Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

కుక్క`గాడిద`ఓ తెలుగు అబ్బాయి

చింతపట్ల సుదర్శన్‌

ఈ భూమ్మీద మనుషులంత తెలివైనవారు మరిలేరు. అందువల్లే కదా నాలుగుకాళ్లను రెండుకి తగ్గించుకున్నారు. ఊగులాడే తోకను పీకేసుకున్నారు. మేం మాత్రం నాలుగు కాళ్లమీదే నడుస్తున్నాం. తోక ఊపుకుంటూ తిరుగుతున్నాం. ఈ తరం మనుషులకు మేం తెలియక పోయినా పుస్తకాల్లో మా బొమ్మలు చూసి ఉండవచ్చు. ఇళ్లల్లో తండ్రులు కొడుకుల్ని గాడిదలనీ, గాడిద కొడుకులనీ తిట్టినప్పుడు మా జాతి గుర్తుకురావచ్చు. గాడిదల్లో మనుషులు ఉండకపోవచ్చుకానీ మనుషుల్లో గాడిదలు ఉన్నారంటే కాదనేవారున్నారా?
అవును నేను గాడిదనే. ఒకప్పుడు మూటలు మోసిన వాణ్ణే. ఇప్పుడు ఎవరికీ పనికిరాకపోవడంతో ఒంటరి తిరుగుళ్లు తిరుగుతున్నా. గాడిదనైనంత మాత్రాన తెలివిలేని వాణ్ణేంకాదు. వెనుకట ‘కిషన్‌చందర్‌’ అనే రచయిత రాసిన ‘గాడిద ఆత్మకథ’ లోని గాడిద నా ముత్తాత. ఆ గాడిద ఎంత తెలివైందో చెప్పక్కర్లేదు. అప్పటి ప్రధానమంత్రి నెహ్రూను కల్సి మాట్లాడిరదట. జీన్స్‌ వల్ల నాకూ ఆ తెలివి వచ్చినట్లుంది. మనుషులు రోజూ దినపత్రిక చదివి పారేస్తారేమో నేను మాత్రం నమిలి మింగేస్తాను. అక్షరమక్షరం నా పొట్టలో స్టోర్‌ అవుతుంది. అందువల్ల మనుషులకు సంబంధించి నాకు తెలియని విషయాలంటూ లేవు.
ఎవరైనా నా ఎదురుగ్గా వచ్చి నిలబడితే పేపర్‌ వెయిట్‌ల వంటి కళ్లతో చూస్తూ పలుగు రాళ్లవంటి పళ్లు ఇకిలిస్తాను. కానీ నా వెనక్కు వచ్చి నిలబడితే మాత్రం కాలుఎత్తి ఫెడీఫెడీ తంతాను. మనుషుల్లో కూడా పైకి నవ్వుతూ వెనుకనించి పొడిచేవాళ్లు, తన్నేవాళ్లు, గోతులు తీసేవాళ్లులేరా? ఇక్కడేదో పేపరు కనపడుతున్నది. కరోనా కాలంలో పేపర్లే కనపడేవికాదు. ఇప్పుడు ఫరవాలేదు. దీన్ని నమిలితేనా బాన పొట్టకాస్త శాంతించవచ్చు.
గాడిద పేపరు నవుల్తుంటే మాంసం కొట్టు ముందు, తోకమీద కాళ్లు పెట్టుకుకూచున్న కుక్క నోరు తెరిచింది. అప్పట్నించీ వెయిటింగిక్కడ. ఓ ఎముకో, చిన్న మాంసం ముక్కో షాపులోంచి ఎగిరి బైటపడదా అని. ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా పదవులకోసం ఇలాగే చొంగ కారుస్తారట గదా. మా గాడిద ‘బ్రో’ చెప్పాడు. ఎక్కచూసినా కాంపిటీషనే. తీరా తిండానికి ఏదైనా వచ్చిపడిరదే అనుకోండి. ఎక్కడ్నించో నా జాతివాళ్ల్లు పదిమంది తోకలు ఊపుకుంటూ వచ్చేస్తారు. అప్పుడు జరుగుతుంది దొమ్మీ. జాతి వైరం మీ దగ్గరే నేర్చుకున్నాం. మాదంతా తిండికోసం పోరాటమేకాని తిండి ఎక్కువైకాదు. మేము ఇళ్లల్లో పరుపుల మీద నిద్రపోయే జాతి కుక్కలం కాదు. మమ్మల్ని ‘టామీ’ అని ‘కూగర్‌’ అనీ పిలిచేవాళ్లు లేరు. ‘స్లమ్‌ డాగ్స్‌’ అనీ ఊరకుక్కలనీ అంటారు. ఓ ముద్దపెట్టిన వాళ్ల చుట్టూ తోక ఊపుతూ తిరుగుతాం. మనుషులకు లేనిదీ మాకు ఉన్నదీ విశ్వాసమేకదా!
జాతి కుక్కను కాకపోతేనేం ఎంతో కొంతలోకం పోకడ తెలిసిన కుక్కనే. కరవడం రాకపోయినా ఆత్మరక్షణకు అరవడం నేర్చుకున్నాను. మనుషులకు మైకు అవసరం కానీ నా కక్కర్లేదు. నాదీ, బ్రదర్‌ గాడిదదీ డోల్బీ డిజిటల్‌ సౌండే.
బ్రదర్‌ గురించి చెప్పలేదు కదూ. ఈ నాటి ఈ బంధం ఏనాటిదో కాదు రెండేళ్ల కిందటిదే. రకరకాల పార్టీలవాళ్లు లౌడ్‌స్పీకర్లలో ‘తాడ్‌గా’ మాటల సంతర్పణచేసే మైదానం చివరున్న ఓ పాడుబడిన ఇంట్లో నివాసం ఉంటున్నాం. మాకు డబుల్‌ బెడ్రూమ్‌లు ఎవరిస్తారు? ఆ ఇల్లు ఏదో లిటిగేషన్‌లో ఉందని ఈ దేశంలో సివిల్‌ కేసుల ఆయుర్దాయం చాలా పొడుగాటిదని, ఓ నాటికి తెగి చావవని మనం పర్మనెంటుగా ఇక్కడేఉండి పోవచ్చని డాంకీ బ్రదర్‌ చెప్పాడు. బ్రదర్‌ చాలా తెలివైన వాడు. ఎన్ని పుస్తకాలు నమిలేడో, ఎన్ని మాగజైన్లు కొరికేడో ఎన్ని కరపత్రాలు మింగోడోకానీ ‘ఐఏఎస్‌’ పరీక్ష పాసవగల నాలెడ్జి సంపాదించాడు. అన్న దగ్గరే నేను ఎన్నో విషయాలు తెల్సుకున్నాను.
ఎముకేదో షాపులోంచి ఎగిరిముఖానపడ్డంతో అందుకుని పాడుబడ్డ ఇంటివైపు పరుగెత్తింది. తెల్లమచ్చల నల్లకుక్క. ‘ఏంటి డాగీ ఇవాళ తొందరగానే వచ్చేశావు?’ అని అడిగింది గాడిద అరుగెక్కుతున్న కుక్కతో. అదృష్టం కలిసొచ్చి ‘లా అండ్‌ ఆర్డర్‌’ ప్రాబ్లమ్‌ రాకముందే దౌడుతీశాను? అంది కుక్క ఎముకను ముందు కాళ్ల మధ్యపట్టుకు కూచుని. ‘మన మానవ మిత్రుడు ఇటువైపు రావడం లేదేం ఈ మధ్య’ అంది గాడిద పళ్లల్లో ఇరుక్కున్న పేపరు ముక్కని నాలుకతో కెలుకుతూ. ‘అదిగో వస్తున్నాడు’ అంది కుక్క ఎదురుగ్గా వస్తున్న మనిషినిచూపుతూ.
అరుగుపైకి ఎక్కినవాడు ఐదడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తుకి తక్కువలేడు. మూడుపదుల వయస్సుకి ఎక్కువాలేదు. మూడుపదుల వయస్సుకి ఎక్కువాలేదు. మాల్‌న్యుట్రిషన్‌ కారణంగానో నిరంతరంగా ‘లివర్‌తో ఫైటింగ్‌’ కారణంగానో ఎముకల మీద మాంసం దట్టంగా పెరగలేదు. అరుగుమీద ఉన్న బండరాయిమీద కూచుంటూ జేబులో సీసా బైటకుతీశాడు అబ్బాయి. ‘ఏంటి మళ్లీ ఏదైనా ప్రాబ్లమా?’’ అనడిగింది గాడిద. ‘ఉద్యోగాలు వచ్చేస్తున్నాయటగడా తాగుడు మానేస్తే పోలా?’ అంది కుక్క. ఎక్కడి ఉద్యోగాలు? పేపరులీకు చేశారని పరీక్షలు నిరవధికంగా వాయిదా పడ్డవి.’ సీసా మూత తీసి గుక్కెడు నోట్లో పోసుకుంటూ అన్నాడు అబ్బాయి. మనసు బాగాలేప్పుడు మనసు బాగా హుషారుగా ఉన్నప్పుడు ఈ అరుగుమీదకి వచ్చి మందుకొట్టే అబ్బాయికి కుక్క, గాడిదలతో బాగా స్నేహం కుదిరింది. వాటి భాష తెలుగు కావడంతో తాను తెలుగు అబ్బాయి కనక బాగా కనెక్టు అయిపోయాడు. ముగ్గురూ కల్సి పాలిటిక్స్‌, కరెంటు ఎఫైర్స్‌ మాట్లాడుకోవడం, కథలు చెప్పుకోవడం చేస్తుంటారు.
‘ఈ రోజు విశేషాలేమిటో’ అన్నాడు తెలుగు అబ్బాయి మిరపకాయ బజ్జీ నములుతూ. ‘రాజకీయ నాయకుల రాజకీయాలు ఉన్నంతకాలం, ఎందుకేస్తున్నామో, ఎవరి కేస్తున్నామో తెలియకుండా ఓట్లు వేసే మనుషులు ఉన్నంతకాలం విశేషాల కేమిలోటు. రాబోతున్నది ఎన్నికల కాలం మనకు కావలసిన ‘కాలక్షేపం’ అన్నది గాడిద. ‘అవునవును అన్నా! పెద్దన్నా! మనిషిని మనిషి అర్థం చేసుకోలేకపోతున్న నమూనాలో నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నావు. మాతో గడపడానికి వస్తున్నావు. వీలైనప్పుడు నువ్వు తెచ్చిన చికెన్‌ ముక్కోటి నాకు, పాత పేపర్‌ ఒకటి గాడిద బ్రో కు ఇస్తున్నారు. అప్పుడో ఇప్పుడో కాకుండా వారానికి ఒక్కసారన్నా వస్తే అన్న మన ఆలోచన్లు షేర్‌ చేసుకుందాం(అన్నది కుక్క).
అవునవును అన్నా! పెద్దన్నా! మనిషిని మనిషి అర్థం చేసుకోలేక పోతున్న జమానాలో నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నావు. మాతో గడపడానికి వస్తున్నావు. వీలైనప్పుడు నువ్వు తెచ్చిన చికెన్‌ ముక్కోటి నాకు, పాత పేపర్‌ ఒకటి గాడిద బ్రోకు ఇస్తున్నావు. అప్పుడో ఇప్పుడో కాకుండా వారానికి ఒక్కసారన్నా వస్తే అన్నా మన ఆలోచనలు షేర్‌ చేసుకుందాం’ అన్నది కుక్క.
తప్పకుండా! బజ్జీచేత్తో పట్టుకుని కాగితం గాడిద మీదకు విసిరేస్తూ అన్నాడబ్బాయి ‘తాగేవాడికి తాగినంత. భగీరధుడనేవాడు ఆకాశగంగను భూమ్మీదకు తెచ్చినట్టు సందుసందుకీ సారా పారిస్తున్నారు ఏలిన వారు. చుక్క చిక్కినప్పుడల్లా ఇక్కడికేవస్తా’ అంటూ తెలుగు అబ్బాయి ‘జగమే మాయ, బ్రతుకేమాయం’ పాట అందుకున్నాడు. ‘ఏ బ్రాండు తాగినా ఈ పాటే పాడాలా?’ అంది గాడిద. ‘ఇది తాగుబోతుల జాతీయ గీతం బ్రో’ అంది కుక్క. ఖాళీ సీసాని దూరంగా విసిరేశాడు తెలుగు అబ్బాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img