Friday, December 1, 2023
Friday, December 1, 2023

కరోనాను పెంచిపోషిస్తున్న ప్రభుత్వాలు

బంగారు వి బి ఆచార్యులు,

‘‘సొంత లాభం కొంత మానుకు
పొరుగు వారికి పాటు పడవోయ్‌’’ అని గురజాడ వారు చెప్పినట్టు
ఎల్లపుడు చేతులు సహాయమందించడానికి సిద్ధంగా ఉండాలి.
నేను, నా ఇల్లు, నా మనుషులు, నా కులం, నా మతం అని కుంచించుకు పోయిన మానవాళికి ఈ విషయం అర్ధం కాకపోవచ్చు. ప్రపంచంలో ఏమూల ఉన్నా మనం మానవులం, మనదంతా ఓకే జాతి అనే కనీస ఇంగితం ఉన్న వారయినా ఆలోచించాల్సిన విషయం. మనతో పాటు ఈ విశ్వంలో అనేక జీవరాసుల కలిసి జీవిస్తున్నాయి. వాటికి లేని నా అనే స్వార్ధ పూరిత భావం మనకెందుకు? ఏమి సాధిద్దామని.
ప్రపంచంలో ఎక్కడో ఒక పట్టణంలో ఒకవ్యాధి పుట్టి అది ప్రపంచం నలుమూలలు తిరిగి విస్తరించి దాదాపు రెండు సంవత్సరాలు సమస్త మానవాళికి కంటిపై కునుకు లేకుండా మూతి ముక్కు మూయించి, కడిగిన చేతులె మరల మరల కడిగించి, చేతి రేఖలు పోయేలా సానిటయిజర్‌ పూయించి తలుపులు బిడాయించుకు కూర్చొనే స్థాయికి తెచ్చిందంటే ఎక్కడికక్కడ రాజ్యాలు చేసిన తప్పిదం కాదా?
ప్రారంభంలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసుకొని ఉంటే, వాణిజ్య సంబంధాలు నిలువరించ గలిగి ఉంటే కోట్లాది మంది మృత్యువాత పడేవారా? ఇవాళ మరల సెకండ్‌ వేవ్‌, భవిష్యత్లో వస్తాయంటున్న వేవ్‌ గురించి ఆలోచించి వలిసిన అవసరం ఉండేదా? ఈమాత్రం కూడా ఆలోచించలేని నాయకులనా మన రక్షణ కోసం, దేశ రక్షణకోసం ఎన్నికలలో మనం ప్రజాస్వామ్యం ముసుగులో ఎన్నుకొన్నది. ఇది ఈ దేశ పౌరులుగా సిగ్గుపడాల్సిన విషయం. దేశ అగ్రజులకు ఆలోచన తట్టకపోవచ్చు. ప్రజల సొమ్ము లక్షలకు లక్షలు జీతాలుగా తీసుకునే సలహా దారులకైనా తట్టలేదా? మన దేశంలోని మన మేధావి నాయకులు పారాసిటమోల్‌ మాత్రలతో పోతుంది. మన ప్రాంతాలు అధిక ఉష్ణ ప్రాంతాలు. మనని ఏమి చెయ్యలేదు. ఇక్కడికొస్తే మాడి మసయి పోతుంది. అని పుంఖాను పుంఖాలుగా స్టేట్మెంట్లు ఇచ్చిన నేతలు తర్వాత నాలిక్కరుచుకొన్నారు. అది సృష్టించిన బీభత్సం చూశాక నలుగురితో పాటు ముక్కు మూతి మూసుకొని ఇళ్లల్లో దాక్కున్నారు. దానితో సహవాసం చేసి చచ్చి బ్రతికినోడికి తెలుస్తుంది. దాని తడాకా ఏమిటో. తల్లి తండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల హృదయ విదారక గాధలు సోషల్‌ మీడియాలో చూస్తుంటే కఠినాత్ములకైనా కళ్ళు చెమర్చక మానవు. బెడ్‌ మీద పేషెంట్‌కు మందులు దొరకవు. ఆక్సిజన్‌ అందదు. వచ్చినవాడికి బెడ్‌ ఉండదు. చివరకు చచ్చిన వాడికి స్మశానంలో జాగా లేదు. పవిత్ర గంగా నదిలో శవాల తంతు చాలా సిగ్గుపడాల్సిన విషయం.
మన దేశంలో 2020 జనవరి లోనే కేరళలో మొదటి కేసు బయట పడిరది. గుణపాఠాలేమిటి? అప్పటికే వైరస్‌ చాలా దేశాలు చుట్టి వచ్చింది. మొదటి కోవిడ్‌ 19 వేవ్‌ అనుభవాలనుండి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి గుణపాఠాలు నేర్చుకున్నాయి? ప్రజలేమి నేర్చుకున్నారు, ఏమి తెలుసుకున్నారు? మొదటిసారి సమయంలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ముందుగానే వేరియెంట్‌ వస్తుందన్నప్పుడు. అంతర్జాతీయ వైమానిక దారులు మూసేసారా? లేదా రాష్ట్రాల సరిహద్దులనైనా మూసేసారా? జనాలు గుమికూడకుండా ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదే మాకేమి సంబంధంలేదు, రాష్ట్రాలు నిర్ణయం తీసుకుని అమలు జరుపుకోమని, కేంద్రం తన భుజాలపై ఉంచుకోవలసిన కాడి రాష్ట్రాలపై పడేసింది. పోనీ రాష్ట్రాలన్న ముందు జాగ్రత్త చర్యలేమైన తీసుకున్నాయా అంటే అదీ లేదు సరిగదా.. ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన వెంటనే అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు నడుము బిగించి బాహాటంగా మాస్కులు కూడా ధరించకుండా జనాల్ని పొగుచేసుకోవటం, బలప్రదర్శనలు చేసుకొని ఒకప్రాంతం నుండి మరి ఒకప్రాంతానికి విస్తరింప చేశారు కరోనాను. కేంద్ర ప్రభుత్వమైతే 5 రాష్ట్రాల జనాల్ని కలగాపులగం చేసి వదిలింది. ఇది చాలదన్నట్టు కుంభమేళాలు. సాధు పుంగవులకి, భక్త జనులకు మునిగిరమ్మని పర్మిషన్‌ ఇచ్చారు. వారు మాస్కులు కూడాలేకుండా ఒకచోట గుమికూడి సరిగంగ స్నానాలాచరించారు. ఇలా తప్పులమీద తప్పులు చేసుకుంటూ నీరో చక్రవర్తులను తలపించారు.
మూడో వేవ్‌ ఇప్పటికే మనదేశంలో ప్రవేశించింది. ఇప్పటికి ప్రపంచ జనాభాలో ఇంచుమించు మూడవ వంతుగా ఉన్న మన జనాభాకు మొదటి విడత టీకాలు ఎప్పటికి పూర్తి చేస్తారు? కేవలం మొదటి విడత టీకా సరిపోదు. రెండవ విడత పూర్తి అయితేగాని రోగ నిరోధక శక్తి సరిపోదంటున్నారు మన వైరాలజీ ప్రముఖులు. రెండోవిడత టీకా వేయడానికి మన ప్రభుత్వాల దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? ఇప్పటికే కొన్ని దేశాలు మూడవ విడత టీకాలు ట్రయిల్‌ రన్‌ నడుపు తున్నట్టు వార్తలొస్తున్నాయి.
లాక్‌డౌన్‌ పెట్టి కట్టడి చేసాం అంటారేమో. పూర్తిగా నియంత్రించారా? లేదే వీళ్ళ వ్యాపారాలు కుంటు పడతాయేమో అని యుద్ధం పూర్తి కాకుండానే సిపాయిల్ని వెనక్కు తెచ్చినట్టు లాక్‌ డౌన్‌ ఉపసంహరించారు. దీన్ని చూస్తుంటే వ్యాధి పూర్తిగా తగ్గి పోతుందేమోనని భయ పడుతున్నారా అనిపిస్తుంది. వ్యాధి పూర్తిగా తగ్గిపోతే కోట్లాది రూపాయల మాస్కుల వ్యాపారం, సానీటైజర్ల వ్యాపారం, మందుల మాఫియా వ్యాపారం, కార్పొరేట్‌ ఆసుపత్రుల వ్యాపారం, ప్రాణ వాయువు వ్యాపారం, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల వ్యాపారం వగైరాలన్ని మూతపడిపోతాయేమో. సామాన్యుల ప్రాణాలేకదా అనుకుంటున్నారేమో. సామాన్యుల ఓట్లే మిమ్మల్ని గద్దెపై కూర్చోపెట్టాయి. ఆ విషయం మరచిపోయినట్టున్నారు. సంపూర్ణ మైన చర్యలు తీసుకోలేక, ఉన్నవారి ప్రాణాలు కూడా కాపాడలేక, చివరకు నిక్కచ్చిగా పోయిన ప్రాణాల లెక్కచెప్పలేక అచేతన స్థితిలో ఉన్నారు. పోగా మిగిలిన వాళ్లనే పరిపాలిద్దాం అనే ఆలోచనకొచ్చినట్టు ఉన్నాయి మనప్రభుత్వాలు. ఇంతకు జరిగిన మరణాలు జి ఎస్‌ టి పంచుకున్నట్టు ఎవరి ఖాతాలో ఎంతమందిని వేసుకుంటారో వేచి చూద్దాం…
పుట్టిన ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ప్రభుత్వాలు ఆ అవకాశం కల్పించటం తమ బాధ్యత గా గుర్తించాలి. మనదేశంలో ప్రభుత్వ రంగ వైద్య విధానానికి ఎంత శాతం ఖర్చు పెడు తున్నాము. ఇంత మంది జనాభాకు అవసరమైన వైద్య సదుపాయాలయినా సమకూర్చుతున్నామా? ప్రభుత్వ రంగంలో ఎన్ని రీసెర్చ్‌ సెంటర్లు ఉన్నాయి. కనీసం ఎన్ని మండల కేంద్రాలలో, మున్సిపాలిటీల పరిధిలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి. ఎంతమంది జనాభాకు ఎంతమంది వైద్యులను నియమించాము అనేది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయమిది. నిజం మాట్లాడిన వాడిపై కేసులు బనాయించటం కాదు. అటు ప్రభుత్వమేకాదు. ఇటు ప్రజల బాధ్యతారాహిత్యం ఎక్కువయింది. కరోనాని పారద్రోలకపోతే భవిష్యత్‌లో ఎన్ని వేరియెంట్లు అయినా వస్తాయి. ఇదే ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తే మనమంతా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img