Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

కులవివక్షను ప్రశ్నిస్తున్న బహుజనులు`ఇరకాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌!

ఎం కోటేశ్వరరావు

అయోధ్యలో రామాలయ నిర్మాణం మీద చూపుతున్న శ్రద్ద, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల ముందు జనం దృష్టికి తెచ్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ నేతలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ప్రధాని పదవి చేపట్టిన తరువాత ఆరవసారి నరేంద్రమోదీ 2022 అక్టోబరులో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ను సందర్శించారు. ప్రభుత్వాలు హాజ్‌ యాత్రకు సహకరించటాన్ని, సబ్సిడీలు ఇవ్వటం గురించి గతంలో బీజేపీ పెద్ద వివాదాన్ని సృష్టించాడు. అసోంలో తాజాగా బీజేపీ ప్రభుత్వం శివరాత్రి సందర్భంగా జారీ చేసిన ప్రకటనలో భక్తులు, యాత్రీకులు కామరూప్‌ జిల్లాలోని డాకిని కొండ మీద ఉన్న భీమేశ్వర దేవాలయాన్ని సందర్శించాలని కోరింది. ప్రభుత్వం ప్రతి మతానికి చెందిన పండుగల సందర్భంగా ఇలాంటి ప్రకటనలు ఇస్తుంటే అదొకదారి, కానీ హిందూ పండగలకే ఇవ్వటం వివాదాస్పదమైంది. తాజాగా సిఎం యోగి ఆదిత్యనాధ్‌ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాధ్‌ ఆలయంలో శివరాత్రి పూజలు చేశారు. తమిళ కాశీ సంగం సమావేశాల్లో గతేడాది నవంబరులో మాట్లాడుతూ తమిళ భాష ఎంతో పురాతనమైనది, ఘనమైన సాహిత్యాన్ని కలిగి ఉంది అంటూనే రెండు భాషలూ శివుడి నోటి నుంచి వచ్చినవే అని చెప్పారు. తమ నేత ఒక శివభక్తుడని రాజస్తాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాట్‌ గతంలో చెప్పారు. ఈ ఏడాది శివరాత్రి సందర్భంగా రాహుల్‌ గాంధీ ఏ క్షేత్రాన్ని సందర్శించారో తెలీదు గాని శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన చేశారు. మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు మతాన్ని, దేవుళ్లను వీధుల్లోకి తెస్తున్న సంగతి తెలిసిందే. 2021లో అమెరికా చెందిన ‘‘పూ’’ సంస్థ మన దేశంలో ఒక సర్వే నిర్వహించింది. దానిలో వెల్లడైన కొన్ని అంశాలను చూస్తే ఎందుకు దేవుళ్ల కోసం రాజకీయ పార్టీలు వెంపర్లాడుతున్నదీ అర్ధం అవుతుంది. 2019 నవంబరు నుంచి 2020 మార్చి వరకు మన దేశంలో 29,999 మందిపై చేపట్టిన సర్వేలో 22,975 హిందువులు, 3,330 ముస్లింలు,1,782 సిక్కులు,1,011 క్రైస్తవులు, 719 బౌద్దులు, 109 జైనులు,67 మంది ఏమతం లేని వారు ఉన్నారు. 2019 ఎన్నికల అనంతరం జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తరువాత జరిపిన సర్వే ఇది. 2019 ఎన్నికల్లో పార్టీల వారీగా హిందువులు బీజేపీకి 49శాతం, కాంగ్రెస్‌కు 13శాతం ఓటు వేశారు. ముస్లింలలో కాంగ్రెస్‌కు 30, బీజేపీకి 19శాతం, క్రైస్తవుల్లో కాంగ్రెస్‌కు 30, బీజేపీికి పదిశాతం, సిక్కుల్లో కాంగ్రెస్‌కు 33, బీఏపీికి 19, బౌద్దుల్లో బీజేపీికి 29, కాంగ్రెస్‌కు 24శాతం మంది ఓటు వేశారు. ఈ ధోరణి 2014 నుంచి ఉంది. ఎవరి ఓటు బ్యాంకును వారు కాపాడుకొనేందుకు హిందువుల ఓట్లకోసం కాంగ్రెస్‌ నేతలు, మైనారిటీల ఓట్లకోసం బీజేపీి నేతలు వెంపర్లాడుతున్నారనేది స్పష్టం.
దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల విశ్వాసం తగ్గుతున్నదని ఈ సర్వే పేర్కొంది. మొత్తంగా ప్రజాస్వామ్య నాయకత్వం కావాలని 46శాతం మంది చెప్పగా, బలమైన నేత కావాలని చెప్పిన వారు 48శాతం. హిందువుల్లో మొదటిదానికి 45 శాతం మద్దతు పలకగా, రెండవ దానికి 50శాతం మంది మద్దతిచ్చారు. బలమైన నేత కావాలని స్త్రీలు 48, పురుషులు 49శాతం మంది కోరగా, ప్రజాస్వామ్యం కావాలని 44, 47శాతం మంది పేర్కొన్నారు. తెలంగాణాలో బిజెపి నేతలు హైదరాబాద్‌లోని వివాదాస్పద భాగ్యలక్ష్మి ఆలయం (చార్మినార్‌ వద్ద ఒక మినార్‌ పక్కనే తెచ్చిపెట్టిన విగ్రహం) నుంచే దాదాపు ప్రతి కార్యకమాన్ని ప్రారంభిస్తారు, కర్ణాటకలో ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టటం తెలిసిందే. కేరళలో ముస్లిం, క్రైస్తవ విద్వేషం ఇలా దక్షిణాది రాష్ట్రాలలో మత ప్రాతిపదికన ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకొనేందుకు బీజేపీ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నది. 2019 ఎన్నికల్లో హిందువులలో బీజేపీికి ఓటు వేసింది 49శాతమే. వీరు దేశ జనాభాలో 80శాతంవరకు ఉన్నారు. ప్రాంతాల వారీ చూస్తే ఉత్తరాదిన 68శాతం, మధ్యభారత్‌లో 65, పశ్చిమాన 56, తూర్పున 46, దక్షిణాదిన 19శాతం మాత్రమే ఉన్నారు. ఈ కారణంగానే దక్షిణాది మీద బీజేపీ కేంద్రీకరిస్తున్నది. నిజమైన భారతీయుడు అంటే హిందూ అన్నట్లుగా హిందూ అంటే హిందీ, హిందీ మాట్లాడేవారంటే హిందువులే అన్న భావనను రేకెత్తించేందుకు బీజేపీ చూస్తోంది. దానిలో భాగంగానే దేశం మొత్తం మీద హిందీని బలవంతంగా రుద్దాలన్న యత్నం. పూ సర్వే ప్రకారం నిజమైన భారతీయుడు హిందువుగా ఉండాలని భావిస్తున్నవారు 55శాతం, హిందీ మాట్లాడాలని చెప్పిన వారు 59, హిందూగా ఉండటం హిందీ మాట్లాడటం అనేవారు 60శాతం ఉన్నారు. ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత జనం మత వ్యవహారాల్లో రాజకీయపార్టీల, నేతల జోక్యాన్ని సమర్ధించేవారు అన్ని మతాల్లో మూడిరట రెండువంతుల మంది ఉండటం ఆందోళన కలిగించే అంశం. కొన్ని శక్తులు నిస్సిగ్గుగా మతాన్ని`రాజకీయాన్ని మిళితం చేస్తున్నాయి. మత పెద్దలమని చెప్పుకొనే వారు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. పూ సర్వే ప్రకారం మొత్తంగా చూసినపుడు 62శాతం మంది మత వ్యవహారాల్లో రాజకీయపార్టీల ప్రమేయాన్ని సమర్ధించారు. ముస్లింలలో రాజకీయపార్టీల ప్రమేయం ఉండాలన్న వారు 59శాతం, వద్దన్నవారు 35శాతం.మెజారిటీ మతతత్వం ఎంత ప్రమాదకరమో మైనారిటీ మతతత్వం కూడా అంతే ప్రమాదకరం. నిరుద్యోగం ప్రధాన సమస్య అని భావిస్తున్నవారు అందరిలో 84శాతం మంది ఉండగా, అవినీతి అని 76, మహిళలమీద నేరాలని 75, మతహింస అని 65శాతం మంది భావించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకున్నట్లుగా లోకం నడవదు. రామచరిత మానస్‌లో వెనుకబడిన తరగతుల వారిని కించపరిచినట్లు వచ్చిన వివాదం తరువాత ఆ సామాజిక తరగతులను సంతుష్టీకరించేందుకు ఆర్‌ఎస్‌ ఎస్‌ నేత మోహన్‌ భగవత్‌ రంగంలోకి దిగారన్నది ఒక అభిప్రాయం. తాము చెప్పే హిందూత్వ సనాతనమైనదని దానిలో కులాలు లేవని జనాన్ని నమ్మిం చేందుకు బిజెపి చూస్తున్నది. మోహన్‌భగవత్‌ ఈ ఏడాది ఒకదగ్గర మాట్లాడుతూ కులాలను సృష్టించింది పండితులే అని సెలవిచ్చారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మహిళలను కించపరుస్తూ తులసీదాస్‌ రామచరిత మానస్‌లో రాశారన్న విమర్శలను సమాజవాదీ, ఆర్‌జెడి నేతలు ముందుకు తెచ్చిన పూర్వరంగంలో భగవత్‌ ఈ మాటలు చెప్పారని అనుకోవచ్చు. ఈ దేశంలో పండితులు అంటే బ్రాహ్మలే కదా ! దాని మీద ఆర్‌ఎస్‌ఎస్‌లోని బ్రాహ్మలు, వెలుపల ఉన్న వారిలో కూడా గగ్గోలు తలెత్తటంతో నష్టనివారణగా ఒక వివరణ ఇచ్చారు.
కులవ్యవస్థ ఉనికిలోకి వచ్చిన నాటి నుంచి బ్రాహ్మణులు తప్ప వేదాలు చదివిన వారు ఇతర కులాల్లో ఎవరూ లేరు. వేదాల్లో ఉన్నదే చెబుతున్నారా అసలు వాటిలో ఉన్నదేమిటి అని తెలుసుకొనే ఆసక్తి కలిగిన వేళ్ల మీద లెక్కించగలిగిన వారు తప్ప వేదాలను చదివే ఇతర కులస్థులు ఎంత మంది ఉన్నారు? ఇటీవలి వరకు అసలు ఇతరులను చదవనివ్వలేదు. నిన్న మొన్నటి వరకు శూద్రులు, అంటరాని వారిగా ముద్రవేసిన వారికి కనీస చదువు సంధ్యలు కూడా లేవు కదా. అలాంటపుడు ఇతర కులాల్లోని ఏ పండితులు తమను తాము కించపరుచుకొనే విధంగా అంతరాలతో కులాలను ఎందుకు సృష్టించినట్లు? చదువుకున్నది బ్రాహ్మల తరువాత క్షత్రియులు, వైశ్యులు మాత్రమే. అంటే ఈ కులాలకు చెందిన మేథావులు అనుకుంటే అందులో బ్రాహ్మల వాటా ఎంత? ఇతరుల వాటా ఎంతో ఆర్‌ఎస్‌ఎస్‌ నిపుణులు వేదగణితంతో గుణించి చెప్పాలి. కుల వ్యవస్థ పోవాలని ఇప్పటికైనా ఆర్‌ఎస్‌ ఎస్‌ చెప్పటం, మారుమనస్సు పుచ్చుకోవటం మంచిదే. అందుకోసం వారు చేసిందేమిటి ?మాటలకే పరిమితం, చిత్తశుద్ది ఎక్కడా కనిపించదు. గమనించా ల్సిందేమంటే కులాల సృష్టి పండితులదే అని చెప్పటంతో హిందూ, బ్రాహ్మణ వ్యతిరేకం అంటూ హిందూత్వ అనుకూలురు మోహన్‌ భగవత్‌ మీద మండి పడుతున్నారు. పండితుల గురించి ఇచ్చిన వివరణను ఏ పండితులూ జీర్ణించు కోవటం లేదు. మరోవైపు పండితులుగా ముద్రవేసుకున్న వారు, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు కులవ్యవస్థను సమర్ధించే మనుస్మృతి పుస్తకాలను అచ్చు వేయించి ప్రచారం చేస్తున్నారు. దక్షిణాదిలో మనువాదం, దానికి ప్రతినిధులుగా ఉన్న బ్రాహ్మణులమీద ధ్వజమెత్తుతూ పెద్ద ఉద్యమం నడిచింది. బ్రాహ్మణులకు ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల కమ్మ బ్రాహ్మణులు వివాహతంతు వాటిని నిర్వహించిన రోజులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో బ్రాహ్మణులు కాకున్నప్పటికీ బ్రాహ్మణవాదాన్ని తలకు ఎక్కించుకున్న అనేకమంది వర్ణవ్యవస్థకు, హిందూత్వకు ముప్పు వచ్చిందంటూ వీధుల్లోకి వస్తున్నారు. ఇప్పటికీ తంతుల పేరుతో బ్రాహ్మణులు జనాన్ని దోచుకుతింటున్నారని, పరాన్న భుక్కులుగా ఉన్నారంటూ వ్యతిరేకతను వెల్లడిరచటాన్ని చూడవచ్చు. ఉత్తరాదిలో బీజేపీ మద్దతుదార్లుగా ఉన్న దళితులు,వెనుకబడిన తరగతులు తమ పట్ల వివక్షను ప్రదర్శించే మనుస్మృతి, పురాణాల గురించి ప్రశ్నిస్తున్నారు. ఓటు బ్యాంకుగా ఉన్న బలహీనవర్గాలు లేవనెత్తే సామాజిక వివక్ష, కించపరచటాన్ని ప్రశ్నిస్తుం డటంతో, హిందూత్వ అంటే కులాలు లేనిది అనే పల్లవిని ఆర్‌ఎస్‌ఎస్‌ అందుకుంది. ఇప్పటివరకు తమకు మద్దతుదార్లుగాఉన్న బ్రాహ్మలు, బ్రాహ్మణ వాదులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉత్తరాదిన బహుజనుల్లో ప్రారంభమైన ఈ ప్రశ్నించే, వివక్షను ఖండిరచేతత్వం మరింత పెరగటం అనివార్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img