Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

కర్ణాటక బీజేపీలో భగ్గుమన్న అసమ్మతి

టీవీఎస్‌

కర్ణాటక పాలక బీజేపీలో ముఠా కుమ్ములాటలు, అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి మే నెల 10వ తేదీన జరగనున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి, మలి జాబితాను ప్రకటించిన వెంటనే టిక్కెట్లు దక్కని దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు, మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్‌సవది బీజేపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. లక్ష్మణ్‌ ఏకంగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు చేశారు. 224 అసెంబ్లీ స్థానాలకుగాను మరో పదిస్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు పలుకుబడిగల లింగాయత్‌లలో అత్యధికంగా పోటీ అభ్యర్థులను ఎంపిక చేశారని బొమ్మయ్‌ వర్గం గుర్రుగా ఉన్నారని వార్తలు. టిక్కెట్లురాని వారిలో ఇటీవల 40లక్షల లంచం తీసుకుంటూ (కొడుకుద్వారా) పట్టుబడి అరెస్టయిన విరూపాక్షప్ప, అవినీతి ఆరోపణలలో కూరుకుపోయిన మాజీ మంత్రి కెఎస్‌ఈశ్వరప్పలు బీజేపీని వీడనున్నట్లు వార్తలు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ను యువతకు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వం కోరగా తిరస్కరించి తాను చివరిసారిగా పోటీ చేయవలసిందేనని భీష్మించారు. అంతిమంగా ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే ముదిగిరె ఎంఎల్‌ఏ, ఎంపి కుమారస్వామి, హవేరి ఎంఎల్‌ఏ ఒలేకర్‌లు బీజేపీ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేసి తిరుగుబాటు చేశారు. దాదాపు పదిమంది ఎంఎల్‌ఏలు ఇంతవరకు తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేస్తూ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. వీరుగాక మరికొందరు ఎంఎల్‌ఏలు, కార్పొరేషన్లలో అనేకమంది ఎంఎల్‌ఏల అనుచరులైన కార్పొరేటర్లు రాజీనామా చేసి పార్టీ నాయకత్వానికి షాక్‌ ఇచ్చారు.
ఈసారి ఓటమి తప్పదని సర్వేల అంచనాలు వెల్లడవుతున్నదశలో ముస్లింలకు గత 4శాతం రిజర్వేషన్లను రద్దుచేసి లింగాయత్‌లకు రెండు, ఒక్కలిగలకు రెండుశాతం కేటాయిస్తూ బొమ్మయ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తగినాధారాలులేవని, లోపభూయిష్టమైన నిర్ణయమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది. బొమ్మయ్‌ ప్రభుత్వం ఇప్పుడు అత్యవసరంగా ముస్లింలకు రిజర్వేషన్లు రద్దుచేసి మరో రెండువర్గాలకు కేటాయించవలసిన అవసరం ఏమొచ్చిందని న్యాయమూర్తులు కె.ఎంజోసెఫ్‌, బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లకు సమాధానం ఇవ్వడానికి ఏప్రిల్‌ 17వరకు సర్వోన్నత న్యాయస్థానం గడువిచ్చింది. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయడానికి కచ్చితమైన సమాచారంలేదని, దీనిపై సమగ్ర అధ్యయనమూ లేదని ముస్లింల తరఫున వాదించిన సీనియరు న్యాయవాదులు కపిల్‌సిబల్‌, దుష్యంత్‌ దవేలు పేర్కొన్నారు.
సమాధానం దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కర్ణాటక తరఫున వాదిస్తూ కోరారు. మార్చి 20వ తేదీన బొమ్మయ్‌ జారీచేసిన జీఓ ప్రకారం జవాబు దాఖలు చేసేలోపు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని ధర్మాసనం ఆంక్షలు విధించింది. లోపభూయిష్టమైన అంచనాలతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తమకు సమర్పించిన పత్రాలు తెలియజేస్తున్నాయని ధర్మాసనం తెలిపింది. అసలే తిరుగుబాట్ల తలనొప్పులతో సతమవుతున్న బీజేపీ నాయకత్వానికి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలుసైతం నష్టం కలిగించేవేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అవినీతికి మారుపేరుగా నిలిచిన ప్రభుత్వంపై ప్రజలలో ప్రత్యేకించి ఒక్కలిగలలో వ్యతిరేకత ఏర్పడిరదని గ్రహించిన బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయానికి కారణం.
తమది క్రమశిక్షణకు మారుపేరని,అవినీతి అంటని పార్టీ అని బీజేపీ అధినాయకత్వం చెప్పుకునే గొప్పలన్నీ నీటి బుడగలేనని కర్ణాటక పరిస్థితి అద్దం పడుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లోనూ సిద్దరామయ్య, డీకె శివకుమార్‌ గ్రూపులున్నప్పటికీ బీజేపీలో కుమ్ములాటలు బైటపడినట్లుగా పెద్దగా సమస్యకాలేదు. ఇక కాంగ్రెస్‌ మాజీ ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రకు రాష్ట్రంలో గణనీయమైన స్పందన లభించడం పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపింది. ఈసారి కాంగ్రెస్‌కే విజయావకాశాలు న్నాయని చాలా సర్వేలు అంచనావేశాయి. అయితే కులాల ప్రాతిపదికపైన, మతాల మధ్య విద్వేషప్రచారం ద్వారా ఓట్లు పొందడానికి బీజేపీ అనేక మాయోపాయాలను పన్నుతుంది. ఈ ధోరణి అన్ని రాష్ట్రాల్లోనూ అనుసరిస్తున్నది. ఇక అపారంగా తన వద్దగల నిధులను బీజేపీ వినియోగిస్తుందన్న విషయం బహిరంగ రహస్యం. రాహుల్‌ గాంధీ తనను వేధించినా, ఎంపీగా అనర్హుడిగా ప్రకటించినా, జైలులో నిర్బంధించినా సత్యం కోసమే నిలబడతానని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరిరక్షణకు పోరాడతానని పదేపదే చెప్తున్న మాటలు కూడా సామాన్యజనాన్ని సైతం ఆకట్టుకున్నాయని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అలాగే కర్ణాటక ఒకసారి ఒక పార్టీకి ప్రజలుపట్టం కడితే రెండవసారి అదే పార్టీ అధికారానికి రావడంలేదు. 1985 నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. టిప్పుసుల్తాన్‌ను ఒక్కలిగల నాయకులిరువురు చంపివేశారని, బ్రిటీష్‌ వాళ్లతో చేసిన యుద్దంలో చనిపోలేదని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు చేస్తున్న ప్రచారంపై ఒక్కలిగలు తీవ్ర ఆగ్రహంతోఉన్నారు. టిప్పుసుల్తాన్‌ను అడ్డుపెట్టుకొని ఓట్లు పొందాలన్న కుయుక్తి తమకే నష్టం కలుగుతుందని బీజేపీ నాయకత్వం ఆందోళన చెందుతోంది. ఈ పరిణామాలన్నీ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గెలుపుపై విశ్వాసం కలగడంలేదని రాష్ట్ర నాయకులే ప్రైవేటుగా అభిప్రాయ పడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img