Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

కుల రక్కసి కరాళ నృత్యం అంతం చేద్దాం!

డాక్టర్‌ దేవరాజు మహారాజు

నేను విప్లవ కారుణ్ణి. అన్ని దేశాలూ నావే అని నిజమైన విప్లవకారుడు ఓ అద్భుతమైన ప్రేమికుడై ఉంటాడని నేను చెప్తే మీకు కాస్త ఆశ్చర్యంగానే ఉండొచ్చు. కానీ, ప్రేమించే గుణాన్ని కోల్పో యినవాడు ఎన్నటికీ గొప్ప విప్లవకారుడు కాలేడు. ప్రపంచంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మనం గాఢంగా ప్రతిస్పందించడం చాలా అవ సరం. ప్రతివారికీ ఉండి తీరాల్సిన అధ్బుతమైన లక్షణం అదే! చే గువేరా కర్నూలు జిల్లాలో కులరక్కసి కరాళ నృత్యం చేస్తోంది. కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన స్వలో వళ్లు గగుర్పొడిచే నిజాలు బైటపడ్డాయి. సుమారు ఎనభైతొమ్మిది గ్రామాల్లో పదిహేనురకాల కులవివక్షలు కనపించాయి. అరవై నాలుగు గ్రామాల్లో దళితులకు దేవాలయం ప్రవేశం లేదు. ముప్పయి గ్రామాల్లో దళితులు రచ్చబండపై కూర్చోడానికి వీల్లేదు. ఇప్పటికీ అక్కడ ఏడు గ్రామాల్లోని టీ కొట్లలో రెండుగ్లాసుల పద్ధతి కొనసాగుతూ ఉంది. ఆరు గ్రామాల్లో దళితుల్ని హోటళ్లలోకి అసలే అనుమతించరు. ఇరవై ఏడు గ్రామాల్లో చాకలివారు దళితుల బట్టలు ఉతకరు. తొమ్మిది గ్రామాల్లో క్షురకులు దళితులకు క్షవరం చేయరు. ఈ పనులకోసం వారు సమీపంలోని పట్టణాలకు వెళుతున్నారు. ‘‘జుట్టు కత్తిరించడం మంగలి పవిత్రమైన ధర్మంకాదు. ఇదిఒక వ్యాపారం. చెప్పులు కుట్టడం మాదిగవాడి పవిత్ర ధర్మంకాదు. అదికూడా వ్యాపారమే! చేసే పూజలు, హోమాలు, ఉత్సవాలలో కూడా అదేజరుగుతోంది. ఇది బ్రాహ్మణుడి పవిత్రమైన ధర్మమేమీకాదు. అలా అనుకోవడం మన అజ్ఞానం. మన అజ్ఞానం మీదే బ్రాహ్మణుడికి తినికూర్చునే పెద్ద వ్యాపారం జరుగుతూ ఉంది.!’’ అని అన్నారు మహాత్మా జ్యోతిరావు ఫూలే. అధునికులుగా మనకు తోచకపోతే పోయింది. కనీసం కొందరు మహానుభావులు చెప్పిన దాంట్లోంచి సారాంశమైనా గ్రహించాలి కదా? ఇదే విషయం మీద డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా ఏం చెప్పారో గమనించండి. ‘‘బ్రాహ్మణులు, కోమట్లు, షేక్‌లు, సయ్యద్‌లు పెద్ద కులాలకు చెందిన వారు. కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, సాలె, మాల, మాదిగలు చిన్న కులాలవారు. వీరి సంఖ్య 90శాతం దాకా ఉంది. కులభేదాల వల్ల వీరి మేధస్సు బందీ అయిపోయింది. వీరిని పైకితెస్తే తప్ప, దేశ పునర్నిర్మాణం జరగదు. కాళ్లూ, చేతులూ కదిలించకపోతే శరీరానికి పక్షవాతం వచ్చినట్లుదేశానికే పక్షవాతం వచ్చింది. ఈ 90శాతం ప్రజలకు రెండువేల సంవత్సరాలుగా పక్షవాతం వచ్చింది. సమాజంలో వీరిని ఎక్కడికక్కడ పాతరవేసి స్థిరపరిచారు. కదలిక లేకుండాచేశారు. బానిసత్వానికి మూలకారణం ఇదే. ఇప్పటికైనా మారకపోతే మరోసారి బానిసలమయ్యే ప్రమాదముంది.
మంత్రాలయ మఠంలో చదువుకున్న దళితులైనా సరే, కేవలం ఊడ్చడానికే అర్హులు! ఆ పని తప్ప మరో పని చేయనివ్వరు. బిల్లులు రాయడానికి గానీ, రిసెప్షనిస్ట్‌లుగా పనిచేయడానికిగానీ వారికి అవకాశమివ్వరు. అక్కడ వారు చదువుకున్న చదువు వృధాకావల్సిందే! కొన్ని ఊళ్లలో దళితులు మోటారు వాహనాలపై తిరగకూడదు. పెళ్లి ఊరేగింపులు సైతం వాహనాలపై చేసుకోగూడదు. కాలి నడకన వెళ్లాల్సిందే. మంచినీటి బావుల్లోకి సైతం దిగనివ్వరు. బావిలోంచి నీరే తోడుకోగూడదు. దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేయడమన్నది ఊహకు అందని విషయం. మంత్రాలయ మండలంలోని బసాపురంలో పెత్తందార్ల కార్లు వెళుతూ ఉంటే ఎంతటి విద్యావంతులైన దళితులైనా సరే టక్కున లేచినిలబడి వంగి నమస్కారం పెట్టాల్సిందే. కర్నూలు మండలం దేవమడ గ్రామంలోనూ ఇంకా కొన్నిచుట్టు పక్కల గ్రామాల్లోనూ గ్రామ వాలెంటీర్‌లు దళితుల ఇళ్లకు వెళ్లరు. వాళ్లనే తమ ఇళ్లకు పిలిపించుకుంటారు. ఊళ్లోని ప్రతి ఇల్లూ తిరగడమన్నది గ్రామ వాలెంటీర్ల ఉద్యోగ ధర్మం. దాన్ని పక్కనపెట్టి వ్యవహరించడం ఎంత తప్పు? అయితే వారిని అడిగేవారు లేరు. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకాకొన్ని ప్రాంతాల్లో ఇంతటి వివక్ష కొనసాగుతూ ఉందంటే మనుషులుగా మనమంతా తలవంచుకోవాలి. అన్నివర్గాల వారికి సమన్యాయం చేస్తున్నామని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వోద్యోగులు, పరిపాలకులు సిగ్గుపడాలి! కర్నాటకలో కొప్పల్‌ జిల్లా మయాపూర్‌ గ్రామంలో అగ్రవర్ణాలవారు దళిత కుటుంబానికి ఇరవై అయిదువేలు జరిమాన విధించారు. ఎందుకంటే ఒక దళితుడు గుడి బైట నిలబడి, కళ్లు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. ఆ సమయంలో వెంట ఉన్న అతని రెండేళ్ల కొడుకు గబుక్కున గుళ్లోకి వెళ్లి పోయాడు. తను దళితుడినని, తను గుళ్లోకి వెళ్లకూడదని ఆ పసివాడికి తెలియదు. ఆ రోజు ఆ పసివాడి పుట్టినరోజు. అందుకే వాణ్ణి తీసుకుని తండ్రి గుడికి వెళ్లాడు. వాణ్ణి చల్లగా చూడమని కోరుకుంటూ ఆ దళితుడు దండం పెట్టుకుంటూ ఉండగా, ఆ ‘ఘోరప్రమాదం’ జరిగిపోయింది. ఒక దళితుడు గుళ్లోకి జొరబడ్డాడని, గుడి మైల పడిరదనీ, దాన్ని ప్రక్షాళన చేయాలని అందుకు రూ.25వేలు ఖర్చు అవుతుందనీ పూజారులు బెదిరించారు. తనకు అంత శక్తి లేదని, ఒక నిరుపేదనని దళితుడు ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది. అగ్రవర్ణ అహంకారం తగ్గలేదు. పెద్ద గలాటా జరిగింది. ప్రభుత్వాధికారుల చొరవతో విషయం సద్దుమణిగింది. ఇంగిత జ్ఞానం లేక, మానవత్వం లేక మనుషులు ప్రవర్తిస్తున్నప్పుడు గోరుతో పోయేది గొడ్డళ్లదాకా వస్తుంది. ఇది 2021 సెప్టెంబరు సంఘటన. ఇలాంటి సంఘటనే తమిళనాడులో జరిగింది. ఒక గుళ్లోకి దళిత మహిళను రానివ్వలేదు. ఆ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌కు తెలిసింది. వెంటనే ఆ గుడికి సంబంధించిన ఇరవైమంది పూజారుల మీద ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టించి వారిని జైలుకు పంపారు. ఇతర రాష్ట్రాలలో కూడా అలా చేయగలిగే అవకాశం ఆయా మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఉంటుంది. రాజ్యాంగం గురించి అందరూ గొప్పగా మాట్లాడుతారు కానీ, ఎవరైనా అలా చేస్తున్నారా? మహిళల అభ్యున్నతికై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్త్రీలకు బస్సు ప్రయాణం ఉచితం చేశాడు. ఒకరోజు కన్యాకుమారి జిల్లా వాణీయం కుడి గ్రామానికి చెందిన సెల్వం అనే డెబ్బయ్యేళ్ల్ల మహిళ తన చేపల బుట్టతో బస్సు ఎక్కింది. చేపలు వాసన వస్తున్నాయంటూ కండక్టర్‌ బలవంతంగా ఆమెను బస్సునుంచి దింపేశాడు. అవి నిలువచేపలు కావని, ఆరోజు పట్టినవేనని చేపలన్నాక కొంచెం వాసనొస్తాయనీ అయినా తను ఎక్కువ దూరమేమీ రావడంలేదని ఆ వృద్ధురాలు ఎంత మొత్తుకున్నా కండక్టర్‌ వినలేదు. ‘పాపం పోనీయండి’ అని తోటి ప్రయాణికులు చెప్పినా,అతను వినిపించుకోలేదు. బలవంతంగా దింపేశాడు. ఆమె కుళచ్చళ్‌ బస్టాండ్‌లో అందరికీ తనకు జరిగిన అన్యాయం చెప్పుకుంది. ఆనోటా ఆనోటా అది సోషల్‌ మీడియా కెక్కింది. రవాణాశాఖ అధికారులకు, తర్వాత ముఖ్యమంత్రికీ తెలిసింది.ఆ వృద్దురాలి హక్కును కాదన్నందుకు ఆ బస్సు కండక్టర్‌, డ్రైవర్‌లను సస్పెండ్‌ చేశాడు స్టాలిన్‌. అణగారిన వర్గాలకు ఎక్కడికక్కడ న్యాయం జరగాలంటే చిత్తశుద్ధి ఉన్న నాయకులు కావాలి. ఉట్టి ‘భాషణ్‌’ లిచ్చే నాయకులు వృధా కదా మిత్రో? మనుస్మృతి ప్రకారం మహిళలందరూ శూద్రులే. మహిళలకు పుట్టిన వారంతా శూద్రులే అవుతారు కానీ, మళ్లీ అందులో బ్రాహ్మణులు, క్షత్రియలు, వైశ్యులు ఎలా పుట్టగలరూ? పుట్టిన వాళ్లందరూ శూద్రులే అయినప్పుడు అగ్రనిమ్న వర్ణాలెందుకూ? ఇదంతా బుద్ధితక్కువ వ్యవహారంగా అనిపించడం లేదూ? అది అలా ఉండనిచ్చి మరొక విషయం చూద్దాం. హిందూ దేవుళ్లలో బ్రాహ్మణులు లేరు. అధిక భాగం క్షత్రియులే. అలా అయినప్పడు బ్రాహ్మణ వర్గానికి మొదటిస్థానం ఎవడిచ్చారు? ఇదంతా కాదు. మహిళలు శూద్రులైనప్పుడు, ఉన్న జనాభా అంతా శూద్రులే. అందరూ సమానులే. విజ్ఞానశాస్త్రం అదే చెప్పింది. మానవజాతి అంతా ఒక్కటేకాబట్టి, అందరూ సమానులే అని అంది. మనుధర్మ శాస్త్ర ప్రకారం కూడా మనుషులంతా సమానులే అని మనం అర్థం చేసుకోవాలి. మనమంతా బాల్యంలో బాలకులం. యవ్వనంలో యువకులం. వృద్ధాప్యంలో పండుటాకులం అంతే! మనువును తిరస్కరిస్తేనే ఎవరికైనాకాస్త బుద్ధిజ్ఞానం పెరుగుతుంది. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పెద్దాయన పక్కనున్న యువకుణ్ణి ఊహించని ప్రశ్న అడిగాడు.మీ కేస్ట్‌ ఏమిటి అని! యువకుడు అందగాడే కాదు తెలివైన వాడు కూడా. విషయం గ్రహించి వెంటనే ‘సాఫ్ట్‌వేర్‌’ అండీ అన్నాడు. ‘‘భలే జోకులేస్తావు బాబూ. నేను అడిగింది వేరు. నువ్వుచెప్పేది వేరు. పోనీ, మీ నాన్నగారి కులమేమిటి’’ అని మళ్లీ అడిగాడు పెద్దాయన.‘‘ఆయనా? ఆయన ఎలక్ట్రికల్‌ అండీ’’ అన్నాడు యువకుడు. ‘‘పోనీలేనీకు చెప్పాలని లేనట్లుంది! ఈ మధ్య ఏమిటో కుర్రవాళ్లు చిత్రమైన జవాబులు చెపుతున్నారు. కులం చెప్పుకుంటే నామోషీయేమో’’అని ముఖం మాడ్చుకుని, ముఖంకూడా తిప్పుకున్నాడు. ‘‘మీరు పెద్దవారు. మీకు తిక్కతిక్కగా సమాధానాలు చెప్పాలని నాకు లేదు. విషయమేమిటంటేనండీ ..భగవద్గీతలోని నాలుగో అధ్యాయంలో పదమూడవ శ్లోకం ఒకసారి నెమరు వేసుకోండి. మీకే అర్థమవుతుంది!’’ అన్నాడు. ‘‘అవునూ ఏముంది అందులో?’’ ఈ కుర్రాడికి గీతలోని విషయాలు కూడా తెలుసా? అని ఆశ్చర్యపోతూ అడిగాడు. ‘‘గుర్తు లేకపోతే ఫరవాలేదు. ఇంటికెళ్లాక చూసుకోండి!’’ నవ్వుతూ బదులిచ్చాడు యువకుడు. ‘‘సరే బాబూ చెబుదూ అందులో ఏముందో’’ అన్నాడు పెద్దాయన ఏముందంటే కులమనేది పుట్టుకతో కాదు, చేసే వృత్తితో వస్తుంది అని ఉంది. దాని ప్రకారమే చెప్పానండీ. అంతే మిమ్మల్ని ఆటపట్టించాలనికాదు. మీకేమో కోపంవచ్చేసింది.’’ అని నవ్వు కొనసాగించాడు పెద్దాయనకు ఎక్కడో కలుక్కుమంది. ‘జ్ఞానం’ వయసు పెరిగితేరాదుబుద్ధి పెరిగితేనే వస్తుందని అప్పుడే తెలుసుకున్నాడు. పాత తరహాలో ఇక మాట్లాడ గూడదని కూడా అనుకున్నాడు. మనుస్మృతి ప్రకారం (త్రిన్ష:9/93) పురుషులు 2430 ఏళ్ల వయసులో 812 ఏళ్లవయసులో ఉన్న బాలికల్ని పెండ్లి చేసుకోవాలి. ఇదేకాదు. 34 ఏళ్ల బాలికలకు 7`8 ఏళ్ల బాలురకు కూడా పెళ్లిళ్లు చేసిన ఆచారం ఈ దేశంలో కొనసాగింది. మరి సమకాలీనంలో దాన్ని కొనసాగించడంలేదు కదా? అందుకే సంప్రదాయం ముసుగులో పనికిరాని ఆచారాల్ని వదిలేయాలి. అన్నీ ఆలోచించే డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ మనుస్మృతిని దహనం చేశాడన్న విషయం గుర్తుంచుకోవాలి!

`కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img