Monday, March 27, 2023
Monday, March 27, 2023

కార్పొరేట్‌ సార్లూ…. ‘‘సార్‌’’ సినిమా చూడండి

చదువు ఏమిస్తుంది. ఏమివ్వాలి. టీవీల్లో ఒకటి, ఒకటి, ఒకటి, ఆరు, ఆరు, ఆరు, పది, పది, పది ర్యాంకుల హోరు కాదు కదా ఇవ్వాల్సింది. వొత్తిడికి తట్టుకోలేక పసి ప్రాణం ఊపిరి తీసుకోవడం కాదు కదా…. అన్నట్లు విద్యార్ధులంటే జ్ఞానార్జన కోసం వచ్చిన వారే కదా… మరి ఆ చిన్నారులను కస్టమర్లు అంటారేమిటి ఈ మాయదారి కార్పొరేట్‌ యాజమాన్యాలు. దానికి వంత పాడతారేమిటి ఈ ఆధునిక టీచర్లు, లెక్చరర్లు. దేశంలో విద్య వ్యాపారం కాదు కదా… మరి లక్షల ఫీజులు తీసుకుంటూంటే ఏలికలు చోద్యం చూస్తున్నాయేంటి. చూడడమేనా…. కార్పొరేట్‌ కళాశాలల యజమానులను దొడ్డిదారిన అత్యున్నతమైన శానసమండళ్లలోకి తీసుకొస్తారేమిటి. పైగా వారిని ఏలికల్లో భాగ స్వాములు చేస్తారేమిటి. ఈ ప్రశ్నలకు జవాబులు అందరికీ తెలుసు. కాని నిదురలోనే గతాన్ని, వర్తమానాన్ని నిమిషమేకాదు…. సంవత్సరాల పాటు మరచిపోవాలి కదా. అలా నిదురపోతున్న వారికి, ముఖ్యంగా కార్పొరేట్‌ కళాశాలల్లో పనిచేసే లెక్చరర్ల కోసం తీసిన సినిమాయే సార్‌. ఈమధ్యే విడుదలైంది. మనం చేయాల్సిన పని చేయలేని సమయంలో తెరపై హీరో చేస్తుంటే కలిగే ఆనందమే ఈ సార్‌ సినిమాలోనూ ఉంది. అందుకే అందరూ బాగుందని ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులందరు కార్పొరేట్‌ కళాశాలల బాధితుల్లాగే కనపడే చిత్రమైన దృశ్యాలు సినిమా నిండా కనిపిస్తాయి. ఈ సార్‌ సినిమాలో హీరో ధనుష్‌లో తననే పోల్చుకుంటున్నారు ప్రేక్షకులు. నిజానికి ఇలా పోల్చుకోవాల్సింది కార్పొరేట్‌ కళాశాలల లెక్చరర్లే.
ఎడమ కాలు విరిగి, తలిదండ్రులు లేని ఆ కుర్రాడు అలసిపోయే వరకూ చేతి పంపు కొడితే వచ్చే నీళ్లతో ఎర్రటి ఎండలో రక్తమోడుతున్న కాళ్లతో నడవలేకపోతున్న ఆ లెక్చరర్‌కి ఊరట ఇచ్చాడనుకున్నారంతా. తన ఏకాకి ఎడారి జీవితానికి ఓ ఆలంబన అయ్యాడనే కృతజ్ఞతతో కాళ్లు కడిగి మీరు మాకు కావాలి సార్‌ అన్నాడనిపించింది నాకైతే. ఆ కుర్రాడు ఎంసెట్‌లో మొదటి ర్యాంకు తెచ్చుకుని తర్వాత కలెక్టర్‌ అయి ఎల్‌బో స్టిక్‌తో నడిచి వస్తుంటే వెనుక గోడకున్న ఫోటోలో చిరునవ్వుతో ఉన్న ఆ లెక్చరర్‌ మురిసిపోతున్నట్లుగా కూడా అనిపించింది. లెక్చరర్లందరికి ఇలా కాళ్లు కడిగించుకోవాలని లేదా… ఓ కలెక్టర్‌ తన పేషీలో మీ ఫొటో పెట్టుకుంటే బాగుందనే కల కనాలని లేదా. ఉంది. ఉంటుంది. గోడకే కాదు… తాము పాఠాలు చెప్పిన పిల్లలందరి గుండెల్లో మీ ఫొటో ఉంటే బాగుండునని ఉంటుంది. కానీ, కార్పొరేట్‌ చదువుల మాయదారిలోకం మీలో కర్కశత్వాన్నే విద్యార్ధులకు పరిచయం చేస్తుంది. కార్పొరేట్‌ యాజమాన్యాలు మీ భుజాల మీద వాళ్ల తుపాకి పెట్టి విద్యార్ధులను టార్గెట్‌ చేయడమే కదా ఇప్పుడు విద్యావ్యవస్ధలో జరుగుతున్న విషాదం.
చదువుల తల్లి సరస్వతిని బజారులో వేలానికి పెట్టినప్పుడే దేశం దివాళా తీయడం ప్రారంభమైంది. సంస్కరణల పేరుతో దేశంలోకి కార్పొరేట్లు చొరబడినప్పుడే కదా చదువంటే ర్యాంకులు ఒక్కటేనని, చదువంటే లక్షల ఫీజులేనని అర్ధం అయ్యింది. ఆ బక్క పలచని హీరో తన విద్యార్ధుల కోసం ఆ పల్లెటూరు సిరిపురంలో చేసిన యుద్ధం ప్రతి ఊర్లోను జరుగుతుందని కాదు కాని, పల్లెల్లో ఒకింతైనా బతికి ఉన్న విద్యా వ్యవస్ధకు కాసింత ఊతం అవుతుందనే ఆశ. ఆ ఆశే గ్రామాల్లోని తల్లిదండ్రులకు శ్వాస. బస్సులేసుకుని పల్లెటూళ్లకి వచ్చేస్తున్న కార్పొరేట్‌ యాజమాన్యాలకు ఈ సార్‌లే సమాధానం చెప్పాలని ఓ కల. సామాన్యుల కలను చిదిమేసే కార్పొరేట్‌ వ్యవస్థ ఏనాటికైనా కాలం చేస్తుందని ఓ ఆశ. కల కనడం, ఆశ పడడం వినా ఈ సామాన్య, మధ్యతరగతి మానవులు చేతుల్లో ఏముంటుంది. కాకపోతే ఇదిగో ఇలా సార్‌ వంటి సినిమాలు వస్తే కల నిజమవుతుందని, ఆశ చిగురిస్తుందని నమ్మకం కలుగుతుంది. కళ చేయాల్సిన పని అదే కదా… మనిషిలో బతుకు మీద ప్రేమ పుట్టించడమే కదా. ఈ సార్‌ సినిమా ఆ పనే చేసింది.
సీనియర్‌ జర్నలిస్టు, 99120 19920

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img