Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

కృష్ణా.. గోదావరి కేంద్రం గుటకాయ స్వాహా

ప్రొఫెసర్‌ ఎం. శ్రీధర్‌ ఆచార్యులు

కుక్క తోక వంకర అన్నట్టుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ ఏ విషయంలోనైనా తన దుర్బుద్ధినే చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నలుగుతున్న కృష్ణా గోదావరి జలాల వివాదంలోనూ ఇదే తీరు కనబరుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి తగువును చల్లార్చకుండా మరింత మంట రాజేస్తోంది. వివాదాలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ పని చేయకపోగా మరింత ఆజ్యం పోస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ నుండి తెలంగాణ విడిపోవడానికి ప్రధాన కారణంగా ఉన్న భావోద్వేగపూరితమైన ఈ అంశంతో కేంద్రం ఆటలాడుతోంది. గొడవ ముదిరేలా మరింత చిలుకుతోంది. నదీ జలాల నిర్వహణలో రెండు రాష్ట్రాలకు ఉన్న అధికారాలను గుటకాయ స్వాహా చేస్తోంది.
నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు తగిన స్థాయిలో అందనందునే తెలంగాణ వెనకబడిపోయింది. దశాబ్దాల ఆందోళనకు ఈ మూడు అంశాలే ప్రధాన కారణం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ ముందునుంచీ ఉన్న ఈ ఉద్యోగాల సమస్య, దారి మళ్ళుతున్న నిధుల సమస్య తీరనేలేదు. కనీసం కృష్ణా, గోదావరి నదీ జలాల వాటానూ దక్కించుకోవాలనే ఆశతో ఉంది. ఇంతకుముందు లేని అవకాశం… తెలంగాణ అభివృద్ధికి నూరు శాతం రెవెన్యూని ఉపయోగించుకోవడంతోపాటు దీనిని నెరవేర్చుకోవాలనుకుంటోంది. ఖాళీగా వేలాది పోస్టులను భర్తీ చేసేందుకు మంచి చొరవ అయితే కనిపిస్తోంది కానీ ఉద్యోగాల విషయంలోనూ గణనీయమైన మెరుగుదల ఏమీ లేదు. ఇక మిగిలిన మరో సమస్య తెలంగాణలో ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి నదుల వైశాల్యాన్ని (పొడవు, వెడల్పులను) బట్టి వారికి రావలసిన వాటా.
నీటి పంపిణీ వివాదాలు సద్దుమణిగాయి కానీ పరిష్కారం కాలేదు. తెలంగాణ వాటాలో ఏమంత హెచ్చుదల లేకుండా రెండు రాష్ట్రాలు పరస్పరం శత్రువుల్లా ప్రకటనలు చేస్తున్నాయి. దీనిపై ప్రజలు ఆందోళన చేస్తుండగా కేంద్రం ఈ పరిస్థితులను చక్కదిద్దడం లేదా వివాదం పరిష్కారం కోసం చర్యలు తీసుకోకపోగా ఈ అంతరాష్ట్ర నదీ జలాల వివాదాన్ని తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
నీళ్లు రాష్ట్రాల అంశం. కానీ కేంద్రం.. ఉమ్మడి జాబితాలోని ఉభయుల పరిధి, ఏపీ పునర్విభజన చట్టం 2014లో నియమాలకు వక్రభాష్యం చెబు తోంది. నదీ జలాల అంశాలను కేంద్రం చేపడుతుందని ఇప్పుడు ప్రకటిస్తోంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీలో కొన్ని సాధారణ సూత్రాలు ఉన్నప్పటికీ, నీటి నిర్వహణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి జలాల అంశాన్ని తామే చేపడతామని చేసిన ప్రకటనతో సమాఖ్య సూత్రం నీటి మూట అయ్యింది.
ఆంధ్ర, తెలంగాణ ఉప ప్రాంతాల మధ్య కృష్ణా గోదావరి నదీ జలాల అసమాన పంపిణీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు అర్ధ శతాబ్దానికి పైగా ఆందోళనలు చేస్తున్నారు. నీటి కేటాయింపుల్లో అన్యాయానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 10 తెలంగాణ జిల్లాలకు చట్టబద్ధమైన అవకాశం (సామర్థ్యం) లేనందున ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ మరింత బలపడిరది. తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ వెనకనున్న రాజ్యాంగబద్ధ అవసరాన్ని గురించి జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీకి నేను వ్యక్తిగతంగా తెలియజేశాను. సుప్రీంకోర్టు మాజీ జడ్జి (శ్రీకృష్ణ), లా యూనివర్సిటీ (నల్సార్‌ విసి ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌) వైస్‌ ఛాన్సలర్‌లు ఈ విషయంపై అనేక ప్రశ్నలు అడిగారు. అంతరాష్ట్ర నదీ జలాల వివాదాన్ని రాజ్యాంగబద్ధంగా కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే లేవనెత్తగలదు. రాష్ట్రం మాత్రమే సుప్రీంకోర్టు న్యాయ పరిధిలో సహాయాన్ని కోరగలదు. కృష్ణ లేదా గోదావరి జలాల వివాదం ట్రిబ్యునల్‌కు వెళ్ళేందుకు సాంకేతికంగా ఒక ఉప ప్రాంతానికి సాధ్యం కాదు.
ఎగువ నదీ పరీవాహక రాష్ట్రాల్లో జలాల దోపిడీ గురించి కేవలం రాష్ట్రం మాత్రమే ప్రశ్నించగలదు. ఎగువ నదీ పరీవాహక రాష్ట్రాల వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టం గురించి ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడూ అంతరాష్ట్ర ఫోరం లేదా సుప్రీంకోర్టుకు చెప్పలేదు. కనీసం కేసుల వరకూ వచ్చాకైనా ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించాలని ఇంజినీర్లు, నిపుణులు లేదా న్యాయవాదులకు సూచించలేదు. తెలంగాణలో స్థిరపడినవారు తమ పూర్వ గ్రామాలకు ఈ నదీ జలాలను తరలించుకుపోయినా మిన్నకున్నారు. ఎక్కడా సమానత్వం, సోదరభావం కానరాకపోవడంతో భావోద్వేగపూరితమైన ఆగ్రహం పెల్లుబికింది, రాష్ట్రం విడిపోవాలనే కాంక్ష వెల్లువెత్తింది. తెలంగాణ భాష, యాసను ప్రింట్‌ మీడియా, టెలివిజన్‌, చలన చిత్రాలు, మీడియా అంతటా అవమానించడంతో మరింత రగిలిపోయారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో సమాన వాటాను తెలంగాణ కోల్పోవడమే వారి ఉద్యమానికి అసలు కారణం. ఇది కాకపోయుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంతమంది ఆత్మహత్య చేసుకునేవారు కాదు, పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు అర్పించేవారు కాదు.
తెలంగాణలో 70 శాతం కృష్ణా జలాలు ప్రవహిస్తుంటే 50 శాతం కంటే తక్కువ వాటా లభించడమేంటి? ఇది సమానత్వానికి సంబంధించిన సాధారణ ప్రశ్న, రాజ్యాంగంలోని అధికరణలు 21, 14 ప్రకారం సమానత్వానికి సంబంధించిన అంశం. మనకు జీవించే హక్కు ఉంది. ఇందుకు నీరు అత్యవసరం. కానీ నీటి వివాదం ట్రిబ్యునల్‌ పరిష్కరించాలి. సమానత్వం లేదా జీవించే హక్కులకు ప్రమాదం ఏర్పడినా సుప్రీంకోర్టు కలగజేసుకోకపోవడం అసంబద్ధం, న్యాయ పాలనకు ఇది పూర్తిగా విరుద్ధం. ఈ రెండు నదులు ప్రవహిస్తున్న అన్ని రాష్ట్రాల మధ్య వాటాలను పునఃకేటాయించాలనే డిమాండ్‌ రావడం వెనకున్న నేపథ్యం ఇది. ఎలాంటి సహేతుకత లేకుండా ఏకపక్ష నిర్ణయానికి వచ్చినప్పుడు కాదని చెప్పాల్సిందే.
రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్రమైన చిక్కులు తెచ్చిపెడుతూ జలశక్తి మంత్రిత్వశాఖ (నీటి వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవ విభాగం) జులై 15వ తేదీన న్యూదిల్లీ నుంచి నెం.ఎస్‌.ఒ.2842 (ఇ) పేరుతో ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏడేళ్ళ తమ పాలనకు అనుగుణంగానే కేంద్రం ఇక్కడ తన అధికార పరిధిని నిర్ణయించింది. అంటే వారి ఉద్దేశం ప్రకారం ఇక్కడ ‘అధికార పరిధి’ అంటే అర్థం.. హైడల్‌ జనరేషన్‌తో సహా అన్ని ప్రాజెక్టుల నిర్వహణను బదిలీ చేయడమే. కేవలం బదిలీ మాత్రమే కాదు మొత్తం ఈ ఆస్తులను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి అపహరించి తన నియంత్రణలోకి తెచ్చుకుంటోంది. నదీ జలాల నిర్వహణా బోర్డుల పేరుతో ఈ దుశ్చర్యకు పాల్పడుతోంది.
కృష్ణ, గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డులు (కెఆర్‌ఎంబి`జిఆర్‌ఎంబి) అధికార పరిధిని నిర్వచించే సాకుతో నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం రాష్ట్రాలకున్న అన్ని అధికారాలనూ, వారి పాలనాశక్తిని లాగేసుకుంది. వాటిని బోర్డులకు అప్పగించింది. అన్ని సాగు నీటి ప్రాజెక్టులపై (కృష్ణా ప్రాంతంలోని 35, గోదావరి పరిధిలోని 71) రాష్ట్రాలకున్న అన్ని రకాల అధికారాలను కేంద్రం మింగేయడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలను మిగల్చని కేంద్రం వాటి మీద బాధ్యతలను మాత్రం మోపడం విచిత్రం. బోర్డులకు ఛైర్మన్‌లను నియమించడం లేదా ఇవి ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా రెండు రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్లు, సిబ్బందిని అనర్హులుగా ప్రకటించిన ఈ నోటిఫికేషన్‌ ఈ అధికారులను నియమించే అధికారాన్ని కేవలం కేంద్రానికి కట్టబెట్టింది. అంటే కృష్ణా, గోదావరి జలాలు ఇక కేంద్రంలోని పెద్దలు, వారి కనుసన్నల్లో మెలిగే ఇంజినీర్ల సొంతమన్నమాట. వారి రాజకీయ బాస్‌ల ఇష్టానుసారం ఇక చర్యలు ఉంటాయి. రెండు ప్రధానమైన నదులపై నియంత్రణను కేంద్రం గుప్పట్లో పెట్టుకోనుంది, రాష్ట్రాలకు వీటిపై హక్కులు ఇక గుండు సున్నాయే.
సమర్థవంతంగా పని చేసేందుకుగాను బోర్డులకు ప్రారంభ నిధిగా రూ.400 కోట్లు చొప్పున డిపాజిట్‌ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. అవసరమైన అదనపు నిధులను బోర్డులు డిమాండ్‌ చేసిన 15 రోజుల్లోగా ఇవ్వాలని కూడా పేర్కొంది. ఈ ప్రాజెక్టుల కోసం సుదీర్ఘకాలంగా లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన రాష్ట్రాలు ఇప్పుడు తమ సొమ్మును, సిబ్బందిని, ఆస్తులను, ప్రాజెక్టులను, నిర్వహణా అధికారాలను, నియంత్రణను అన్నింటినీ వదులుకోవాల్సిందే. అధికారాలన్నీ కేంద్రానికి… అన్ని బాధ్యతలు లేదా అప్పులు మాత్రం రాష్ట్రాలకి.
ప్రాజెక్టుల నిర్వహణ కోసం రెండు రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలనైనా ఇచ్చే అధికారం రెండు బోర్డులకూ ఉంది. వాటికి రాష్ట్రాలు తలొగ్గడం తప్ప చేసేదేమీ లేదు. తమ ఆదేశాలను అమలు చేసేందుకు బోర్డులకు పూర్తి అధికారాలను ఇచ్చారు.
‘‘ప్లాంట్‌కు సంబంధించిన ప్రతిదీ యంత్ర పరికరాలు, స్టోర్స్‌, వాహనాలు మొత్తం ఆస్తులన్నీ కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబీకే చెందుతాయి. ఈ కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబీ అధికార పరిధికి సంబంధించి ఎలాంటి సందేహం తలెత్తినా కేంద్రం నిర్ణయమే అంతిమం’’ అని ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఆమోదం లభించని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా ఆమోదం సాధించేందుకు రాష్ట్రాలు ప్రయత్నించాలి. ఆమోదం లభించని అన్ని ప్రాజెక్టుల్లోనూ కొనసాగుతున్న పనులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిలిపివేయాలి. ఆరు నెలల్లోగా ఆమోదం లభించకపోతే ఈ ప్రాజెక్టులు పనిచేయకుండా ఆపేయాలి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు కారణమైనప్పటికీ అన్ని అనామోదిత ప్రాజెక్టులను నిలిపివేయక తప్పదు. కేంద్రం వీటికి ఎలాంటి బాధ్యత వహించదు.
కేంద్రానికి ఈ పెత్తనాన్ని కట్టబెడుతున్నది ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014. ఈ చట్టం ప్రకారం కేంద్రానికి రెండు నదీ జలాల బోర్డు ఏర్పాటుకు, వాటి అధికార పరిధిని నిర్ణయించేందుకు అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఈ బోర్డులు 2014లోనే ఏర్పడ్డాయి కానీ వాటి అధికార పరిధి గురించిన ఆలోచనలు మాత్రం గత ఏడాదే (2020) పొడసూపాయి. దీనిపై నోటిఫికేషన్‌ 17 రోజుల క్రితమే (జులై 15న) విడుదల చేశారు. ఇక రాష్ట్రాలు తమ సార్వభౌమాధికారాన్ని దిల్లీ చక్రవర్తి పాదాల ముందు అన్యాక్రాంతం చేయాల్సిందే.
వ్యాస రచయిత కేంద్ర సమాచార విభాగం మాజీ కమిషనర్‌
హైదరాబాద్‌లోని మహేంద్ర యూనివర్సిటీలో స్కూల్‌ ఆఫ్‌ లా డీన్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img