అతితక్కువ వర్షపాతం నమోదైంది. 17 జిల్లాల్లో 20శాతం నుంచి 60శాతం వరకు తక్కువ నమోదుకాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 61.6శాతం అతి తక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తం ఖరీఫ్‌ సీజన్‌లో 29.8శాతం లోటు వర్షపాతం నమోదైంది. 18 జిల్లాల్లోని 440 మండలాల్లో తీవ్ర కరువు, దాదాపు 40 మండలాలకు పైగా తీవ్ర దుర్భిక్షం ఉన్నది. ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల, వెలిగోడు, సోమశిల, కండలేరులలో గత సంవత్సరం అక్టోబరు 25 నాటికి 800.33 టియంసిల నీటి నిల్వలు ఉంటే ప్రస్తుతం 326.5 టియంసిలు మాత్రమే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం యల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువ కురుస్తాయని వాతావరణ శాఖ, పర్యావరణ శాస్త్రవేత్తలు ముందుగా హెచ్చరికలు జారీచేశారు. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో నమోదైన వర్షపాతం అత్యల్పం. 122 సంవత్సరాల క్రితం నమోదైనదానితో సమానం. 2023 సెప్టెంబరు మాసంలో కొద్దిపాటి వర్షాలు కురిసినా అక్టోబరులో తిరిగి ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అక్టోబరులో 89శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రాయలసీమ వ్యాప్తంగా సాధారణంకంటే 90శాతం వర్షాలు తక్కువ పడ్డాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా వై.యస్‌.ఆర్‌. కడపలో 97శాతం తక్కువ నమోదైంది. కర్నూలు జిల్లాలో 99శాతం తక్కువ వర్షం కురిసింది. కోస్తా జిల్లాల్లో సైతం 88శాతం తక్కువ వర్షాలు నమోదైనాయి. తీవ్ర వర్షాభావంవల్ల భూగర్బ జలమట్టం పడిపోయి రాయలసీమ జిల్లాల్లో సగటు నీటిమట్టం 2.75 మీటర్లు తగ్గింది. కోస్తాంధ్ర జిల్లాలో సగటు 1.49 మీటర్లు, రాష్ట్ర సగటు నీటి మట్టం 1.88 మీటర్లు తగ్గిపోయింది.
తీవ్ర వర్షాభావం ప్రాజెక్టుల నీటిమట్టం, భూగర్భజల నీటిమట్టం తగ్గిపోవటంతో పంటలు ఎండిపోయి రైతాంగం దిగుబడులపై ఆశలు వదులుకున్నారు. మరోవైపు విద్యుత్‌ కోతలు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో సైతం సాగునీరందక వరి తదితర పైర్లు ఎండిపోవడం జరుగుతున్నది. ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 34.39 లక్షల హెక్టార్లు కాగా, సాగైంది 24.98 లక్షల హెక్టార్లు మాత్రమే. రబీ పంటకాలంలో సాధారణ సాగు 22.38 లక్షల ఎకరాల్లో జరగాలి. గత సంవత్సరం నవంబరు 1 వరకు 2.11 లక్షల హెక్టార్లలో సాగైతే ప్రస్తుతం 1.51 లక్షల హెక్టార్లలో మాత్రమే వివిధ పంటల సాగు జరిగింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ప్రభుత్వం జి.ఓ.యం.యస్‌. 4 ద్వారా అక్టోబరు 31న 103 కరువు మండలాలను ప్రకటించింది. యన్‌.టి.ఆర్‌. జిల్లా 2, కర్నూలు 24, నంద్యాల 6, అనంతపురం 28, శ్రీ సత్యసాయి 21, అన్నమయ్య 18, చిత్తూరు 4 మండలాలను మాత్రమే కరువుగా ప్రకటించింది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో కరువు తీవ్రత అధికంగా ఉన్న మిగిలిన జిల్లాలను కరువుగా ప్రకటించకపోవడం దురదృష్టకరం. కేవలం వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఖరీఫ్‌లో దాదాపు 25 లక్షల ఎకరాల్లో సాగు జరగని విషయాన్ని ప్రభుత్వం విస్మరించింది. కృష్ణా డెల్టాతోసహా వివిధ ప్రాజెక్టుల క్రింద సాగైన వరి పంటకు నీరు అందక నెర్రెలతో పంట భూములు దర్శనమిస్తున్నా, వేసిన పంటలు ఎండిపోతున్నా దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని రైతుల ఆవేదన పాలక ప్రభుత్వానికి పట్టకపోవడం ఆశ్చర్యం. ఈ స్థితిలో ప్రస్తుతం కరువు మండలాల ప్రకటనపై ప్రభుత్వం పునఃసమీక్షచేసి కరువు మండలాలను ప్రకటించాలి. ప్రకటించిన కరువు మండలాలతోపాటు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కరువు నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్‌, రబీలో ఇప్పటి వరకు పంట వెయ్యలేకపోయిన రైతులను కూడా ఆదుకోవాలి. పంటవేసి నష్టపోయిన రైతాంగానికి ఆహార పంటలకు 25వేలు, వాణిజ్య పంటలకు 50వేలు, ఉద్యాన పంటలకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి.
గ్రామీణ ప్రాంతాల్లో రైతుకూలీలు పెద్దఎత్తున వలసలు పోతున్నారు. వందలాది గ్రామాల్లో త్రాగునీటికి సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వ్యవసాయ, ఉద్యాన, జలవనరుల, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రత్యామ్నాయచర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్న కనీస విజ్ఞత రాష్ట్ర్ట ప్రభుత్వానికి కొరవడిరది. తక్షణం రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల నుండి రైతాంగాన్ని, గ్రామీణ పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వెంటనే రాజకీయ పక్షాలు, రైతుసంఘాలతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించాలని, ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించి ఖరీఫ్‌లో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, రబీ పంట కాలానికి అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
తక్షణం కరువు మండలాలపై పునఃసమీక్షచేసి తిరిగి ప్రకటించాలి. పంటల బీమా అమలు చేయాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి వలసల నివారణకు చర్యలు చేపట్టాలి. ఖరీఫ్‌ కాలంలో రైతులు, కౌలు రైతులు తీసుకున్న అన్ని రకాల అప్పులను రద్దుచేసి రబీపంట కాలానికి తిరిగి వడ్డీలేని రుణాలు ఇవ్వాలి, రబీలో పంటలు వేసే రైతాంగానికి 90శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలి. పశుగ్రాసం, దాణా ఉచితంగా అందించాలి. కరువు పెన్షన్లు ఇవ్వాలి.

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img