Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

కులగణనతోనే సామాజిక సమగ్రత

కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ ఓబిసి కులగణనపై కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని అలాగే కేంద్రం పార్లమెంటులో కులగణన బిల్లు తక్షణమే ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చారు. బిహార్‌లో కుల ఆధారిత జనగణన పూర్తి అయ్యింది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో బీసీ కుల గణనకు బీసీ ఉద్యమకారులు, దళిత ప్రజాతంత్ర వాదులు, వామపక్షాలు, మేధావులు డిమాండ్‌ చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడంలేదు. కుల గణన అనేది జరిగితే ఎవరు ఎంత శాతం ఉన్నారనేది తెలుస్తుంది. కులగణన చేపట్టక కేవలం ఎనిమిది శాతం ఉన్న ఆర్థికంగా వెనుకబడ్డ వారికి పది శాతం రిజర్వేషన్‌ కల్పించడం వలన వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. జనాభాలో 54శాతం ఉన్న వెనుకబడిన తరగతులకు కేవలం 27 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. జనాభాలో 54 శాతం ఉన్న అన్ని రంగాల్లో వెనుకబడి పోయారు. చట్టసభల్లోనే కాదు గ్రామ మండల స్థాయిలో ప్రాతినిధ్యం లేని కులాలు అరవై శాతం వెనుకబడిన తరగతులలో ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా ఓబీసీ వాటా భవిష్యత్తు తేల్చాలి. బీసీ కుల గణన చేపట్టకుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారుతో తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని మేధావులు హెచ్చరిస్తున్నారు. బీజేపీ సర్కార్‌ ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు వేయబోమని స్పష్టం చేశారు. రిజర్వేషన్లను ఎత్తేసేలా కేంద్రం వైఖరి బీసీ కుల గణనను చట్టం అనుమతిస్తుందని, కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. బీసీ జనాభా లెక్కలు లేకుండా దేశంలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు బడ్జెట్‌ కేటాయింపులు ఎలా చేస్తారు. కులాల లెక్కలు తేల్చితే విద్యావంతులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో తేలుతుంది. దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం కూడా తెలుస్తుంది. కుల గణన జరిగితే రిజర్వేషన్లు పెంచాలని బీసీల నుంచి డిమాండ్‌ వస్తుందన్న ఉద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ పని చేయడం లేదు. తెలంగాణ, బిహార్‌, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు కులాల లెక్కలు తీయాలని కోరారు.
అసెంబ్లీల్లో తీర్మానాలు సైతం చేశారు. ప్రజలంతా వారి కులాల లెక్కలు తీయాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. రూపాయి ఖర్చు లేకుండా కుల గణన చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీసీ జనాభా లెక్కలు బయటకొస్తేనే దోపిడీ చేసేవారికి అడ్డుకట్ట పడుతుంది. అందుకే లెక్కలు బయటకు రాకుండా ఆ వర్గాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘అందరూ సమిష్టిగా కేంద్రం మెడలు వంచాలి. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. బీసీల పోరాటానికి జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలవాలి. దేశంలో ఓబీసీల్లో 983 కులాలకు ఐదేండ్లుగా ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయోజనాలు అందట్లేదు. నిరుద్యోగం 8.4 శాతానికి పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు దివాలా తీసేలా చేస్తున్నారు. ఇన్సూరెన్స్‌, రైల్వే, కమ్యూనికేషన్‌, చివరికి ఇస్రో, హెచ్‌ఏఎల్‌ ప్రవేటు పరం చేస్తున్నారు. ఆయన ఏదో చేస్తున్నారన్న భ్రమ నుంచి ప్రజలు బయట పడాలి. బీసీల్లోని అన్ని కులాలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలి. కులం పేరుతో వివక్షకు గురైన వర్గాల వారికి సమ ప్రాతినిధ్యం దక్కించడం కోసమే రిజర్వేషన్ల వ్యవస్థ అని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వాల్సినవి సంక్షేమ పథకాలు మాత్రమే. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఈబీసీ వర్గాలకు ఎక్కడ నుండి వచ్చాయి? రిజర్వేషన్‌కు ప్రాతిపదిక కులం (సామాజిక వెనుకబాటు) మాత్రమే, కేంద్రంలో బీజేపీ ఏర్పడిన నాటినుండి అంతా తారుమారు అయింది. మండల్‌ కమీషన్‌ నివేదిక ప్రకారం ఓబీసీల జనాభా 54శాతం, అగ్రకులాల జనాభా ఎంత అనేది తెలియకుండా వారికి10శాతం రిజర్వేషన్లా? అసలు ఏ లెక్కల ప్రకారం 10శాతం కేటాయించారు అనే దానిపై చర్చ జరగలేదు. తీర్పు వెలువరించే ముందు ఓసిల జనాభాను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. రిజర్వేషన్లు 50శాతం దాటొచ్చు అన్న సుప్రీం తీర్పు వెనుకబడిన తరగతులు అనుకూలంగా మలచుకుని జనాభా దామాషా ప్రకారం ఓబీసీ లకు 54శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలి. సమగ్రంగా, శాస్త్రీయంగా అన్ని కులాల లెక్కలు తీయాలి. వేరే అంశాలు పక్కన పెట్టి జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలి. ఇదే అంశంపై దేశవ్యాప్త చర్చ జరగాలి.
రిజర్వేషన్లు 50శాతం దాటొచ్చు అన్న సుప్రీం తీర్పు ప్రకారం, ఓబీసీలకు 54శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి లేదా సమగ్రమైన, శాస్త్రీయమైన కులగణన ద్వారా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి. 1931జనాభా లెక్కల ప్రకారం ఓబీసీల జనాభా 54 శాతంగా మండల్‌ కమిషన్‌ పేర్కొంది, ఇప్పుడు ఆ శాతం మరింత పెరిగింది, ఎందుకంటే 1931 తర్వాత దేశవ్యాప్తంగా చాలా కులాలు ఓబీసీ జాబితాలో చేర్చారు. దళిత క్రిస్టియన్లు ఇప్పుడు అప్పటికంటే ఎక్కువయ్యారు. ఇప్పుడు లెక్కలు తీస్తే ఓబీసీ జనాభా 60 శాతం దాటొచ్చు, దానికనుగుణంగా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం పెరగాలి. చారిత్రాత్మకమైన తప్పిదాలకు మనము అవకాశం ఇవ్వొద్దు, మన భవిష్యత్తు తరాలు మనల్ని నిందించకూడదు. ఓబీసీల దీర్ఘకాలిక ప్రయోజనాలు సాధన కోసం సాధించేవరకు పోరాడాలి. దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు అర్ధాకలితో అలమటిస్తుంటే అదానీకి రోజుకు వెయ్యి కోట్ల ఆదాయం వస్తున్నట్టు ఇటీవల ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. ఈ ఆర్థిక దోపిడీని అరికట్టడంతో పాటు దేశంలోని బీసీలకు న్యాయం జరిగేంతవరకు అందరితో కలిసి ఉద్యమించాలి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 2018 ఎన్నికల సమయంలో బీసీ కుల గణన చేపడుతామని, రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అమలు చేయలేదు.
డా. యం.సురేష్‌ బాబు,
గౌతమ్‌ బుద్ధ అభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు
9989988912

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img